ఏపీని కేటీఆర్ మళ్లీ అనేశారు.. జగన్ కు కావలసిందీ అదేనా?
posted on Jan 6, 2023 @ 10:47AM
తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో తన ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోందని గుర్తించిన ప్రతి సందర్బంలోనూ పొరుగు రాష్ట్రాన్ని అంటే ఏపీని చులకన చేయడం.. అక్కడి పరిస్థితులు నరకంతో సమానంగా ఉన్నాయంటూ చులకన చేసి.. తాము చేసిన అభివృద్ది గురించి గొప్పలు చెప్పుకోవడం కామనైపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు గడిచిపోయింది. ఉమ్మడి రాష్ట్రం నాటి భావోద్వేగాలు, సెంటిమెంట్లు ఇప్పుడు పెద్దగా లేవు కూడా. అయితే రాజకీయంగా తమకు అవసరమనిపించిన ప్రతి సందర్బంలోనూ తెలంగాణ మంత్రులు తమ ప్రభుత్వ గొప్ప చాటుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని చూపి తమ భుజాలను తామే చరుచుకుంటూ ఉండటం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగినప్పుడూ, ప్రభుత్వం ఇబ్బందులలో పడినప్పుడూ తెలంగాణ మంత్రులకు తమ గొప్పలు చాటుకోవడానికి ఏపీ దుస్థితినే ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువే ఉన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఇప్పటి తెలంగాణలో కూడా చెప్పుదగ్గ స్థాయిలో ఇక్కడి రాజకీయాలను మలుపు తిప్పగలరు. దాదాపు పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని కూడా ఇక్కడి రాజకీయాలలో ఓ లెక్క ఉంది. అందుకే తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇక్కడ స్థిర పడిన వారి మద్దతు అవసరం కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులకు బాగా తెలుసు. అందుకే స్థిరపడిన ఆంధ్రుల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలచుకోవాలంటే ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణను మా ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ది చేసిందని చెప్పుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని అండగా తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది.
అవినీతి, రెండు కళ్ల సిద్ధాంతంలో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారంటూ, సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. గత ఏడాది మేలో కేటీఆర్ ఇక్కడ స్థిర పడిన ఆంధ్రుల్లో జగన్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికే.. ఏపీలో రోడ్లు, విద్యుత్ పరిస్థితి అధ్వానంగా ఉంటే తెలంగాణలో అద్భుతంగా ఉన్నాయయంటూ చెప్పుకున్నారు.
గత ఎన్నికల్లో ఎలాగైతే ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకతను తెరాస ఇక్కడ ఓట్లుగా మార్చుకుందో.. అదే విధంగా జగన్ పై అక్కడి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే వ్యూహంతోనే కేటీఆర్ తెలంగాణతో ఏపీలో పరిస్థితులను పోలుస్తూ అభివృద్ధి చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. కేటీఆర్ మరో సారి ఆంధ్రలో పరిస్థితులపై తనదైన శైలీలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధిని తెలుసుకోవాలంటే ఓ సారి ఏపీ వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి రండంటూ వ్యాఖ్యలు చేశారు.
స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు, కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు పొరుగురాష్ట్రం చులకనగా చేసిన వ్యాఖ్యలను పట్టించుకునే తీరిక లేదు.
ఆ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. రాష్ట్రంలో విపక్షాలు సభలు, సమావేశాలు, రోడ్ షోలను అడ్డుకోవడానికే జగన్ సర్కార్ సర్వ శక్తులను వెచ్చిస్తోంది. పైగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలో అబద్ధమేముంది? నిజమే కదా అని తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులే కాదు.. ఏపీ ప్రజలు కూడా అంటున్నారు. ఇలాంటి భావన ఏపీలో ఎంతగా వ్యాపిస్తే తనకు అంత ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాలన్న భావన కొద్ది మందిలోనైనా ఏర్పడితే.. ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న ఆశాభావంతో జగన్ ఉన్నారనీ, అందుకూ కూటీఆర్ ఏపీని చులకన చేస్తూ, అభివృద్ధి లేమికి ఆనవాలుగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసినా స్పందించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తన గ్రాఫ్ పడిపోయిందని గుర్తించిన జగన్ ఇప్పుడు తన సర్వ శక్తులనూ విపక్షాల గ్రాఫ్ పెరగకుండా ఉండటంపైనే కేంద్రీకరించారని అంటున్నారు.
ఇందు కోసం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వెల్ కం చెప్పడం దగ్గర నుంచీ... తెలంగాణ మంత్రులు ఏపీ పరిస్థితులపై విమర్శలు చేసినా మౌనమే భూషణంగా భరించడం వరకూ అన్నీ చేస్తున్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా జనంలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత విపక్ష తెలుగుదేశం కు అనుకూలంగా మారకుండా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇందుకు బీఆర్ఎస్ ఏపీపై విమర్శలతో దూకుడు పెంచాలని కోరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.