మోపిదేవి కాంగ్రెస్ కి రామ్ రామ్
posted on Nov 14, 2013 @ 6:20PM
వాన్‌పిక్ కేసు నిందితుడిగా దాదాపు 16నెలలు జైలు జీవితం గడిపిన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, తనకు కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా వదిలేసిందనే ఆగ్రహంతో, కాంగ్రెస్ ను వీడి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు, కుటుంబ సభ్యులు, అనుచరులు వైకాపాలో చేరి ఉన్నారు. ఇప్పుడు మోపిదేవి కూడా చేరుతున్నారు.
సాధారణ పరిస్థితుల్లో అయితే మోపిదేవి వంటి బలమయిన నాయకుడు పార్టీని వీడివెళ్లిపోతుంటే బుజ్జగింపుల ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రికే గ్యారంటీ లేనప్పుడు ఇంకా మోపిదేవిని మాత్రం ఎవరు పట్టించుకొంటారు? పైగా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందరూ ఎవరికి వారు తమ పరిస్థితి ఏమిటనే దిగులుతో ఏమి చేయాలో పాలుపోక, పరిస్థితులు ఎప్పటికయినా చక్కబడక పోతాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో మోపిదేవిని ఎవరూ పట్టించుకొంటారని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అయితే రేపు జగన్ తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లు మోపిదేవి మళ్ళీ కాంగ్రెస్ గూటిలోనే వచ్చి పడవచ్చును.