దేవుళ్ళకీ ప్రాంతీయ మసి!
posted on Nov 14, 2013 @ 2:15PM
దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూయడానికి విభజనవాదులు ప్రయత్నిస్తున్నారు. విభజనవాదులకు హైదరాబాద్‌ని తేరగా ఇచ్చేయాలి.. గతంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలిపిన భద్రాచలాన్ని కూడా ఇచ్చేయాలి. ఇదెక్కడి న్యాయం? 1956కి ముందు తెలంగాణ ఎలా వుండేదో ఆ తెలంగాణ కావాలని అంటున్నారు కదా, మరి 1956లో భద్రాచలం సీమాంధ్రలోనే వుంది కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే విభజనవాదులు గయ్యిమని అంతెత్తున లేస్తున్నారు.
భద్రాచలంతో తెలంగాణ ప్రజలకు బోలెడంత అనుబంధం పెరిగిపోయిందట. అందుకే భద్రాచలం తెలంగాణలో వుండాలట. మరి సీమాంధ్రులకు కూడా హైదరాబాద్‌తో అనుబంధం పెరిగిపోయింది కాబట్టి హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా హక్కు కావాలంటే దానికిమాత్రం ఒప్పుకోం అంటున్నారు. అంటే ‘అనుబంధం’ అనే పదం మీద కేవలం తెలంగాణ వారికే కాపీరైట్ హక్కులున్నాయా? సీమాంధ్రులకు అనుబంధాలు వుండకూడదా? అసలు భద్రాచలం ఆలయాన్ని హైదరాబాద్ పాలకుల ఆదాయంతోనే కట్టించారు కాబట్టి భద్రాచలం మాదే అని విభజనవాదులు అంటున్నారు. అలాంటప్పుడు భద్రాచలం ఆలయం కట్టించిన సమయంలో సీమాంధ్ర ప్రాంతం కూడా హైదరాబాద్ నవాబుల పాలనలోనే వుండేది కదా.. మరి సీమాంధ్ర మీకు వద్దా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళెవరూ లేరు!
ఈమధ్య మరో కొత్త వాదన విభజన వాదుల నోళ్ళలోంచి ఊడిపడింది. సీమాంధ్ర ప్రాంతంలో అనేక ప్రధాన దేవాలయాలు వున్నాయి. మా తెలంగాణలో లేవు. అంచేత భద్రాచల రాముడినైనా మాకు వదిలిపెట్టండి అంటున్నారు. దేవుళ్ళు ఏ ప్రాంతంలో వున్నా అందరికీ దేవుళ్ళే. ఒకవేళ భద్రాచలం సీమాంధ్రకి వెళ్ళిపోతే తెలంగాణ వాళ్ళు రాముడిని చూడటానికి వెళ్ళరా? రాముడు అందరి వాడు.. ‘అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా’ అని అందుకే అన్నారు. అందరి బంధువుని కొందరికే బంధువుని చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అయినా తెలంగాణలో పెద్ద దేవాలయాలు లేవని అనడం చాలా తప్పు. చాలా గొప్పగొప్ప క్షేత్రాలు తెలంగాణ ప్రాంతంలో వున్నాయి. ప్రాంతీయ భేదం లేకుండా అందరూ వాటిని సందర్శిస్తూనే వున్నారు. విభజనవాదులు మాత్రం ప్రతి అంశాన్నీ విభజనకు ముడిపెడుతూ రాజకీయాలు చేస్తున్నారు. చివరికి దేవుళ్ళకి కూడా ప్రాంతీయ మసిని పూస్తున్నారు.