రామయ్యా.. రావొద్దయ్యా!

 

 

 

తండ్రి హరికృష్ణ, ఇతర సన్నిహితుల సూచనల మేరకు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వుంటున్నాడు. తాను దూరమైపోతే తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం జరిగి, చంద్రబాబు తనను బతిమాలుకుంటాడని జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. అయితే బుడ్డోణ్ణి తెలుగుదేశం పార్టీలో ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు పార్టీలో వుంటే ఎంత.. బయటకి పోతే ఎంత అన్నట్టుగా ఎలాంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోయారు. తనకు లభించిన రాంగ్ డైరెక్షన్ కారణంగా తెలుగుదేశం పార్టీకి అనవసరంగా దూరమయ్యానే అన్న ఆవేదన జూనియర్‌లో వుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సన్నిహితం కావాలన్న ఆలోచన కూడా ఆయనలో వుంది. అయితే తెలుగుదేశం పార్టీ పిలిస్తేనే వెళ్ళాలన్న బెట్టు మెయింటెయిన్ చేస్తున్నాడు.


 

ఈమధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లను ఎవరు క్రియేట్ చేశారో తెలియదుగానీ, వీటి ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద పడుతుందని జూనియర్ సన్నిహితులు భావించారు. వైఎస్సార్‌సీపీలో చేరితే జూనియర్ తమ నుంచి పూర్తిగా దూరమైపోతాడన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో పెరుగుతుందని, దాంతో  పార్టీ బుడ్డోడి దగ్గరకి దిగి వస్తుందని ఎదురుచూశారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి సిగ్నలూ లభించలేదు.  జూనియర్ ఎన్టీఆర్ వైఎస్సార్‌సీపీకి వెళ్తాడేమోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో మచ్చుకు కూడా కనిపించలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి వచ్చేస్తాడేమోనన్న ఆందోళన మాత్రం వైఎస్సార్‌సీపీ నాయకులలో కనిపిస్తోంది.


ఇప్పటికే గందరగోళంగా వున్న వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ రాకతో మరింత గందరగోళంలో పడే అవకాశం వుందని భయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన సహచరులు, సన్నిహితులు తమ పార్టీలోకి రావడం, ఆధిపత్యం కోసం పోరాడటం, కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సీట్లకు టెండర్ పెట్టడం, వాటిని ఇవ్వకపోతే అలగడం.. ఈగోలంతా తమకు ఎందుకని అనుకుంటున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తమ పార్టీలోకి రాకుండా వుండటమే తమ పార్టీకి మంచిదని భావిస్తున్నారు. మనస్పూర్తిగా ‘రామయ్యా.. రావొద్దయ్యా’ అంటున్నారు.