కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కులు
కాంగ్రెస్ పార్టీలో కొత్త చిక్కు మొదలైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో హస్తం పార్టీకి ఇంటా బయట చిక్కులు ఎదురవుతున్నాయా అంటే, అవునన్న సమాధానమే వస్తోంది. ఓ వంక గాంధీ కుటుంబ విధేయుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి.
ఇటీవల రాహుల్ గాంధీని మానవాతీతుడిగా అభివర్ణించిన సల్మాన్ ఖుర్షీద్ తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరుకే అధ్యక్షుడు, పవర్స్ మాత్రం గాంధీల చేతుల్లోనే ఉన్నాయి. ఉంటాయి .. అంటూ పార్టీ అధ్యక్షుడు, గాంధీల రిమోట్ కంట్రోల్ తో పనిచేస్తారని బీజీపే చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చారు. నిజానికి ఖుర్షిద్ చెప్పింది కొత్త విషయం కాదు. ఒకప్పుడు చిదంబరం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీ రోజు వారీ కార్యకలాపాలు ఖర్గే చూస్తారు. విధాన పరమైన నిర్ణయాలు, ఇతరత్రా ముఖ్య నిర్ణయాలు గాంధీలను సంప్రదించే తీసుకుంటారని అన్నారు. ఇప్పడు అదే విషయాన్ని ఖుర్షిద్, ఖుల్లం ఖుల్లాగాబయట పెట్టారు. కాంగ్రెస్ పార్టీ సారథి గాంధీ కుటుంబమే అందులో సందేహం లేదు. కేవలం పార్టీ కార్యకలాపాలపైన దృష్టి సారించేందుకే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారని తెలిపారు. అయితే అది నిజమే అయినా ఇప్పడు ఖుర్షిద్ యాదృచ్చికంగా, ఈ వ్యాఖ్యలు చేశారా, లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనే చర్చ జరుగుతోంది.
నిజానికి బీజేపీ ఎప్పటి నుంచో ఇదే ఆరోపణ చేస్తోంది. ఇపుడు సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్య ను ఆసరా చేసుకుని ఖర్గే కాంగ్రెస్ పార్టీకి రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడా? రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడా? అని ప్రశ్నించింది. ఖుర్షిద్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అసలు నిజం బయటపడిందన్నారు. భజనపరత్వం, వంశపారంపర్య రాజకీయాలనే కాంగ్రెస్ నమ్ముకుందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నారనేదానితో సంబంధం లేదని పగ్గాలు మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీల చేతుల్లోనే ఉంటాయన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా? రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అని పిలవాలా? అని నిలదీశారు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఎటువంటి అధికారం ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేదన్నారు. గాంధీలు ఏం చెబితే దానినే ఖర్గే చేస్తారన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ఎన్నికలు ఓ బూటకమని విమర్శించారు. మరో వంక మనీలాండరింగ్ కేసులో తనపై దర్యాప్తును రద్దు చేయాలని రాబర్ట్ వాద్రా చేసిన దరఖాస్తును రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ మరో మారు గాంధీ కుటుంబాని టార్గెట్ చేసింది.
భారత రాజకీయాల్లో గాంధీ కుటుంబం అత్యంత అవినీతిపరుల కుటుంబమని దుయ్య బట్టింది. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మౌనం వీడాలని బీజేపీ డిమాండ్ చేసింది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఈ అవినీతి జరిగిందన్నారు. భారత దేశంలో అత్యంత అవినీతిపరుల కుటుంబం ఇది. అవినీతికి పాల్పడటం, భూములను కబ్జా చేసి రాబర్ట్ వాద్రాకు అప్పగించడం మాత్రమే దాని పని. కుటుంబంలో ముగ్గురు సభ్యులు అవినీతి కేసుల్లో బెయిలుపై బయట ఉన్నారని ఎద్దేవా చేశారు.
అదలా ఉంటే రాహుల గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, రాహుల్ గాంధీ, విపక్షాల ముఖ్యనేతగా ఆమోదం పొందుతున్నారని, కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్న వేళ, ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భారత్ జోడో యాత్రకు తమ పార్టీ మద్దతు ఇవ్వదని తెగేసి చెప్పారు. అంతే కాదు, తమ పార్టీ సిద్ధాంతం, భావజాలం ప్రత్యేకమైనవన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని వ్యాఖ్యానించారు.
మరో ఐదారు రోజుల్లో జనవరి 3 న యాత్ర ఉత్తర ప్రదేశ్ లో ప్రవేశిస్తున్నవేళ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యాత్రలో పాల్గొనాలని బీజేపీ యేతర పార్టీల నేతలను ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేతలు ఇటీవల చెప్పారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్‌డీ నేత జయంత్ చౌదరిలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. జోడో యాత్రలో పాల్గొనాలని తమకు ఆహ్వానమే అందలేదన్నారు.
నిజానికి, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాకపోయినా, యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తం వచ్చి చేరుతుందని, తద్వారా కాంగ్రస్ పార్టీ బలపడడంతో పాటుగా, రాహుల్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని, ఆశించారు. అయితే, భారత్ జోడో యాత్ర ఈ లక్ష్యాన్ని చేరుకుందా ? అంటే, కొంత వరకు మాత్రమే అనే సమాధానం వస్తోంది.