ఎక్కడయినా బావ కానీ... వంగతోట కాడ కాదు

 

జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో మిగిలిన వారినందరినీ విడిచి పెట్టేసి, తనలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గట్టిగా కృషి చేస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు టార్గెట్ చేసుకొంటున్నారు? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకొని, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు వచ్చితనతో చేతులు కలపమని తన బద్ధశత్రువయిన తెదేపాని కూడా కోరుతున్నపుడు, మరి తన సమైక్యబాటలోనే పయనిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డితో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలిసి నడవడానికి ఇష్టపడటం లేదు?

 

వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వానికి మద్దతి ఇస్తామని చెపుతున్నపుడు, ‘సేమ్ టు సేమ్ డీ.యన్.ఏ.’ కలిగి ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అంటే జగన్ ఎందుకు మండిపడుతున్నట్లు? ఇటువంటి ధర్మ సందేహాలు ప్రజలకు చాలానే ఉన్నాయి. అయితే ఇవి సమాధానాలు దొరకని భేతాళ ప్రశ్నలు కావు.

 

పరుగు పందెంలోనయితేనేమి సమైక్య చాంపియన్ రేసులోనయితేనేమి ఎవరూ కూడా తమ పోటీదారులతో చేతులు కలిపి పరిగెత్తాలనుకోరు కదా? ఇదీ అంతే! అదీకాక అన్నివిధాల సమాన, మ్యాచింగ్ డీ.యన్.ఏ.కలిగి ఉన్నవాడిని ప్రోత్సహించడం అంటే మొదటి స్థానం కోసం కాక రెండో స్థానం కోసం పరుగెడుతున్నట్లే లెక్క.

 

ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే అంటిపెట్టుకొని ఉంటే, ఎన్నికల సమయంలోనే కాక ఆ తరువాత కూడా రెండు కత్తులు ఒకటే ఒరలో ఇమడవన్నట్లు, ఆ ఇద్దరు రెడ్లు ఒకే పార్టీలో, ప్రభుత్వంలో ఇమడలేరు. అలాకాక కిరణ్ పార్టీ నుండి బయటపడి వేరే కుంపటి పెట్టుకొన్నప్పటికీ, ఆ పొగ, ఆ సెగ ఎన్నికలలో తనకి తగలక మానవు. ఎక్కడయినా బావ కానీ వంగ తోట కాడ మాత్రం కాదన్నట్లు తనకి అన్ని చోట్ల పోటీగా నిలుస్తున్న కిరణ్ కుమార్ అంటే అందుకే జగన్కి అంత ప్రత్యేకమయిన ఆ ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో మిగిలినవారినెవరినీ అతను తనతో సమానులుగా భావించడం లేదు గనుకనే వారు బ్రతికిపోయారు. లేకుంటే వారు కూడా పోయేవారే.

 

ఇక చంద్రబాబు రాజకీయ అనుభవమంతా వయసు కూడా లేని జగన్ ఆయనని లేఖ వెనక్కి తీసుకొని, వచ్చి తన వెనుక నడువమని చెప్పడం అతితెలివి, అహంకారమే తప్ప మరొకటి కాదు. తన దూకుడు వల్ల ఇప్పటికే అనేక తప్పుడు నిర్ణయాలు, ‘యూ టర్నులు’ తీసుకొని, చివరికి ఆ తెదేపాను చూసే తన తప్పుని గ్రహించి మళ్ళీ తెలంగాణాలో పార్టీని కాపాడుకోవాలని ప్రాకులాట మొదలుపెట్టిన అతను, తను వేసిన ఎత్తుకి చంద్రబాబు, అతని పార్టీ పడిపోతుందని భావించడం అవివేకమే.