బండికి బెర్త్ ఖాయం.. ఈటలకు పార్టీ పగ్గాలు
ఉత్తర భారత దేశంలోనే కాదు,తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి పెరుగుతోంది. జనం బయటకు రావాలంటే ఒణుకుతున్నారు. అయితే, దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. రాష్ట్రం ఎన్నికల సంవత్సరంలోకి ఎంట్రీ ఇచ్చేసిన నేపథ్యంలో ఎన్నికల వేడి అన్ని పార్టీల్లో, అందరు నాయకుల్లో కాక పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలు వ్యూహలకు పదునుపెడుతున్నాయి.
ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పడు కాకపొతే ఇంకెప్పుడు తెలంగాణలో అధికారంలోకి రాలేము అన్న నిర్ణయానికి వచ్చింది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (భారాస) ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. అంతర్గత సమస్యలతో సతమత మవుతోంది. పార్టీ నాయకులను సిబిఐ, ఈడీ కేసులు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, అంతర్గత కుమ్ములాటలు, జూనియర్ సీనియర్, పాత, కొత్త కొట్లాటలతో పార్టీ దినదిన ప్రవర్త మానంగా దిగజారి పోతోంది. పీసీసీ అధ్యక్షుడు రెంత్ రెడ్డి కాడి తన్నేసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి.
మరో వంక బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ గలుపుతో పాటుగా, ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్’ను పడగొట్టి రెండవ స్థానంలోకి వచ్చింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోవడంతో, పార్టీ మూడో స్థానానికి పడిపోయిందనే అభిప్రాయం బలపడిపోయింది. దీంతో బీజేపీలో జోష్ పెరిగింది. మునుగోడులో బీజేపీ అధికార భారాసకు గట్టి పోటీ ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఊరి కొకరు, వాడ కొకరు అన్నట్లు మోహరించినా, అధికార భారస అభ్యర్ధి 10,000 స్వల్ప మెజారిటీతో మాత్రమే బయట పడ్డారు. సో .. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేసేందుకు ఇదే సరైన సమయమని, ఈ అవకాశం వదులుకుంటే ఇక మళ్ళీ ఇప్పట్లో మరో అవకాశం రాకపోవచ్చని బీజేపీ ఎట్టి పరిస్తితిలో గెలిచి తీరాలనే పట్టుదలతో పావులు కదుపుతోంది.
అందులో భాగంగా, బీజేపీ అగ్ర నాయత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది.ఇప్పటికే, రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం మొదలు బలాబలాలను బేరీజు వేసుకునేదుకు, మునుగోడు ఉప ఎన్నిక కోరి తెచ్చుకునేంత వరకు... చాలా చాలా ప్రయోగాలు చేసింది. చేస్తోంది. ఇక ఇప్పుడు తాజగా మరో పావు కదపటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో చేపట్టనున్న కేబినెట్ విస్తరణలో... తెలంగాణకు ఒక బెర్త్ ను ఖరారు చేసిందని విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజీపీ తరఫున నలుగురు ఎంపీలు గెలుపొందారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, ఆదిలాబాద్-సోయం బాపురావు, నిజామాబాద్-ధర్మపురి అరవింద్ గెలిచారు. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు.
కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. బండి సంజయ్ నాయకత్వం పట్ల ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పూర్తి విశ్వాసం వుంది. ఇక మిగిలిన ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది కానీ, తాజా సమాచారం ప్రకారం, బండి సంజయ్ ని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకుని ఆయన స్థానంలో ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నిజానికి బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవిలోకి వచ్చిన తర్వాతనే పార్టీలో ఊపొచ్చింది. దుబ్బాక, జీహెచ్ఎంసి, హుజురాబాద్ విజయాలు పార్టీకి మరింత ఊపునిచ్చాయి. అందుకే మళ్ళీ ఎన్నికల వరకు బండినే అధ్యక్ష పదవిలో కొనసాగించాలని ముందు నిర్ణయించినా భారాస, కాంగ్రెస్ పార్టీలలో చోటు చేసుకున్న పరిణామాల నేపధ్యంలో ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే భారాస, కాంగ్రెస్ పార్టీలపై ‘పైచేయి’ సాధించడం మరింత తేలిక అవుతుందని పార్టీ బావిస్తున్నట్లు చెపుతున్నారు. అందుకే బండికి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించి, ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఉభయ తారక నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
ఈటల రాజేందర్ కు భారాస లోగుట్లన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఉద్యమ పార్టీగా తెరాస పురుడు పోసుకున్నటి నుంచి, కుటుంబ పార్టీగా రూపాంతరం చెందేవరకు, అనంతర పరిణామాలు అన్నీఈటలకు కొట్టిన పిండి. అంతే కాకుండా ఇప్పటికీ గులాబి పార్టీ నేతలు అందరితోనూ ఈటలకు సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే ఒక బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈటల అన్ని వర్గాల ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాజేందర్ కు తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఇచ్చి, ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, జనవరి 16,17 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఉంటుందని అంటున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నందున ఈ లోగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని అంటున్నారు. అలాగే ఈ ఏడు జరగా నున్న9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటు పార్టీలో, అటు కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పుల ఉంటాయని అంటున్నారు.