అఖ్కర్లేనిపక్షం!
posted on Nov 13, 2013 @ 2:25PM
కేంద్రప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఏదో జరిగిపోతుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. కేంద్ర మంత్రుల బృందం అఖిలపక్షం మొదటిరోజు ఒక్కో పార్టీతో పదేసి నిమిషాలపాటు మాట్లాడించింది. ఆ పార్టీలు కొత్తగా మాట్లాడిందేమీ లేదు.. వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెలుసుకున్న విషయమూ ఏమీ లేదు. మొత్తమ్మీద చూస్తే ఈసారి అఖిలపక్షం ద్వారా ఒరిగిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ అఖిలపక్షం ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అస్సలు అఖ్కర్లేని పక్షమని జోక్ చేస్తున్నారు. ఈ అఖ్కర్లేనిపక్షంలో అన్ని పార్టీలూ మరోసారి రాష్ట్ర విభజన మీద తమ విధానాన్ని చెప్పాయి. బీజేపీ పాత పాట పాడిన తర్వాత ఈ విషయంలో కాంగ్రెస్ తీరు చెప్పాలంటూ కొత్త పల్లవి అందుకుంది. ఆ పల్లవి బీజేపీ నోట్లోంచి బయటకి రాకముందే మంత్రుల కమిటీ బీజేపీ నోరు నొక్కేసింది. కొత్త విషయాలు చెప్పనివ్వకుండా, పాత విషయాలనే మళ్ళీ వినడానికే ఈ అఖిలపక్షం ఏర్పాటు చేసినట్టున్నారు.
హైదరాబాద్ నుంచి పార్టీలన్నీ పడుతూ లేస్తూ ఢిల్లీకి వెళ్ళాయి. పార్లమెంటు మెయిన్ గేటు నుంచి సమావేశం జరిగిన చోటకి వెళ్ళడానికి ఎంతసేపు పట్టిందో కనీసం అంతసేపు కూడా మంత్రుల బృందంతో సమావేశం జరగలేదు. ఈమాత్రం భాగ్యానికి, ఈ హడావిడి మేళానికి పార్టీల సమయం వృధా చేయడం ఎందుకని విమర్శకులు అంటున్నారు. కాకపోతే ఈసారి నిర్వహించిన అఖ్కర్లేనిపక్షం రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత బుర్రలేకుండా ఆలోచిస్తోందన్న విషయాన్ని మరోసారి బయటపెట్టింది. కేంద్రప్రభుత్వ అజ్ఞానం బయటపడటం మినహా ఈ అఖ్కర్లేనిపక్షం పింగళించిందేమీ లేదు!