‘ఇసి’గించొద్దు రాహుల్!
posted on Nov 14, 2013 @ 10:26AM
మనిషికోమాట... గొడ్డుకోదెబ్బ అన్నారు. మరి రాహుల్ గాంధీ లాంటి రాజకీయ నాయకుడిని దారిలోకి తేవాలంటే ఏం చేయాలన్నది ఎవరైనా కొత్తగా కనిపెట్టాలి. చిన్నసార్ ఏ ముహూర్తంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యాడోగానీ, సార్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మటాష్! తనమీద పడిన ఈ ముద్రని పోగొట్టుకోవాలని అనుకున్నాడో ఏంటోగానీ, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాహుల్ తెగ పర్యటించేస్తున్నాడు. ఓటర్లని బుట్టలో వేయడానికి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు.
ఆమధ్య ఓ మీటింగ్‌లో ముజఫర్‌నగర్‌లో జరిగిన గొడవలను ప్రస్తావించి, ఆ గొడవలకి కారణం బీజేపీయేనని కాషాయం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయం మీద బీజేపీ భగ్గుమంది. రాహుల్ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం రాహుల్‌ని వివరణ కోరితే, రాహుల్ తాను చాలా మంచి బాలుడినని, ఎన్నికల కమిషన్ నిబంధనలను ఎంతమాత్రం ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చాడు. అయితే రాహుల్ గాంధీ ఇచ్చిన వివరణ ఎన్నికల కమిషన్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. రాహుల్ వివరణ మీద ఇ.సి. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
భవిష్యత్తులో బహిరంగసభల్లో మాట్లాడే సమయంలో నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికైనా రాహుల్ జనాన్ని తన మాటలతో ‘ఇసి’గించకుండా వుంటారని ఆశిద్దాం. ఇదిలావుంటే, రాహుల్ గాంధీ మీద బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాబట్టి, దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. ఎన్నికల ప్రచార సభల్లో మోడీ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన హస్తాన్ని ‘ఖూనీ పంజా’ అని విమర్శిస్తున్నారని, ఈ పాయింట్‌ని బేస్ చేసుకుని మోడీ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల సంఘం యథావిధిగా ఈ విషయంలో నరేంద్ర మోడీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనికి నరేంద్రమోడీ వివరణ ఎలా వుంటుందో వేచి చూడాలి. కానీ ఒక్కటి మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. అదేంటంటే, మోడీ ఇచ్చే వివరణ రాహుల్ ఇచ్చిన వివరణలా ఇ.సి. చేత అక్షింతలు వేయించుకునేలా మాత్రం వుండదు.