ఏపీలో ఫాసిజానికి ప్రజాస్వామ్యానికీ మధ్య యుద్ధం... ఆర్ ఆర్ ఆర్
posted on Jan 6, 2023 @ 2:12PM
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. వెంటనే కేందా్రం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది. ఇదీ ఏపీలో అన్ని రాజకీయ పార్టీలూ చెబుతున్న మాట. వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు కూడా ఇదే అంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ కూడా రాశారు. ఈ విషయాన్ని ఆయన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గురువారం (జనవరి 5) విలేకరుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో ఫాసిజానికి, ప్రజాస్వామ్యానికి మధ్య యుద్ధం జరుగుతోందా? ఈ యుద్దంలో బ్యాలెట్ ద్వారా ఏపీ జనం జగన్ ఫాసిజ పాలనకు చరమగీతం పాడనున్నారా అంటే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఔననే అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డివన్నీ ఫాసిజం పోకడలేనని దుయ్యబట్టారు.
కుప్పం ప్రజలు పోలీసులపై తిరగబడిన తీరు, రేపు రాష్ట్ర నలుమూలలకూ వ్యాప్తి చెందుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రతిపక్ష నేత, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ని కుప్పంలో పోలీసులు దారుణంగా అవమానించి, వేధించారు. గూండాల్లాగా వ్యవహరించారన్నారు.
గతంలో జగన్ , ఆయన తల్లి, చెల్లి ఇరుకు రోడ్లలో సమావేశాలను ఏర్పాటు చేయలేదా?. అప్పటి ప్రభుత్వం, పోలీసులతో రక్షణ కల్పించి సహకరించలేదా? అన్నారు. చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకోవడానికి వినియోగించిన పోలీసులలో, పది శాతం మంది పోలీసులను రక్షణ కోసం వినియోగించి ఉంటే రోడ్ షో సజావుగా సాగేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1 ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిగా ఉందన్నారు. రాజకీయ పార్టీల సమావేశాలకు, సభలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన సాగిస్తున్న జగన్ కు హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా కొనసాగిన ఆనం రామనారాయణ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించడం కక్షపూరిత రాజకీయాలకు ఇది పరాకాష్టగా అభివర్ణించారు.