సైకో పోవాలి.. సైకిల్ రావాలి.. చంద్రబాబుకు మద్దతుగా కుప్పంలో జనం నినాదం
posted on Jan 6, 2023 @ 4:29PM
చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ పేరంటేనే అధికార వైసీపీలో వణుకు మొదలైంది. అయన ఎక్కడకు వెళితే అక్కడ జనం ప్రభంజనంలా పోటెత్తుతున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఆయన చేసే విమర్శలకు హర్ష ధ్వానాలతో ఆమోదం తెలుపుతున్నారు. ఇదే అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేస్తోంది. దీంతో ఆయనను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఆయన సభలు, సమావేశాలు నిర్వహించడానికీ, రోడ్ షోలు చేయడానికీ వీల్లేకుండా చీకటి జీవోలతో ఆంక్షలు విధించింది.
అయితే కుప్పం పర్యటన చంద్రబాబులోని పోరాట యోధుడిని మరో సారి లోకానికి చూపింది. సొంత నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులు అవరోధాలు కల్పిస్తుంటే.. తనను కలవడానికి వచ్చిన వాళ్లపై లాఠీచార్జి చేసి గాయపరుస్తుంటే.. చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. పోలీసుల తీరును ఎండగట్టారు. సైకో పాలనలో బానిసలుగా మారారని పోలీసులపై జాలీ చూపారు. అయితే ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఏడు పదువ వయస్సులో గ్రామాలలో పాదయాత్ర చేశారు. ప్రచార వాహనాన్ని పోలీసులు దొంగిలించారని ఆరోపిస్తూ.. రోడ్డుపై పక్కన నిలిపి ఉన్న వాహనం టాప్ పైకి ఎక్కారు. వాన్ పక్కన నిట్ట నిలువుగా ఉన్ననిచ్చెనను అవలీలగా ఎక్కేసిన చంద్రబాబును చూస్తుంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాట ఆయన విషయంలో అక్షర సత్యం అనిపించక మానదు.
వ్యాన్ పై నుంచే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మొత్తం కుప్పం అంతా సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న నినాదాలతో మార్మోగిపోయింది. కుప్పం పర్యటన మూడో రోజు చంద్రబాబు గుడిపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలోకి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే బైఠాయించిన నిరసనకు దిగారు. ఎక్కడ మాట్లాడాలో చెప్పండంటూ పోలీసులను నిలదీశారు. దొంగల్లా తన ప్రచార రథాన్ని ఎత్తుకు పోయిన వారు పోలీసులు ఎలా ఔతారన్నారు. ఓటమి భయంతోనే జగన్ నల్ల జీవోలతో విపక్షాలను అణచివేయాలని యత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ప్రజలు గమనిస్తున్నారని... వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని హెచ్చరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కు శిక్షపడటం ఖాయమని అన్నారు. గొడ్డలి పోటుతో లేపేసి గుండెపోటు అని చెప్పింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. తన ప్రచార రథాన్ని పోలీసులు దొంగిలించారనీ, అందుకే ఇక్కడ ఉన్న వ్యాన్ ఎక్కి ప్రసంగిస్తున్నానన్నారు.