న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినా మారని జగన్ సర్కార్
posted on Jan 7, 2023 @ 1:03PM
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
ప్రసిద్ధ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సమాజంలో స్పందనా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ రాసిన పాట. ఈ పాటను జగన్ సర్కార్ కు అతికినట్లు సరిపోతుంది. కోర్టులు ఎన్ని మొట్టి కాయలు వేసినా స్పందనే లేనట్టుగా, తనను కానట్టుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. ఏపీ సర్కార్ కు హైకోర్టు మొట్టి కాయలు వేయని రోజంటూ లేదంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఏపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు నష్టం చేకూరేదిగానే ఉంటుందనడానికి కోర్టులలో తగులుతున్న ఎదురు దెబ్బలే నిదర్శనం. జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు పెద్ద ఎత్తున దాఖలౌతున్నాయి.
ఆ కేసులలో దాదాపు అన్నిటిలోనూ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిధుల దారి మళ్లింపుపై హైకోర్టు జగన్ సర్కార్ కు గట్టిగా మొట్టికాయలు వేసింది. ఎస్సీ కార్పొరేషన్ పోటీ పరీక్షల శిక్షణకు బిల్లులు ఇవ్వడం లేదని.. ఎస్సీ కార్పొరేషన్ నిధులు నవరత్నాలకు మళ్లిస్తున్నారని ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ను విచారించిన ఏపీ హై కోర్టు ఎస్సీ కార్పొరేషన్ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిధుల మళ్లింపు కుదరదని 2003లోనే స్పష్టం చేశామని పేర్కొన్న ధర్మాసనం ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు.. దాన్ని మూసేయడం మేలని అభిప్రాయపడింది. ప్రభుత్వ కార్పొరేషన్లు నామమాత్రంగా మారిపోయాయని.. బిల్లులు చెల్లింపు వివరాలతో అదనపు అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని హైకోర్టు ఆదేశించింది.
సాధారణంగా కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే ఏ ప్రభుత్వమైనా నైతిక బాధ్యత వహిస్తుంది. నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. తప్పు సరిదిద్దుకుంటుంది. కానీ జగన్ సర్కార్ నైతికత అంటే అర్దం తెలియదన్నట్లుగా వ్యవహరిస్తోంది. కోర్టులు తలంటితే తల తుడుచుకుని మళ్లీ అదే తీరులో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఓ కాంట్రాక్టర్ అప్పులపాలై గత్యంతరం లేని పరిస్థితుల్లో చోరీకి పాల్పడిన సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోనికి వచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక పెన్షనర్లను జేబు దొంగలుగా మారుస్తారా అని ప్రభుత్వాన్నిప్రశ్నించింది. ఇంతటి ఘాటు వ్యాఖ్యలను కూడా జగన్ సర్కార్ దున్నపోతుమీద వాన పడ్డ చందంగా దులిపేసుకుంటోంది. కోర్టు ఆదేశాలను కానీ, సూచనలను కానీ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పై పెచ్చు కోర్టు తీర్పులు, వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పడానికి కూడా జగన్ సర్కార్ వెనుకాడటం లేదు. ఇందుకు అమరావతి పిటిషన్లపై సుప్రీం తీర్పుపై జగన్ రెడ్డి పార్టీ నేతలు చేసిన ప్రకటనలూ వ్యాఖ్యలే నిదర్శనం.
అలాగే ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా సర్కార్ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోడంతో హైకోర్టు బాధ్యులైన అధికారుల్ని న్యాయస్దానానికి పిలిపించి మరీ బిల్లులు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ ేసింది. ఆ ఆదేశాలు కూడా అమలు కాకపోవడంపై కాంట్రాక్టర్లు మరో సారి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులపై హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఏకంగా 102 రివ్యూ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే హైకోర్టు మొత్తం 102 రివ్యూ పిటిషన్లనూ కోట్టి వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వ తీరు మారలేదు. కోర్టు తీర్పుల దారి కోర్టు తీర్పులదే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో మరోమారు జగన్ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక కేసులో హైకోర్టు రూ.40 లక్షలు బకాయిలు కట్టలేదని గ్రానైట్ పరిశ్రమకు కరెంటు నిలిపివేశారని.. మరి కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని.. మరి ప్రభుత్వ పవర్ ను ప్రజలు ఎప్పుడు తీయాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అందుకే..
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని.. అని జగన్ సర్కార్ ను ఉద్దేశించి పాడుకోవాలేమో అని పరిశీలకులు అంటున్నారు.