కేంద్రం,రాష్ట్ర్రం మధ్య మళ్ళీ అదే పైసల పంచాయతీ
posted on Jan 7, 2023 6:06AM
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య చాల కాలంగా సాగుతున్న పైసల పంచాయతీ, మళ్ళీ మరో మారు తెర వచ్చింది. ఓ వంక కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్ళిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతుంటే, మంత్రి కేటీఆర్ మరో మారు,లెక్కల పంచాయతీని తెరపైకి తెచ్చారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పంపిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గద్దలా ఎగరేసుకు పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.5,080 కోట్లను, పంచాయతీల ప్రమేయం లేకుండా ఒకే ఒక్క గంటలో రాష్ట్ర ప్రభుతం ఉడ్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే, కిషన్ రెడ్డి చేసిన ఆరోపణపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఇది తప్పని నిరూపిస్తే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిజానికి మంత్రి కేటీఆర్ ఇదే సవాల్ గతంలోనూ చేశారు. అంతే, పంచాయతీ నిధుల దారి మళ్ళింపుకు సంబంధించి కేంద్ర మంత్రి కొంచెం చాలా ఆలస్యంగా స్పందించారు. పంచాయతీ సర్పంచ్ లు కేంద్ర నిధుల దారి మళ్లింపు పై రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగతనానికి పాల్పడిందని మీడియా సాక్షిగా ఆరోపించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల ఆరోపణలకు సమాధానం ఇచ్చినట్లు లేదు. కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలపై మాత్రం రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పర్యటనలో భాగంగా, నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. సవాల్ విసిరారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన పైసలను బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెడుతున్నారని.. ఇది తప్పని నిరూపిస్తే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేంద్రం నిధులను పక్కదారి పట్టించారంటూ.. కిషన్‌రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ కట్టిన 3 లక్షల 68 వేల కోట్ల డబ్బును వెనుకపడిన బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం ఖర్చుపెట్టింది నిజం కాదా అని కేటీఆర్ నిలదీశారు.
అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వ్యయాలు, నిధుల పంపాకాలకు సంబంధించి ఆరోపణలు రావడం కొత్తకాదు. నిజానికి నిధుల పంపకానికి సంబంధించి రాజ్యాగం నిర్దేశించిన నిర్దిష్ఠ నియమ నిబంధనలున్నాయని నిపుణులు చెపుతుంటారు. దేశ రక్షణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు దేశ రక్షణకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయవు, చేయవలసిన అవసరం ఉండదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక విధులుంటాయి. ఇది అందరికీ తెలిసిందే అయినా తరచూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ.. రాజకీయ పార్టీల నడుమ వివాదాలు తలెత్తడం ... విమర్శలు .. సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయ విచికిత్స తప్ప మరేమీ కాదు.
అందుకే, ఇలాంటి వివాదాలు కొద్ది రోజులు మీడియాలో హల్ చల్ చేసి కనుమరుగై పోతుంటాయని అంటారు. నిజంగా జరుగుతున్నది కూడా అదే. అయితే.. తెలంగాణ, కేంద్ర ప్రభూత్వాల నడుమ, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ల మధ్య ఈ విమర్శలు, ప్రతి విమర్శలు శృతితి మించి రాగాన పడుతున్నాయని విజ్ఞులు, విమర్శకులు అంటున్నారు.