కేంద్ర కాబినెట్లో టీ ఓకే.. ఏపీకి బెర్త్ అనుమానమే
posted on Jan 6, 2023 @ 2:27PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఇంచుమించుగా ఖరారైంది. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఢిల్లీ రాజకీయ వరగాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే సంక్రాంతి పండగకు ముందా తర్వాతా అనే విషయంతో పాటుగా, జనవరి 16, 17 తేదీలలో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందా వెనకా అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంవత్సరం (2023) ఒక విధంగా ఎన్నికల నామ సంవత్సరం. ఈ ఏడాది తెలంగాణ సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సో .. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా వచ్చే ఏడాది ( 2024)లో జరిగే సార్వత్రిక ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇటు పార్టీలో, అటు కేంద్ర మంత్రి వర్గంలో ఒకేసారి సమాంతరంగా మార్పులు చేర్పులు చేసే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నారని అంటున్నారు.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ, భారీ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు ఏడాది పైగా గడువు ఉంది. మరోవంక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. దీంతో పాటు జనవరిలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది.
ఈ నేపధ్యంలో, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకుని, మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ప్రధాని మోడీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనా ప్రధాని మోడీతో పాటుగా బీజేపీ సంఘ పరివార్ పెద్దలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. నిజానికి, ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితిని, సంఘ్ పరివార్ సంస్థలు వేటికవి నివేదికల రూపంలో కేంద్ర కార్యాలయానికి అందజేశాయని వాటి ఆధారంగా ఎన్నికల వ్యూహరచన సాగుతోందని అంటున్నారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు అంటే.. మోదీ కేబినెట్‌లో మొత్తం 78 మంది ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అంటే మరో ఐదుగురి అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో బెర్త్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. తెలంగాణ నుంచి, యూపీ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ తో కలిపి మొత్తం ఐదుగురు ఎంపీలున్నారు. అందులో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉన్నారు. క రీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఏ ఒకరినీ ప్రస్తుతానికి కదిల్చే ఆలోచన కేంద్ర నాయకత్వానికి లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్, సోయం బాబురావులలో ఒకరికి అవకాశం ఉంటుందని అంటున్నారు. నిజానికి గత విస్తరణ సమయలోనే సోయం బాబు రావు పేరు ప్రముఖంగా వినిపించింది. పేరు ప్రముఖంగా వినిపించడమే కాదు ఢిల్లీ నుంచి పిలుపు కూడా వచ్చింది. అయితే ఆఖరి క్షణంలో వచ్చిన పదవి చేజారిపోయింది.
సో ఈ సారి, ఫస్ట్ ప్రిఫెరెన్సు గిరిజన బిడ్డకే ఉంటుందని అంటున్నారు. అయితే, బండి సంజయ్ పదవీ కాలం వచ్చే నేలతో ముగియనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే పక్షాన బండి పేరు కూడా పరిశీలనకు వచ్చే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఇక మూడేళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కని ఏపీకి ఈ సారి తప్పక ప్రాతినిధ్యం ఉంటుందని అంటున్నారు. ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నందున ఈసారి ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఏపీకి చెందిన సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు (యూపీ నుంచి) రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరి లేదా గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవంఉన్న, దగ్గుబాటి పురందేశ్వరిని మంత్రివర్గంలోకి తీసుకుని ఆరు నెలలోగా ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే ఆలోచన లేక పోలేదని అంటున్నారు.
అయితే, ఏపీ విషయంలో అంత ఖచ్చితంగా ఏదీ చెప్పలేమని, నిజానికి కేంద్ర నాయకత్వానికి ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది, ఏపీ ఒక్కటేనని, అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని అంటున్నారు.