సచిన్ ఎందుకు ఔటయ్యాడు?

      ముంబైలోని వాంఖేడే స్టేడియం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత సచిన్ ఇక బ్యాట్ పట్టడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా తన కెరీర్‌కి గొప్ప ముగింపు ఇవ్వాలని ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు. వాంఖేడే స్టేడియంలో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ మీదే స్టేడియంలో వున్న, టీవీలో మ్యాచ్ చూస్తున్న అందరి చూపులూ కేంద్రీకృతమై వున్నాయి.   సచిన్ ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు విసురుతున్న బంతుల్ని చాకచక్యంగా కొడుతున్నాడు. వేసిన ప్రతి బాల్ నుంచి పరుగులు పిండుకోవాలి.. తనను చూస్తున్న అభిమానులకు ఆనందం కలిగించాలి అనే తపన సచిన్ ముఖంలో కనిపిస్తోంది. ఈ చివరి టెస్ట్ మ్యాచ్‌లో తనకోసం కాకపోయినా తనను అభిమానించే దేశ ప్రజల కోసమైనా సెంచరీ చేయాలన్న  కృతనిశ్చయం ఆయన కళ్ళలో కనిపిస్తోంది. సచిన్ ముఖంలో, కళ్ళలో కనిపిస్తున్న భావాలను అర్థం చేసుకున్న అభిమానులు మరింత ఉత్సాహంగా మ్యాచ్‌ని గమనిస్తున్నారు. సచిన్ సెంచరీ చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ విసురుతున్న బంతుల్ని సచిన్ చాకచక్యంగా ఫోర్లు, సిక్సర్ల రూపంలో బౌండరీ అవతలకి తరలిస్తున్నాడు. సచిన్ అర్ధ శతకం పూర్తి చేశాడు. స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది. చూస్తుండగానే సచిన్ అరవై పరుగులు పూర్తి చేశాడు. మరికొద్ది నిమిషాల్లో డెబ్భై పరుగులు పూర్తయ్యాయి. సచిన్ సెంచరీ చేయడం ఖాయమన్న నిర్ణయానికి స్టేడియంలో ఉన్నవారు, టీవీలు చూస్తున్నవారు వచ్చేశారు. అయితే సడెన్‌గా సచిన్ దూకుడులో మార్పు వచ్చింది. మనిషి స్లో అయిపోయాడు. బంతులు ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. రెండుసార్లు ఔటవ్వబోయి తృటిలో తప్పించుకున్నాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. సచిన్‌లో సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళంతా అలా ఆలోచిస్తూ వుండగానే 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సచిన్ ఔటయ్యాడు. సచిన్ సెంచరీ చేయాలన్న అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. సచిన్‌లో ఉన్నట్టుండి, సడెన్‌గా ఎందుకు మార్పు వచ్చిందా అన్న పరిశీలన అభిమానులలో మొదలైంది. అందరూ ఏదో అనుమానం వచ్చి స్టేడియం మొత్తం కలియజూశారు. అంతకుముందే స్టేడియంలోకి ఎంటరైన ఒక వ్యక్తిని చూడగానే అందరికీ సచిన్ ఎందుకు ఔటయ్యాడో అందరికీ అర్థమైపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. రాహుల్‌గాంధీ! లెగ్గుబాబూ.. లెగ్గు! అది మామూలు లెగ్గా! రాహుల్‌గాంధీ ఎంటరయ్యాక వంద సంవత్సరాలకు పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీనే ఔటయిపోయింది. పాపం సచిన్ ఒక లెక్కా? సరే జరిగిందేదో జరిగిపోయింది. కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సచిన్ ఆడేటప్పుడు రాహుల్‌గాంధీని స్టేడియం పరిసరాల్లోకి రాకుండా చూడు భగవంతుడా అని  సచిన్ అభిమానులందరూ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు.

సోనియమ్మ గుడికి పూజారి ఎవరు?

  తన రాజకీయ ప్రస్థానంలో చివరి దశలో ఉన్న మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు, ఇంతవరకు తన సికిందరాబాద్ కంటోన్మెంటు నియోజక వర్గం ప్రజలకు ఒరగబెట్టినదేమీ లేకపోయినా, వచ్చే ఎన్నికలకు టికెట్ సంపాదించాలనే యావ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలకే తమ పరిస్థితి ఏమిటో అర్ధం కాక తలలు పట్టుకొంటుంటే, శంకర్ రావు మాత్రం ‘అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే’ అనే పాలసీతో నిత్య సోనియా పారాయణం చేస్తూ ఆమె దృష్టిలో పడాలని తెగ తాపత్రయపడుతున్నాడు.   ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణా వరంగా ఇచ్చిన ఆ దేవతకు ఒక గుడి కట్టాలని కూడా సంకల్పం చెప్పుకొని ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. స్థలం గుర్తించడం, (బహుశః ప్రభుత్వభూమి అయినందున) రెవెన్యు అధికారులను సంప్రదించడం కూడా జరిగిందని, సోనియమ్మ పుట్టిన రోజు అంటే డిశంబర్ 9న సోనియాలయ శంఖు స్థాపన కూడా చేయాలని ఆయన కమిట్ అయిపోయినట్లు సమాచారం.   అయితే ఆయన గ్రహించని రెండు విషయాలు ఏమిటంటే, ఆయన ఇంకా రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నప్పటికీ, సోనియమ్మ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ బాబుని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి, తను రిటర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అటువంటప్పుడు శంకర్ రావు ఆమెకు గుడి కట్టించడం కంటే రాహుల్ బాబుకే కట్టించేస్తే బెటరేమో ఓ సారి ఆలోచించవలసి ఉంది. లేకుంటే రాజకీయాల నుండి రిటర్ అయిపోతున్న సోనియమ్మకు గుడి కట్టి అందులో భజన చేసుకోవాలంటే ఆమెతో బాటు శంకర్ రావు కూడా రిటర్మెంట్ తీసుకోక తప్పదు.   ఇక రెండో పాయింటు: రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికలలో తన వంటి యువతకి అంటే 40 నుండి 60 మధ్యలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారని ఇప్పటికే చాలా స్పష్టమైయిన సంకేతాలు ఇస్తున్నారు. మరి తను ఆ ‘యువ రేంజ్’ లో ఉన్నాడో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, వీలయితే మళ్ళీ ఓ సారి ఆరోగ్యపరీక్షలు చేయించుకొంటే మంచిది. ఎందుకంటే పోలీసులు విచారణకు పిలిచినప్పుడల్లా ఆయన ఆరోగ్యం పాడయిపోవడం, వెంటనే ఏ కార్పోరేట్ ఆసుపత్రిలో చేరిపోవడం చూసి ఆ సాకుతో రాహుల్ ఆయనకు టికెట్ నిరాకరించే ప్రమాదం ఉంది. అందువల్ల సోనియమ్మని ఎలాగో ప్రసన్నం చేసుకొని, యువ రేంజ్ లోకి దూరిపోయి టికెట్ సంపాదించుకొన్నా, తీరా చేసి మళ్ళీ ఆరోగ్యంపాడయిపోతే టికెట్ వృదా అయిపోతుంది గనుక ముందే ఓ సారి ఓల్ బాడీ చెకప్స్ కూడా చేయించుకొంటె మంచిదేమో అని అలోచించాలి. .   అందువల్ల సోనియమ్మకి గుడి కట్టే ముందు ఓసారి టికెట్ విషయం కూడా కన్ఫర్మ్ చేసుకొంటే మంచిదేమో. అప్పుడు గుడికి, తనకి కలిపి మొత్తం ఎంత ల్యాండ్ పుచ్చుకోవాలో, అసలు గుడి కట్టాలో వద్దో, కడితే ఎవరికి కట్టాలో, కడితే టికెట్ వస్తుందో రాదో, రాకపోతే దానిలో నిత్యపూజలు తనే స్వయంగా నిర్వహించాలో లేక వేరవరినా నిర్వహించాలో, వగైరా సమాచారం అంతా సేకరించవచ్చును.     ఏమయినప్పటికీ ఇటువంటి గొప్ప భక్తుడిని తమ ప్రతినిధిగా ఎన్నుకొన్న సికిందరాబాద్ కంటోన్మెంటు ఓటర్ల విజ్ఞతకు జోహార్లు చెప్పక తప్పదు. ఒకవేళ ఈ సారి అతనిపై అమ్మ దయ తప్పి, యువరాజు టికెట్ మంజూరు చేయకపోతే కనీసం సదరు నియోజక వర్గ ప్రజలయినా అతనిని స్వతంత్ర అభ్యర్ధిగా నిలబెట్టుకొని గెలిపించుకోవలసిన గురుతరమయిన బాధ్యత తమపైనే ఉందని గుర్తించాలి.లేకుంటే శంకరన్న అదే గుడిలో గంట కొట్టుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు.

మోపిదేవి కాంగ్రెస్ కి రామ్ రామ్

  వాన్‌పిక్ కేసు నిందితుడిగా దాదాపు 16నెలలు జైలు జీవితం గడిపిన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, తనకు కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా వదిలేసిందనే ఆగ్రహంతో, కాంగ్రెస్ ను వీడి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులు, అనుచరులు వైకాపాలో చేరి ఉన్నారు. ఇప్పుడు మోపిదేవి కూడా చేరుతున్నారు.   సాధారణ పరిస్థితుల్లో అయితే మోపిదేవి వంటి బలమయిన నాయకుడు పార్టీని వీడివెళ్లిపోతుంటే బుజ్జగింపుల ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రికే గ్యారంటీ లేనప్పుడు ఇంకా మోపిదేవిని మాత్రం ఎవరు పట్టించుకొంటారు? పైగా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందరూ ఎవరికి వారు తమ పరిస్థితి ఏమిటనే దిగులుతో ఏమి చేయాలో పాలుపోక, పరిస్థితులు ఎప్పటికయినా చక్కబడక పోతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో మోపిదేవిని ఎవరూ పట్టించుకొంటారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అయితే రేపు జగన్ తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లు మోపిదేవి మళ్ళీ కాంగ్రెస్ గూటిలోనే వచ్చి పడవచ్చును.

పాల్వాయి శిశుపాలుడు ఎవరో?

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ణన్ రెడ్డి మండిపడుతున్నారు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తరువాత శిక్ష అనుభవించాడు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శిశుపాలునికంటే ఎక్కువ తప్పులే చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తే ఏంటి ? చేయకపోతే ఏంటి ? అధిష్టానం అనుకుంటే వెంటనే తప్పిస్తుంది. ఆయనను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలి. తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటూనే అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదు అని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ణన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ హై కమాండ్ కిరణ్ ను తీసే సాహసం చేయలేకపోతున్నదని పాల్వాయి 'కడుపు మంట'ని అంటున్నారు!

దేవుళ్ళకీ ప్రాంతీయ మసి!

    దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూయడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. విభజనవాదులకు హైదరాబాద్‌ని తేరగా ఇచ్చేయాలి.. గతంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలాన్ని కూడా ఇచ్చేయాలి. ఇదెక్కడి న్యాయం? 1956‌కి ముందు తెలంగాణ ఎలా వుండేదో ఆ తెలంగాణ కావాలని అంటున్నారు కదా, మరి 1956లో భద్రాచలం సీమాంధ్రలోనే వుంది కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే విభజనవాదులు గయ్యిమని అంతెత్తున లేస్తున్నారు.   భద్రాచలంతో తెలంగాణ ప్రజలకు బోలెడంత అనుబంధం పెరిగిపోయిందట. అందుకే భద్రాచలం తెలంగాణలో వుండాలట. మరి సీమాంధ్రులకు కూడా హైదరాబాద్‌తో అనుబంధం పెరిగిపోయింది కాబట్టి హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా హక్కు కావాలంటే దానికిమాత్రం ఒప్పుకోం అంటున్నారు. అంటే ‘అనుబంధం’ అనే పదం మీద కేవలం తెలంగాణ వారికే కాపీరైట్ హక్కులున్నాయా? సీమాంధ్రులకు అనుబంధాలు వుండకూడదా? అసలు భద్రాచలం ఆలయాన్ని హైదరాబాద్ పాలకుల ఆదాయంతోనే కట్టించారు కాబట్టి భద్రాచలం మాదే అని విభజనవాదులు అంటున్నారు. అలాంటప్పుడు భద్రాచలం ఆలయం కట్టించిన సమయంలో సీమాంధ్ర ప్రాంతం కూడా హైదరాబాద్ నవాబుల పాలనలోనే వుండేది కదా.. మరి సీమాంధ్ర మీకు వద్దా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళెవరూ లేరు!  ఈమధ్య మరో కొత్త వాదన విభజన వాదుల నోళ్ళలోంచి ఊడిపడింది. సీమాంధ్ర ప్రాంతంలో అనేక ప్రధాన దేవాలయాలు వున్నాయి. మా తెలంగాణలో లేవు. అంచేత భద్రాచల రాముడినైనా మాకు వదిలిపెట్టండి అంటున్నారు. దేవుళ్ళు ఏ ప్రాంతంలో వున్నా అందరికీ దేవుళ్ళే. ఒకవేళ భద్రాచలం సీమాంధ్రకి వెళ్ళిపోతే తెలంగాణ వాళ్ళు రాముడిని చూడటానికి వెళ్ళరా? రాముడు అందరి వాడు..  ‘అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా’  అని అందుకే అన్నారు. అందరి బంధువుని కొందరికే బంధువుని చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా తెలంగాణలో పెద్ద దేవాలయాలు లేవని అనడం చాలా తప్పు. చాలా గొప్పగొప్ప క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో వున్నాయి. ప్రాంతీయ భేదం లేకుండా అందరూ వాటిని సందర్శిస్తూనే వున్నారు. విభజనవాదులు మాత్రం ప్రతి అంశాన్నీ విభజనకు ముడిపెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. చివరికి దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూస్తున్నారు.

కన్నావారి సొల్లు కబుర్లు

  మంత్రి కన్నా లక్ష్మినారాయణ తన రచ్చబండ కార్యక్రమాన్ని సైతం రద్దు చేసుకొని రెక్కలు కట్టుకొని మరీ సోనియమ్మ ముందు వాలి రహస్య మంతనాలు చేసివచ్చిన తరువాత, కిరణ్ కుర్చీలో ఆయనే కూర్చోబోతున్నడనే వార్తలు రావడంతో, అటువంటి వార్తలు వింటూ మనసులో ఆనందం పొంగిపోరలుతున్నపటికీ, పైకి మాత్రం అసలు సిసలయిన రాజకీయనాయకుడిగా చిరంజీవి కంటే బాగా నటించక తప్పలేదు.   అసలు అధిష్టానం తనను రమ్మని పిలువలేదని కానీ తానే సమైక్యాంధ్ర కోసం వెళ్లి సోనియమ్మని కలిసొచ్చానని, కానీ గిట్టని వారు తనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని, అందుకు ప్రతిగా రాష్ట్ర విభజనకు సహకరించేందుకు అంగీకరించినట్లు ప్రచారం చేస్తున్నారని, కానీ తను అచ్చమయిన సమైక్యవాదినని, అచ్చు బొత్స సత్తి బాబు లాగానే ఆవేదన ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసారు.   అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో ఆయన రచ్చబండ మీద నుండి నేరుగా హనుమంతుడిలా డిల్లీకి లంగించి తల్లి సోనియా ముందు వాలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరానని చెపుతున్నారు. అదే కొంచెం నమ్మ బుద్ది కావడం లేదు. అయితే ఆయన మిగిలిన వారిలా కాకుండా తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెప్పడం ద్వారా రేసులో తన ప్రాధమిక అర్హతను స్వయంగా నిర్దారించుకొనడంమెచ్చుకోవలసిందే.

కేంద్ర విన్నపాలు వినవలె ముఖ్యమంత్రిగారు

  రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ రోజు రాత్రి 8గంటలకు డిల్లీలో జరిగే సమావేశానికి రమ్మని పిలిచింది. కానీ రచ్చబండ కార్యక్రమం పెట్టుకొనందున డిల్లీ రాలేనని జవాబు చెప్పి తప్పించుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కంగు తింది. ఇంతవరకు తన విభజన ఆలోచనని ధిక్కరిస్తున్నప్పటికీ, అది సజావుగా సాగేందుకు పరోక్షంగా సహకరిస్తున్నందున నేటికీ ఆయనను ‘గుడ్ బాయ్’ గానే పరిగణిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఆయన ఇప్పుడు తన ఆజ్ఞను కూడా ధిక్కరించడంతో అవాక్కయింది.   అయితే ఊహించినట్లే కాంగ్రెస్ అధిష్టానం తన పరువు కాపాడుకొనే ప్రయత్నంలో, ఈనెల 18న సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో జీ.ఓ.యం. సమావేశమయిన తరువాతనే, ఆఖరిగా ముఖ్యమంత్రితో మాట్లాడాలని నిశ్చయించుకొన్నామని, అందుకే ఈరోజు ఆయనతో జరుగవలసిన సమావేశం వాయిదా వేశామని ప్రకటించింది. అందువల్ల మళ్ళీ ఈనెల 18న జరిగే సమావేశానికి ఆయనని డిల్లీ రమ్మని తాజాగా మరో ఆహ్వానం పంపింది. కనీసం ఆ విజ్ఞప్తినయినా ముఖ్యమంత్రి మన్నించి డిల్లీ వెళతారో లేక తేదీ ముందే తెలిసింది గనుక, ఆరోజు ఏ విశాఖ పర్యటనో పెట్టుకొని తప్పించుకొంటారో? చూడాలి.

‘ఇసి’గించొద్దు రాహుల్!

        మనిషికోమాట... గొడ్డుకోదెబ్బ అన్నారు. మరి రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకుడిని దారిలోకి తేవాలంటే ఏం చేయాలన్నది ఎవరైనా కొత్తగా కనిపెట్టాలి. చిన్నసార్ ఏ ముహూర్తంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యాడోగానీ, సార్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మటాష్! తనమీద పడిన ఈ ముద్రని పోగొట్టుకోవాలని అనుకున్నాడో ఏంటోగానీ, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాహుల్ తెగ పర్యటించేస్తున్నాడు. ఓటర్లని బుట్టలో వేయడానికి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు.   ఆమధ్య ఓ మీటింగ్‌లో ముజఫర్‌నగర్‌లో జరిగిన గొడవలను ప్రస్తావించి, ఆ గొడవలకి కారణం బీజేపీయేనని కాషాయం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయం మీద బీజేపీ  భగ్గుమంది. రాహుల్ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం రాహుల్‌ని వివరణ కోరితే, రాహుల్ తాను చాలా మంచి బాలుడినని, ఎన్నికల కమిషన్ నిబంధనలను ఎంతమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చాడు. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణ ఎన్నికల కమిషన్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. రాహుల్ వివరణ మీద ఇ.సి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులో బహిరంగసభల్లో మాట్లాడే సమయంలో నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా రాహుల్ జనాన్ని తన మాటలతో ‘ఇసి’గించకుండా వుంటారని ఆశిద్దాం. ఇదిలావుంటే, రాహుల్ గాంధీ మీద బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాబట్టి, దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తాన్ని ‘ఖూనీ పంజా’ అని విమర్శిస్తున్నారని, ఈ పాయింట్‌ని బేస్ చేసుకుని మోడీ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల సంఘం యథావిధిగా ఈ విషయంలో నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి నరేంద్రమోడీ వివరణ ఎలా వుంటుందో వేచి చూడాలి. కానీ ఒక్కటి మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. అదేంటంటే, మోడీ ఇచ్చే వివరణ రాహుల్ ఇచ్చిన వివరణలా ఇ.సి. చేత అక్షింతలు వేయించుకునేలా మాత్రం వుండదు.

రెడ్డిగారి ఈ దూకుడు ఎందుకో

  టీ-కాంగ్రెస్ నేతల జైత్రయాత్రలో అకస్మాత్తుగా దూకిన జైపాల్ రెడ్డి మొన్ననిర్మల్ లో జరిగిన సభలో ‘సమన్యాయం అంటే అదేమయినా బ్రహ్మపదార్ధమా?’ అని ఒక మంచి ప్రశ్నవేసారు. నిజమే! అది ఎవరికీ అర్ధం కాని బ్రహ్మ పదార్ధమేమి కాదని, దాని భావమెంటో అందరికీ తెలుసునని ఆయనకి బాగా తెలుసును.   అయితే, మిగిలిన కేంద్ర మంత్రులకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి బహిరంగంగా మాట్లాడేందుకు లేని అభ్యంతరం కేవలం తనకే ఉందని భావిస్తూ, ఇంతకాలం తెలంగాణాపై మాట్లాడానికి ఇష్టపడని ఆయన, పాపం టీ-కాంగ్రెస్ నేతలు సోనియమ్మ భజన చేసుకొని ముఖ్యమంత్రి సంపాదించుకోవాలనే ఆలోచనతో జైత్ర యాత్రలు చేసుకొంటుంటే, వారి మధ్యలో ఆయన సినిమా హీరోలా హటాత్తుగా ఎందుకు దూకారు? దూకి వారి కంటే బిగ్గరగా ‘సోనియమ్మ మనసు వెన్న, కానీ ఆమె సంకల్పం మాత్రం వజ్ర సంకల్పం’ అంటూ ఎందుకు భజన మొదలుపెట్టారు? భద్రాచలం మొదలు హైదరాబాదు వరకు, ఉద్యోగుల సమస్యల నుండి నదీ జలాల వరకు ప్రతీ అంశంపై అందరి కంటే పెద్ద గొంతుకు వేసుకొని ఎందుకు వాదిస్తున్నారు? ఆయనలో కలిగిన ఈ అకస్మాత్ మార్పుల వెనుక దాగిఉన్న బ్రహ్మ రహస్యం ఏమిటి? అని ఆయన వివరించితే బాగుంటుంది.   వీలయితే అవే సభల్లో తను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక చిన్న ప్రకటన చేసినట్లయితే, వేదిక మీద ఉన్న పోటీదారులకి అదో తుత్తి.

విభజనపై సుప్రీంను ఆశ్రయించిన ఎంపి

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేఫధ్యంలో కొందరునాయకులు న్యాయపోరాటానికి రెడీ అవుతున్నారు. విభజన ప్రక్రియను ఆపాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌ బుధవారం సుప్రింకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కారణంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్‌లో తెలిపారు. కేంద్రంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ విభజన ప్రక్రియను రాజకీయ కోణంలో చూస్తుందని పిటిషనర్‌ అయిన సి.ఎం. రమేష్‌ తెలిపారు. రాజ్యాంగ సవరణ ద్వారా 371(డి) ని తొలగించాలని సి.ఎం. రమేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలా వుండగా సీమాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలల కన్వీనర్‌ చిరంజీవిరెడ్డి కూడా రాష్ట్ర విభజనను సవాల్‌ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోసారి సమ్మెకు సై

  కాంగ్రెస్‌ అధిష్టానం విభజన దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఏపిఎన్జీవోలు మరోసారి సమ్మెకు సిద్దపడుతున్నారు. యుపీఏ ప్రభుత్వం, సీడబ్ల్యుసి గత జులై 30న రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె సరైన్‌ మోగింది. దాదాపు అన్ని ప్రభుత్వ సంఘాలకు సమ్మెకు మదతునివ్వడంతో దాదాపు 72 రోజుల పాటు రాష్ట్రంలో పాలన స్తంభించింది. అయితే ప్రస్థుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ఏపీ ఎన్జీవో నేత అశోక్‌ బాబు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని జాతీయ పార్టీ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మరో మారు సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఏర్పాటుకు సంభందించిన బిల్లు అసెంబ్లీకి వస్తే వెంటనే మరో మారు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు ఏపిఎన్జీవోలు.

వైద్య విద్యార్థిపై హత్యాయత్నం

వైధ్యకళాశాలలో దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రనికి చెందిన ఓ వైద్య విద్యార్థిపైన తోటి విద్యార్థులే పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన చోటు చేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని కోలార్ వైద్య విశ్వవిద్యాలయంలో ఈ దారుణం జరిగింది. బాధితుడు వైద్య విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన కామేష్ సాయిప్రసాద్. మంగళవారం రాత్రి కొందరు సహ విద్యార్థులు కామేష్‌ పై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలు అయిన అతనిని దగ్గర్లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అరవై శాతం గాయాలతో కామేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పైన దాడి చేసింది మన రాష్ట్రానికి చెందినవారేనని అనుమానిస్తున్నారు. కామేష్ తల్లిదండ్రులు హైదరాబాదులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు.

మరో ఘోరం

  మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాదం మరువక ముందే కర్ణాటకలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో హవేలీ జిల్లాలోని కునిమల్లళ్లిలో మంటల్లో చిక్కుకుంది.ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉంది. బుధవారం సాయంత్రం బెంగళూరు నుంచి ముంబైకి ఈ బస్సు బయలుదేరింది. అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్‌ నిర్లక్షంగా భావిస్తున్నారు. బస్సు డివైడర్‌ను డీకోని టైరుపేలటంతో మంటలు వ్యాపించాయన్నది ప్రాదమిక సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులున్నారు.

అఖ్కర్లేనిపక్షం!

      కేంద్రప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఏదో జరిగిపోతుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. కేంద్ర మంత్రుల బృందం అఖిలపక్షం మొదటిరోజు ఒక్కో పార్టీతో పదేసి నిమిషాలపాటు మాట్లాడించింది. ఆ పార్టీలు కొత్తగా మాట్లాడిందేమీ లేదు.. వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెలుసుకున్న విషయమూ ఏమీ లేదు. మొత్తమ్మీద చూస్తే ఈసారి అఖిలపక్షం ద్వారా ఒరిగిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   ఈ అఖిలపక్షం ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అస్సలు అఖ్కర్లేని పక్షమని జోక్ చేస్తున్నారు. ఈ అఖ్కర్లేనిపక్షంలో అన్ని పార్టీలూ మరోసారి రాష్ట్ర విభజన మీద తమ విధానాన్ని చెప్పాయి. బీజేపీ పాత పాట పాడిన తర్వాత ఈ విషయంలో కాంగ్రెస్ తీరు చెప్పాలంటూ కొత్త పల్లవి అందుకుంది.  ఆ పల్లవి బీజేపీ నోట్లోంచి బయటకి  రాకముందే మంత్రుల కమిటీ బీజేపీ నోరు నొక్కేసింది. కొత్త విషయాలు చెప్పనివ్వకుండా, పాత విషయాలనే మళ్ళీ వినడానికే ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసినట్టున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీలన్నీ పడుతూ లేస్తూ ఢిల్లీకి వెళ్ళాయి. పార్లమెంటు మెయిన్ గేటు నుంచి సమావేశం జరిగిన చోటకి వెళ్ళడానికి ఎంతసేపు పట్టిందో కనీసం అంతసేపు కూడా మంత్రుల బృందంతో సమావేశం జరగలేదు. ఈమాత్రం భాగ్యానికి, ఈ హడావిడి మేళానికి పార్టీల సమయం వృధా చేయడం ఎందుకని విమర్శకులు అంటున్నారు. కాకపోతే ఈసారి నిర్వహించిన అఖ్కర్లేనిపక్షం రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత బుర్రలేకుండా ఆలోచిస్తోందన్న విషయాన్ని మరోసారి బయటపెట్టింది. కేంద్రప్రభుత్వ అజ్ఞానం బయటపడటం మినహా ఈ అఖ్కర్లేనిపక్షం పింగళించిందేమీ లేదు!

ఎక్కడయినా బావ కానీ... వంగతోట కాడ కాదు

  జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో మిగిలిన వారినందరినీ విడిచి పెట్టేసి, తనలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గట్టిగా కృషి చేస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేసుకొంటున్నారు? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొని, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు వచ్చితనతో చేతులు కలపమని తన బద్ధశత్రువయిన తెదేపాని కూడా కోరుతున్నపుడు, మరి తన సమైక్యబాటలోనే పయనిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిసి నడవడానికి ఇష్టపడటం లేదు?   వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వానికి మద్దతి ఇస్తామని చెపుతున్నపుడు, ‘సేమ్ టు సేమ్ డీ.యన్.ఏ.’ కలిగి ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జగన్ ఎందుకు మండిపడుతున్నట్లు? ఇటువంటి ధర్మ సందేహాలు ప్రజలకు చాలానే ఉన్నాయి. అయితే ఇవి సమాధానాలు దొరకని భేతాళ ప్రశ్నలు కావు.   పరుగు పందెంలోనయితేనేమి సమైక్య చాంపియన్ రేసులోనయితేనేమి ఎవరూ కూడా తమ పోటీదారులతో చేతులు కలిపి పరిగెత్తాలనుకోరు కదా? ఇదీ అంతే! అదీకాక అన్నివిధాల సమాన, మ్యాచింగ్ డీ.యన్.ఏ.కలిగి ఉన్నవాడిని ప్రోత్సహించడం అంటే మొదటి స్థానం కోసం కాక రెండో స్థానం కోసం పరుగెడుతున్నట్లే లెక్క.   ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే అంటిపెట్టుకొని ఉంటే, ఎన్నికల సమయంలోనే కాక ఆ తరువాత కూడా రెండు కత్తులు ఒకటే ఒరలో ఇమడవన్నట్లు, ఆ ఇద్దరు రెడ్లు ఒకే పార్టీలో, ప్రభుత్వంలో ఇమడలేరు. అలాకాక కిరణ్ పార్టీ నుండి బయటపడి వేరే కుంపటి పెట్టుకొన్నప్పటికీ, ఆ పొగ, ఆ సెగ ఎన్నికలలో తనకి తగలక మానవు. ఎక్కడయినా బావ కానీ వంగ తోట కాడ మాత్రం కాదన్నట్లు తనకి అన్ని చోట్ల పోటీగా నిలుస్తున్న కిరణ్ కుమార్ అంటే అందుకే జగన్కి అంత ప్రత్యేకమయిన ఆ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగిలినవారినెవరినీ అతను తనతో సమానులుగా భావించడం లేదు గనుకనే వారు బ్రతికిపోయారు. లేకుంటే వారు కూడా పోయేవారే.   ఇక చంద్రబాబు రాజకీయ అనుభవమంతా వయసు కూడా లేని జగన్ ఆయనని లేఖ వెనక్కి తీసుకొని, వచ్చి తన వెనుక నడువమని చెప్పడం అతితెలివి, అహంకారమే తప్ప మరొకటి కాదు. తన దూకుడు వల్ల ఇప్పటికే అనేక తప్పుడు నిర్ణయాలు, ‘యూ టర్నులు’ తీసుకొని, చివరికి ఆ తెదేపాను చూసే తన తప్పుని గ్రహించి మళ్ళీ తెలంగాణాలో పార్టీని కాపాడుకోవాలని ప్రాకులాట మొదలుపెట్టిన అతను, తను వేసిన ఎత్తుకి చంద్రబాబు, అతని పార్టీ పడిపోతుందని భావించడం అవివేకమే.  

రాష్ట్ర విభజనకు సమైక్యవాది సలహాలా?

  కేంద్రమంత్రుల బృందం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రం నుండి ఒక్క తెదేపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు హాజరయ్యి తమ తమ అభిప్రాయాలు చెప్పివచ్చాయి. మిగిలిన పార్టీల సంగతెలా ఉన్నా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వైకాపా విభజనకోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని వెళ్లి కలవడంలో అర్ధమేమిటని చంద్రబాబు ప్రశించారు. ఓట్లు సీట్ల కోసం పైకి సమైక్యాంధ్ర అంటూ, విభజన ప్రక్రియలో వైకాపా ఎందుకు పాలుపంచుకొంటోందని ఆయన ప్రశ్నించారు. ఇక ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో విలీనం కామని చెపుతూనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నిన్న హోం మంత్రి షిండేతో రహస్యంగా సమావేశమయ్యి ఏమి మాట్లాడుకొన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తెరాస ఎన్నికల ముందు విలీనం అయితే, వైకాపా ఎన్నికల తరువాత అవ్వాలని ముందే నిర్ణయం అయిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కాంగ్రెస్ తో తెరాస చేతులు కలపడంలో ఆశ్చర్యం లేదు. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నట్లు చెప్పుకొంటున్న వైకాపా కూడా చేతులు కలిపితే దాని అర్ధం వేరేలా ఉంటుంది.

రామయ్యా.. రావొద్దయ్యా!

      తండ్రి హరికృష్ణ, ఇతర సన్నిహితుల సూచనల మేరకు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వుంటున్నాడు. తాను దూరమైపోతే తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం జరిగి, చంద్రబాబు తనను బతిమాలుకుంటాడని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. అయితే బుడ్డోణ్ణి తెలుగుదేశం పార్టీలో ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు పార్టీలో వుంటే ఎంత.. బయటకి పోతే ఎంత అన్నట్టుగా ఎలాంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోయారు. తనకు లభించిన రాంగ్ డైరెక్షన్ కారణంగా తెలుగుదేశం పార్టీకి అనవసరంగా దూరమయ్యానే అన్న ఆవేదన జూనియర్‌లో వుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితం కావాలన్న ఆలోచన కూడా ఆయనలో వుంది. అయితే తెలుగుదేశం పార్టీ పిలిస్తేనే వెళ్ళాలన్న బెట్టు మెయింటెయిన్ చేస్తున్నాడు.   ఈమధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లను ఎవరు క్రియేట్ చేశారో తెలియదుగానీ, వీటి ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద పడుతుందని జూనియర్ సన్నిహితులు భావించారు. వైఎస్సార్‌సీపీలో చేరితే జూనియర్ తమ నుంచి పూర్తిగా దూరమైపోతాడన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో పెరుగుతుందని, దాంతో  పార్టీ బుడ్డోడి దగ్గరకి దిగి వస్తుందని ఎదురుచూశారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సిగ్నలూ లభించలేదు.  జూనియర్ ఎన్టీఆర్ వైఎస్సార్‌సీపీకి వెళ్తాడేమోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో మచ్చుకు కూడా కనిపించలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి వచ్చేస్తాడేమోనన్న ఆందోళన మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులలో కనిపిస్తోంది. ఇప్పటికే గందరగోళంగా వున్న వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ రాకతో మరింత గందరగోళంలో పడే అవకాశం వుందని భయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన సహచరులు, సన్నిహితులు తమ పార్టీలోకి రావడం, ఆధిపత్యం కోసం పోరాడటం, కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సీట్లకు టెండర్ పెట్టడం, వాటిని ఇవ్వకపోతే అలగడం.. ఈగోలంతా తమకు ఎందుకని అనుకుంటున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి రాకుండా వుండటమే తమ పార్టీకి మంచిదని భావిస్తున్నారు. మనస్పూర్తిగా ‘రామయ్యా.. రావొద్దయ్యా’ అంటున్నారు.