అప్పుడు ఇందిరమ్మ .. ఇప్పడు జగనన్న
posted on Jan 7, 2023 5:38AM
వినాశకాలే విపరీత బుద్ధి 1975 జూన్ 25న అప్పటి ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు. రాత్రికి రాత్రి వందల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో పముఖ సోషలిస్ట్ నాయకుడు, సంపూర్ణ క్రాంతి ఉద్యమ నిర్మాత లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళారు. తలుపు తట్టారు. నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చిన జేపీతో పోలీసు అధికారులు దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన విషయం చెప్పారు. తాము ఆయన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని తమతో సహకరించాలని కోరారు.అప్పుడు జేపీ ... ఎక్కువ తక్కువ లేకుండా ఒకే ఒక్క మాటన్నారు. ఆ మాటే .. వినాశకాలే విపరీత బుద్ధి.
ఆమాటకు అర్థం విడమరఛి చెప్పవలసిన అవసరం లేదు.ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుంది.అలాంటి పెడ ధోరణిని పెద్దలు వినాశ కాలానికి, పతనానికి సంకేతంగా నిలిచే విపరీత బుద్ధి అన్నారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎలాంటి రాజకీయ పరాభవాన్ని ఎదుర్కొన్నారో వేరే చెప్పనక్కరలేదు. అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడం కాదు, స్వయంగా ఇందిరా గాంధీ తమ సొంత నియోజక వర్గం రాయిబరేలి (యుపీ)లో ఓడిపోయారు. ఆమె కుమారడు సంజయ్ గాంధీ అమేథిలో ఓడి పోయారు.
ఇక ఇప్పుడు ఏపీకి వస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల కదలికలకు సంకెళ్ళు వేశారు. రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో (నంబర్ 1) తెచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అప్పుడు ఇందిరా గాంధీ అనుసరించిన మార్గంలోనే జగన్ రెడ్డి ప్రతిపక్షాల పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు కాదు స్వపక్షీయులే అంటున్నారు. అందుకే వినాశకాలే విరీత బుద్ధి ‘దీవెన’ జగన్ రెడ్డికు కూడా వర్తిస్తుందని అంటున్నారు. ఇలా ఇంకెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో, రాజకీయ సభలు, ర్యాలీలపై ఆంక్షలు విధించడం చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోనూ ఆయన పర్యటను అడ్డుకోవడం పోలీసుల దౌర్జన్యం ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న ఫాసిస్ట్ పాలన, నియంతృత్వ పోకడలకు అద్దం పడుతున్నాయి.ఇందిరమ్మ అత్యవసర పరిస్థితిని గుర్తు తెస్తున్నాయని అంటున్నారు.
నిజానికి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు నియంతృత్వ పోకడలు పోతున్నారనే ఆరోపణలున్నాయి.ఇప్పడు ఆయనకు సహజ సిద్ధంగా అబ్బిన కక్షపూరిత రాజకీయ సు...గుణాలకు ఓటమి భయం తోడవడంతో జగన్ రెడ్డి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వ్యవ్హరిస్తున్నన్నారని అంటున్నారు. ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారనీ అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాయి. చేయాలి .. అందులో భాగంగా ప్రజాస్వామ్య పద్దతిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ధర్నాలు, రోడ్డు షోలు, బహిరంగ సభల ద్వారా ప్రజా వ్యతీరేక ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెడతాయి.ఇవన్నీ, కూడా ఒక విధంగా ప్రజాస్వామ్య ఆభరణాలు. ఇప్పడు జగన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, అరాచక పాలనను, మరో మెట్టు పైకి తీసుకు పోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమి ఆశించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో, ఇంకేమి ఆశించి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారో కానీ,రాజకీయ వినాశనాన్ని ఆయన కోరి తెచ్చుకుంటున్నారని ప్రత్యర్ధి పార్టీల నాయకులే కాదు, సొంత పార్టీ, సొంత కుటుంబ సభ్యులే అంటున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాన్ని చూసి ముఖ్యమంత్రి రాజకీయ సభలు, ర్యాలీలపై విధించిన ఆంక్షలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లు అధికార పక్ష నేతలే ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాలను చూసి జగన్ భయపడుతున్నాడనే సంకేతం పంపినట్లవుతుందని స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికలలో 151 సీట్లు మాత్రమే గెల్చుకున్నామని,ఈ సారి కుప్పంతో సహా మొత్తం 175 నియోజకవర్గాలలో ఎందుకు విజయం సాధించలేమని గొప్పలకు పోయిన జగన్ రెడ్డి, ఇప్పడు ప్రతిపక్ష నాయకులకు భయపడి జీఓల చాటున దాక్కోవడం ఎలాంటి సంకేతాలు పంపుతుందని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి, నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి మీటలు నొక్కుతూ ఓట్లు లెక్కేసుకుంటూ ప్యాలెస్ లో కులాసాగా గడిపేశారు, కానీ ఒక సారి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఆయనకు సత్యం బోధ పడలేదు. మనము కట్టుకున్నవి దేవతా వస్త్త్రాలనే నిజం తెలిసి రాలేదు. ఇప్పుడు తెలిసొచ్చినా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఆయన విపరీత పోకడలు పోతున్నారని వైసీపీ నేతలే వాపోతున్నారు.