రాష్ట్ర విభజనకు సమైక్యవాది సలహాలా?
posted on Nov 13, 2013 @ 12:53PM
కేంద్రమంత్రుల బృందం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రం నుండి ఒక్క తెదేపా తప్ప మిగిలిన అన్ని పార్టీలు హాజరయ్యి తమ తమ అభిప్రాయాలు చెప్పివచ్చాయి. మిగిలిన పార్టీల సంగతెలా ఉన్నా, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వైకాపా విభజనకోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందాన్ని వెళ్లి కలవడంలో అర్ధమేమిటని చంద్రబాబు ప్రశించారు. ఓట్లు సీట్ల కోసం పైకి సమైక్యాంధ్ర అంటూ, విభజన ప్రక్రియలో వైకాపా ఎందుకు పాలుపంచుకొంటోందని ఆయన ప్రశ్నించారు. ఇక ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో విలీనం కామని చెపుతూనే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నిన్న హోం మంత్రి షిండేతో రహస్యంగా సమావేశమయ్యి ఏమి మాట్లాడుకొన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో తెరాస ఎన్నికల ముందు విలీనం అయితే, వైకాపా ఎన్నికల తరువాత అవ్వాలని ముందే నిర్ణయం అయిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సిద్దపడుతున్న కాంగ్రెస్ తో తెరాస చేతులు కలపడంలో ఆశ్చర్యం లేదు. కానీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్నట్లు చెప్పుకొంటున్న వైకాపా కూడా చేతులు కలిపితే దాని అర్ధం వేరేలా ఉంటుంది.