జల్లి కట్టుకు తమిళనాడు సర్కార్ లైన్ క్లియర్
posted on Jan 7, 2023 @ 2:16PM
తమిళనాట సంక్రాంతి సంబరాలు, సంస్కృతిలో జల్లికట్టుదే అగ్రస్థానం. ఏటా జనవరి 1వ తేదీ నుంచే సంక్రాంతి సంబరాలు మొదలైపోతాయి. అంటే జల్లి కట్టూ సందడీ ఆరంభం అయిపోతుంది. అయితే ఈ సారి మాత్రం కొత్త సంవత్సరం వచ్చి వారం రోజులైనా జల్లి కట్టు సందడి ఎక్కడా కనిపించలేదు. ఇందుకు కారణం ఇప్పటి వరకూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడమే. అయితే ఎట్టకేలకు శనివారం (జనవరి 7) జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో ఆదివారం నుంచీ తమిళనాటలో జల్లి కట్టు సందడి ప్రారంభం కానుంది. ఒక్క తమిళనాడులోనే కాకుండా ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్లు నిర్వహిస్తారు. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జల్లికట్టుకు అనుమతి ఇచ్చే విషయంలో స్టాలిన్ ప్రభుత్వం ఒకింత వెనుకాడటంతో తమిళనాట ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శనివారం జల్లికట్టు నిర్వహణకు సర్కార్ ఓకే చెప్పింది. కోవిడ్ ప్రొటోకాల్ తప్పని సరిగా పాటించాలని పేర్కొంటూ వీక్షకుల సంఖ్యపై ఆంక్షలు విధించింది.
మూడు వందల మందికి మించి వీక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతే కాకుండా జల్లికట్టుకు హాజరయ్యేవారంతా వ్యాక్సినేషన్ వేయించుకుని ఉండాలనీ, అలాగే కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ ఉండాలని ప్రభుత్వం షరతులు విధించింది. ఇలా ఉండగా సంప్రదాయ క్రీడ జల్లి కట్టును చెన్నైలో కూడా నిర్వహించేదుంకు అనుమతించాలని ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హసన్ డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున చెన్నైలో జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు.