కమల దళానికి రాముడే రక్ష..!
posted on Jan 6, 2023 @ 12:53PM
భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) ఈ రోజున జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. వరసగా రెండు సార్లు (2014, 2019) సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. స్వయంగా సంపూర్ణ మెజారిటీ సాధించి, మూడు దశాబ్దాలకు పైగా నడుస్తున్న సంకీర్ణ రాజకీయ చరిత్రను తిరగరాసింది. ఈ రోజున కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది.
అయితే, బీజేపీ విజయం వెనక, కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల బలహీనతలతో పాటుగా ఇంకా అనేక కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ, మూల కారణం మాత్రం, 1990 దశకంలో దేశాన్ని కదిలించిన రామజన్మ భూమి ఆందోళన.. అద్వానీ రథ యాత్ర. అవును 1990 లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా వెనక బడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తెచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అగ్రవర్ణాల ప్రజలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వీపీ సింగ్ ప్రభుత్వ రాజకీయ ఎత్తుగడకు జవాబుగా బీజేపీ అప్పటికే విశ్వ హిందూ పరిషత్ ఇతర సంఘ పరివార్ సంస్థలు సాగిస్తున్న రామ జన్మభూమి ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అందుకు అనుగుణంగా అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ 1990లో రథ యాత్రను చేపట్టారు. ఇక ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని వివాదాస్పద కట్టడంబాబ్రీ మసీదుకూల్చివేత వరకుసాంస్కృతిక జాతీయవాదం పేరిట బీజేపీ సాగించిన ప్రయాణమే, బీజేపీ ఎదుగుదలకు బీజం వేసింది.
ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర. ఇక అప్పటి నుంచి బీజేపీ, ప్రతి ఎన్నికలలోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తే, రామజన్మభూమి అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం నిర్మిస్తామని వాగ్దానం చేస్తూనే వుంది. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేరే రోజు దగ్గరకొచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు 2019 నవంబర్ లో అనుమతి ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, 2020 ఆగష్టులో శంఖుస్థాపన చేశారు. ఇదంతా మన కళ్ళముందు కదులుతున్న చరిత్ర.
కాగా, ఈసంవత్సరం జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, వచ్చేస సంవత్సరం ( 2024) లోక్ సభ ఎన్నికల విజయానికి ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించిన బీజేపీ మరో మారు రామ మందిర్ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల సన్నాహక యాత్రలు సాగిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. వచ్చే సంవత్సరం (2024) జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ఆయన గురువారం(జనవరి 5) ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో నిర్వహించిన సభలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. అంతే కాదు అదే సమయంలో అమిత్ షా, ప్రత్యేకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకున్నారు.
రాహుల్ గాంధీని ఉద్దేశించి అడుగో ..అయోధ్య రాముడు వస్తున్నాడు కాసుకో ... అన్నట్లుగా, సవాలు విసిరారు. “రాహుల్ బాబా విను, .2024 జనవరి 1 నాటికి అయోధ్యలోని రామ మందిరం సిద్ధం అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. అంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని, రామమందిర్ వివాదంలోకి లాగేందుకే అమిత్ షా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ పేరు తీసుకున్నారని రాజకీయ పరిశీలకులు షా సవాలును విశ్లేషిస్తున్నారు. అలాగే, అయోధ్యలో రామ మందిర్ నిర్మాణాన్ని కాంగ్రెస్, వామపక్ష, లౌకిక వాద పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. అయోధ్య అంశాన్ని కోర్టు పరిధిలో సుదీర్ఘ కాలం ఉండేలా చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను,ఇతర లౌకికవాడ పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలుగా చిత్రించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
అంటే 2024 ఎన్నికలలో బీజేపీ మరోమారు రామ మందిర్ అంశాన్ని ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రం చేసుకునేందుకు సిద్డంవుతోందనే సంకేతాలు అమిషా ఇచ్చారు. నిజానికి అయోధ్య రామమందిర్ ఇష్యూని బీజేపీ ప్రతి ఎన్నికలలోనూ ఉపయోగించుకుంటూనే వుంది. అయితే, ఈసారి రామ మందిర నిర్మాణం పూర్తి చేసిన నేపధ్యంలో హిందూ ఓటు బ్యాంకును మరింత పటిష్ట పరచుకునే ప్రయత్నం మొదలెట్టిందని పరిశీలకులు షా ప్రసంగాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ సవాలును ఎలా స్వీకరిస్తారు అనేది చూడవలసి వుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.