ఒకే దెబ్బకు రెండు పిట్లలు.. ఇదే బీఆర్ఎస్ స్కెచ్
posted on Jan 7, 2023 @ 10:11AM
ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బిఆర్ఎస్ వెనుక దాగి ఉన్న భారీ స్కెచ్ ఇదేనా? అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలంగాణలో కె. చంద్రశేఖర్ రావు, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు మళ్ళి అధికారంలోకి వచ్చేందుకు వేసిన మాస్టర్ ప్లానే బీఆర్ఎస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ ఒక్కటే రాష్ట్రాలే రెండు అన్నట్లుగా ఒకే పార్టీతో ఇటు తెలంగాణ, అటు ఏపిలోనూ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసిన బృహత్తర ప్రణాళికే బిఆర్ఎస్ అంటున్నారు ప్రాంతీయ సెంటిమెంట్ రగిలించి, దానిని ఓట్ల రూపంలో దండుకోవాలి, ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించిందంటున్నారు
బిఆర్ఎస్ విస్తరణ పేరిట ఏపిలో నాయకులను కొందరిని చేర్చుకొని, వారితో ప్రకటనలు చేయించడం, సమావేశాలు, సభల నిర్వహణకు సమాయత్తం కావడం ఇదంతా ఆ వ్యూహంలో భాగమే అంటున్నారు. బీఆర్ఎస్ సాకుతో కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడంపై ఏపీ నేతల నుంచి విమర్శలను ఆహ్వానించడం, వీటికి ప్రతిగా ఏపీ నేతలపై తెలంగాణలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడటం జరగాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఏపీలో విస్తరణకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విశేష ప్రచారం చేశాయంటున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏపీలో, బీఆర్ఎస్ పై విమర్శలకు నిరసనగా తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ రగల్చాలన్నదే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంగా చెబుతున్నారు.
ఆ వ్యూహంలో భాగంగానే తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరగానే వైసిపి నేతలు, మంత్రులు తమ గళానికి పదును పెట్టారు. మంత్రులైతే.. ఏకంగా సిగ్గుండాలి.. బుద్ది చెప్పుతారు.. అంటూ కేసీఆర్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు. ఏపీకి వెన్నుపోటు పొడిచింది చాలదా..? శ్రీశైలంలో, నాగార్జున్ సాగర్ లలో విద్యుత్ దోచుకుంటూ.. నీటిని సముద్రంలోకి వదులుతున్న వాళ్ళు ఇక్కడకు వచ్చి చేసేదేంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి రోజా కూడా తనదైన శైలితో స్పందించారు. విభజన చట్టం ప్రకారంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ప్రజలే బుద్ది చెప్పుతారంటూ నిప్పులు చెరిగారు. కెసిఆర్ జాతీయ స్థాయిలో కొట్లాడాలే గానీ, ఆంధ్రప్రదేశ్ లో చేసేదేమిటి..? రాష్ట్ర విభజనలో, ఏపీ నష్టపోవడంలోనూ ఆయన పాత్ర ఉందంటూ కొడాలి నాని ధ్వజమెత్తారు.
ఈ విమర్శలు, నిప్పులు చెరగడాలు అన్నీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యూహంలో భాగమేననీ అంటున్నారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ సభ తరువాత నుంచీ తెలంగాణ నుంచి ఏపీ నేతలపై విమర్శలు ప్రారంభమౌతాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇప్పటికే కేసీఆర్, ఆ తరువాత మంత్రులు ఏపీలో అభివృద్ధి లేమి గురించిన విమర్శలు మళ్లీ మొదలెట్టేశారు. తాజాగా స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు, కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తెరాస ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇటీవల తిరుమల శ్రీవారి దర్వనం చేసుకున్నారు. ఆ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాలలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. ఏపీలో చాలామంది ఎమ్మెల్యేలు, మాజీలు బీఆర్ఎస్ పార్టీకి టచ్ లో ఉన్నారని త్వరలో అందరూ బీఆర్ఎస్ లో చేరతారని అన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఒక పక్కా వ్యూహం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమ తమ రాష్ట్రాలలో తమ విజయం ఖరారు చేసుకోవడానికి, ఇరు రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ రగిల్చి.. ప్రాంతీయ చిచ్చు రగిల్చి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ను వాడుకుంటున్నారన్నది పరిశీలకుల విశ్లేషణ.