రూటు మారిన జేసీ బస్సు!

      రాయలసీమ కాంగ్రెస్ నాయకుడు, ట్రావెల్స్ అధినేత జేసీ దివాకరరెడ్డి తన రాజకీయ బస్సును సమైక్యాంధ్ర రూట్లోంచి రాయల తెలంగాణ రూట్లోకి మళ్ళించారు. ఆమధ్యకాలంలో తన బస్సును రాయల తెలంగాణ రూట్లో నడిపినప్పటికీ నిన్న మొన్నటి వరకూ సమైక్యాంధ్ర రూట్లోనే నడిపారు.   తాజాగా తన బస్సును రాయల తెలంగాణ రూట్లోకి ఆయన మళ్ళించారు. గతంలో సమైక్యాంధ్ర కోసం తాపత్రయపడిన జేసీ ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్సతో ఫోన్‌లో గొడవ కూడా పడ్డారు.  బొత్సతో గొడవ పడినందువల్లే పాలెం బస్సు ప్రమాదంలో జేసీ ట్రావెల్స్ మీద కూడా కేసు నమోదైందన్న వార్తలు వచ్చాయి... అది వేరే విషయం. మొత్తమ్మీద జేసీ తన రూటు మార్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. జేసీ దివాకరరెడ్డి రాయలసీమ ప్రాంత నాయకుడైనప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు తెలంగాణ ప్రాంతంలోనే ఉంటాయని అంటారు. ఇంకా చెప్పాలంటే దివాకరరెడ్డి పుట్టింది రాయలసీమ పక్కనే వున్న తెలంగాణ ప్రాంతంలోనేనని చెబుతారు. ఆ విధంగా జేసీకి తెలంగాణతో కూడా బోలెడంత అనుబంధం వుంది. అంత అనుబంధం వున్న తెలంగాణ నుంచి విడిపోవడం ఇష్టం లేకనే ఆయన రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి వుండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతోపాటు జేసీకి చెందిన ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కి ఎక్కువగా ప్రయాణం చేస్తాయి. రేపు రాష్ట్రం విడిపోయి రాయలసీమకు, తెలంగాణకు సంబంధాలు లేకపోతే ఆ ప్రభావం ఆయన ట్రావెల్స్ మీద కూడా వుండే అవకాశం వుంది. అదే రాయల తెలంగాణ ఏర్పడితే తెలంగాణతో తనకున్న అనుబంధం తెగిపోదు అలాగే తన ట్రావెల్స్ కీ ఎలాంటి ఇబ్బందీ వుండదు. ఇవన్నీ ఆలోచించే జేసీ రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి వుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపి అక్కడితే ఆగితే బాగానే వుండేది. తన బస్సుకి అక్కడితే బ్రేక్ వేస్తే మంచిగా వుండేది. అలా బ్రేక్ వేస్తే ఆయన జేసీ ఎందుకవుతారు? రాయల తెలంగాణని వ్యతిరేకించేవాళ్ళందరూ తెలంగాణ ద్రోహులే అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దాంతో ఒకవైపు సమైక్యాంధ్రకోసం, మరోవైపు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం తంటాలు పడుతున్న రాయలసీమ నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం జేసీ బస్సు రాయల తెలంగాణ వైపు దూసుకుపోతోంది. భవిష్యత్తులో ఏ రూట్లోకి మారుతుందో వేచి చూద్దాం.

అఖిలపక్షం కాదు.. వికలపక్షం!

        ఈనెల 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అఖిల పక్షానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్న తెలుగుదేశం, సీపీఎం, వైఎస్సార్సీపీలను మినహాయించి ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలిచింది. 12న ఉదయం ఐదు పార్టీలతో విడివిడిగా కేంద్ర మంత్రుల బృందం సమావేశం అవుతుంది. అన్ని పార్టీలతో ఏర్పాటు చేసే సమావేశాన్ని ‘అఖిలపక్షం’ అని పిలవొచ్చుగానీ, కొన్ని పార్టీలతో జరిపే సమావేశాన్ని ‘వికలపక్షం’ అని పిలవాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వికలపక్షంలో పాల్గొనే పార్టీల్లో ఒక్క ఎంఐఎం తప్ప మిగతా పార్టీలన్నీ రాష్ట్ర విభజనను సమర్థించే పార్టీలే. ఎంఐఎం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అంటూనే రాయల తెలంగాణ ఇస్తే ఓకే అంటుంది. మొత్తమ్మీద చూసుకుంటే తెలుగుజాతి విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలే కేంద్రం జరపబోయే వికలపక్ష సమావేశంలో పాల్గొనబోతున్నాయి. ఈ వికలపక్ష పార్టీలన్నీ కలసి ఒకే మాట మీద నిలబడి తెలుగు తల్లిని వికలాంగురాలిని చేయాలని నిర్ణయిస్తే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. మేం పిలిచినా మీరు రాలేదు.. వికలపక్షానికి వచ్చిన పార్టీలన్నీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేయమన్నాయి కాబట్టి చేసేస్తున్నామని వికలపక్షం ముగిశాక కేంద్రం పక్షపాతంతో ప్రకటిస్తే పరిస్థితేంటి? ఈ ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. కేంద్రం తెలుగు జాతిని ఎంత దారుణంగా అవమానిస్తోందో చెప్పడానికి ఈ వికలపక్ష సమావేశం మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సమావేశానికి ప్రతి పార్టీ నుంచి ఐదుగురు మెంబర్లు రావొచ్చట. ఒక్కో పార్టీకి విడివిడిగా అరగంట సమయం కేటాయించారట! రోజుల తరబడి చర్చించినా తీరని సమస్య గురించి అరగంటలో చర్చించాలని కండీషన్ పెట్టడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? తెలుగువారి హృదయాలను మరింత వికలం చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఈ వికలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని అనుకోవాలి.

విభజనపై కేంద్రం జెట్ స్పీడ్

      ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం ప్రక్రియను వేగవంతం చేసినట్లుగానే కన్పిస్తోంది. రాష్ట్రానికి చెందిన ఐదు పార్టీలతో ఈ నెల 12న కేంద్ర మంత్రుల బృందం సమావేశమవుతుంది. దానికన్నా ముందు ఈ రోజు జీవోఎం ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలోనే జీఓఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.   ఈ నెలాఖరులోగా అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందనీ, డిసెంబర్‌ మొదటి వారంలో పార్లమెంటు ముందుకు తెలంగాణ బిల్లు రానుందనీ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ రెండూ కేంద్రం అనుకున్నట్టుగానే జరిగితే, డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాదాపు ఖాయమే కావొచ్చు.

బాబోయ్ అఖిలపక్షం

  గతంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర విభజనపై చర్చించేందుకు రాష్ట్ర రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అప్పుడు వారి నుండి లేఖలు తీసుకోవడమే గాకుండా ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా వారి మాటలను రికార్డు చేసి, వీడియోను కూడా తీసి భద్రంగా ఉంచుకొన్నారు. అఖిలపక్షమయితే ఘనంగానే నిర్వహించారు, గానీ రాష్ట్ర విభజన మాత్రం వెంటనే చేయలేదు.   మళ్ళీ ఆ తరువాత షిండే ఆయన స్థానంలోకి హోం మంత్రిగా రావడంతో మళ్ళీఅదే తంతు మరోసారి జరిపారు. అప్పుడు కూడా మళ్ళీ లేఖలు, వీడియోలు తతంగం షరా మామూలే. ఎట్టకేలకు కాంగ్రెస్ దైర్యంచేసి రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించేసరికి రాష్ట్రంలో రాజకీయపార్టీలు అన్ని కంగు తిన్నాయి. కానీ వెంటనే తేరుకొని తలో వాదన చేస్తూ కేంద్రాన్ని నిందించడం మొదలుపెట్టాయి.   అయితే రాష్ట్రంలో పార్టీలు మహా ముదుర్లయితే, కాంగ్రెస్ దేశాన్నే ఏలేస్తున్నపెద్ద దేశముదురు. తన దగ్గరున్నవారి లేఖలను బయటపెట్టి లొంగ దీయాలని ప్రయత్నించింది. గానీ వాళ్ళు లొంగకపోవడంతో వారి నోళ్లకు తాళం వేసేందుకు మళ్ళీ తన దగ్గరున్న బ్రహ్మాస్త్రం అంటే అఖిలపక్ష సమావేశం ఐడియాని మరోమారు వారిపై ప్రయోగించింది. ఊహించినట్లే ప్రతిపక్షాలు మళ్ళీ కంగు తిన్నాయి.   రెండు సార్లు అఖిలపక్షంలో పాల్గొనందుకే నేటికే లెంపలు వేసుకొనే పరిస్థితి ఎదురవుతుంటే, ఇప్పుడు మళ్ళీ మరో మారు వెళ్లడం బుద్ధి తక్కువ పనే అవుతుందని గ్రహించిన తెదేపా, వైకాపాలు అఖిలపక్షానికి కుంతీ సాకులు చెప్పి డుమ్మా కొట్టేసాయి. అఖిలపక్షానికి వెళితే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తునట్లు సంకేతాలు వెళ్తాయని వైకాపా భయపడితే, వెళ్లి కొత్త ఇబ్బందులు తలెకెత్తుకోవడమెందుకని తెదేపా తప్పించుకొంది. కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు నమ్మవు. వాటిని కాంగ్రెస్ నమ్మదు. అందుకే వారి మధ్య ఈ చదరంగం నిరంతరం సాగుతూనే ఉంటుంది.

కిరణ్‌ కు అధిష్టానం పిలుపు

      ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డికి అధిష్టానం నుండి పిలుపువచ్చింది. దీంతో శుక్రవారం ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. అదే రోజు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్‌పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈనెల 12న కేంద్ర హోంశాఖ నేతృత్వంలో రాష్ట్రవిభజనపై ఏర్పాటైన మంత్రులబృందం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్య మంత్రికి అధిష్టానం నుండి పిలుపురావడం ప్రాధా న్యతను సంతరించుకుంది. రాష్ట్రవిభజనపై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ముఖ్య మంత్రి లేఖలు రాయడం, అవకాశమొచ్చిన ప్రతి సభలోనూ సమైక్యరాగాన్ని సిఎం గట్టిగా వినిపించ డాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రంగా పరిగణి స్తోంది. తాను ఫోన్‌ చేసినా అధిష్టాన ప్రతినిధులు స్పందించటం లేదంటూ ముఖ్య మంత్రి చేస్తున్న వ్యాఖ్యలపట్ల అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమా చారం. విభజనకు అనుకూలంగా అధిష్టానం తీసు కున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కట్టుబడ తారా? లేక సమైక్యరాగాన్నే అధిష్టానం పెద్దల ముందు వినిపిస్తారా? అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది.

తెదేపాలో ముసలం

  చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన తెదేపాలో చిచ్చుపెడుతోంది. గోరుచుట్టుపై రోకటి పోటు పడినట్లు, ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో క్రిందామీద పడుతున్న తెదేపాకి తాజాగా హోంశాఖ విభజనపై అభిప్రాయాలను, సూచనలను పంపవలసిందిగా పార్టీలను కోరడం, అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపడంతో, తెదేపాలో ముసలం పుట్టింది.   హోం శాఖకు ఎటువంటి లేఖ వ్రాయకూడదని, అదేవిధంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని తెదేపా నిశ్చయించుకొంది. అయితే పార్టీలో రెండు వర్గాలను సంతృప్తి పరిచేందుకు మధ్యేమార్గంగా అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించేవరకు విభజన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధానికి లేఖ వ్రాసారు.   ఇది సహజంగానే పార్టీలో ఎర్రబెల్లి వంటి తెలంగాణా నేతలకి ఆగ్రహం కలిగించింది.  మళ్ళీ ఇప్పుడు కేంద్రమంత్రుల బృందంతో సమావేశమయ్యి విభజన విషయంలో సలహాలు, సూచనలు చేయడానికి నిరాకరించడంతో, తమ పార్టీ తెలంగాణా కంటే సీమాంధ్రకే ప్రాధాన్యత ఇస్తోందనే భావం తెలంగాణా నేతలలో నెలకొంది. పయ్యావుల, కోడెల వంటి సీమాంధ్ర నేతల ఒత్తిడికి లొంగినందునే చంద్రబాబు నేటికీ తెలంగాణాపై పార్టీ వైఖరి స్పష్టం చేయడం లేదని తెలంగాణా నేతలు ఆగ్రహంతో ఉన్నారు.   పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పటి నుండే వారి మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలయింది. పుండు మీద కారం చల్లినట్లు, “తమ అధినేత ప్రధానికి వ్రాసిన లేఖ ద్వారా ఇప్పుడు తమ పార్టీ సమైక్యాంధ్రకి అనుకూలంగా తన వైఖరి మార్చుకొన్నట్లు స్పష్టమవుతోందని, త్వరలో ఈవిషయంపై మరింత స్పష్టత వస్తుందని” పయ్యావుల చేసిన తాజా వ్యాఖ్యలతో తెదేపాలో గొడవ ముదిరి పాకన పడింది. అందుకు ఎర్రబెల్లి తీవ్రంగా స్పందిస్తూ పయ్యావుల వంటి వారు పార్టీలో చీడ పురుగుల వంటి వారని విమర్శించారు.

అఖిలపక్ష౦ ఒక రోజే..!

      ముందు అనుకున్నట్లు అఖిలపక్ష సమావేశం రెండు రోజులు కాకుండా ఒక్క రోజుతోనే ముగించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈనెల 12న అఖిలపక్షం జరగనుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఐదు రాజకీయ పార్టీలు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు అఖిలపక్షానికి రావాల్సిందిగా బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఫోన్ ద్వారా తెలియజేసింది.   అఖిలపక్షాన్ని బహిష్కరిస్తున్నట్లు మూడు రాజకీయ పార్టీలు టీడీపీ, సీసీఎం, వైసీపీలు పేర్కొనడంతో ఆ పార్టీలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపలేదు. దీంతో ఈనెల 12, 13 తేదీల్లో అఖిలపక్షం నిర్వహించాలనుకున్న హోంశాఖ మూడు పార్టీలు లేకపోవడంతో 12వ తేదీ ఒక్క రోజుతోనే ముగించాలని భావించింది. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఒక్కక్క పార్టీతో 30 నిముషాలపాటు చర్చలు జరపనుంది. ముందుగా ఎంఐఎం, తర్వాత బీజేపీ, సీపీఐ, టీఆర్ఎస్, చివరిగా కాంగ్రెస్‌తో కేంద్ర హోంశాఖ ఆయా పార్టీల అభిప్రాయలు తెలుసుకోనుంది.

సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

      తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు టీడీపీ కట్టుబడి ఉందని, విభజనలో తమ పార్టీ భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. మద్యప్రదేశ్‌లో ఓడిపోయిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్చి దిగ్విజయ్ సింగ్ తెలుగువారి జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. విధివిధానాలు లేకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందని, హైదరాబాద్‌పై హక్కులేదని, మా మనసులను గాయపిచారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 1972లోనే రాష్ట్ర విభజన జరిగితే బాగుండేదని, ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, తాము ఇప్పటికీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

టీ-ముసాయిదాతో తేదేపాకు మరో అగ్ని పరీక్ష

  తెదేపా రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ, సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకోక తప్పని పరిస్థితుల్లో కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు వ్యవహరిస్తూ రోజులు నెట్టుకొస్తోంది. అఖిలపక్ష సమావేశం గండాన్ని కూడా ఎలాగో గట్టెక్కినా మళ్ళీ త్వరలోనే తెలంగాణా ముసాయిదా లేదా వేరొకటి శాసనసభకు వచ్చినప్పుడు మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు. అయితే అప్పుడు కూడా మళ్ళీ అటువంటి వ్యూహాన్నే అమలుచేయవచ్చును. అయితే తెలంగాణపై స్పష్టమయిన వైఖరి అనుసరించక పోవడం వలన ఆ పార్టీకి తెలంగాణాలో కోలుకోనంతగా నష్టం జరుగుతోంది.   ఇప్పటికే, పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి తెలంగాణా నేతలు పార్టీ అనుసరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్నారు. కడియం శ్రీహరి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి తెలంగాణా నేతలు దైర్యం చేసి బయటకుపోయి పడుతున్న ఇబ్బందులను చూస్తున్న కారణంగానే పార్టీలో నేతలు బయటకి వెళ్లేందుకు జంకుతున్నారు. నేటికీ తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు మినహా వేరే బలమయిన పార్టీలు లేకపోవడం కూడా తేదేపాకు వరంగా ఉందని చెప్పవచ్చును. కానీ వారు ఎల్లకాలం అలాగే పార్టీని అంటిపెట్టుకొని ఉంటారని చెప్పలేము.   త్వరలో తెలంగాణా ముసాయిదా రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు కూడా తమ పార్టీ ఇదే విధంగా వ్యవహరిస్తే కొంతమంది తెదేపాను వీడవచ్చును. అయితే వారు వెంటనే ఏ పార్టీలో చేరకుండా రానున్న ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకే మొగ్గు చూపవచ్చును. పరిస్థితులు అంతవరకు రానీయకూదదని తెదేపా భావిస్తే రాష్ట్ర విభజన వ్యవహారంలో స్పష్టమయిన వైఖరి ప్రకటించవలసి ఉంటుంది. లేకుంటే రాజకీయ నేతలెవరూ కూడా పార్టీ కోసం తమ రాజకీయ భవిష్యత్తుని పణంగా పెట్టరనే సత్యం గ్రహించేసరికి సమయం మించిపోవచ్చును.

ఎంపీ గారి జోస్యం!

      నిజామాబాద్ ఎంపీ మధు యాస్కి గౌడ్‌ అబద్ధాలతో జనాల చెవుల్లో పూలు పెట్టడంలో కేసీఆర్‌ని మించిపోయేట్టున్నాడు. నెలకోసారి మీడియా ముందుకు వచ్చి సీమాంధ్ర ప్రజల కడుపు మండేలా ఏదో ఒక మాట మాట్లాడి వెళ్ళపోయే ఆయన తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ఆ రావటం కూడా మామూలుగా రాలేదాయన. బోలెడన్ని అబద్ధాలు మూట కట్టి తెచ్చి మీడియా ముఖాన పారేసి చక్కా పోయారు.   ఇంతకీ ఈసారి ఆయన చెప్పిన అబద్ధాలు, ఊహాగానాలు, జోస్యాలు ఏమిటంటే, తెలంగాణ వచ్చుడు ఖాయమట. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదమైపోతుందట. సరే, ఇంతవరకూ తెలంగాణ వాదులందరూ చేసే ఊహాగానాలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ యాస్కి మరింత ముందడుగు వేశాడు. సీమాంధ్ర ఎంపీలందరూ రాజీనామాలు చేసినా, బిల్లుకి బీజేపీ మద్దతు ప్రకటించకపోయినా, జాతీయ స్థాయిలో వున్న ఇతర పార్టీలు సహకరించకపోయినా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందుతుందట. ఇంకో రెండు నెలల్లో అంటే జనవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయట. సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంలో ప్రభుత్వమే ఉండే అవకాశం లేదు. సరే ఎంపీగారు చెబుతున్నారు కాబట్టి ఏమీ కాదనుకుందాం. బీజేపీ, ఇతర జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించకుండా పార్లమెంటులో బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది? ఆ లెక్కలేవో ఎంపీగారు వివరంగా చెబితే తెలంగాణ ప్రజలతోపాటు సీమాంధ్ర ప్రజలు కూడా ధన్యులైపోతారు. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండే ప్రయత్నమే తప్ప మధు యాస్కి చెప్పిన జోస్యం ఫలించేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  వచ్చే ఎన్నికలలో మధు యాస్కీకి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం టిక్కెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తనలాగే అబద్ధాలు, ఫలించని జోస్యాలు చెప్పే కేసీఆర్ దృష్టిని ఆకర్షించడానికే యాస్కి ఇలాంటి జోస్యాలు చెబుతూ ఉండవచ్చు.

కాంగ్రెస్ సాలెగూటిలో తెదేపా చిక్కుకొందా

  రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రుల బృందానికి లేఖ వ్రాయడం కూడా విభజనకు అంగీకరించినట్లే అవుతుందని భావించిన తెదేపా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాన్ని కనుగొన్న తరువాతనే విభజన చేయమని కోరుతూ ప్రధానికి లేఖ వ్రాసింది. త్వరలో జరుగనున్నఅఖిలపక్ష సమావేశానికి కూడా తెదేపా హాజరుకాకపోవచ్చును.   అయితే ఇవి ఆ పార్టీకి తాత్కాలిక ఉపశమనంగానే ఉపయోగపడతాయి తప్ప, పార్టీని రెండు ప్రాంతాలలో బలోపేతం చేయడానికి ఏవిధంగాను దోహదపడవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎత్తు వేస్తూ, రాష్ట్రంలో ప్రతిపక్షాలను గందరగోళ పరిస్థితుల్లో కొనసాగేలా ఉంచుతోంది. వచ్చే ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ బహుశః ఇదే విధానం అవలంబించవచ్చును.   ఎన్నికలకు ఇంకా కేవలం ఆరు నెలలే సమయం మిగిలి ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఈ విభజన అంశంపైనే దృష్టి కేంద్రీకరించవలసి వస్తోందంటే, కాంగ్రెస్ వాటిని ఎంతగా కట్టడి చేసి ఉంచిందో అర్ధం అవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ డిశంబర్లో తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టిన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మధ్యంతర ఎన్నికలకి వెళ్ళదలచుకొంటే, అందరికంటే ఎక్కువ ఇబ్బందిపడేది రెండు రాష్ట్రాలలో పోటీ చేయాలనుకొంటున్న తెలుగుదేశం పార్టీయే.   ఎందుకంటే ఇంతవరకు అందుకు అనుగుణంగా పార్టీని జాతీయ పార్టీగా మార్చుకోవడం, తెలంగాణాలో పార్టీ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకోవడం, అభ్యర్ధుల పేర్లను సిద్దం చేసుకోవడం వంటి ప్రక్రియ ఏదీ కూడా మొదలుపెట్టలేదు. మొదలుపెడితే అది సీమాంధ్ర ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపుతుందనే భయంతోనే వెనక్కి తగ్గవలసి వస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెదేపా ఇదే అయోమయ స్థితిలో కొనసాగాలని కోరుకొంటోంది. బహుశః అందుకే అఖిలపక్షం వంటి ఐడియాలతో ఆ పార్టీ దృష్టి ఎన్నికలపైకి మళ్ళకుండా బిజీగా ఉంచుతోంది.   తెదేపా కూడా కాంగ్రెస్ అల్లిన ఆ సాలెగూటి నుండి బయటపడలేక ఎప్పటికపుడు తాత్కాలిక వ్యూహాలతో కాలక్షేపం చేస్తూ ఏమరపాటుగా వ్యవహరిస్తోంది. దీనివల్ల ఆ పార్టీకే నష్టం కలుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టమూ జరుగదు.

ఎంఐఎం 'రాయల తెలంగాణ'

      ''రాయల తెలంగాణ ప్రకటిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హైదరాబాద్‌ని యూటీగా ప్రకటించవద్దు. తాత్కాలికంగా కొంత కాలం ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవచ్చు. అయితే, ఇక్కడి నుంచి వచ్చే ఆదాయం, వనరుల పంపిణీపై నిర్దుష్టమైన విధానాన్ని ఖరారు చేయాలి'' అని మజ్లిస్ పార్టీ కేంద్ర మంత్రుల బృందానికి సూచించింది. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలి.   రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే నదీ జలాల వివాదాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉత్పన్నం కావని స్పష్టం చేసినట్టు తెలిపింది. సాంస్కృతికంగా తెలంగాణ- రాయలసీమ ప్రజల మధ్య సారూప్యత ఉందని పేర్కొన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యతను కేంద్రం తన పరిధిలోకి తీసుకోరాదని, రాజధానిలో సీమాంధ్రుల హక్కుల పరిరక్షణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వలసవాదులు, సీమాంధ్రులు అనే నిర్లక్ష్య భావంతో చూసే వారిపై కఠినంగా వ్యవహరించేలా చట్టం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. భౌగోళికంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని కేంద్రమని స్పష్టం చేశారు. విభిన్న మతాలు, కులాల ప్రజలు నివసించే కేంద్రంగా హైదరాబాద్ సంస్కృతి విశ్వవిఖ్యాతి పొందిందని, స్థానిక సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు విఘాతం కలిగించకుండా విభజనపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు తెలిసింది.

రాహుల్ స్థానంలోకి ప్రియాంకా గాంధీ రాబోతోందా

  రానున్నఎన్నికల తరువాత యుపీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీకి ప్రధానిగా పట్టభిషేకం చేసి సోనియాగాంధీ రాజకీయాల నుండి తప్పుకోవాలనుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్ల, రానున్న ఎన్నికలు యుపీయేకి చాలా కీలకమయినవి. అయితే రాహుల్ గాంధీ గత తొమ్మిదేళ్లుగా రాజకీయాలలో ఉన్నపటికీ, తనకి అత్యంత అనుకూలమయిన పరిస్థితుల్లో కూడా పార్టీపై కానీ ప్రభుత్వంపై గానీ, చివరికి దేశ రాజకీయాలపై గానీ ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయారు.   గత పదేళ్ళలో దేశంలో అనేక సంచలన సంఘటనలు, పరిణామాలు కలిగాయి. కానీ రాహుల్ గాంధీ ఎన్నడూ కూడా చొరవ తీసుకొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. ఆయన ఎల్లపుడూ తనదయిన ఒక ఊహా ప్రపంచంలో విహరిస్తూ, రాజకీయల ప్రక్షాళన, అధికార వికేంద్రీకరణ, నీతి నిజాయితీవంటి అంశాలపై సుదీర్గ ఉపన్యాసాలకే పరిమితమవుతారు.   గతంలో తనకి ప్రధాని పదవిపై ఆసక్తిలేదని ప్రకటించిన ఆయన, ఈ మధ్యనే ఉగ్రవాదుల చేతిలో తను కూడా చనిపోవచ్చునని చెప్పి తను ఎంత బలహీనుడో స్వయంగా ఆయనే ప్రకటించుకొన్నారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న బీజేపీ ఇదే అదునుగా రాజకీయంగా మంచి అనుభవశాలి, రాహుల్ గాంధీకి పూర్తి భిన్నమయిన ధోరణితో గొప్ప ఆశావాది అయిన నరేంద్ర మోడీని ముందుకు తీసుకురావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏమిచేయాలో తెలియని అయోమయంలో పడింది.   బొత్తిగా నాయకత్వ లక్షణాలు ప్రదర్శించని, నిరాశావాది అయిన రాహుల్ గాంధీని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళినట్లయితే నరేంద్ర మోడీ చేతిలో భంగపాటు తప్పదనే చేదునిజం మెలమెల్లగా కాంగ్రెస్ నేతలకు అర్ధం అవుతోంది. అందుకే ఇప్పుడు ప్రియాంకా గాంధీని క్రమంగా ముందుకు తీసుకు వస్తోంది. స్వర్గీయ ఇందిరాగాంధీకి దగ్గర పోలికలున్నందున ఆమెను ప్రజలు ఆమోదించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అభిప్రాయం. అయితే ఆమె తనలో ఇందిరమ్మకున్న నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని ఆమె నిరూపించుకోవలసి ఉంటుంది.   ఒకవేళ రానున్నఎన్నికలలో ప్రియాంకా గాంధీ నేతృత్వంలో యుపీయే కూటమి విజయం సాధిస్తే ఆ విజయం ఆమెకే స్వంతం అవుతుంది గనుక, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమెనే ప్రధాని అభ్యర్ధిగా ఎన్నుకోవలసిఉంటుంది. అప్పుడు రాహుల్ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీయే సమాధానం చెప్పవలసి ఉంటుంది. నవంబర్, డిశంబర్ నెలలో ఐదు రాష్ట్రాలలో జరగనున్న శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్ అధిష్టానం రాహుల్, ప్రియాంకాల విషయంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

జగన్ దారి.. అడ్డదారి!

      వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిని చూస్తుంటే రజనీకాంత్ గుర్తొస్తాడు. అంతేకాదు జగన్ని జగనీకాంత్ అని పిలుచుకోవాలని కూడా అనిపిస్తూ వుంటుంది. కాకపోతే ఒక్కటే తేడా ఏంటంటే, సినిమాలో రజనీకాంత్‌ ‘నాదారి రహదారి’ అంటాడు. రాజకీయాల్లో జగన్ మాత్రం ‘నా దారి అడ్డదారి’ అంటున్నాడు.   రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టింది దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి అయితే, ఆ చిచ్చులో ఆజ్యం పోసి నిప్పు ఎగదోసింది మాత్రం జగన్మోహనరెడ్డి. తెలంగాణ వస్తే రాని, సీమాంధ్రలో నేనే హీరో అయిపోతా అనే ఆలోచనతో తెలంగాణకు మద్దతు ప్రకటించిన జగన్ విభజనకు ప్రధాన కారకుడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు దారి వెతుక్కుంటున్న సమయంలో విభజన రథ చక్రాలు సులభంగా ముందు వెళ్ళడానికి జగన్ జాతీయ రహదారినే నిర్మించాడు. ఇప్పుడు అంతా అయిపోయాక తాను విభజనకు వ్యతిరేకమని అంటూ, రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అంతా అయిపోతున్న తరుణంలో ఇప్పుడు రహదారుల దిగ్బంధం చేసి జగన్ బావుకునేదేమిటో అర్థం కాక రాజకీయ విశ్లేషకులు కూడా ఆలోచనలో పడుతున్నారు. రహదారులను దిగ్బంధించి జగన్ సీమాంధ్రుల అభిమానం పొందుతాడా అంటే, సీమాంధ్రుల దృష్టిలో పాతాళానికి పడిపోయిన జగన్‌కి ఆ ఛాన్స్ కూడా లేదు. మరి ఎందుకిలా తంటాలు పడుతూ రహదారుల దిగ్బంధం చేస్తున్నాలో, జనాన్ని ఎందుకు తంటాలు పెడుతున్నాడో జగన్ గారికే ఎరుక. అన్నట్టు... రాష్ట్ర విభజన కోసం తాను చేసినవన్నీ మర్చిపోయి ఇప్పుడు సమైక్యవాది ముసుగులో వున్న జగన్ మహాశయుణ్ణి ‘గజనీ’కాంత్ అని పిలుచుకోవచ్చు.  

ఓదార్పులకు సిద్దంకండహో

  జగన్ జైల్లో ఉన్నంత కాలం ఆయనను ఎవరూ ఓదార్చకపోయినా, ఆయన మాత్రం ప్రజలను ఓదార్చడం తన బాధ్యతగా భావించడం గొప్ప విషయమే. ఈ నెల 16నుండి ఆయన ఓదార్పు యాత్ర మొదలవుతుందని సమాచారం. అందుకే వైకాపా ఆయన ఓదార్చవలసిన వారి లిస్టులు బయటకు తీసి సిద్దం చేస్తోంది. మనుషులు పోయిన నాలుగేళ్ళయినా, నలబై ఏళ్ళయినా కూడా ఓదార్చవచ్చని దీనిని బట్టి అర్ధం అవుతోంది. అందువలన ఆ లిస్టులో పేర్లున్నవాళ్ళు అందరూ మళ్ళీ జగన్ ఓదార్పుకి సిద్దంగా ఉండాలి.ఇక త్వరలో మొదలయ్యే ఈ ఎమ్మోషనల్ డ్రామాను ప్రజల ముందు ఉంచేందుకు సాక్షి కూడా సిద్దంగానే ఉంటుంది. అయితే ఎన్నికలు ఆరు నెలలో పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాల ద్వారా విలువయిన సమయం వృదా చేసుకొనే బదులు అదేదో టికెట్ల పంపకాలు, పార్టీ నిర్మాణం వంటి విషయాలకు కేటాయిస్తే ఫలితం ఉంటుంది కదా! అని ఆ పార్టీ నేతలే సణుగుతున్నారు.

ఇంతకీ నానేటి సెపుతున్నాఅంటే... ఏట్నేదు-1

  “నానేటి సెపుతున్నానో ఎవులికీ అరదం కాట్నేదనే, నాను సాన కష్టపడి ఈ మాత్రం బాస నేర్సుకొని గలగలా మీడియా ఓళ్ళతో మాటాడేతున్నా. అయినా ఈ ఎర్రిబాగుల జనాలకి అరదం కానేకపోతే నానేటిసేసేది? నాను ఓ పాలి అదేదో జెరమనీ దేసమాట! ఆడికి కూడా ఇమానం ఎక్కి ఎగురకుంటా ఎల్లినా. అదేదో వోకుసు యాగనట ఆ కార్ల కంపెనీ వోల్లకి కూడా నానేటి సెప్పినానో సానా సక్కగా అరదం అయిపోనాది. నాను అంత ఏటబ్బా.. అది.. ఆ.. 'రిసుకు' తీసుకు సంద్రాలు దాటెల్లి వత్తే.. నానేదో ఆ కార్ల కంపెనీ పేరు సెప్పి 11 కోట్లు నొక్కేసినానన్నట్లు జనాలు ఓ.. ఒక్కటే బుగ్గలు నొక్కేసుకొన్నారోలబ్బ! సొమ్ములు పోనాయి మరేటి సేతం? అని నానంటే జనాలు ఓ.. ఒకటే ఇకఇకలు పకపకలు. అంతకీ నానేదో పెద్ద జోకేసినట్లు."   "నా మాటినుకొని నవ్వినవ్వి సచ్చినారు జెనాలు. సస్తే సావనీ! ఆనక మళ్ళీ ఆల్లు  నాజోలికి రానేదు..నాను కూడా ఆ వోకుసు యాగన్ యవ్వారం సంగతి మరి కదపనేదు. గాని నా దుక్కం ఆల్లు అలా నవ్వినందుకు గాదు. పొట్ట సింపితే అచ్చరం ముక్కనేకపోయినా నాను కూడా ఇమానాలు ఎక్కి డిల్లీ ఎల్లిపోతున్నానా? అక్కడ మన బాస రానోల్లకి కూడా నాను సెప్పింది ఎంచక్కా అరదం అయిపోద్ది. గానీ ఇదేటి ఇడ్డూరం బాబు? నాను ఇంత సక్కగా ఇడమరిసి తెనుగులో సెపుతున్నామన జనాలకి నా మాటలేటీ సరిగ్గా ఎందుకు అరదం కాట్నేదో నాకరదం కాట్నేదు. మరి నాను సెపుతున్నగొప్ప గొప్ప ఇసయాలు అరదం సేసుకొనే గ్యానం జనాలకి నేదనుకోవాలా? నేకపోతే అసుమంటోల్లకి ఇసుమంటి యవ్వరాల గురించి సెప్ప కూడదనే గ్యనం నాకే నేదనుకోవాల్నా? ఏటో ఏటి అరదం కాట్నేదు నాకు."   "అన్నట్లు మరిసా... ఇంతకీ నానెవరో మీకు సెప్పనే నేదు గదా... నాను.....అయినా నా పేరు సెప్పుకోమంటే మా సెడ్డ నామోషీగా ఉంది మరి."   "ఈడ ఆ ముక్కెమంతిరి ఓ...ఏదో సమేకం...సమేకం.. అని ఏటేటో మాటాడి సెక్కరం తిప్పేతున్నానని ఓ...ఒకటే ఇదయిపోతున్నాడు. పాపం! ఆయనకి తెనీకుండా నాను డిల్లీలో కూకోని అంతకంటే పెద్ద సెక్కరమే గిరగిర తిప్పేతున్నా. గాని ఆ సంగతి పాపం ఆ ఎర్రిబాగులోడికి తెనీదు. ఆ.. ఇంతకీ నా పేరేటో సెప్పనే నేదు కదూ...రేపు ఈ రాష్ట్రం ఇడిపోతే ముక్కె మంతిరయిపొయ్యేటోడిని..ఇంకా నాపేరు నాను సెప్పుకోకపోతే మీకు అరదం గాకపోతే నాకు మా సెడ్డ సిరాకు."

ఇంతకీ నానేటి సెపుతున్నాఅంటే... ఏట్నేదు-2

  "ఆ.. ఇంతకీ నా పేరేటో సెప్పనే నేదు కదూ... నా మాటలు అరదం కాకున్నా నానేటి అనుకోను. గానీ ఎవులు నువ్వు? నీ పెరేటిది. ఏ వూరు మనది? అని సిల్లర పెస్నలు అడిగితే నాకు మా సెడ్డ సిరాకు."   "నాకయితే రాష్ట్రం ఇడిపోతేనే ముక్కెమంతిరి అయ్యే శాన్సు ఉంది. గనుక బేగి ఇడిపోవాలని ఆ భగమంతుడిని ఏడుకొంటా! గానీ, ఆ ఇసయం పైకి సెప్పనేను గదా! అందుకే ఇట్టం నేకపోయినా సమేకం...సమేకం... అని గుంపుతో బాటు నాను కేకలేతుంటా. అంత మాత్రాన్న సమేకం కావాలని నాను పట్టిడుపులు నేకుండా మాటాడే మూర్కుడ్ని గాను నేను."   "నాకే ముక్కే మంతిరి కుర్సీ ఖాయం సేసేత్తే ఈ రాష్ట్రం కలిసున్నా ఇడిపోయినా నాకు సమ్మతమే. కానీ, కలిసుంటే ఈ తెలంగానోల్లు నన్నుఆ సీయం కుర్సీలో సల్లగా కూకోనిత్తారా ఏటి? ఆ డవుటే నేదు! అందుకే ఎంత బేగి ఇడిపోతే అంత మేలు నాకు. కితం సారి వెంకన్న కొండకి ఎల్లినప్పుడు భగమంతుడా.. నానే ఆ కుర్సీలో కూసోనేలా సేయి దేముడా...ఎయ్యి కొబ్బరికాయలు గొడతా నీకు, మరాపని రాష్ట్రం ఇడదీసేసి సేసెత్తాతవో నేక ఏటిసేత్తవో నాకు మాతరం తెల్దు. నాను మాత్రం బేగి ముక్కేమంతిరి అయిపోవాల..సల్లగా సూడు సామీ.. అని గట్టిగా ఏడుకొని మరీ వచ్చినా."   ఆ పని మీదే నిన్న మా కాంగిరేసోల్లందరినీ ఓ కాడ కూకోపెట్టి మన రాష్ట్రం గురించి అమ్మకి ఏటి సెప్దారి? అని అడిగినానా.. ఆల్లు నానే అదేదో తీరమానం సేసేత్తాననుకొన్నారో ఏటో ఎర్రి నాయాల్లు... ఓ.. ఒక్కోల్లు రద్దీ కాగితాల కట్టల మాదిరి ఇంతేసి దొంతరలు కాగితాలు ఒట్టుకొచ్చేసి  నాసేతిలో ఎట్టేసి. ఇక ఎల్లు! మళ్ళీ మరో పాలి ఆ ఇమానం ఎక్కి డిల్లీ ఎల్లి అమ్మకి మా మాటగా సెప్పిరా... అని నన్ను ఈ ఇమానంలో కూకోబెట్టినారు."   "ఒకడేమో ఇడిపోవలంటాడు.మరోడేమో కలిసి సద్దారి అంటాడు...నాను తెనుగులో ఇడమరిసి సేపితేనే అరదం సేసుకోలేని ఈ ఎర్రి బాగుల జనాలకి తెనుగులో అచ్చరం ముక్క రాని ఆయమ్మ మాతరం ఈల్లకి ఎట్టా సర్ది సెప్పగలదు? నా ఎర్రి గాకపోతేను?"   "అయినా మనకీ గోలంతా ఎందుకు? కలిసి సత్తారో నేక ఇడగొట్టుగొట్టుకొని సత్తారో అదంతా మనకనవసరం. మంది ఆరడుగుల బులెట్ మాదిరి ఒకటే ముక్క. ఒకటే పెశ్న. ఆ సీయం కుర్సీ నాకిత్తావా నేదా? అంతే మరో ముక్కనవసరం. అవుసరమనుకొంటే రాష్ట్రాన్ని మరో నాలుగు ముక్కలు సేసేసుకొన్నా నాకేటి అభేంతరం నేదు. కుర్సీ మాత్రం శానా ఇంపాటెంట్ మనకి అంతే. ఈ ముక్క ఆయమ్మకి బాగానే నచ్చజేపినా. కానీ ఈ ఎర్రి బాగుల జనాలకే అరదం అయ్యేనా సెప్పనేక తల పెనం తొక్కి వస్తోంది...స్సీ.. సీ..”   "సార్! డిల్లీ వచ్చేసాము. లేవండి. సార్! నిద్ర లేవండి..."  

అంతరిక్ష ప్రయోగాలకి వ్యాపార కేంద్రంగా భారత్

  ఈ రోజు భారత్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగ్గ రోజు. మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై పరిశోధనలు చేసేందుకు ప్రయోగించిన పీ.యస్.యల్వీ-సి25 విజయవంతమవడంతో, మన శాత్రవేత్తల నైపుణ్యం, మేదస్సు, మన దేశ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. మంగళ్ యాన్ అనే పేరును సార్ధకం చేసుకొంటూ, ఇస్రో షార్ నుండి నేడు ప్రయోగించిన రాకెట్ ప్రయోగంలో కీలకమయిన మొదటి నాలుగు దశలు పూర్తిచేసుకొని, విజయవంతంగా అంగారక గ్రహం వైపు దూసుకుపోతోంది.   ఏకధాటిగా ౩౦౦రోజులు ప్రయాణించిన తరువాత, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 24న అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశించడంతో దాని యాత్ర పూర్తయ్యి, పరిశోధనలు మొదలవుతాయి. దీనివలన శాస్త్రవేత్తలకు అంగారక గ్రహం గురించి మరింత కీలక సమాచారం లభ్యమవుతుంది. అయితే దీనివలన ప్రజలకి, దేశానికి ఏమి ప్రయోజనం కలుగుతుందని కొందరు ప్రశ్నించవచ్చును.   ఈ విజయంతో భారత్ అంతరిక్ష ప్రయోగాలకి ప్రధాన వ్యాపార కేంద్రంగా మరింత ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక చిన్నా, పెద్ద దేశాలు తమ ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశ పెట్టేందుకు భారత్ ను ఆశ్రయిస్తున్నారు. తద్వారా భారత్ తన అంతరిక్ష పరీక్షలపై, టెలికాం, టీవీ ప్రసారాలకోసం ఇస్రో ప్రయోగిస్తున్న అనేక ఉపగ్రహాల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న వందల కోట్ల సొమ్ముని తిరిగి ఈవిధంగా రాబట్టుకొనే వీలుకలుగుతుంది. అందువలన భారత్ మున్ముందు మరింత అత్యాదునికమయిన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమయిన నిధులను స్వయంగా సమకూర్చుకొనగలుగుతుంది. దానివలన ప్రజలకు మరింత అత్యాదునికమయిన సాంకేతిక పరికరాలను ఉపయోగించే వీలు, సౌకర్యం కలుగుతుంది. నేటి ఈ విజయం ద్వారా ఇటువంటి కనబడని పరోక్ష ప్రయోజనలెన్నోప్రజలకి కలుగుతాయి.

బ్రదర్‌ అనీల్‌కు హైకోర్టు నోటీసులు

  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బావ బ్రదర్‌ అనీల్‌కుమార్‌కు రాష్ట్ర అత్యున్నత నాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో అనిల్ పేరును చార్జిషీట్ నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.   ఈ పిటీషన్‌ పై స్పందించిన న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని బ్రదర్‌ అనీల్‌ను కోర్టు ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలో బ్రదర్ అనిల్ క్రిస్టియన్ సభలు నిర్వహించారని ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయింది.