రేవంత్ కాంగ్రెస్ కాడి వదిలేస్తారా?
posted on Jan 7, 2023 @ 11:02AM
తెలంగాణలో కాంగ్రెస్ లో వర్గ పోరు చినికి చినికి గాలివానగా మారిందా? అధిష్ఠానం జోక్యం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పు తర్వాత కూడా విభేదాలు సమసి పోలేదా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది. అసమ్మతి నేతల తీరుతో రేవంత్ రెడ్డి విసిగిపోయారని ఆయన మాటలను బట్టే అర్ధమౌతుంది. పార్టీ కోసం అవసరమైతే తాను టీ పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ అనడం వెనుక ఆయన ఫ్రస్ట్రేషనే కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు తాను ఎంత ప్రయత్నిస్తున్నా అసమ్మతి నేతలు పడనీయడం లేదన్న భావన రేవంత్ లో నెలకొందన్న విషయాన్ని ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ లోని కొందరు నేతలు బిఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ భావిస్తున్నారు.
ఆ విషయం తెలిసినా అధిష్ఠానం కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడం రేవంత్ మనోభావాలను గాయపరిచిందని అంటున్నారు. అసమ్మతి వర్గం డిమాండ్ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ ను అధిష్ఠానం పక్కన పెట్టడం ఒక రకంగా తన దూకుడు తగ్గించాలని హెచ్చరించడంగానే రేవంత్ పరిగణిస్తున్నారని అంటున్నారు. అసలు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ పార్టీలో సీనియర్లుగా చెప్పుకుంటున్న వారి నుంచి ఎటువంటి సహకారం అందలేదన్నది వాస్తవం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ ఒక అడుగు ముందుకు వేస్తే.. అసమ్మతి వర్గం తన చర్యలతో పది అడుగులు వెనక్కులాగేసే ప్రయత్నాలు చేశారు. తెలుగుదేశం నుంచి నిన్న కాక మొన్న పార్టీలో చేరిన రేవంత్ కు టీపీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడమేమిటన్న దుగ్ధ వినా పార్టీలో అసమ్మతి నాయకులు రేవంత్ కు వ్యతిరేకంగా జట్టు కట్టడానికి మరో కారణం కనిపించదు.
రాష్ట్రంలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లాలని భావించినా రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో అంతర్గత సమస్యలు అడుగడుగునా అడ్డం పడుతున్నాయి. తొలి నుంచీ టీపీసీసీ చీఫ్ రేవంత్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు, ఇటీవల పీసీసీ కమిటీల్లోనూ రేవంత్ వర్గానికి పెద్దపీట వేశారన్న నెపంతో ఒక్కసారిగా అసమ్మతి స్వరం పెంచడంతో పంచాయతీ రోడ్డెక్కింది. ఇంత కాలం పట్టీపట్టనట్టు వ్యవహరించిన అధిష్ఠానం రంగంలోకి దిగింది. అయితే కర్రా విరగకుండా, పామూ చావకుండా పంచాయతీని పరిష్కరించడానికి హై కమాండ్ చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు సరికదా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరింత బలహీన పరిచిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీలో ఉన్న పంచాయితీలు మరింత రచ్చకెక్కాయి. రేవంత్ రెడ్డికి సహకరించాడని, రేవంత్ వర్గం వద్ద డబ్బులు తీసుకుని పదవులు కట్టబెట్టారని పార్టీ సీనియర్లు మాణిక్కం ఠాగూర్ ను ఆ పదవి నుంచి తొలగించాలని ఇటీవల తెలంగాణా కు వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద డిమాండ్ చేశారు.
ఇక దిగ్విజయ్ సింగ్ నివేదిక మేరకు అన్నంత పని చేసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను పక్కన పెట్టి ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణిక్యరావు ఠాక్రేకు అవకాశం కల్పించింది. అయితే ఈ నిర్ణయం ఇటు రేవంత్ రెడ్డిని కానీ, అటు ఆయన వ్యతిరేక వర్గం వారిని కానీ సంతృప్తి పరచలేదనే చెప్పాలి. తన వ్యతిరేకుల డిమాండ్ కు తలొగ్గి అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం తనను బలహీనుడిని చేసిందని రేవంత్ భావిస్తుంగా, మాణిక్కం ఠాగూర్ ను మాత్రమే కాదు, రేవంత్ ను కూడా టీపీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలన్న తమ డిమాండ్ ను హై కమాండ్ పూర్తిగా నెరవేర్చలేదన్న అసంతృప్తి రేవంత్ వ్యతిరేక వర్గంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కాడె మోయడం అనవసరమన్న భావనకు వచ్చారని ఆయన వర్గీయులు అంటున్నారు.
పార్టీ బలోపేతం చేయడానికి రేవంత్ చేపట్టదలచిన పాదయాత్రను సైతం తన వ్యతిరేక వర్గం అంటే సీనియర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని రేవంత్ ఏ విధంగానూ సహించలేకపోతున్నారని అంటున్నారు. అంతే కాకుండా పార్టీ హైకమాండ్ కూడా సీనియర్లు అన్న ఒకే ఒక్క కారణంతో తన వ్యతిరేక వర్గం మాటకు విలువనిస్తుండటం కూడా రేవంత్ రెడ్డికి మింగుడు పడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నోటి వెంట రాజీనామా మాట వచ్చిందని అంటున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలను సీనియర్లు తప్పుపడుతుండటాన్ని కూడా రేవంత్ సీరియస్ గా తీసుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ తన భవిష్యత్ కార్యాచరణపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేయడమా లేక తెలంగాణలో బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం గూటికి చేరడమా అన్న ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.