కేంద్రమంత్రుల బృందం వేస్తే అదో తుత్తి!

  రాష్ట్ర విభజనపై సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయినప్పుడు కాంగ్రెస్ హడావుడిగా అంటోనీ కమిటీ వేసింది. దాని నిర్వాకం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందం రాష్ట్రంతో కానీ, రాష్ట్ర ప్రజలతో గానీ ఎటువంటి సంబంధం లేకుండా డిల్లీలోనే కూర్చొని విభజన ప్రక్రియ చకచక చేసుకుపోతుంటే, సీమాంధ్ర రాజకీయ పార్టీలు మళ్ళీ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో అఖిలపక్ష సమావేశం పెట్టింది. అయినప్పటికీ విభజన రాజ్యంగా ప్రకారం జరుగలేదంటూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలవుతుండటంతో చివరిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా నిన్న పిలిచి వారి అభిప్రాయాలు తీసుకొని ‘మమ’ అనిపించేసింది.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకు విశ్వప్రయత్నాలు చేశామని, అందుకోసం తమ పదవులకు రాజీనామాలు కూడా చేసేసామని చెప్పుకొంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, మళ్ళీ తమ కేంద్రమంత్రుల హోదాలోనే రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్రమంత్రుల బృందానికి తగిన సూచనలు ఇచ్చివచ్చారు.   కానీ, ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనే చెప్పివచ్చామని మరో మారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసారు. బహుశః ఏపీఎన్జీజీవోల హెచ్చరికలు, ప్రజల ఆగ్రహానికి గురికాకూడదనే భయమే వారిని ఆవిధంగా పలికించి ఉంటుంది. లేకుంటే వారు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయం గురించి ఈ సందర్భంగా మీడియా ముందు ప్రస్తావించేవారే కాదు. ఆ తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా గట్టిగా చాలా వాదించానని, తను కూడా అవసరమయితే వారిలాగే పదవీ త్యాగానికి సిద్దమని చెప్పి వచ్చారు.   కేంద్రమంత్రుల బృందం తన నివేదికను సిద్దం చేసి ఈ నెల 21న క్యాబినెట్ కి సమర్పించనుంది. కానీ, ఈ అభిప్రాయ సేకరణ తంతు పూర్తయిన కొద్ది గంటలలోనే రాష్ట్ర విభజనకి ప్రధాన కారకుడు-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర విభజనను ముందే ఖరారు చేసేస్తూ తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు. దీనిని బట్టి ఈ కేంద్రమంత్రుల బృందం, అబిప్రాయాల సేకరణ తంతు మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని అర్ధం అవుతోంది.   కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యదర్శులు శాఖల వారిగా తెరవెనుక ఈ విభజన ప్రక్రియ అంతా పూర్తి చేస్తుంటే, ప్రజల తుత్తి కోసమే కేంద్రమంత్రుల బృందం పాపం! చాలా శ్రమ తీసుకొంది. కానీ నేటికీ కొందరు విభజనను వ్యతిరేఖిస్తూ చెప్పివచ్చమని, మరి కొందరు అడ్డుకొంటామని చెప్పడం కూడా సీమాంధ్ర ప్రజల తుత్తి కోసమే!

ఛత్తీస్‌గఢ్ లో రెండో విడత పోలింగ్ ప్రారంభం

      ఛత్తీస్‌గఢ్ లో రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. 73 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 843 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.40 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 18 స్థానాలకు ఈ నెల 11న తొలిదశ ముగిసిన నేపథ్యంలో చివరివిడతకు లక్షమందికిపైగా భద్రత సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలవారు 72 మంది చొప్పున పోటీలో ఉండగా, మొత్తంమీద 75 మంది మహిళలు కూడా రంగంలో ఉన్నారు. తొలిదశలో కొన్ని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, తుది విడత 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు సాగుతుంది. ఇక రాజధాని రాయ్‌పూర్ (దక్షిణ) నియోజకవర్గంలో అత్యధికంగా 38 మంది, సరాయ్‌పలి స్థానంలో అతి తక్కువగా ఐదుగురు బరిలో ఉన్నారు.

సీఎం పదవి..బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

      "తొమ్మిదేళ్లు ఎవరికీ దక్కని గౌరవం, అవకాశం నాకు దక్కాయి. ముఖ్యమంత్రిగా ఇంతపెద్ద ఆంధ్రప్రదేశ్‌ను ఏకధాటిగా పాలించా. మళ్లీ అలాంటి రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటాను తప్పితే.. ఏ జైళ్లనుంచీ బెయిళ్లు.. ఏ కేసుల నుంచీ మాఫీలూ నాకు అవసరం లేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.   చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న టీడీపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే విభజన కుట్రను తెరమీదకు తీసుకొచ్చారని ఆయన ఆరోపించాడు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిన తర్వాతనే రాష్ట్ర విభజన గురించి ఆలోచించాలని, కాదని ఏకపక్షంగా ముందుకు పోతే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని హెచ్చరించారు. ఈనెల 21న తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని, అదే రోజు తిరుపతిలో జరిగే సభలో కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కలిసి పన్నుతున్న కుతంత్రాలను బయటపెడతానని చంద్రబాబు అన్నాడు. వచ్చే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మ పోరాటం సాగిస్తున్న టీడీపీ ఘన విజయం సాధించి తీరుతుందని జోస్యం చెప్పాడు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యానాలు చేశాడు.

వైఎస్ షర్మిల కూడా పులుసులో కరివేపాకేనా?

  ఈరోజు హైదరాబాదులో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో ముఖ్యలయిన నాయకులందరూ పాల్గొన్నప్పటికీ వైవీ సుబ్బారెడ్డి, షర్మిల ఇద్దరు కూడా హాజరుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుండి, షర్మిల కడప నుండి లోక్ సభ టికెట్స్ ఆశించి భంగపడినందునే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని సమాచారం. అయితే ఇందులో నిజానిజాలెలా ఉన్నపటికీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయిన నాటి నుండి షర్మిల పార్టీలోకి కానీ, ప్రజల మధ్యగానీ కనబడలేదనిధి వాస్తవం.   అతను జైల్లో ఉన్నపుడు పార్టీని నిలబెట్టడానికి షర్మిల ఏకంగా 3000 కిమీ. పాదయాత్ర చేయడమే కాక, స్వయంగా తన రాజకీయ భవిష్యత్ నిర్మించుకోగల ఆ సదవకాశాన్ని కూడా కాదనుకొని, తాను తన సోదరుడు జగన్ తరపునే ప్రజల వద్దకు వచ్చానని చెప్పిన వ్యక్తి ఆమె. ఒకవేళ షర్మిల కనుక ఆనాడు పూనుకొనకపోయి ఉంటే, ఈరోజు వైకాపా ఉనికి కూడా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదెంత మాత్రం.   ఒకవేళ జగన్ జైలు నుండి విడుదల కాకపోయినట్లయితే, రానున్నఎన్నికలలో పార్టీకి ఆమె సారధ్యం వహించవచ్చని, అందువల్ల పాదయాత్ర అనంతరం ఆమెకు పార్టీలో కీలకమయిన పదవి కట్టబెడతారని ప్రజలు కూడా భావించారు. కానీ పార్టీలో ఇప్పుడు ఆమె ఉనికే లేకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం.   నిత్యం తన తండ్రి రాజశేకర్ రెడ్డి నామస్మరణ చేస్తూ, ప్రజలకు తన ఆ ‘ప్రత్యేక హోదా’ని గుర్తుచేసే జగన్మోహన్ రెడ్డి నోట పార్టీ కోసం, తన కోసం ఇంత కష్టపడిన తన సోదరి షర్మిల సేవలను ప్రశంసిస్తూ నేటివరకు ఒక్క ముక్క కూడా వినబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అంటూ నిత్యం సూక్తులు వల్లించే జగన్, తన సోదరికి కృతజ్ఞతలు తెల్పుకోవడం కాదు కదా, కనీసం ఆమె పేరు కూడా తలచుకోకపోవడం ఎటువంటి విలువలో అతనికే తెలియాలి. ఒకవేళ జగన్ తన స్వంత సోదరి షర్మిలనే పక్కనబెట్టగలిగినప్పుడు, మరిక ఇతరుల గురించి చెప్పేదేముంది? పార్టీ అవసరమయినప్పుడు మాత్రమే వాడుకొని తరువాత పక్కన బెట్టడం చూస్తే ఆమెను కూడా పులుసులో కరివేపాకు వలే ఉపయోగించుకొంటున్నట్లు అర్ధం అవుతోంది.

పట్టువదలని జగన్మార్కుడు

  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎవరికయినా మాట ఇస్తే దానికి తిరుగు ఉండేది కాదని చెపుతారు. ఆయనకి, ఆయన కుర్చీకి కూడా వారసుడినని దృడంగా నమ్మేఆయన కొడుకు జగన్ కి ఆ గొప్ప లక్షణం రాకపోయినా మంచి పట్టుదల, దానికి విరుగుడుగా తొందరపాటు ఉన్నాయి.   ఈ తొందరపాటు కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఇంకా రాష్ట్ర విభజన ప్రకటన కూడా చేయక ముందే రాత్రికి రాత్రి తెలంగాణా నుండి వయా సమన్యాయం టు సమైక్యాంధ్రలోకి వచ్చిపడ్డారు. అయితే ఆ తరువాత తన తొందరపాటుకి తీరికగా చింతిస్తూ మళ్ళీ తెలంగాణా లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక జైలు నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు అంత దూకుడే. తత్ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డేడ్’ అన్న రీతిలో చెప్పటిన ప్రతీ వ్యవహారం బెడిసి కొడుతూనే ఉంది, చివరికి నిన్నమొన్నటి డిల్లీ టూర్ తో సహా! అయినా ఆ దూకుడు తగ్గలేదు.     రాజశేఖర్ రెడ్డి తనను నమ్ముకొన్న వాళ్ళకోసం ఎంత దూరమయినా వెళ్ళగలరని ప్రతీతి అయితే అందుకు పూర్తి విరుద్దంగా తనకు ఎంత నమ్మకస్తులనయినా, కోపం వస్తే క్షణంలో వదిలించుకోవడం జగన్ లక్షణం. కొండ సురేఖ, సబ్బం హరి వంటి వారు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనబడుతుంటే, అటువంటి అనామకులు ఇంకెందరున్నారో ఆ పార్టీకే తెలియాలి.   వైకాపాకు మొదటి నుండి విదేయుడిగా ఉంటూ, పార్టీని అనకాపల్లి పరిసర ప్రాంతాలలో ఎంతో బలోపేతం చేసిన సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణని, తెదేపా నుండి పార్టీలోకి దూకిన దాడి వీరభద్ర రావు కోసం వదులుకోవడానికి కూడా జగన్ సిద్దపడటం ఇందుకు మరో చక్కటి ఉదాహరణ. అయితే మంచి రాజకీయ అనుభవమున్న కొణతాల సోదరులు, వివేకం ప్రదర్శించి వెనక్కి తగ్గడం వలననే వారు ఇప్పటికీ వైకాపాలో కనిపిస్తున్నారు.   జైలులో ఉన్నంత కాలం కోర్టులు ఎన్ని సార్లు బెయిలు తిరస్కరిస్తున్నా, చివరికి సుప్రీం కోర్టు ఇక బెయిల్ పిటిషను వేయడానికి వీలేదని చెప్పేవరకు కూడా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా బెయిలు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. బెయిలు పొంది బయటకి వచ్చిన రెండు రోజులకే ఇడుపులపాయ, గుంటూరు వెళ్లేందుకు మరో పిటిషను వేస్తే కోర్టు ఇడుపులపాయకు మాత్రం అనుమతిచ్చింది. ఆ తరువాత వెంటనే మరో పిటిషను వేసి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు స్టేట్ పర్మిట్ పొందగలిగాడు. ఆ తరువాత డిల్లీకి కూడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు యావత్ దేశం పర్యటించేందుకు అనుమతి కావాలని మరో పిటిషను వేస్తే దానిని సీబీఐ కోర్టు తిరస్కరించింది.   అయితే సీబీఐ, కోర్టులు, పిటిషన్లు, చార్జ్ షీట్లు, కేసులు, విచారణలు తన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన తరువాత ఇక కొత్తగా బాధపడేందుకు ఏముంటుంది గనుక? అందుకే వెంటనే మరో పిటిషను వేసాడు. ఈ సారి కోల్ కత వెళ్లేందుకు అనుమతి కోరుతున్నాడు. ఈ కేసుపై సీబీఐని కౌంటర్ ఫెయిల్ చేయమని ఆదేశిస్తూ, కోర్టు కేసుని మంగళవారానికి వాయిదా వేసింది.   ఇక సోమవారంనాడు లేపాక్షి చార్జ్ షీట్ కేసు చేపట్టిన సీబీఐ కోర్టు దానిని డిశంబర్ 3కి వాయిదా వేసింది. అది కాక అక్రమాస్తుల కేసుల్లో ఉన్న మరో తొమ్మిది చార్జ్ షీట్లపై కోర్టు విచారణ జరుగవలసి ఉంది. ఇదంతా చూస్తుంటే కేవలం జగన్ కేసులకి, పిటిషన్లకే ఒక ప్రత్యేక న్యాయ వ్యవస్థ ఏర్పరచవలసిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే కోర్టులు ఇక వేరే ఏ ఇతర కేసులు చూసేందుకు వీలుపడదేమో!

ఐదుగురు అమ్మల ముద్దుబిడ్డ!

      అమ్మ అనే మాటే ఒక అద్భుతం. అమ్మ మనిషికి దేవుడిచ్చిన వరం! అలాంటి వరం అందరికీ ఒక్కటే వుంటుంది! అలాంటి వరాలు ఒకే మనిషికి ఐదు వుంటే ఆ మనిషి నిజంగా ఎంత అదృష్టవంతుడో కదూ! అలాంటి అదృష్టం పట్టిన వ్యక్తి ఎక్కడో లేడు.. మన రాష్ట్రంలోనే వున్నాడు. ఎప్పుడో లేడు.. ఇప్పుడే వున్నాడు.. మనమధ్యనే తిరుగుతున్నాడు. ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి.   అదేంటీ.. విజయమ్మే కదా జగన్ బాబుకి అమ్మ అని అనుకుంటున్నారా? కరెక్టే.. విజయమ్మ జగన్ బాబుకి మానవ జన్మనిచ్చిన అమ్మ!  ఇక తనకు రాజకీయంగా ముఖ్యమంత్రి జన్మని ఇవ్వడానికి జగన్ మరో నలుగురు అమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ నలుగురు అమ్మల్లో మొదటి అమ్మ మరెవరో కాదు... సోనియాగాంధీ! సోనియమ్మతో చేసుకున్న ఒప్పందం కారణంగానే జగన్ బాబు పదహారు నెలల జైలువాసం నుంచి బయటపడ్డాడు. ఆ అమ్మ ఆదేశాల మేరకు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి సహకారం అందిస్తున్నాడు. ఒకవేళ భవిష్యత్తులో సోనియమ్మ తనమీద రివర్సయితే తనకు అండగా నిలవటానికి మరో ముగ్గురు అమ్మల అనుగ్రహం సంపాదించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ ముగ్గరమ్మలు మరెవరో కాదు.. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి! మీరు నాకు అండగా నిలిస్తే, వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మీరు ఎవరికి మద్దతు ఇవ్వమంటే వాళ్ళకే మద్దతిస్తా, మీరు చెప్పినట్టే వింటానంటూ జగన్ ఈ ముగ్గురమ్మలకీ విడివిడిగా వర్తమానం పంపినట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశిస్తున్న ఈ ముగ్గురమ్మలూ జగన్‌ని పుత్రవాత్సల్యంతో చూస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్యూచర్లో కేంద్రంలో ఈ ముగ్గరిలో ఎవరు బలమైన శక్తిగా ఎదిగితే, ఆ శక్తి కొంగుచాటు కృష్ణుడిలా మారడం కోసం జగన్ పథక రచన చేసినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నలుగురు పొలిటికల్ మదర్స్ నుంచి జగన్ రాజకీయ లబ్ధి పొందుతాడా.. లేక నలుగురు అమ్మలూ జగన్‌ చెవి మెలేసి, ఈ కొంగుచాటు కృష్ణుడిని తన జన్మస్థానానికి పంపిస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాలి.

విభజన వల్ల కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింటుంది: కిరణ్

      జీవోఎంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటి ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జీవోఎంకి లేఖతో పాటు రెండు పుస్తకాలు అందజేశారు. విభజన వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తింటుందని చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విభజన వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అన్ని వసతులు హైదరాబాద్ లొనే ఉన్నందు వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చె అవకాశం ఉందని చెప్పారు. వైద్య,విద్య అంశాలపై తీవ్ర ఇబ్బందులు వచ్చె ప్రమాదం ఉందని అన్నారు. దేశానికి నక్సలిజం ప్రధాన సమస్య అని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నక్సల్స్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది కాబట్టి విభజన వల్ల నక్సలిజం, మతతత్వశక్తులు రేచ్చిపోతాయని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల భద్రత సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయని.. విభజన వల్ల పోలీసు బలగాలను నలభై శాతం పెంచాల్సి ఉంటుందని జీవోఎం కు చెప్పానన్నారు.

రాష్ట్ర విభజన అంటే కష్టమే మరి

  కేంద్రమంత్రుల బృందంతో తెలంగాణా కేంద్రమంత్రుల సమావేశం ముగియగానే, సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. ఊహించినట్లుగానే వారు రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలను ఏకరువు పెట్టివచ్చామని మీడియాకు తెలిపారు. అయితే తాము సీమాంధ్ర కోసం ప్యాకేజి ఏమయినా కోరారా లేదా? అనే విషయం మాత్రం బయటపెట్టలేదు. కానీ ప్యాకేజి కోరితే తప్పేమిటని అడుగుతున్న వారు తమ డిమాండ్లను కేంద్రమంత్రుల బృందం చేతిలో పెట్టరాని అనుకోలేము.   వారి తరువాత ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రుల బృందం తో సమావేశమవుతున్నారు. ఆయన కూడా రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తానని ముందే ప్రకటించినందున కొత్త విశేషాలేవి ఉండకపోవచ్చును.   శంఖంలో పోస్తే కాని నీళ్ళు తీర్ధంగావన్నట్లు, ఇప్పుడు ఆయన అధికారిక హోదాలో, రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన అధికారిక కేంద్రమంత్రుల బృందం ముందు రాష్ట్ర విభజన ను వ్యతిరేకిస్తూ వాదనలు చేసిన తరువాత, ఇక కాంగ్రెస్ అధిష్టానం తన ప్రత్యామ్నాయ అస్త్రాలను అంటే ముఖ్యమంత్రి మార్పుకి సిద్దపడవచ్చును. ఇప్పటికే కోట్లని, కన్నాని ప్లాట్ ఫారం పైకి తెచ్చేందుకు అంతా సిద్దం చేసి ఉంచింది గనుక వారిలో ఎవరో ఒకరిని ఎప్పుడయినా రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా నియమించవచ్చును. అయితే ఆ ముహూర్తం శాసనసభకు తెలంగాణా బిల్లు పంపక మునుపా? లేక పంపిన తరువాత అనేది మాత్రమే తేలవలసి ఉంటుంది.

జైపాల్ రెడ్డిని కాంగ్రెస్ అందుకే ముందుకి తెచ్చిందా?

  తెలంగాణాపై గత పదేళ్లుగా ఉద్యమాలు చేసిన తెరాసను చివరికి రాష్ట్ర ఏర్పాటు సాకారం కానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పక్కన పడేసి మొత్తం వ్యవహారమంతా స్వంత పార్టీ వ్యవహారంగా నడిపిస్తుండటం చూస్తే అది ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్నట్లుంది. విభజనపై నిర్ణయం తీసుకొనే సమయంలోనే కేసీఆర్ ను పక్కనపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఆ తరువాత అతనిని దారికి తెచ్చుకొనేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అతను కాంగ్రెస్ తో చేతులు కలపడం కంటే ఒంటరిగా పోటీకి దిగేందుకే సిద్దపడుతున్నట్లు స్పష్టమయిన సంకేతాలు పంపడంతో, అతనిని నిలువరించేందుకే కేంద్ర మంత్రిని జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపి, అతనిని ముందు ఉంచుకొని ముందుకు సాగుతోంది. తెలంగాణా ప్రజలలో మంచి పేరు, మచ్చలేని చరిత్ర, అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన జైపాల్ రెడ్డిని విమర్శించడం వల్ల తెరాసకు లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించినందునే బహుశః ఆయనని ఆకస్మాతుగా ముందుకి తీసుకువచ్చి ఉండవచ్చును.   తన ప్రమేయం లేకుండా డిల్లీలో ఇంత హడావుడి జరుగుతున్నప్పటికీ, తెరాస నోరు విప్పలేకపోవడానికి బహుశః ఇది కూడా ఒక కారణమయి ఉండవచ్చును. బహుశః ఆయనను కాంగ్రెస్ అధిష్టానమే ముందుకు తెచ్చిన కారణంగానే ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న అనేకమంది టీ-కాంగ్రెస్ నేతలు సామాజికన్యాయం అంటూ ఎంతగా గొంతు చించుకొంటునపటికీ, ఆయన రాకను, అత్యుత్సాహాన్నిఅడ్డుకోలేక చివరికి వ్యవహారమంతా ఆయన చేతుల్లో పెట్టి, ఆయన దర్శకత్వంలో ముందుకు సాగుతున్నట్లుంది.   ప్రస్తుతం తెరాస వెనక్కి తగ్గినట్లు కనబడుతున్నపటికీ, అది కేవలం తగిన అవకాశం కోసం ఎదురుచూస్తోంది. రేపు కేంద్రమంత్రుల బృందం తెలంగాణా ప్రజల అభీష్టానికి వ్యతిరేఖంగా  ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అప్పుడు అదే సాకుతో తెరాస జైపాల్ రెడ్డిపై కూడా తన అస్త్ర శాస్త్రాలు ఎక్కుబెట్టవచ్చును.

జగన్ కు ఎదురుదెబ్బ

      ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరతానని ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు ధరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విభజనకు సహకరించవద్దని ఆయన ఢిల్లీలోని జాతీయ పార్టీల నేతలను కలిసి వచ్చారు. అయితే ఈ రోజు కోర్టు జగన్ దేశ పర్యటనకు అభ్యంతరాలు తెలిపి పిటీషన్ ను తోసిపుచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోను, అలాగే డిల్లీకి పర్యటించడానికి అనుమతి ఇచ్చినందున దేశ పర్యటన చేయాల్సిన అవసరం లేదని, దేశంలోని మెజారిటీ పార్టీల నేతలు ఢిల్లీలో కలుస్తారని ..ఇంతకుముందే ఢిల్లీ పర్యటన చేసినందుకు దేశ పర్యటన చేయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.

భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలి: జైపాల్

        జీవోఎంతో తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటిలో తెలంగాణ కేంద్ర మంత్రులు 12పేజీల నివేదికను జీవోఎంకు అందజేశారు. జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...భద్రాచలంతో కూడిన తెలంగాణకావాలన్నారు. హైదరాబాద్ తెలంగాణాలో భాగమని అన్నారు. హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పెట్టడమనేది చరిత్రలో అపూర్వమని అన్నారు. హైదరాబాద్ రెవెన్యూ పంపిణి విషయం చర్చకు రాలేదన్నారు. 371-డీ పై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు ఓకే అభిప్రాయంతో ఉన్నారని, 371-డీ ని కొనసాగించాలన్నారు. కృష్ణా జలాల పై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరి జలాలపై ట్రైబ్యునల్ అవసరం లేదని అన్నారు. జీవోఎంకు లిఖిత పూర్వఖ నోట్ ఇచ్చామని, విదాన నిర్ణయాలు తీసుకోనే౦తవరకు నోట్ ను విడుదల చేయమని చెప్పారు.

సోనియాకి చిప్పకూడు తప్పదా?

      ఈరోజుల్లో రాజకీయ నాయకులు జైళ్ళలో మగ్గడం అనేది మామూలు విషయంగా మారింది. కాలం కలిసొచ్చినంత వరకూ దర్జా వెలగబెట్టినా, బ్యాడ్ టైమ్ రాగానే జైలుకి మకాం మార్చిన రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో చాలామంది వున్నారు. ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో చక్రం తిప్పుతున్న ఇటలీ వనిత సోనియాగాంధీ భవిష్యత్తులో జైల్లో కాలక్షేపం చెయ్యక తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వాదన వినిపిస్తోంది ఎవరో కాదు. సంచలన వ్యాఖ్యలతో, కేసులతో తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించే అభినవ చాణక్యుడు సుబ్రహ్మణ్యస్వామి.     ఆయన తాజాగా సోనియాగాంధీతో పాటు తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుల మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సోనియాగాంధీని ఆయన టార్గెట్ చేశారు. ఒకప్పుడు సోనియా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో వుండేదట. ఇప్పుడా బ్యాలెన్స్ రెండు లక్షల కోట్లకు చేరుకుందట. ఆ సొమ్మంతా కుంభకోణాల ముడుపుల ద్వారా సమకూరినదేనట! టూజీ కుంభకోణంలో సోనియాకి 25 వేల కోట్లు, కరుణానిధికి 16 వేల కోట్లు, చిదంబరానికి 5 వేల కోట్లు ముడుపులుగా దక్కాయట! మొత్తమ్మీద ఈ కుంభకోణంలో 60 వేల కోట్లు చేతులు మారాయట! ఎన్డీయే అధికారంలోకి రాగానే ఈ ముగ్గుర్నీ జైలుకు పంపించడం ఖాయమట! సుబ్రహ్మణ్యస్వామి అన్న ఈ మాటలన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. గతంలో ఆయనకి ఎంతో మంది రాజకీయ నాయకుల రాజకీయ భవిష్యత్తును సమాధి చేయడంతోపాటు, ఉద్ధండపిండాల్లాంటి ఎంతోమంది రాజకీయ నాయకుల చేత చిప్పకూడు తినిపించిన చరిత్ర వుంది. తన ప్రత్యర్థులకు సంబంధించిన రహస్యాల గుట్టమట్లను బయటకి లాగి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి శిక్షలు వేయించడంలో ఆయనకు ఆయనే సాటి. అన్నంతపనీ చేసే పట్టువదలని విక్రమార్కుడు సుబ్రహ్మణ్యస్వామి నోటి వెంట తమ అధినేత్రి గురించి ఇలాంటి మాటలు రావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఆందోళనపడి ఉపయోగం ఏముంటుంది.. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవా అని ఊరకే అన్నారా?!

కాంగ్రెస్ బీజేపీపై జగన్మోహనాస్త్రం ప్రయోగించిందా?

  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు కోరుతూ డిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన జగన్మోహన్ రెడ్డికి తాము ఎటువంటి మద్దతు ఈయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఇది పైకి కనబడే ఏనుగు పెద్ద దంతాల వంటిదే. కానీ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య సమావేశమే కీలకమయినది. అందులో తీసుకొన్న నిర్ణయాలే అసలయినవని భావించవచ్చును.   ఎందుకంటే, 2014 ఎన్నికల తరువాత ఎలాగయినా కేంద్రంలో అధికారం వశం చేసుకోవాలని తపిస్తున్న బీజేపీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు కూడా చాలా కీలకమే. అటువంటప్పుడు అతను తన సహాయం అర్దించి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా తిరస్కరించలేదు. కానీ తిరస్కరించినట్లు నటించింది అనుకోవలసి ఉంటుంది. అందువల్ల ఆ రెండు పార్టీల నేతల మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఏమి నిర్ణయాలు తీసుకొన్నారనేదే కీలకం.   బీజేపీ తను వ్యతిరేఖిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చి, ఆ పార్టీ తెలంగాణాలో మరింత బలపడేలా సహాయపడి, అక్కడ తన పార్టీని తనే దెబ్బ తీసుకొంటుందని భావించలేము గనుక ‘కర్ర విరగ కుండా పాము చావకుండా’ అన్నట్లు బీజేపీ పార్లమెంటులో వ్యవహరించవచ్చును.   అయితే, ఇక్కడ మరో ముఖ్యమయిన విషయం తేలవలసి ఉంది. 2014 ఎన్నికల తరువాత జగన్ తనకు మద్దతు ఇస్తాడనే ఉద్దేశ్యంతోనే అతనిని జైలు నుండి బయటకి రప్పించి, రాష్ట్ర విభజనపై దూసుకుపోతున్నకాంగ్రెస్ పార్టీ, జగన్ ఈవిధంగా తన ప్రత్యర్ధులతో రహస్య సమావేశాలవడం, వారిని కూడగట్టి తను చేయబోతున్న రాష్ట్ర విభజనను అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం సహించగలదా? సహిస్తే దానర్ధం అది జగన్మోహన్ రెడ్డినే తన రాజకీయ అస్త్రంగా బీజేపీపై ప్రయోగిస్తోందా?   ఇక జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్నరహస్య ఒప్పందం గురించి స్వయంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా చాటింపు వేస్తునప్పుడు, బీజేపీ అగ్రనేతలు జగన్నిఎంతవరకు విశ్వసిస్తారు? తెలంగాణాలో తమ బీజేపీ శాఖ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుకొంటుంటే, అందుకు విరుద్దంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొంటున్న జగన్ తో బీజేపీ చేతులు కలుపుతుందా? ‘విశ్వసనీయత’ కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిని బీజేపీ విశ్వసిస్తుందా? అంటే లేదనే చెప్పవచ్చు.   కానీ, రాజకీయాలలో ఎవరూ శాశ్విత శత్రువులు కానీ, మిత్రులు గానీ ఉండరనే సిద్ధాంతం ప్రకారం బీజేపీ జగన్మోహన్ రెడ్డితో గౌరవంగా వ్యవహరించి ఉండవచ్చును.  

రాజకీయ నేతలు ఇడియట్స్: సీఎన్ఆర్ రావు

      భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు (చింతామణి నాగేశ రామచంద్రరావు ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలను 'ఇడియెట్స్' అని అంటున్నారు. భారతదేశంలో సైన్స్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యకూ శాస్త్రీయ పరిశోధనలకూ కేటాయించే నిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "విద్యారంగంలోనూ, సైన్స్ రంగంలోనూ మనం మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. సెన్సెక్స్, వ్యాపారం బాగున్నంతమాత్రన దేశం బాగున్న ట్టు కాదు. ఈ ప్రభావం ఐదు-పదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో పరిస్థితి ఏమిటి? సైన్స్‌లో ప్రగతితోనే భవిష్యత్ భద్రత సాధ్యం'' అని రావు స్పష్టం చేశారు.     రాజకీయనాయకులపైనే కాదు.. ఐటీ రంగంపైనా సీఎన్ఆర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐటీ అనేది అసలు సైన్సే కాదని.. అది కొందరు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతోందని అన్నారు. అంతేకాదు.. ఐటీ రంగంలో చాలా మంది అసంతృప్తితో పనిచేస్తున్నారంటూ ఇటీవలికాలంలో పేపర్లలో వస్తున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఐటీ ఉద్యోగులను అసంతృప్త గుంపుగా అభివర్ణించారు. VIdeo Courtesy: TV9

జీవోఎం చివరి భేటీ నేడే!

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్రనాయకులు అభిప్రాయలను సేకరిస్తున్న కేంద్ర మంత్రులు సోమవారం రాష్ట్రనికి చెందిన నాయకులతో చివరి సారిగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనటానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కిరణ్‌తొ పాటు మంత్రి పితాని సత్యనారాయన, గంట శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజ్‌నాధ్ టీజీ వెంకటేష్‌లు జీవోయంతో సమావేశం కానున్నారు.   అయితే సీమాంద్ర నాయకుల కన్నా గంట ముందుగానే తెలంగాణ నాయకులు తమ వాదనను జీవోయంకు వినిపించనున్నారు. తెలంగాణ ప్రాంతం తరుపున జైపాల్‌ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌ జీవోయంతో సమావేశం అవుతారు. ఈ భేటిల తరువాత సీమాంద్ర పాంత్రానికి చెందిన కేంద్ర మంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లంరాజు, పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి జీవోఎంను కలిసి తమ తమ ప్రాంతాల డిమాండ్లను వినిపించనున్నారు.

కిరణ్‌ పై కంప్లయింట్‌

  పదవిలో కొనసాగుతూనే సమైఖ్యగానం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై తెలంగాణ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నాయకులు సియం వైఖరిపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండగా మరి కొందరు నాయకులు ఇప్పుడ అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.   జీవోయంకు తెలంగాణ నేతలు తుది నివేదిక ఇవ్వనున్న నేపధ్యంలో టి కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలో మకాం వేసి చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి సారధ్యంలో ఇప్పటికే రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో కిరణ్‌ వైఖరిపై చర్చించినట్టుగా సమాచారం. కిరణ్‌ పట్ల పార్టీ హైకమాండ్‌ ఇంకా ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తే అది చివరకు పార్టీకే నష్టంచేకూర్చుతుందని, ఇదే విషయాన్నిపార్టీ అధినేత్రి సోనియాగాంధీకి చెప్పాలని ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

విభజనకు ఓకె, యూటి చేయండి

  రాష్ట్ర విభజన నేపధ్యంలో ఇన్నాళ్లు సమైక్యవాదం బలంగా వినిపించినట్టు కనిపించిన సీమాంద్ర కేంద్ర మంత్రులు ఇప్పుడు పూర్తిగా తమ మాట మార్చారు. ఇక సమైక్య రాష్ట్రం కష్టం అని భావించిన మంత్రులు ఇక ప్యాకేజీల మీద దృష్టి సారించారు.  ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు.   ముఖ్యంగా హైదరాబాద్‌ విషయంలో సీమాంద్రుల్లో నెలకొన్న భయాందోళనలను కేంద్ర నివృత్తి చేయాలని మంత్రులు నివేదించనున్నారు. హెచ్‌ఎండీఎ పరిధి మేరకు హైదరాబాద్‌ను ఢిల్లీ పుదుచ్చేరి లా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని, అలా అయితే విభజనకు సీమాంద్రునలు ఒప్పిస్తామని జీవోయంకు నివేదించే ఆలొచనలో ఉన్నారు.   సోమావారం జీవోయం ఎదుట కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే జీవోయం ముందుంచవలసి అంశాలపై చర్చించిన కేంద్ర మంత్రులు సోమావారం ఉదయం మరోసారి పళ్లం రాజు నివాసోం సమావేశం అయి చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర నాయకులు కూడా హాజరు కానున్నారు.

రామాంజనేయ యుద్ధం!

    ఎప్పుడో రామాయణంలో రామాంజనేయ యుద్ధం జరిగిందని చదువుకున్నాం. ఇప్పుడు తెలంగాణాయణంలో కూడా మరో రామాంజనేయ యుద్ధం జరుగుతోంది. ఆ రామాంజనేయులు ఎవరో కాదు.. మాజీ పోలీసు ఉన్నతాధికారులు. రాముడేమో పేర్వారం రాములు.. ఆంజనేయుడేమో ఆంజనేయరెడ్డి!   పేర్వారం రాములేమో అర్జెంటుగా తెలంగాణ వచ్చేయాలని అంటూ వుంటే, ఆంజనేయరెడ్డేమో తెలంగాణ వస్తే తెలుగుజాతి నష్టపోతుందని అంటున్నారు. తెలంగాణ ఏర్పడితే రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితి మీద ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశం సందర్భంగా వీరిద్దరి పేర్లు ఒకేసారి వార్తల్లోకి వచ్చాయి. సదరు సమావేశానికి ఆంజనేయరెడ్డిని ఆహ్వానించిన కేంద్రం పేర్వారం రాములుని ఆహ్వానించలేదని టీఆర్ఎస్ హడావిడి చేసింది. అప్పుడు వీరిద్దరి మధ్య పరోక్షంగా యుద్ధం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరిగే అవకాశం వుందని, అది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీసే అవకాశం వుందని ఆంజనేయరెడ్డి ఇటీవల ఒక  సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించారు.  ఆంజనేయరెడ్డి ఇలా మాట్లాడారో లేదో టీఆర్ఎస్ నాయకత్వం పేర్వారం రాముల్ని అర్జెంటుగా యుద్ధంలోకి దించింది. యుద్ధంలోకి దిగిన పేర్వారం రాములు ఆంజనేయరెడ్డి మీద విమర్శనాస్త్రాలు సంధించారు.   అసలు నక్సల్ సమస్య పుట్టింది తెలంగాణ కాదని, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలపడటానికి కారణమయ్యారని ఎదురుదాడి చేశారు.  మొత్తమ్మీద ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల మధ్య మాటల యుద్ధం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ యుద్ధం భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుందో చూడాలి.   Video Courtesy Tv9

భజన సంఘంలో విజయశాంతి!

      తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్నవాళ్ళంతా ఎవరికి వాళ్ళు ముమ్మరంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. సీమాంధ్రులను తిట్టిపోయడం, సోనియాగాంధీని ఆకాశానికెత్తేయడం ద్వారా ఇటు తెలంగాణ ప్రజల అభిమానం, అటు సోనియాగాంధీ అనుగ్రహం పొందాలని ప్రయత్నిస్తున్నారు. జైపాల్‌రెడ్డి దగ్గర్నుంచి షబ్బీర్ అలీ వరకూ ఎవరి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గానీ వీళ్ళ హడావిడి మాత్రం బాగా ఎక్కువైపోయింది.   రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న సోనియాగాంధీని సీమాంధ్రులెవరైనా కడుపుమండి విమర్శిస్తే టీ కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడిపోతున్నారు. సోనియాగాంధీని ఎవరేమన్నా సహించేది లేదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్‌మెంట్లు ప్రింటయిన పేపర్ కటింగ్స్, టీవీలో టెలీకాస్ట్ అయిన వీడియో క్లిప్పింగ్స్ ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. సోనియాగాంధీ అంటే తమకెంత అభిమానం వుందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్లే.. పదవికోసం ఎవరి తంటాలు వారివి! ఇప్పుడు ఈ తంటాలు పడేవాళ్ళ లిస్టులో అభినయ రాములమ్మ విజయశాంతి కూడా చేరింది. మొన్నటి వరకూ మెదక్ పార్లమెంట్ సీటు మీదే మమకారాన్ని పెంచుకున్న విజయశాంతి, ఆ సీటు కోసం టీఆర్ఎస్‌కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరింది. ఇప్పుడు ఆమె మనసు మెదక్ సీటు మీద నుంచి సీఎం సీటు మీదకి మళ్ళినట్టుంది. అందుకే, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎంతమాత్రం తీసిపోని విధంగా సోనియాగాంధీ భజన మొదలుపెట్టింది. మెదక్ నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి సోనియా వ్యతిరేకుల మీద విరుచుకుపడింది. తెలంగాణ ఇచ్చిన దేవతని కొంతమంది రాష్ట్ర మంత్రులు విమర్శిస్తున్నారని, అలాంటి వారిని క్షమించకూడదని ఉపన్యాసం ఇచ్చింది. సదరు ఉపన్యాసం ఇచ్చే సమయంలో  విజయశాంతి గారి హావభావాలు, ఆవేశం చూసిన వారికి విజయశాంతి ఎంత గొప్ప నటి అన్న విషయంలో ప్రత్యక్ష్యానుభవం కలిగి తరించిపోయారు. విజయశాంతి కూడా తెలంగాణ సీఎం పదవికి గాలం వేస్తోందన్న విషయం అర్థమైపోయి పులకరించిపోయారు.