యువ‘గళం’ నొక్కేస్తారా?
posted on Jan 6, 2023 @ 2:45PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యవగళం పేరిట నిర్వహించే పాదయాత్రకు మరోవైపు.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వారాహి బస్సు యాత్రకు ఫూల్ స్టాఫ్ పెట్టేందుకు వైయస్ జగన్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? అందుకే అర్థరాత్రి జీవో నెంబర్ 1 తీసుకు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా.. జనవరి ఒకటోవ తేదీన గుంటూరులో జరిగిన తోపులాటలో ముగ్గురు మరణించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభల్లో జరుగుతున్న విషాద ఘటనలపై జగన్ సర్కార్ ఆగమేఘాల మీద స్పందించింది. రాష్ట్రంలో రోడ్ షో, సభలు, ర్యాలీలకు చెక్ పెడుతూ, జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చింది. ఈ జీవో ప్రకారం ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, సమావేశాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అయితే ఈ జీవోపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. లోకేష్ పాదయాత్రపై ప్రభుత్వ ఉత్వర్వులు అమలు కానున్నాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ఈ నిషేధం వర్తించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.
ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దాదాపు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించడమే కాదు.. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. అయితే లోకేష్ పాదయాత్ర రహదారులపై జరగనుంది. అంతేకాదు.. వేలాది మంది ఈ పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి అడుగులు వేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో.. హాజరైన ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగించాల్సి ఉంటుంది. అలాంటి వేళ.. లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా? లేదా? అంటే సందేహమే అని వారు స్పష్టం చేస్తున్నారు.
దాదాపు 4 వేల కోలోమీటర్ల మేర జరగనున్న ఈ పాదయాత్రలో చాలా చోట్ల లోకేశ్.. ప్రజలతో మాట్లాడతారు.. పలు చోట్ల ఆయన సభలు ఏర్పాటు అవుతాయి. అందుకోసం ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర హోం శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. అందుకు అనుమతులు కావాలంటే ఇస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు తాజాగా విడుదలైన జీవో ప్రకారం.. అనుమతి లభిస్తోందనే ఆశలు అయితే లేవని రాజకీయ విశ్లేషకలు స్పష్టం చేస్తున్నారు. ఓ వేళ.. ఒకరి పాదయాత్రకు.. మరొకరి బస్సు యాత్రకు అనుమతి ఇచ్చినా.. ఆవి ప్రారంభమైన కొద్ది రోజులకే వైయస్ జగన్..ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నారు.