తెరాస... భారాస డీఎన్ఏ ఒకటేనా?
ఉభయ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఒకటవుతాయా? ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడంలో కీలక భూమిక పోషించిన, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడం వెనక ఇతరేతర కారాణాలు ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాలను ఏకం చేసే ఆలోచన కూడా వుందా, అంటే, ఉన్నదని కాకున్నా, ఉంటే ఉండవచ్చే అనే అభిప్రాయం అనుమనాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన సమయానికి,ఆయన ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన కాకపోవచ్చని, దివంగత మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని బాటలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన తెరాస స్థాపించారని, అనుమానించిన వాళ్ళు అప్పుడూ ఉన్నారు, ఇప్పుడూ ఉన్నారు. తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ను సభలోనే వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.
సరే అదంతా గతించిన చరిత్ర. అందులో ఏది నిజమో ఏది కాదో, ఇప్పడు అపస్తుతం. అలాగే కేసీఆర్ కావాలనుకున్నా, మరొకరు వద్దనుకున్నా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలపడం అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ, ఏపీలో అడుగు పెట్టేందుకు కదులుతున్న బీఆర్ఎస్ స్వరంలో మార్పు అయితే స్పష్టంగా వినిపిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు ఆంధ్రా పాలకులు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని, ‘బ్యాన్’ చేశారని ఆరోపించిన నాయకులే ఇప్పడు తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా వెనకాడుతున్నారని అంటున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో ‘వందే మాతరం’ నినాదం ఎంత ప్రభావం చూపిందో, అంత కంటే ఎక్కువగా, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలను ప్రభావితం చేసిన, ‘జై తెలంగాణ’ నినాదం భారాస వేదికల నుంచి వినిపించడం లేదని తెలంగాణ ఉద్యమ ప్రజానీకం ఆవేదన, వ్యక్త పరుస్తున్నారు.
అలాగే, ఇంతవరకు రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పడు, తిలా పాపం తల పిడికెడు అన్నరీతిలో కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు. అయితే ఆ మాట నేరుగా కేసీఆర్, కేటీఆర్ లేదా మరో తెలంగాణ నాయకుడో కాకుండా బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు, తోట చంద్రశేఖర్ నోటి ద్వారా చెప్పించారు. చంద్రశేఖర్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. రాష్ట్ర విభజనకు ఒక్క తెరాస మాత్రమే కారణం కాదు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ అందరూ ఓకే చేస్తేనే రాష్ట్ర విభజన జరిగింద నే కొత్త స్వరాన్ని ఎత్తుకున్నారు. అంతే కాకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అయితే, ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరులు సహా ఉద్యమంలో భాగస్వాములైన అయిన అందరినీ పక్కన పెట్టి, ఒక్క కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యమైందని కేసీఆర్ లేకుంటే తెరాస లేదు తెరాస లేకుంటే తెలంగాణ లేదు అంటూ రాష్ట్ర విభజన క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఇలా స్వరం మార్చడం దేనికి సంకేతం? అనే ప్రశ్నకు తెలంగాణ సమాజానికి సమాధానం చిక్కడం లేదు.
అదలా ఉంటే పూర్వాశ్రయంలో తెరాస నాయకులుగా పిడికిలి బిగించి, ‘జై తెలంగాణ’ అని నిందించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తెలంగాణ పేరు ఉచ్చరించేందుకు కూడా జంకుతున్నారు. ఎవరో కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం, ‘జై తెలంగాణ’ నినాదాన్ని నాలుక మీద నుంచి చెరిపేశారని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు మేథావులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఆశించి తెలంగాణ నాదాన్ని, నినాదాన్నివదులుకోవడం ఒక్క రోజు భాగోతానికి మీసాలు గోరుకున్నట్లుందని, కోదండరాం వంటి ఉద్యమ నేతలు అంటున్నారు.
అలాగే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని మరో మారు కేసీఆర్ ప్రశ్నార్ధకం చేస్తున్నారని కేసీఆర్ ధోరణి పట్టి పట్టి పంగనామాలు పెడితే, పక్కకెళ్ళి తుదిచేసుకున్నట్లు ఉందని అంటున్నారు. అయితే మరోవంక మంత్రి కేటీఆర్, తెరాస పేరు భారాసగా మారిందే కానీ, పార్టీ డీఎన్ఎ మారలేదని, అదే రంగు, అదే రుచి, అదే వాసన కొనసాగుతుందని అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏది నిజం ... కేసీఆర్ తల్లి పేరును తుడిచేసుకుంది నిజమా .. అదే డీఎన్ఎ అంటున్న కేటీఆర్ మాటలు నిజామా ? అని ప్రశ్నిస్తున్నారు.