లెఫ్ట్, కారు బంధం ఇలాగే కొనసాగేనా? సీట్ల సర్దుబాటు సజావుగా ముగిసేనా?
posted on Nov 21, 2022 @ 1:47PM
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి, లెఫ్ట్ పార్టీల మధ్య చిగురించిన స్నేహం ఇలాగే కొనసాగనుందా? అంటే ఇరు పార్టీల నేతలూ కూడా ఔను ఇలాగే కొనసాగుతుందంటున్నారు. ఇరు పక్షాల మధ్య పొత్తు ఇప్పుడు ఆ రెండు పార్టీలకూ కూడా అవసరం అని పరిశీలకులు అంటున్నారు. పైగా ఒక ఉప ఎన్నికలో విజయం కోసం కేసీఆర్ తన అవసరం కొద్దీ వామపక్షాలకు స్నేహహస్తం అందిస్తే.. అంతకంటే ఆత్రంగా వామపక్షాలు గతంలో తెరాస అధినేత తమను ఉద్దేశించి గతంలో చేసిన అవమానకర వ్యాఖ్యలను కూడా విస్మరించి అందుకున్నాయని విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో వామపక్షాలు మరో అడుగు ముందుకేసి వచ్చే ఏడాది జరుగనున్న శాసన సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తాము పోటీచేసే సీట్లపై ఇప్పటికే దృష్టి సారించి.. ఆ దిశగా టీఆర్ఎస్ తో చర్చలకు సమాయత్తమౌతున్నట్లు చెబుతున్నారు. అయితే, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా గులాబీ దళానికి, ఎర్ర సైన్యానికి మధ్య చిగురించిన స్నేహం.. పొత్తుగా మార్చుకునేందుకు వామపక్ష నేతలే కాకుండా, తెరాస అధినేత కూడా ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు. ఒంటరి పోరుకు దిగితే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే పాటి బలం లేని పార్టీలు వామపక్షాలైతే... తమ కొత్త పార్టీ బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో ఇంతో కొంతో ఇమేజ్ ఉన్న (ఓట్లూ, సీట్లూ లేకపోయినా) వామపక్షాల అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వామపక్షాలతో లైన్ క్లియర్ చేసుకునే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఒక పొత్తులో భాగంగా సీపీఐ రాష్ట్రంలో కొన్ని అసెంబ్లీ సీట్లపై గురి పట్టినట్లు తెలుస్తోంది. ఆ సీట్లు తమకు ఇస్తేనే టీఆర్ఎస్‌తో పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని ఇప్పటికే కేసీఆర్ కు సూచన ప్రాయంగా తెలియజేసిందని లెప్ట్ పార్టీల కార్యకర్తలే చర్చించు కుంటున్నారు.
ముఖ్యంగా హుస్నాబాద్ సీటును తమకే కేటాయించాలని తెలంగాణ సీపీఐ గట్టిగా కోరుతోందని అందుకు కారణం అది సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం కావడమేనని అంటున్నారు. అయితే అంత తేలికగా టీఆర్ఎస్ కూడా ఆ సీటును మిత్రపక్షానికి ఒదులుకోవడానికి అంగీకరించదని అంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా తెరాస హుస్నాబాద్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించింది. ఆ కారణంగానే ఇప్పుడు కూడా హుస్నాబాద్ లో తెరాస అభ్యర్థినే రంగంలోకి దించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. హుస్నాబాద్ కు ప్రత్యామ్నాయంగా సీపీఐ సీనియర్ నేత చాడకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నట్లు తెరాస వర్గాలలో వినిపిస్తోంది. చాడ వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ కేటాయిస్తే.. ఆయన హుస్నాబాద్ సీటును టీఆర్ఎస్‌కి వదలిపెడతారని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణలో వచ్చే ఏడాది ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీతో పాటు మేలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో మూడు స్థానాలు మే 29న ఖాళీ అవుతాయి. వీటిలో ఒక స్థానాన్నిసీపీఐకి కేటాయించే అవకాశముందని తెరాస వర్గాల్లో ప్రచారం అవుతోంది. 2004 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. 2018లో మళ్లీ పోటీ చేసినా.. గెలవలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే అక్కడ సీపీఐకి బలమైన కేడర్ ఉందని.. టీఆర్ఎస్-సీపీఐ పొత్తులో భాగంగా.. ఈసారి చాడ వెంకటరెడ్డిని బరిలోకి దింపాలని సీపీఐ భావిస్తోంది.
కానీ సీఎం కేసీఆర్ మాత్రం సీపీఐకి ఎమ్మెల్సీ ఇచ్చి.. హుస్నాబాద్ నుంచి తామే బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 25 స్థానాలపై సీపీఐ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పొత్తు కుదరకపోతే.. ఆయా స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు పార్టీల మధ్య పొత్తు బలపడితే... సాధ్యమైనంత ఎక్కువ సీట్లు అడగాలనే యోచనలో వామపక్షాల నాయకులు ఉన్నారనేది ప్రచారంలోకి వచ్చింది. ఇదే జరిగితే... టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలను కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. మరి ఏ సీట్లను సిపిఐ కోరుతుందో...? ఏ సీట్లను టిఆర్ఎస్ వదులుకుంటుందో వేచి చూడాలి.