మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి డిల్లీకి

  కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏలుతున్నముఖ్యమంత్రే కావచ్చు. గానీ ఆయనదీ కాంగ్రెస్ డీ.యన్.ఏ. గనుక కాంగ్రెస్ ఆచార వ్యవహారాల ప్రకారం, రోజూ సచివాలయానికి వెళ్లినా వెళ్లకపోయినా వారానికొకమారయినా  డిల్లీ వెళ్ళడం మాత్రం అత్యవసరం. ఓసారి సోనియా మాడం పిలిస్తే రెక్కలు కట్టుకొని డిల్లీలో వాలవలసి ఉంటుంది. మరోసారి అందరూ కలిసి వార్ రూమ్ లో తలుపులేసుకొని వాదులాడుకోవడానికి వెళ్ళవలసి వస్తుంది. ఇంకోసారి తనని అభిమానించే దిగ్విజయ్ సింగ్ పిలిస్తే ఆయనను కాదనలేక వెళ్ళవలసి ఉంటుంది. ఏ లెక్కన చూసుకొన్నాకిరణ్ నెలకి ఓ ఐదారుసార్లు డిల్లీకి అలా వెళ్లి ఇలా వచ్చేస్తుంటారు.   ఇంతకు ముందు కూడా ఆయన చాలా సార్లు వెళ్లోచ్చిన్నపటికీ, అప్పటికి ఆయనకి ఇంత ఫాలోయింగ్ లేకపోవడంతో మీడియా కూడా ఏదో మొక్కుబడిగా రిపోర్ట్ చేసేది. కానీ ఆయన సమైక్య చాంపియన్ గా బ్యాడ్జీ తగిలించుకొన్నపటి నుండి మీడియాలో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన తన ఇంట్లోంచి కాలు బయటపెట్టినా సెన్సేషనల్ న్యూసే, పెట్టకపోయినా అంతకంటే పెద్ద సెన్సేషనల్ న్యూసే. మరి అటువంటప్పుడు ఆయనని కేంద్రమంత్రుల బృందం రేపు డిల్లీ రమ్మని పిలిస్తే మరింకెంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   ఈరోజు మిగిలిన రెండు సమైక్య పార్టీలు సీపీఎం, వైకాపాలతో కూడా అఖిలపక్షం తంతు ముగించేసిన కేంద్రమంత్రుల బృందం, రేపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓసారి డిల్లీ వచ్చిపొమ్మని మెసేజ్ పెట్టింది. ఈయన చూస్తే విభజన వద్దంటాడు. వాళ్ళేమో విభజన ప్రక్రియ దాదాపు పూర్తి చేసేసి చేతులు కడుక్కొనే ముందు, తమకు ఇంత సౌలభ్యం కల్పించిన ఆయనకు ఓమారు థాంక్స్ చెప్పడం ధర్మమని భావించారో లేక ఆయనను సంప్రదించకుండా కుర్చీలోంచి లేచిపోతే రాజ్యంగా విరుద్దమని జనాలేమయినా ఫీలయిపోతారనో తెలియదు కానీ మొత్తం మీద ఆయనను ఓసారి మళ్ళీ డిల్లీకి రమ్మని పిలిచారు. రేపు రాత్రి మీటింగుట!

సీబీఐ చిలక పలుకులు

  బీసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఐపీయల్ మ్యాచుల్లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుల్లో వెలగబెట్టిన నిర్వాకానికి ఆయన ఉద్యోగం ఊడినంత పనయింది. అయితే ఆయన కాంగ్రెస్ తో చాలా చక్కగా కనెక్ట్ అయ్యి ఉన్నాడు గనుక మళ్ళీ తన కుర్చీలో తను మళ్ళీ కూల్ గా సెటిల్ అయిపోగలిగాడు.   జనాలకి, మీడియాకే కాదు పోలీసులకి కూడా గజినీలా షార్ట్ మెమొరీ సమస్య ఉంది గనుక, మేయప్పన్ తో సహా అందరినీ ఎప్పుడో మరిచిపోయారు. మరి ఆ పాటిదానికి ఇంతోటి హంగామా, కష్టం ఎందుకనే ఆలోచన ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారికి రావడంతో, లేడికి లేచిందే పరుగు అన్నట్లు సీబీఐ చిలుక అంటే ఆ సంస్థ డైరెక్టర్ రంజిత్ సిన్హా, రాహుల్ ద్రావిడ్ వంటి క్రికెట్ ఆటగాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి అసలు ఈ తప్పులనే చట్టబద్దం చేసేస్తే ఎలాగుంటుంది? అని కెలికొదిలి పెట్టింది.   క్రికెట్ పై బెట్టింగ్ కి చట్టబద్దత కల్పిస్తే దేశానికి కూడా మేలు జరుగుతుందని రాహుల్ ద్రావిడ్ డిక్లేర్ చేసారు.   “నిజమే స్మీ! ఇలా చేస్తే మాకు కొంచెం పని తగ్గుతుందని” అనుకొందో మరేమో గానీ సీబీఐ చిలుక కూడా బెట్టింగ్ ని చట్టబద్దం చేయడంలో ఎటువంటి తప్పు లేదని ఒప్పేసుకొంది. తన చిలక పలుకులు ప్రజలకు మరింత బాగా విడమరిచి చెపితే బాగుంటుందనే సదాభిప్రాయంతో “మన దేశంలో అనేక రాష్ట్రాలలో నేటికీ లాటరీలకు చట్టబద్దత ఉంది. హాలీ డే రిసార్ట్ లో కాసీనోల పేరిట జూదమాడుకోవడానికి అభ్యంతరం లేదు. నల్లదనం ఉంటే ప్రకటించుకొనే సౌలభ్యం కూడా ఉంది. మరటువంటప్పుడు మరే ఇతర పరిశ్రమలకి తీసిపోని విధంగా రూ.66,000 కోట్ల టర్న్ ఓవర్ తో సాగుతున్న ఈ క్రికెట్ బెట్టింగ్ మీదనే ఎందుకు ఇన్ని ఆంక్షలు, అభ్యంతరాలు? అవి ఉన్నపటికీ బెట్టింగ్ కాయడాన్ని మనం ఆపలేకపోతున్నాము కదా? మరటువంటప్పుడు దానికి చట్టబద్దత కల్పిస్తే పోలా? అని సదరు చానల్ వారిని గట్టిగా నిలదీశారు.   ఆ చిలుక ప్రశ్నలకి సదరు చానెల్ వారి వద్ద సరయిన సమాధానం ఉన్న కార్డు ఒక్కటి కూడా లేదు.

తెలంగాణలో క్షణం కూడా ఉండలేం

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం దూకుడు ప్రదర్శింస్తుంటే సీమాంద్ర కాంగ్రెస్‌ నాయకులకు ఏమి పాలుపోవడం లేదు. అందుకే రోజుకో రకంగా స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ తమ నిరుత్సాహాన్ని ప్రకటిస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జేసి దివాకర్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్రవిభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో సీమాంద్ర వాసులు ఒక్క క్షణం కూడా ఉండటం దండగ అని అన్నారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులతో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఇక్కడ ఉండటం కన్నా కొత్త రాజధానిలో గుడారాలు వేసుకొని పని చేసుకోవడం మంచిదన్నారు.   రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రాంతంలో ఒక్క క్షణం కూడా ఉండటం దండగ అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నాయకులు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం సిఎల్పీ కార్యాలయంలో జెసి, గాదె వెంకట రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ఈ సమయంలో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అంశం చర్చకు వచ్చింది. దీనిపై జెసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధానిలో గుడారాలు వేసుకుని పని చేస్తామంటే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. గుడారాల్లో పని చేస్తూనే రాజధాని నిర్మాణాన్ని కొనసాగించవచ్చని, ఇందుకు మహా అయితే ఐదేళ్లకు మించి సమయం అవసరం ఉండదన్నారు

రాష్ట్రపతికి బాబు లేఖ

  తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర అనుసరిస్తున్నతీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ఇరు ప్రాంతాల అభిప్రాయలకు కేంద్ర విలువ ఇచ్చేలా చూడాలని ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు.   జీవొయం భేటికి రావాలని కేంద్రహొం శాఖకు రాసిన లేఖకు బదులుగా ఆయన ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసిన సిఫార్సులను పట్టించుకోనందుకు నిరసనగా జీవోయం భేటిని బహిష్కరించారు.   రాష్ట్రపతికి రాసిన లేఖలో చంద్రబాబు ముఖ్యంగా మూడు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ నియమాలు, గతంలో పాటించిన సంప్రదాయాలను గౌరవించాలి. ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు, రైతులకు సంబంధించిన జేఏసీలను పిలిచి సమస్యాత్మక అంశాలపై విపులంగా చర్చించాలి. ఇతర ప్రభావిత వర్గాల మనోగతాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొన్న తర్వాతే ముందుకు వెళ్లాలి అని ఆయన రాష్ట్రపతిని కోరారు.

సిబిఐని తప్పు పట్టిన చిదంబరం

  తాము పెంచి పోషించిన సిబిఐ ఇప్పుడు తమకే వ్యతిరేకంగా మారటంతో కాంగ్రెస్‌ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే విధాననిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రదాని సిబిఐకి క్లాస్‌ తీసుకున్న మరుసటి రోజే ఆర్థికమంత్రి చిదంబరం కూడా సిబిఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిబిఐతో సహా కాగ్‌ కూడా తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   ప్రభుత్వాలు కార్యనిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను కూడా నేరాలుగా, అధికారదుర్వినియోగంగా చూపించడానికి సిబిఐ లాంటి విచారణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన మాట్లాడారు.

శంకరన్న శపథం!

      మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు మంత్రిపదవి ఊడిపోయాక ఏం చేయాలో అర్థం కాక అడపాదడపా ప్రెస్‌మీట్లు పెట్టి, తనపార్టీ వాళ్ళని, పరాయిపార్టీ వాళ్ళని తిట్టిపోస్తూ టైమ్‌పాస్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే మాత్రం శంకరన్నకి ఎంతో అభిమానం. ఆమెని అమ్మా అని నోరారా పిలుస్తూ, కీర్తిస్తూ వుంటారు. ఎవరేమి అనుకున్నా సోనియాగాంధీని కీర్తించడంలో మాత్రం ఆయన ఎంతమాత్రం రాజీపడరు.   శంకరన్న నోరారా సోనియాగాంధీని పొగుడుతుంటే వినడానికి రెండు చెవులూ చాలవనిపిస్తూ వుంటుంది. శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదుగానీ, ఆయన సోనియమ్మని పొగిడే వీడియోకి ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేసి సోనియాగాంధీకి చూపిస్తే ఆమె పొంగిపోయి శంకరన్నని దేశప్రధానిగా కూడా ప్రమోట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పాల్సి వస్తోందంటే, శంకరన్న సోనియమ్మని మళ్ళీ మరోసారి పొగిడారు. తెలంగాణ ఇచ్చేసిన సోనియాగాంధీ సాక్షాత్తూ దేవతట! తెలంగాణ అంతటా ఆమెకి దేవాలయాలు కట్టితీరాలట. శంకరన్న అక్కడితో ఆగలేదు. తన సోనియా భక్తిని చాటుకోవడానికి ఒక  మంచి ప్రపోజల్‌తో ముందుకొచ్చారు. సికింద్రాబాద్‌లో సోనియాగాంధీ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తారట. ఆరు నూరైనా డిసెంబర్ తొమ్మిదో తేదీన సోనియాగాంధీ విగ్రహావిష్కరణ జరిపి తీరుతారట. బాగుంది శంకరన్నా.. చాలా బాగుంది! నిక్షేపంలా వున్న సోనియాగాంధీకి విగ్రహాన్ని పెట్టాలన్న శంకరన్న ఆలోచనని ఆయన సహచరులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలు చాలా గ్రేట్. సీమాంధ్రులు సోనియాగాంధీకి సమాధి కడితే, తెలంగాణ వాళ్ళు ఆమెకి గుడులు కట్టి, శిలావిగ్రహాలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. చూడ్డానికి ఈ రెండూ పరస్పర విరుద్ధంగా అనిపించినా, రెండిటి అర్థమూ ఒకేటే కదా అని కాస్తంత బుర్రపెట్టి ఆలోచించేవాళ్ళు నవ్వుకుంటున్నారు.

తెలంగాణలో కిరణ్ రచ్చబండ రద్దు..!!

      మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి అలా ప్రకటించారో లేదో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోయారు. రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి రచ్చబండ నిర్వహణకి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. ముఖ్యంమంత్రితో రచ్చబండకి హాజరు కావలసిన తెలంగాణ మంత్రులు ‘‘మేం సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభలో పాల్గొంటున్నాం కాబట్టి మేం రా౦రాం’’ అనేశారు. ముఖ్యమంత్రి రచ్చబండలో పాల్గొంటే నానా న్యూసెన్సూ చేస్తామని కాంగ్రెస్ నాయకులే వార్నింగులు ఇచ్చారు. దాంతో ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు. వీళ్ళ రాజకీయాల గొడవేంటోగానీ, రచ్చబండ కార్యక్రమం సజావుగా జరిగితే సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కొన్నయినా తీరేవి.

విభజనకు ఎంఐఎం వ్యతిరేకం

      రాష్ట్రాన్ని విభజిస్తే 'రాయల తెలంగాణ' ఏర్పాటు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఈరోజు జీవోఎంతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ విభజన జరిగితే హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని ఒప్పుకోమన్నారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండొద్దని తెలిపారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని అసదుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు. విభజన తప్పనిసరైతే హైకోర్టును విభజించాలని డిమాండ్ చేశారు.     ఈ మధ్య కాలంలో ఎం.ఐ.ఎం. తన రాయల తెలంగాణ నినాదంలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. రాయల తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ జిల్లాలు, నాలుగు రాయలసీమ జిల్లాలతో ఏర్పడేది కాదట. పది తెలంగాణ జిల్లాలు ప్లస్ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో ఏర్పడిన రాయల తెలంగాణ ఏర్పడితేనే ఎం.ఐ.ఎం. ఒప్పుకుంటుందట. రాయలసీమలోని రెండు జిల్లాల మీద ప్రేమ ఎందుకో, మిగతా రెండు జిల్లాలు చేసిన పాపమేమిటో ఎం.ఐ.ఎం. నాయకులకు తప్ప ఎవరికీ అర్థంకాని విషయం.

టి-కాంగ్రెస్ నేతల టిట్ ఫర్ టాట్

  కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి టీ-కాంగ్రెస్ మంత్రులని, శాసనసభ్యులని కలిసేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తాము కూడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, అతని క్యాబినెట్ మంత్రులు తీరు చూస్తుంటే, వేర్వేరు పార్టీలకి చెందిన నేతలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నట్లుంది.   టీ-కాంగ్రెస్ నేతలు తాము బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి పాల్గొనే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మరో ఆడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి పాల్గొంటున్నరచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరించాలని ప్రజలకు, టీ-కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి తెలంగాణాలో తిరగడాన్ని నిరసిస్తూ తెరాస కూడా రేపు మెదక్ జిల్లా బంద్ కి పిలుపు ఇచ్చింది.   ఈ పరిణామాలు చూసిన తరువాత గీతారెడ్డి, జగ్గారెడ్డి తదితరుల సలహా మేరకు ముఖ్యమంత్రి రేపటి తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. ఇంతవరకు తనకు ఎదురులేదన్నట్లు వ్యవహరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. అదికూడా ఇక నేడో రేపో కుర్చీలోంచి దిగిపోయే ముందు ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవలసి రావడం ఎవరికయినా మరింత కష్టంగానే ఉంటాయి మరి.

టీడీపీ తీరంలో వలస పక్షులు!

      టీడీపీ తీరంలో వలస పక్షులు సంచరిస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే టీడీపీలోకి దూకేయడానికి రెడీగా వున్నాయి. కాంగ్రెస్, వైఎస్సార్సీపీతోపాటు టీఆర్ఎస్ నుంచి కూడా తెలుగుదేశంలోకి రావడానికి పలువురు ప్రముఖ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పైమూడు రాజకీయ పార్టీలలో కీలక నాయకులుగా వున్నప్పటికీ సరైన గౌరవం లభించని అనేకమంది నాయకుల నాలుకలు పిడచగట్టుకుని పోయాయి.     టీడీపీ తీర్థం పుచ్చుకోవడమే దీనికి సరైన పరిష్కారమన్న ఆలోచనలో అనేకమంది నాయకులు వున్నారు. వారంతా సరైన సమయం కోసం ఎదురుచూస్తూ టీడీపీ నాయకులతో రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. అడ్డగోలు విభజన నిర్ణయంతో సీమాంధ్రలో అడ్డంగా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు పదిలంగా వుండాలన్నా, తెలుగుజాతి భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలన్నా తెలుగుదేశం పార్టీని బలపరచడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండ పిండాల్లాంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇక వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీలో వున్న అనేకమంది నాయకులు కూడా తెలుగుదేశం నీడకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ఒక స్పష్టమైన విధానం లేకపోవడం, పార్టీ నాయకులు జగన్మోహనరెడ్డి నిరంకుశ, నియంతృత్వ ధోరణి, రాష్ట్రాన్ని విభజించడానికి జగన్ సోనియాతో మిలాఖత్ అయ్యాడన్న విషయం బహిర్గతం కావడం.. వీటన్నిటి కారణంగా ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగటం కంటే అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీలోకి మారడమే ఉత్తమమన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో కలుగుతోంది. అలాగే టీఆర్ఎస్‌ కుటుంబ పాలనని తట్టుకోలేకపోతున్న అనేకమంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వలస వచ్చే నాయకుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహంలా కనిపిస్తోంది.  

జగన్ని తట్టుకోవడం కష్టమబ్బా: అనంత రెడ్డి

  జగన్ జైలు నుండి విడుదల అయిన తరువాత అతని పార్టీలోకి దూకాలనుకొన్న కొద్ది మంది కాంగ్రెస్ నేతలలో యంపీ అనంత వెంకట రామిరెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజన కారణంగా రానున్నఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తే ఘోరపరాజయం పాలవుతాననే భయంతో వైకాపా కండువా కప్పుకొనేందుకు సిద్దపడ్డారు. ఆ క్రమంలో జగన్ నిరాహార దీక్ష చేస్తున్నపుడు వెళ్లి అతనిని కలిసి పార్టీ తీర్ధం పుచ్చుకోనేందుకు ముహూర్తం కూడా ఖారారు చేసుకొన్నారు. అయితే విశ్వరూప్ వంటి వారు కొందరు వైకాపాలో చేరినప్పటికీ, ఆయన మాత్రం ఇంత వరకు చేరలేదు.   ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిశ్చయించుకొన్నారు. కారణం ఆయనను పార్టీలో చేర్చుకొనేందుకు జగన్ ఆయనకి ఏవో కొన్ని షరతులు పెట్టడమేనట. సాధారణంగా పార్టీ మారదలచుకొన్నవారు ముందుగా తాము జేరబోయే పార్టీలో తమ టికెట్స్ కోసం బెరామాడుకొని, అంతా ఖాయం చేసుకొన్నాక పార్టీలో చేరుతారు. కానీ ఎవరయినా నేతలు వైకాపాలో చేరాలంటే ముందుగా జగన్ పెట్టే కొన్నిషరతులు అంగీకరించాలనడం విచిత్రమే.   జగన్మోహన్ రెడ్డి విచిత్ర వ్యవహార శైలిని తట్టుకొని ఇబ్బందులు పడటంకంటే ఆ కష్టమేదో కాంగ్రెస్ పార్టీలోనే పడితే కనీసం గౌరవమయినా దక్కుతుందని ఆయన వెనక్కి తగ్గారు. ఆయన వైకాపాలో చేరితే అనంతపురం నుండి మరి కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఆయనను అనుసరించాలని అనుకొన్నారు. కానీ, ఆయనే ఆగిపోవడంతో మిగిలిన వారు కూడా వెనక్కి తగ్గారు.

కాంగ్రెస్‌లో విలీనంపై కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  కాంగ్రెస్‌లో విలీనం ఉండదని ప్రజలకు గట్టిగా చెప్పాలంటూ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించనున్న నేతలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   "శిక్షణ తరగతుల నిర్వహణను సీరియస్‌గా తీసుకోండి. ఇందుకు సంబంధించి వివిధ బాధ్యతలు స్వీకరిస్తున్న వారు క్షేత్ర స్థాయి నివేదికలను పార్టీ నేత కడియం శ్రీహరికివ్వండి. నేను ఇంటెలిజెన్స్, సర్వే నివేదికలను తెప్పిస్తాను. అన్నింటినీ క్రోడీకరించిన తర్వాత నాయిని నర్సింహారెడ్డి సారథ్యంలోని పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది. ఈ జాబితాను డిసెంబర్‌లో వెల్లడిస్తాం'' అని టీఆర్ఎస్ చీఫ్ చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని కేసీఆర్ బదులిచ్చారు. "కాంగ్రె స్‌లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని నేను స్వయంగా చెప్పలేను. పార్టీ అధ్యక్షుడిగా నాకు కొన్ని పరిమితులుంటాయ్. నేను ఏది చెప్పినా ప్రతిస్పందనలు ఉంటాయి. మీరు ఏదైనా స్వేచ్ఛగా చెప్పొచ్చు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదని మీడియా సమావేశాల్లో.. పార్టీ కార్యకర్తల సమావేశాల్లో సూటిగా చెప్పండి. ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధంకండి'' అని ఉద్భోదించారు.

తెలంగాణా ముఖ్యమంత్రిగా జైపాల్ రెడ్డికే తొలి ప్రాధాన్యత

  ఇంతవరకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెర వెనుకే ఉంటూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం కృషిచేసారు. అయితే ఇటీవల వరంగల్లో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్ర సభలో పాల్గొనడం ద్వారా ఇక ప్రత్యక్షంగా పనిచేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే మొట్ట మొదట ముఖ్యమంత్రి పదవి చెప్పట్టాలని ఆశిస్తున్నవారు టీ-కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. అయితే కేంద్రమంత్రిగా సుదీర్గ అనుభవం, కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలున్నజయపాల్ రెడ్డి కూడా పోటీలో దిగితే మిగిలినవారు, ఇక ఆశలు వదులుకోక తప్పదు.   కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా అటువైపు నుండి సానుకూల సంకేతాలు రావడం లేదు. అంతే గాక తామే తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసి, రాష్ట్ర పునర్నిర్మాణం కూడా చేస్తామని తెరాస నేతలు గట్టిగా చెపుతున్నారు. సీమాంధ్రని పణంగా పెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం ఇస్తున్నా కూడా దాని ఫలితం తమ పార్టీకి కాక తెరాసకు దక్కుతుందంటే కాంగ్రెస్ చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోదు.   కేసీఆర్ ధాటిని తట్టుకొని, తెలంగాణా సాధించిన కీర్తి భుజాన్నేసుకొని యుద్దానికి వస్తున్న తెరాసను డ్డీ కొని గెలవాలంటే చాలా సమర్దుడయిన నేత పార్టీకి చాలా అవసరం. ఇప్పుడున్న నేతలలో జయపాల్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవజ్నుడు, అందరినీ కలుపుకొనిపోగల సమర్ధుడు లేరు గనుక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనకే ప్రాధాన్యం ఈయవచ్చును.   నీతి నిజాయితీలకు మారుపేరయిన ఆయన పెట్రోలియం శాఖా మంత్రిగా ఉన్నంత కాలం సాక్షాత్ రిలయన్స్ కంపెనీనే గుమ్మం దగ్గిర నిలబెట్టేసిన ఘనుడు. ఆయన కీలకమయిన తన పెట్రోలియం శాఖను వదులుకోవడానికి సిద్దపడ్డారు తప్ప, తన సిద్దాంతాలను, విలువలను వాదులుకోవలనుకోలేదు. అందుకే ఆయనను పెట్రోలియం శాఖ నుండి ప్రస్తుత శాఖలోకే మార్చేసింది కాంగ్రెస్ అధిష్టానం.   మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే క్రిందనున్న వారికి ఇక ‘మిగిలేదేమి ఉండదు’. అయితే ఆయన వల్ల తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గట్టిగా నిలద్రోక్కుకోవడమే కాకుండా, తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పవచ్చును. ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే, తెలంగాణాలో జైపాల్ రెడ్డి ప్రభుత్వాలు కొలువు తీరినట్లయితే అది తెలంగాణా ప్రజలకి ఎంతో మేలు చేకూర్చవచ్చును. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక మౌలిక వసతులు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చెప్పతవలసి ఉంటుంది గనుక మొదటి ఐదు సం.లు చాలా కీలకం. అందుకు సమర్దుదయిన, నిజాయితీ పరుదయినా నాయకుడు చాలా అవసరం. గనుక ఆ అర్హతలన్నీ ఉన్న జైపాల్ రెడ్డికే ప్రాధాన్యత ఈయవచ్చును.   జాతీయస్థాయిలో పనిచేసిన ఆయన, అదే జాతీయ దృక్పధం చూపుతూ ఇంతకాలంగా తెరాస ప్రజలలో నాటిన విషబీజాలను ఏరిపారేసి, రెండు ప్రాంతాల ప్రజల మధ్య మళ్ళీ సహృద్భావ వాతావరణం ఏర్పరచగలరు. తద్వారా రాష్ట్రం విడిపోయిన తరువాత వచ్చే అనేక సమస్యలను ఆయన సామరస్యంగా, చాకచక్యంగా ఎవరికీ నష్టం కలుగని రీతిలో పరిష్కరించగలరు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ కుర్చీ అప్పగిస్తుందో చూడాలి.

వ్యాటే టాక్స్ సర్ జీ!

  సాయంత్రం సరదాగా ఫ్యామిలీతో అలా ఏదయినా మంచి హోటల్ కి వెళ్లి లైట్ గా ఏదయినా టిఫిన్ లేదా డిన్నర్ చేసి వద్దమనుకొంటున్నారా? అయితే ఓసారి ఇది చదివి బయలుదేరితే మంచిది. ఇటీవల విజిలన్స్ శాఖ అధికారులు హైదరాబాదులో ఆరు ప్రముఖ హోటల్స్ రికార్డులు తనిఖీ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమయిన విషయం వెలుగులోకి వచ్చింది.   ఇప్పుడు మనం తినే భోజనానికి, తాగే నీళ్ళకి కూడా (పీల్చేగాలికి ఇంకా చెల్లించనవసరం లేదు)వాట్ టాక్స్, సర్వీస్ చార్జ్, సర్వీస్ టాక్స్ వగైరాలు కట్టక తప్పదని అందరికీ తెలుసు. సాధారణంగా వినియోగదారులు తాము తినే ఆహారానికి మాత్రమే 14.5 శాతం వ్యాట్ టాక్స్ చెల్లించవలసి ఉంటుంది. కానీ సదరు హోటల్స్ వారు ఆహారంపై వసూలు చేస్తున్నసర్వీస్ చార్జ్ మరియు సర్వీస్ టాక్స్ లపై కూడా వ్యాట్ టాక్స్ వసూలు చేస్తున్నట్లు బయటపడింది. సాధారణంగా ఇటువంటి విషయాలు వినియోగదారులు పెద్దగా గమనించరు గనుక, హోటల్ యాజమాన్యాలు ఈవిధంగా టాక్స్ పై టాక్స్ వేసి గత ఏడాది రూ.2.48 కోట్లు అదనంగా వినియోగదారులకి తెలియకుండా పిండుకొన్నారు.   ఈ తెలివి తేటలు కేవలం ఈ ఆరు హోటల్స్ కే పరిమితం కాదు గనుక, రాష్ట్రంలో, దేశంలో ఏ హోటల్ కి వెళ్ళినా ఈ అదనపు టాక్స్ వడ్డింపులు కూడా ఉంటాయని మరిచిపోకండి. దైర్యం ఉంటే అడగండి. ఆ టెన్షన్లు మనకొద్దనుకొంటే బేరర్ కి మరో పదో పరకో ఎక్కువ టిప్పు ఇస్తున్నామని సరిబెట్టుకొని చల్లగా బయటపడండి.

శభాష్ ఎర్రబెల్లీ!

      తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో వున్న కార్యకర్తల నుంచి జాతీయ స్థాయిలో వున్న నాయకుల వరకూ ఇప్పుడు శభాష్ ఎర్రబెల్లీ అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా, పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకరరావు ఇటీవల తన సహచరులు కోడెల శివప్రసాదరావు, పయ్యావుల కేశవ్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణవాదిగా ఎర్రబెల్లి చేసిన కామెంట్లను తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ సానుభూతితో అర్థం చేసుకున్నారు.   ఎర్రబెల్లి స్థానంలో ఎవరూ వున్నా అలాగే స్పందించేవారని భావించారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎర్రబెల్లి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతాయని, దానిని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్లాన్ చేశాయి. అయితే ఎర్రబెల్లి వ్యాఖ్యల వివాదం టీ కప్పులో తుపానులా చల్లారిపోయి ఆ పార్టీలకు నిరాశ మిగిల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన దింపుడుకళ్ళం ఆశలను వదులుకోలేదు. తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిలో వున్న ఎర్రబెల్లి దయాకరరావుని కాంగ్రెస్ వైపు లాక్కోవాలని గాలం వేసింది. ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపింది. ‘ఆపరేషన్ ఆకర్ష’ సృష్టికర్త అయిన కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లిని ఎలాగైనా తమ పార్టీలో చేర్చుకోవాలని చేసిన అన్ని ప్రయత్నాలనూ ఎర్రబెల్లి విజయవంతంగా తిప్పికొట్టారు. ఆయన అక్కడితో ఆగకుండా తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ప్రాంత  నాయకులు, కార్యకర్తలో జరిపిన మేధోమధన సదస్సులో ఈ విషయాన్ని బయటపెట్టారు. తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టనని, ఒకవేళ పార్టీని వీడాల్సివస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని ఎర్రబెల్లి ప్రకటించడం సదస్సులో కరతాళధ్వనులు మోగేలా చేసింది. శభాష్ ఎర్రబెల్లీ అని పార్టీలోని ప్రతి ఒక్కరూ ప్రశంసించేలా చేసింది. ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకులు చంద్రబాబు వెంట వుంటే ఇక తిరుగేముంటుందని మేధోమథన సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రాంత తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడ్డారు.  

టీ కాంగ్రెస్ తంటాలు చూతము రారండీ!

      టీ కాంగ్రెస్ నాయకులు పడుతున్న తంటాలు చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు. తెలంగాణ వచ్చేస్తోందని పైపైకి మాత్రం లేని ఉత్సాహం ప్రదర్శిస్తూ సోనియాకి ‌కృతజ్ఞతలు చెప్పే సభలు నిర్వహించడం, సీమాంధ్రుల నుంచి ఏ రకంగా హక్కులన్నిటినీ లాక్కుని తరిమేయాలో కేంద్రానికి సూచించడం చేస్తున్నారుగానీ, లోలోపల వాళ్ళు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు.     కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ వస్తుందా, రాదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ తెలంగాణ రాకపోతే ఆల్రెడీ సీమాంధ్రలో గల్లంతైపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం వుంది. ఇప్పటి వరకూ తెలంగాణ ఇచ్చిందీ.. తెచ్చిందీ మేమే అని గొప్పలు చెప్పుకుంటున్న టీ కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కనంత స్థాయిలో ఓడిపోయే అవకాశం వుంది. రెండు మూడు రోజుల నుంచి మారిన పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ వచ్చినా పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. అలాంటి సరుకులేని తెలంగాణను తెచ్చినందుకు తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోన్న భయం కూడా టీ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత వాళ్ళే పశ్చాత్తాపపడతారని అనడం అందరిలో బోలెడన్ని సందేహాలను రేకెత్తించింది. అలాగే, తెలంగాణ వచ్చేసింది కదా ఆరామ్‌గా కూర్చుని వినోదం చూద్దామనుకున్న టీ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అధిష్టానం ముందు ఎన్ని తంటాలు పడుతున్నారో టీ కాంగ్రెస్ నాయకులూ అన్ని తంటాలు పడాల్సిన పరిస్థితులొచ్చాయి.  వీటన్నిటికంటే వీళ్ళు ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య ఏంటంటే, తెలంగాణ వస్తే కాబోయే సీఎం ఎవరన్నదే!  టీ కాంగ్రెస్ నాయకులలో డజనుకు పైగా నాయకులు రాబోయే తెలంగాణకు తానే కాబోయే సీఎం అని కలలు కంటున్నారు. తెలంగాణ కోసం ఇన్ని తంటాలు పడుతున్నాను.. నేను సీఎం కాకపోతే పరిస్థితి ఏంటని ప్రతి ఒక్క నాయకుడూ, నాయకురాలూ మనసులో మథన పడుతున్నారు.

'ఆమ్ ఆద్మీ'పై కాంగ్రెస్ పగ

      ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీని ఊడ్చేయడానికి 'చీపుళ్ళు' సిద్ధమయ్యాయి. చీపురుకట్ట గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగిన 'ఆమ్ ఆద్మీ' పార్టీ ఢిల్లీలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఢిల్లీని మురికికూపంగా మార్చిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు ఊడ్చిపారేసే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పార్టీకి అందుతున్న చందాల విషయంలో చాలా పారదర్శకంగా వ్యవహరించింది. తమకు అందిన చందాల వివరాలను బయటపెట్టింది. అందులో కొన్ని ప్రవాస భారతీయుల నుంచి అందిన చందాలు కూడా వున్నాయి. విదేశాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిన చందాలపై విచారణ జరిపించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది తమమీద విజయం సాధించబోతున్న 'ఆమ్ ఆద్మీ' పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మీద కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.     ఇది కాంగ్రెస్ మార్కు విచారణ జరిపి, ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచే కుట్రలో భాగమని అభివర్ణిస్తున్నారు. రాజకీయ పార్టీలకు లభించే చందాలను బహిర్గతం చేయాల్సన అవసరం లేదనీ గొంతెత్తి చాటి, పార్లమెంటులో బిల్లు కూడా ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన ప్రత్యర్థి రాజకీయ పార్టీ చందాలపై విచారణ జరిపించాలనుకోవడం విచిత్రంగా వుందని అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొడుతున్నారు. తన పార్టీ చందాలపై విచారణ జరిపించే ముందు కాంగ్రెస్ పార్టీ తనకు వస్తున్న చందాలను బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. చందాల బహిర్గతం విషయంలో కాంగ్రెస్ కిక్కురుమనడంలేదు.

సీబీ‘ఐ’- కాంగ్రెస్‘ఐ’

      కాంగ్రెస్-ఐ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, తనకు అవసరమైన వారిని దారికి తేవడానికి అస్త్రంలా ఉపయోగిస్తున్న సీబీఐకి చట్టబద్ధతే లేదని గౌహతి హైకోర్టు తీర్పు ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నీతి నిజాయితీలకు తానే కేరాఫ్ అడ్రస్ అని బిల్డప్ ఇచ్చుకుంటున్న సీబీఐ అసలు గుట్టు ఇదా అని దేశం మొత్తం తెల్లబోయింది.   గౌహతి హైకోర్టు తీర్పుతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం, సుప్రీం సదరు తీర్పు మీద స్టే విధించడం ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. మొత్తమ్మీద సీబీఐ ఉనికికే ప్రమాదం రావడంతో కాంగ్రెస్ పార్టీ కలవరపడుతోంది. సీబీఐ అంటే మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీకి కన్నులాంటిది. ఈ కన్ను లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒంటికంటిదైపోతుంది. ఈ కన్ను సాయంతోనే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థుల మీద దృష్టిని కేంద్రీకరించి ‘దిష్టి’ పెడుతూ వుంటుంది. సీబీఐ ఉనికి దేశానికి ఏం మేలు చేస్తుందో తెలియదుగానీ, కాంగ్రెస్‌కి మాత్రం బోలెడంత మేలు చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికే వస్తే, సీబీఐ కేసులను అడ్డు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ జగన్ మహాశయుణ్ణి తన దారికి తెచ్చుకుంది. అతని సహకారంతో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో అధికారంలోకి రావడానికి పథకరచన చేసింది. ఇప్పుడు సీబీఐ అనేదే లేకపోతే, సీబీఐ బుక్ చేసిన కేసులన్నీ బుట్టదాఖలైపోతే జగన్‌ని కట్టడి చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి వుండదు. ఒక్క జగన్ మాత్రమే కాదు. లాలూప్రసాద్ యాదవ్, రాజా, కనిమొళి లాంటి ఎందరో అవినీతి చేపలు కాంగ్రెస్ వలలోంచి తప్పించుకుని పోతాయి. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ సీబీఐని కాపాడుకుని తీరాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

కాంగ్రెస్ హయంలోనే తెలంగాణ: షిండే

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. సోమవారం ఉదయం జీవోఎం సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ యూపీఏ -2 పదవీ కాలం పూర్తయ్యేలోపు తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందని షిండే ప్రకటించారు. ఉమ్మడి రాజధాని విషయంలో హైదరాబాద్ పరిధిపై జీవోఎంకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. అవన్నింటినీ కేంద్రం పరిశీలిస్తుందని తెలిపారు. 371డి సంగతి జీవోఎం చూసుకుంటుందని షిండే చెప్పారు. షిండే ఉద్దేశ్యం ప్రకారం, 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో యూపీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయనే స్పష్టం చేశారనుకోవాలి. బిల్లు తీసుకొస్తారు సరే, దానికి పార్లమెంటు ఆమోదం పొందుతుందా.? అంటే దానికింకా సమాధానం దొరకడంలేదు.   VIDEO courtesy TV9