సచిన్ ఎందుకు ఔటయ్యాడు?

 

 

 

ముంబైలోని వాంఖేడే స్టేడియం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్లో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత సచిన్ ఇక బ్యాట్ పట్టడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా తన కెరీర్‌కి గొప్ప ముగింపు ఇవ్వాలని ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు. వాంఖేడే స్టేడియంలో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ మీదే స్టేడియంలో వున్న, టీవీలో మ్యాచ్ చూస్తున్న అందరి చూపులూ కేంద్రీకృతమై వున్నాయి.

 

సచిన్ ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు విసురుతున్న బంతుల్ని చాకచక్యంగా కొడుతున్నాడు. వేసిన ప్రతి బాల్ నుంచి పరుగులు పిండుకోవాలి.. తనను చూస్తున్న అభిమానులకు ఆనందం కలిగించాలి అనే తపన సచిన్ ముఖంలో కనిపిస్తోంది. ఈ చివరి టెస్ట్ మ్యాచ్‌లో తనకోసం కాకపోయినా తనను అభిమానించే దేశ ప్రజల కోసమైనా సెంచరీ చేయాలన్న  కృతనిశ్చయం ఆయన కళ్ళలో కనిపిస్తోంది. సచిన్ ముఖంలో, కళ్ళలో కనిపిస్తున్న భావాలను అర్థం చేసుకున్న అభిమానులు మరింత ఉత్సాహంగా మ్యాచ్‌ని గమనిస్తున్నారు. సచిన్ సెంచరీ చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ విసురుతున్న బంతుల్ని సచిన్ చాకచక్యంగా ఫోర్లు, సిక్సర్ల రూపంలో బౌండరీ అవతలకి తరలిస్తున్నాడు. సచిన్ అర్ధ శతకం పూర్తి చేశాడు. స్టేడియం మొత్తం కోలాహలంగా మారింది. చూస్తుండగానే సచిన్ అరవై పరుగులు పూర్తి చేశాడు. మరికొద్ది నిమిషాల్లో డెబ్భై పరుగులు పూర్తయ్యాయి. సచిన్ సెంచరీ చేయడం ఖాయమన్న నిర్ణయానికి స్టేడియంలో ఉన్నవారు, టీవీలు చూస్తున్నవారు వచ్చేశారు.




అయితే సడెన్‌గా సచిన్ దూకుడులో మార్పు వచ్చింది. మనిషి స్లో అయిపోయాడు. బంతులు ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. రెండుసార్లు ఔటవ్వబోయి తృటిలో తప్పించుకున్నాడు. మ్యాచ్ చూస్తున్నవారంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. సచిన్‌లో సడెన్‌గా ఈ మార్పు ఎందుకు వచ్చిందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళంతా అలా ఆలోచిస్తూ వుండగానే 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సచిన్ ఔటయ్యాడు. సచిన్ సెంచరీ చేయాలన్న అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. సచిన్‌లో ఉన్నట్టుండి, సడెన్‌గా ఎందుకు మార్పు వచ్చిందా అన్న పరిశీలన అభిమానులలో మొదలైంది.




అందరూ ఏదో అనుమానం వచ్చి స్టేడియం మొత్తం కలియజూశారు. అంతకుముందే స్టేడియంలోకి ఎంటరైన ఒక వ్యక్తిని చూడగానే అందరికీ సచిన్ ఎందుకు ఔటయ్యాడో అందరికీ అర్థమైపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. రాహుల్‌గాంధీ! లెగ్గుబాబూ.. లెగ్గు! అది మామూలు లెగ్గా! రాహుల్‌గాంధీ ఎంటరయ్యాక వంద సంవత్సరాలకు పైగా చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీనే ఔటయిపోయింది. పాపం సచిన్ ఒక లెక్కా? సరే జరిగిందేదో జరిగిపోయింది. కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సచిన్ ఆడేటప్పుడు రాహుల్‌గాంధీని స్టేడియం పరిసరాల్లోకి రాకుండా చూడు భగవంతుడా అని  సచిన్ అభిమానులందరూ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు.