కేంద్ర విన్నపాలు వినవలె ముఖ్యమంత్రిగారు
posted on Nov 14, 2013 @ 10:37AM
రాష్ట్ర విభజనను పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రుల బృందం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ రోజు రాత్రి 8గంటలకు డిల్లీలో జరిగే సమావేశానికి రమ్మని పిలిచింది. కానీ రచ్చబండ కార్యక్రమం పెట్టుకొనందున డిల్లీ రాలేనని జవాబు చెప్పి తప్పించుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కంగు తింది. ఇంతవరకు తన విభజన ఆలోచనని ధిక్కరిస్తున్నప్పటికీ, అది సజావుగా సాగేందుకు పరోక్షంగా సహకరిస్తున్నందున నేటికీ ఆయనను ‘గుడ్ బాయ్’ గానే పరిగణిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, ఆయన ఇప్పుడు తన ఆజ్ఞను కూడా ధిక్కరించడంతో అవాక్కయింది.
అయితే ఊహించినట్లే కాంగ్రెస్ అధిష్టానం తన పరువు కాపాడుకొనే ప్రయత్నంలో, ఈనెల 18న సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులతో జీ.ఓ.యం. సమావేశమయిన తరువాతనే, ఆఖరిగా ముఖ్యమంత్రితో మాట్లాడాలని నిశ్చయించుకొన్నామని, అందుకే ఈరోజు ఆయనతో జరుగవలసిన సమావేశం వాయిదా వేశామని ప్రకటించింది. అందువల్ల మళ్ళీ ఈనెల 18న జరిగే సమావేశానికి ఆయనని డిల్లీ రమ్మని తాజాగా మరో ఆహ్వానం పంపింది. కనీసం ఆ విజ్ఞప్తినయినా ముఖ్యమంత్రి మన్నించి డిల్లీ వెళతారో లేక తేదీ ముందే తెలిసింది గనుక, ఆరోజు ఏ విశాఖ పర్యటనో పెట్టుకొని తప్పించుకొంటారో? చూడాలి.