కేసీఆర్ కోసమే ‘రాయల తెలంగాణ’

      కెసిఆర్ ను దారిలోకి తెచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీ తనమార్కు రాజకీయం ప్లే చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తాయిలం ఆశ చూపిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్లేటు ఫిరాయించేశాడు.   అందుకనే రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందే ముందు రోజున ‘ఇచ్చేది రాయల తెలంగాణ’ అనే మాటను లీక్ చేయడం ద్వారా కేసీఆర్‌ని దారిలోకి తెచ్చిందని, కేంద్రం ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతోందన్న వార్త బయటకు రాగానే కేసీఆర్‌లో టెన్షన్ పెరిగి కాంగ్రెస్‌కి దాసోహం అన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పకడ్బందీగా కుదిరి వుండవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ విలీనం విషయంలో తల ఎగరేసిన కేసీఆర్‌కి కీలక సందర్భంలో విలీనానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించిందని, కేసీఆర్‌ని దారిలోకి తేవడానికి ‘రాయల తెలంగాణ’ అస్త్రాన్ని విజయవంతంగా వాడుకుందని అంటున్నారు.

"ఆత్మగౌరవాన్ని'' సోనియాకు తాకట్టుపెట్టిన నాయకులు!

    - డా. ఎబికె ప్రసాద్ [సీనియర్ సంపాదకులు]   "వీడు అమ్మపెంచిన బిడ్డా, అయ్యపెంచిన బిడ్డా'' అంటే చెడిపోయినవాడెల్లా "వాడు అమ్మపెంచిన బిడ్డడే'' అన్నాడట వెనకటికొకడు! అంటే కొందరు అమ్మలా లక్షణాలు అలా ఉంటాయి కాబోలు! అలా అని "అయ్యా''లందరూ మంచివాళ్ళనీ తీర్పు చెప్పలేము, అయ్యల్లోనూ 'కొయ్య'మొగాలుంటాయి! ప్రేమకు, అబిమానానికి కూడా కొన్ని హద్డులుంటాయి. ఆ హద్దులు దాటినవాళ్ళు తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టేసి ఎంతకైనా దిగజారుతారనడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన సమస్య విషయంలో రాష్ట్రంలోని సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాల అధికారపక్షం, కొన్ని ప్రతిపక్షాల నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ పట్ల హద్దులు మీరి ప్రకటిస్తున్న 'విధేయత' శ్రుతిమించిన పొగడ్తలే నిదర్శనం! చివరికి వీళ్ళు అఆత్మగౌరవాన్ని కూడా చూసుకోనంతగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపున అనూహ్యమైన రీతిలో సోనియాగాంధీ పుట్టుపూర్వోత్తరాల తబిశీళ్ళ గురించి, ఆమె కుటుంబం తాలూకూ వివరాల గురించీ, వివాహమైన తీరు గురించీ, చివరికి ఆమె పేరుకున్న పూర్వరంగాన్ని గురించీ ఇంటర్నెట్ లోనూ, వెబ్ సైట్స్ లోనూ వస్తున్న అసాధారణ సమాచారం గురించీ ఆంధ్రప్రదేశ్ లోని ఇరుప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో చేరడానికి ఉవ్విళ్ళూరుతున్న వేర్పాటువాదియైన 'బొబ్బిలిదొర' ఏమాత్రం పట్టించుకున్నట్టులేరు! ఒకవేళ పట్టించుకునే పక్షంలో ఇంటర్నెట్, వెబ్ సైట్స్ లో భారీస్థాయిలో సోనియా గురించి ప్రవాహవేగంతో కుమ్మరిస్తున్న సమాచారంవల్ల తామిప్పటికే కోల్పోయిన ఆత్మగౌరవం మరింతగా ఎక్కడ బుగ్గిపాలై పోతుందోనని వీరికి భయమైనా ఉండి ఉండాలి, లేదా తుమ్మితే ఊడిపోయే తమ పదవులను కాపాడుకునే యత్నంలో పరువుప్రతిష్టలను ఆత్మగౌరవాన్ని సహితం పణంగా పెట్టినందువల్ల అదనంగా వచ్చే నష్టంలేదన్న భరోసా అయినా ఉండి ఉండాలి!   ఆత్మగౌరవంతో హుందాగా ప్రజలకు నాయకత్వం వహించి దేశ స్వాతంత్ర్యరథాన్ని సజావుగా నడిపించిన ఒకనాటి కాంగ్రెస్ నాయకత్వం వేరు, కేవలం 65ఏళ్ళ పాలనలో రాజ్యపాలనకు వచ్చిన కాంగ్రెస్, బిజెపి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ఈ రెండు పార్టీల నాయకులు వేరు. స్వాతంత్ర్యానంతర భారతంలో కనీసం కడచిపోయిన గత నలభయ్యేళ్లలోనూ "ప్రోగ్రెసివ్ టాక్సేషన్'' స్థాయిలో పాలకపక్షాలయిన ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులూ, వారి పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ, వారి ప్రధానమంత్రులు, మంత్రులు సహా ఎలా ఏదో ఒక అవినీతికి పడగలెత్తుతూ వచ్చిన వారే! కనుకనే కేంద్రస్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు అంతులేకుండా పోయింది.  ఈ పరిణామం కేంద్రస్థాయిలో సోనియాను కూడా ఇరకాటంలో పెట్టగల స్థాయికి చేరుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై సోనియా వహించిన నాయకపాత్ర ఎంతో చరిత్రగలిగిన తెలుగుజాతికి వినాశకరంగా పరిణమించింది; ఆమె దృఢమైన అవగాహనకు తెలుగుప్రజల్ని నెట్టివేసింది! ఇందుకు దోహదం చేయడంలో తమ పదవీ స్వార్థప్రయోజనాల కోసం ఇరుప్రాంతాల కాంగ్రెస్ నాయకులు సిగ్గువిడిచి సోనియాకు చేయూతనిచ్చారు. ఇరుప్రాంతాలలోని తెలుగుప్రజలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంద్వారా ప్రజలలో చైతన్యాన్ని రేకెత్తించి, తెలంగాణలో "చెట్లపాదులను కూడా రాజకీయలు మాట్లాడ''గల స్థాయికి చేర్చిన వాతావరణంలో అంతవరకూ "నీ బాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న స్థితినుంచి ప్రజలైనా విముక్తి పొందారుగాని నాయకులు మాత్రం ఆ దుస్థితినుంచి విముక్తి పొందలేదని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. నేడు ఇరుప్రాంతాలలో పెక్కుమంది కాంగ్రెస్ నాయకులు ప్రజలు 60 ఏళ్ళనాడే సాయుధపోరాట దీక్షలో తన్నితగలేసిన బానిసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగుజాతిని చీల్చడానికి కంకణం కట్టుకున్న సోనియా ముందు "నీ బాన్చలం తల్లీ! నీ కాల్మొక్తాం'' అంటూ సాగిలపడడాన్ని తెలుగుజాతి సహించలేకపోతోంది! "ఆత్మగౌరవ పోరాటా''న్ని కాస్తా వీరు ఆత్మవంచనా ప్రక్రియగా మార్చేశారు. సోనియా కాళ్ళముందు సాగిలపడడంలో ఏ స్థాయికి వీరు దిగజారిపోయారో కొన్ని ఉదాహరణలు : కేవలం రానున్న జనరల్ ఎన్నికల్లో మన రాష్ట్రంలో కోల్పోనున్న కాంగ్రెస్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను కాపాడుకునేయత్నంలో, తద్వారా తన వారసుడైన రాహుల్ రాజకీయ భవిష్యత్తును పదిలపరచుకునేందుకు సోనియా తెలుగుజాతిని ముక్కలు చేయడానికి సంకల్పించి రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆశీస్సులు పలకడంతో రాష్ట్రప్రజలు పెద్దఎత్తున నిరసనకు దిగవలసివచ్చింది. ఆ నిరసన రకరకాల రూపాల్లో వ్యక్తం కావటం, జీవన్మరణ సమస్యలను ప్రజలు ఎదుర్లోవలసి వచ్చినప్పుడు అతి సహజం.ఆ ధర్మాగ్రహంలో భాగమే ప్రజాబాహుళ్యం సోనియా, రాహుల్ గాంధీల బొమ్మలతోపాటు, విగ్రహాలతో పాటు రాష్ట్ర విభజనకు పదవీ స్వార్థప్రయోజనాల కోసం 'గొర్రెల్లా' తలలు వూపిన స్థానిక ఎం.పి.ల, ఎం.ఎల్.ఏ.ల దిష్టిబొమ్మల్ని కూడా తగలపెట్టారు. ఆ క్రమంలో కొందరు స్థానిక కాంగ్రెస్ వందిమాగధులు తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నదికాగ, ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా న్యూనపరుస్తూ ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్ర విభజన ద్వారా తెలుగుజాతిని కించపరచడానికి నడుంకట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానాన్ని, దాని నాయకురాలయిన సోనియానూ ఎదుర్కునేదిపోయి, ఇరుప్రాంతాలలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు, వారికి తన స్వార్థం కొద్దీ కాపుకాస్తున్న "బొబ్బిలిదొర'' వర్గమూ "సోనియాను కించపరిచినవారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రకటనలు జారీచేశారు; అంతేగాదు, ఆమెను తమ పాలిట"స్థానిక దేవత''గా ప్రకటించి, ఆ "దేవత''కు ఒక "దేవాలయాన్ని'' కూడా నిర్మించాలని పోటాపోటీలమీద ఒక జిల్లా కాంగ్రెస్ నాయకులే బాహాటంగా తీర్మానించారు! తెలుగుజాతిని చీలుస్తున్నందుకు "జైజై సోనియా'' అంటూ ప్రత్యేక యాత్రలు తలపెట్టారు! ఈ 'మేళా'లో ఒక గమ్మత్తు పరిణామం కూడా ఘటిల్లింది. ఇది, తెలంగాణా ప్రజలు మిలిటెంట్ పోరాటాల ద్వారా విదిలించుకున్న, వదిలించుకున్న బానిసత్వంలోకి తిరిగి ప్రజల్ని నెట్టేందుకు, తమ పెత్తనాన్ని తిరిగి ప్రతిష్ఠించి, బడుగు ప్రజలనెత్తిపైన పెత్తనం కొనసాగించుకోడానికి 'దొరల'పార్టీ (తెలంగాణా పేరిట ఏర్పడిన 'సమితి') నాయకులకూ, పాట జాగిర్దారీ, భూస్వామ్య కుటుంబాలకు చెందిన ఇతర మోతుబరులకూ తీవ్రమైన రాజకీయపోరు సాగుతోందని ప్రజలు మరచిపోరాదు. ఆ 'మాధ్యమాన్ని'' సోనియాలో చూసుకున్నారు! రోగి కోరుకున్నదీ, వైద్యుడు సూచించిన మందూ ఒకటే అయింది! ఆ మాధ్యమమే సోనియా! కాని సోనియా పుట్టుపూర్వాలు ఈ తెలుగునాయక 'బానిసల'కు తెలిసినప్పటికీ వీరు 'కిమ్మన్నాస్తిగా' నటించడంద్వారా తమ పదవుల్ని రక్షించుకోవటమే ప్రధాన వ్యాపకంగా మారింది! సరిగ్గా ఈలోగా, భారతీయులుగానీ, వారిలో భాగమైన తెలుగుజాతిగానీ గర్వించడానికి సంకోచించే విషయాలు సోనియా గురించి వెబ్ సైట్స్ లో తామర తంపరగా దూసుకువచ్చాయి! పండిట్ నెహ్రూ కుటుంబం, మోతిలాల్ నెహ్రూ సహా తమ ఆస్తిపాస్తులను, స్థిరచరాస్తులనూ అత్యధికభాగం భారత స్వాతంత్ర్యోద్యమం కోసం ధారపోశారు. ఈ పెత్తందారీ పోరును కడకంటూ కొనసాగించుకోడానికి ఒక నాయకత్వ మాధ్యమం కరిగించుకున్నారు. కాని సోనియాగాంధీ, ఆ ఇంటికోడలుగా అడుగుపెట్టిన తరువాత సోనియా ఇంగ్లాండ్ రాణి ఆస్తుల విలువను కూడా వెనక్కినెట్టేసి, రూ.12 వేల కోట్ల విలువగల ఆస్తుల్ని కూడబెట్టిందనీ, 16వ స్థానంలో ఉన్న ఇంగ్లాడ్ రాణిని 12వ స్థానాన్ని ఆక్రమించుకున్న సోనియా ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలయిందనీ ప్రసిద్ధ అమెరికన్ మీడియా "హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్'' ఈ నెల 3వ తేదీన (3-12-2013) ఆరోపణ చేసింది! ఇలా మరెన్నో వివరాలను ఈ సంస్థ బట్టబయలు చేసింది. ఈ "పురోగతి''చూస్తూ తెలుగువాళ్ళలో ఉన్న ఒక ముతక సామెత గుర్తుకొస్తోంది - "తన ముడ్డి గాకపోతే కాశీవరకూ దేకవచ్చు''నని! ఎందుకంటే అధికారికంగా సోనియా పేరు "సోనియాగాంధీ'' కాదనీ, ఆమె పాస్ పోర్టులో పేరు "గాంధీ''కాదు, 'సోనియా'నూ కాదనీ, ఆమె అసలు (ఇటాలియన్) పేరు "ఎడ్విజి ఆంటోనియా ఆల్బినా మాయినో'' అనీ, "సోనియా'' అన్నపదం రష్యన్ పెరనీ "వెబ్ సైట్స్''లో "ప్రతిభారతీయుడూ తెలుసుకోవలసిన సమాచారం యిది'' అనీ ఉంది!   ఇటాలియన్ వనిత అయిన ఆమెకు రష్యన్ పేరు "సోనియా'' ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆ సమాచ్వారం ఆమె తండ్రి అని చెప్పే స్టెఫానో యూజీనీ మాయినో కూడా ఇటాలియన్ కాదట, జర్మన్ అట. ఇతడు నాజీ హిట్లర్ జర్మనీలో పనిచేసినవాడు. హిట్లర్ సైన్యం రష్యామీద దురాక్రమించి, రెండవ ప్రపంచయుద్ధానికి దారితీసిన సమయంలో ఆ సైన్యంలో పనిచేసిన స్టెఫానో, రష్యా సైన్యానికి పట్టుబడిన సైనికుల్లో ఒకడు! అతన్ని రష్యన్ సైన్యం బంధించి 20 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. ఆ దరిమిలా అతన్ని రష్యన్ ప్రభుత్వం తన గూఢచారి శాఖ అయిన "కె.జి.బి.'' సంస్థకు అతడు లొంగిపోయి క్షమాభిక్ష పొందిన పిమ్మట రష్యన్ గూఢచారిగా ఉపయోగించుకుంది! నమ్మకం కుదిరిన తర్వాత శిక్షాకాలాన్ని నాలుగేళ్ళకు కుదించేశారు. జైలు నుంచి బయటపడిన స్టెఫానో తన కూతుళ్ళకు రష్యన్ పేర్లు పెట్టారు. అందులో ఒక పేరే "సోనియా'' అట! అదో గాధ! గా స్టెఫానో ఇటాలియన్ నియంత ముసోలీనీకి విధేయుడైన బంటూ, మద్ధతుదారూ అని "వికిపీడియా'' సమాచారం! అంటే ప్రపంచయుద్ధానికి కారకులయిన ఇద్దరూ (హిట్లర్, ముసోలినీ) సోనియా తండ్రికి అత్యంత సన్నిహితులు! ముసోలినీ అనేవాడు ఫాసిస్టు! అంతేగాదు, మరో విచిత్రం - కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా కనిపించే నేటి ఆర్.ఎస్.ఎస్. మతోన్మాద సంస్థ పూర్వికులు ఈ ముసోలినీ, హిట్లర్ లతో సంబంధాలు కలిగినవారని జెఫ్రలాట్ అనే చరిత్ర విశ్లేషకుడు 'హిందూయిజం' పుట్టుపూర్వాల విశ్లేషణలో పేర్కొన్నాడు కూడా! స్పానిష్ రచయిత్రి జేవియర్ మోరో, ఇటాలియన్ సోనియా గురించి "ది రెడ్ శారీ'' అన్న మకుటంతో ఓ జీవిత చరిత్రను 2009లో విడుదల చేసింది. అందులో ఇండియా గురించి ప్రస్తావించి, సోనియా 'ఇండియాలో సాహసయాత్ర'లు చేస్తోందనీ, సోనియా-రాజీవ్ ల కొడుకు రాహుల్ ఈసారి ఒకే (నెహ్రూ) కుటుంబంనుంచి దేశాన్ని ఏలుతున్న వారిలో నాల్గవతరంగా భారత ప్రధానిగావచ్చునన్న నమ్మకం నాకు కలిగింద''ని జేవియర్ మోరో రాసిందట! "దేశం గొడ్డుబోయినట్టు''గా మరెవరూ ప్రధానమంత్రి కాగాలవారు ఇండియాలోనే లేనట్టుగా ఇలా ప్రచారం జరగడానికి కారణం అంతా - భారత నాయకులు చాలామంది ఆత్మగౌరవం  లేనివారు కావడమూ, వంశపారంపర్య సంస్కృతికి బానిసలు కావడమూ, నెహ్రూ కుటుంబం పార్టీలో సమర్థులయినవారిని ఎదిగి\రానివ్వకుండా జాగ్రత్త పడటమూ, ఉన్నవారిని తినాతీలుగా మార్చుకోవటమూ, వెన్నెముకగలవారి వెన్ను విరిచేయడంలోనే ఉంది! బానిస మనస్తత్వాన్ని మార్చడం కష్టమనీ, ముఖ్యంగా కట్టుబానిసల్ని పెంచే రాజకీయ పార్టీలో మరింత కష్టమని మన రాష్ట్ర రాజకీయాలు నిరూపిస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు రాజీనామా

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తనతో పాటు మరికొందరు నేతలు కూడా ఇదే బాటలో ఉన్నారని తెలిపారు. సాయంత్రం తన రాజీనామా నిర్ణయాన్ని సీఎం కిరణ్ కు తెలియజేస్తానని ఆయన అన్నారు.   ఈ ఉదయం విశాఖలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐబీ చీఫ్ లాంటి వారు హెచ్చరించినా కూడా బేఖాతరు చేయకుండా, విభజన నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు. తెలుగు ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పార్టీలో తాను కొనసాగలేనని గంటా స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న రోజును బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు.

యూపిఏను కూల్చేస్తాం: లగడపాటి

      తాము యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం చెప్పారు. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని, ఈ ప్రభుత్వం తమను అడుగడుగునా మోసం చేసిందన్నారు. విద్వేషాలు రగిల్చిన వారు పండుగ చేసుకుంటున్నారని, చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని హడావుడిగా విభజిస్తున్నారని మండిపడ్డారు. హైకమాండ్ మమ్మల్ని బదనాంచేసిందని లగడపాటి విమర్శించారు.   రాష్ట్రాన్ని విభజించిన తీరు అందరినీ బాధించిందని, కనీస సమాయం కూడా ఇవ్వకుండా హడావుడిగా బిల్లును ఆమోదించారని విజయవాడ లగడపాటి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల సమావేశం అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. కీలక అంశాన్ని టేబుల్ ఐటెంగా తీసుకున్నారన్నారు. తమను అవమానించి...ఇష్టానుసారంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఈ సీమాంధ్ర కేంద్ర మంత్రుల చిన్ని చిన్న కోరికలు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దత్తతపుత్రుడ్ని పూచికపుల్లలా తీసిపారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ రాష్ట్రపతికి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించామని, నేడో...రేపో రాష్ట్రపతిని కలువనున్నట్లు ఎంపీ లగడపాటి తెలిపారు.  

స్టార్ బ్యాట్స్ మ్యాన్ కి ఇంకా ఎన్నిబాల్స్ మిగిలాయో

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఎన్నివాదనలు వినిపిస్తున్నపటికీ, విభజన ప్రక్రియకు మాత్రం ఆయన ఎన్నడూ అవరోధం కలిగించలేదనేది తెలంగాణావాదులు కూడా అంగీకరిస్తారు. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తప్ప, అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తే, ఆయన పరోక్షంగా విభజనకు సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతుంది. నిన్నతెలంగాణా ఏర్పాటుకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో విభజన ప్రక్రియలో మరో అంకం ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసింది. అయితే ముఖ్యమంత్రి నుండి దానిపై ఇంతవరకు స్పందించకపోవడం చాల విచిత్రం. ఏమయినప్పటికీ, ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనేది, రాష్ట్ర విభజన లాగే ఒక పెద్ద సస్పెన్స్ గా ఉంది.   ఒకవేళ ఆయన విభజన తరువాత కూడా పార్టీలోనే కొనసాగాలనుకొన్నా, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నవారు ఆయనని ఉండనీయకపోవచ్చును. ఒకవేళ బయటకు వెళ్లి కోట్లు ఖర్చు చేసి పార్టీ పెట్టుకొన్నా, ప్రజలు నమ్మి ఓటేస్తారనే నమ్మకం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన కారణంగా అయన వేరే ఏ పార్టీలోను జేరి మరొకరి క్రింద పనిచేయడం కూడా చాలా కష్టమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏమిచేస్తారనే ప్రశ్నకి ఎవరూ కూడా ఊహించని జవాబు వచ్చినా ఆశ్చర్యం లేదు.   బీజేపీ పాలిత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ కొద్ది రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా కలవడం అనుమానాలకు తావిస్తోంది. నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ లకు అత్యంత సన్నిహితుడయిన ఆయన  తమ ప్రత్యర్ధ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా ఎందుకు కలిసారో ఇంకా తేలవలసి ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై కోపంతో రగిలిపోతున్నకిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితిని అర్ధం చేసుకొన్నబీజేపీ ఇదే అదునుగా భావించి ఆయనని తమ పార్టీలోకి ఆహ్వానించి సీమాంధ్ర పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే అటు ఆయన, ఇటు సీమాంధ్రలో సరయిన నాయకుడు లేక బలహీనంగా ఉన్నబీజేపీ ఇద్దరూ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.   ఈ కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రులిద్దరి రహస్య సమావేశం దేనికి దారి తీస్తుందో తెలుసుకోవాలంటే శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు.

టిడిపి ఎంపీలపై లాఠీచార్జ్...తీవ్ర గాయాలు

      కేబినెట్ హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నివాసం వద్ద ధర్నా చేపట్టిన టిడిపి సీమాంధ్ర ఎంపీల పై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోద౦ తెలపడంతో...ఆగ్రహంతో టిడిపి సీమాంధ్ర ఎంపీలు షిండే నివాసం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటు అమానుషమని, అదొక తప్పుడు నిర్ణయమని మండిపడ్డారు. వైఎస్ జగన్ కోసమే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.  టిడిపి ఎంపీ సీఎం రమేశ్ విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోని ఆయన మెడ మీద చెయ్యి వేసి తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సంధర్బంగా పోలీసులు ఎంపీల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జి చేయడంతో సీఎం రమేశ్‌కు, మోదుగులకు, ఒక కార్యకర్తకు బాగా దెబ్బలు తగిలాయి.  అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ వీధి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని అర్ధరాత్రి దాటినా వదిలిపెట్టలేదు.                

యదా ప్రజా తదా నేత

కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడంతో తెలంగాణాలో ఉద్రిక్తతలు తగ్గితే, సీమాంధ్రలో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తెదేపా, వైకాపాలు 48గంటల సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఉద్యోగ సంఘాలు మళ్ళీ సమ్మెకు సిద్దం అవుతున్నాయి. రాష్ట్రానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.గతానుభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి సీమాంధ్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యుల ఇళ్ళకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక పోలీసు రక్షణ కల్పించారు.   సీమాంధ్రలో మారిన ఈ పరిస్థితులను చూసి రాజకీయనేతల వాదనలు, మాట తీరు, ఆలోచనలు కూడా మారిపోయాయి. నిన్నటి దాకా రాజీనామాలు తప్ప మరిదేనికయినా సిద్దం అని దృడంగా పలికిన సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు మళ్ళీ తమ రాజీనామా డ్రామాలకు తెర తీసారు. ఇంతకాలంగా రాష్ట్ర విభజన అనివార్యమని వాదిస్తున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర విభజనని చివరి దాకా అడ్డుకొంటామని మళ్ళీ ప్రతిజ్ఞలు చేయడం మొదలు పెట్టారు. తెదేపా, వైకాపాలు మళ్ళీ విడివిడిగా సమైక్యపోరాటాలు మొదలుపెట్టేసాయి.   రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాపత్రయం కంటే ప్రజాగ్రహానికి గురి కాకూడదనే భయమే రాజకీయ నాయకులని ఈవిధంగా మాట్లడేలా, వ్యవహరించేలా చేస్తోంది. పనిలోపనిగా ప్రజలలో ఉన్న బలమయిన సమైక్య సెంటిమెంటుని కూడా వాడుకొని ప్రయోజనం పొందుదామనే దురాశ కూడా ఇమిడి ఉంది.

మరోసారి రాజీ'డ్రామా'

  రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర కేభినెట్‌ నిర్ణయం నేపధ్యంలో సీమాంద్ర కాంగ్రెస్‌ నేతలు మరోసారి రాజీనామ డ్రామాకు సిద్దపడుతున్నారు. ఇప్పటికే ఈ నేతలు స్పీకరుకు రాజీనామా లేఖలు సమర్సించగా వాటిన ఆయన తిరస్కరించారు. అయితే ఇప్పుడు మరోసారి పార్లమెంట్‌ సభలో సభాపతికి రాజీనామ లేఖలు అందించాలని భావిస్తున్నారట. ఇందులో కేంద్రమంత్రులు పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, చిరంజీవి, పురంధేశ్వరి తో పాటు ఎంపిలు లగడపాటి, హర్షకుమార్‌, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్‌, సబ్బంహరి, రాయపాటి సాంబశివరావులు ఉన్నారు. అయితే ఈసారైనా ఈ నాయకులు రాజీనామాలు ఆమోదింప చేసుకుంటారా లేక మరోసారి అదే డ్రామా ఆడుతారా అన్న అనుమానం ప్రజల్లో ఉంది. తాము కోరినట్టు సమైక్యా రాష్ట్రంగా కోనసాగించకపోయినా తప్పని పరిస్థితుల్లో తాము చెప్పినట్టుగా భద్రాచలాన్ని సీమాంద్రలో కలపటం, హైదరాబాద్‌ను యూటి చేయటం లాంటి ప్రతిపాదనలను కూడా పట్టించుకోకపోవడంతో సీమాంద్ర నాయకులు మనస్తాపానికి గురైనట్టుగా సమాచారం.

మరోసారి అన్నా దీక్ష

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆగమేగాల మీద చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయంలో మాత్రం అంత త్వరగా స్పందించకపోవటం పై అన్నా హజరే ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్ లోక్‌పాల్ కోసం మహారాష్ట్రలోని రాలేగావ్‌సిద్ధి వేదికగా మరోసారి ఉద్యమించేం దుకు అన్నా హజారే సమాయత్తమయ్యారు. ఈ నెల 10 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు అన్నాహజరే ప్రకటించారు . ప్రభుత్వం ఈసారి కూడా జన్ లోక్‌పాల్ బిల్లు తీసుకురాకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభం రోజు నుంచే దీక్ష చేపడతానని ప్రజలకు మాటిచ్చానని అందుకే దీక్ష చేపడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే గతంలోనే దీక్ష చేయాలని భావించినా తనకు జరిగిన శస్త్రచికిత్స నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అలాగే తొలుత ప్రకటించిన దీక్షా వేదిక ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌కు బదులు సొంతూరు రాలేగావ్ సిద్ధిలో దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు.

నల్లసూరీడి అస్తమయం

  ఇటీవల తన 95 వ పుట్టినరోజును జరుపుకున్న నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా అస్తమించారు.. 67 సంవత్సరాల పాటు నల్లజాతి హక్కుల పోరాడిన ఈ పోరాట యోదుడి మరణంతో యావత్‌ ప్రపంచం షాక్‌ గురైంది.ఈ మహాయోధుడి అంతిమ సంస్కారాలను ఘనంగా నిర్వహించడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కారణం జూన్‌ 8 న హాస్పిటల్‌లో చేరిన మండేలా అప్పటి నుంచి ట్రీట్‌మెంట్‌లోనే ఉన్నారు.. ఇంతకు వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోయినా నిలకడగా ఉందంటున్నారు డాక్టర్లు. అయితే ఇటీవలే ఆయనను హాస్పిటల్‌ నుంచి ఇంటికి మార్చారు. ఆఫ్రికాలో అనగారి వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలకు గుర్తుగా నోబల్‌ ప్రైజ్‌న్‌ కూడా అందుకున్నారు మండేలా.. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను ఆయన పుట్టిన రోజును ఇంటర్‌నేషనల్‌ మండేలా డేగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. నల్లజాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆ మహాయోధుడి ఆత్మశాంతి కోసం ప్రపంచమంతా ప్రార్థిస్తుంది.

పది జిల్లాలతో కూడిన తెలంగాణకే ఆమోదం

  దాదాపు 3 గంటల సేపు సాగిన కేంద్రమంత్రి వర్గ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అనంతరం హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణానే కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని ప్రకటించారు. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా సాగే హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజల హక్కులను కాపాడే బాధ్యత తెలంగాణా గవర్నర్ దేనని తెలిపారు. ఆర్టికల్ 371 (డీ) రెండు రాష్ట్రాలలో కొనసాగుతుందని తెలిపారు. జలవనరులు, విద్యుత్ తదితర కీలక అంశాలలో కేంద్రం పాత్ర ఉంటుందని తెలిపారు.   విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ నిర్మించాలో ననిర్ణయించేందుకు ఒక నిపుణుల కమిటీ వేయబడుతుందని, అది 45 రోజులలో తన నివేదికను సమర్పిస్తుందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం తగినన్ని నిధులు విడుదులు మంజూరు చేస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా క్యాబినెట్ ఆమోదం పొందిందని, దానికి అవసరమయిన అనుమతులు, నిధులు వగైరా అన్నీ కేంద్రమే చూసుకొంటుందని ఆయన తెలిపారు.   ఈరోజు ఆమోదింపబడిన తెలంగాణా బిల్లు రేపు లేదా ఎల్లుండి రాష్ట్రపతికి పంపబోతున్నట్లు షిండే తెలియజేసారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపటి నుండి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ యాత్రకి బయలుదేరబోతున్నారు. అంటే షిండే చెప్పినట్లు రేపు కాక ఈరోజు రాత్రే రాష్ట్రపతికి తెలంగాణా బిల్లు అందజేయవచ్చును. లేకుంటే ఆయన కోల్ కత చేరుకొన్నతరువాత అక్కడికే బిల్లుని పంపి, ఆయన ఆమోదిస్తే  అక్కడి నుండే నేరుగా రాష్ట్రశాసన సభకు పంపవచ్చును. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తామని షిండే తెలిపారు.   ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, కావూరి సాంభశివరావు, పల్లంరాజు, కిషోర్ చంద్ర దేవ్ కూడా పాల్గొని తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా బలంగా వాదనలు వినిపించారు. అయితే క్యాబినెట్ విభజనకే మొగ్గు చూపడంతో, సీమాంధ్ర మంత్రులు ముగ్గురు  సమావేశం ముగిసే ముందే బయటకు వెళ్ళిపోయారు. వారు సీమాంధ్రకు ఇస్తున్న ప్యాకేజీ పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ప్రకటించినట్లు సమాచారం.

రాయల తెలంగాణాపై కేంద్రం వెనకడుగు

  కేంద్ర మంత్రి వర్గం సమావేశం గురువారం సాయంత్రం సమావేశమయ్యి కేంద్రమంత్రుల బృందం ఆమోదించిన రాయల తెలంగాణా లేదా పది జిల్లాలతో కూడిన తెలంగాణాలలో ఏదో ఒక ప్రతిపాదనను ఆమోదింపవలసి ఉంది. అయితే తను ఆయాచితంగా తెలంగాణా ప్రజలకు ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దపడినా వారు అందుకు అంగీకరించకుండా, మళ్ళీ బందుల బాట పట్టడంతో రాయల తెలంగాణా ప్రతిపాదన విరమించుకొంటున్నట్లుగా కొద్ది సేపటి క్రితమే అలవాటు ప్రకారం మీడియాకు లీకులు ఇచ్చింది. తద్వారా తాము ఆ ప్రతిపాదనపై తనకు అంత ఆసక్తి లేదనే అభిప్రాయం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ముందు ప్రకటించినట్లుగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రమే ఇవ్వబోతున్నట్లు మీడియాకి లీకులు ఇచ్చింది.   అయితే రాయల తెలంగాణా ప్రతిపాదనతో తమ టీ-కాంగ్రెస్ నేతలు మళ్ళీ తెలంగాణాలో దైర్యంగా తిరుగలేని పరిస్థితి కల్పించడమే గాక, ఉన్న కొద్దిపాటి పరువు కూడా రెండే రెండు రోజుల్లో పోగొట్టుకొంది. తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగానే సోనియా గాంధీకి కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుడి కట్టిన ప్రజలు, రాయల తెలంగాణా ప్రతిపాదన చేయగానే దానిని కూల్చి వేయడమే ఇందుకు చక్కటి ఉదారణగా చెప్పుకోవచ్చును.   ఈ నిరసనలను చూసి భయపడి కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా ప్రతిపాదన ఉపసంహరించుకొన్నపటికీ, హైదరాబాద్ మరియు భద్రాచలంపై ఆంక్షలు, ఇతర సున్నిత అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు తెలంగాణా ప్రజలు ఆ పార్టీకి దూరం చేయడం ఖాయం. అందువల్ల ఇప్పుడు పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రమే ఇచ్చినా, తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీని మెచ్చి దానికి ఓటేసే పరిస్థితి ఉండకపోవచ్చును.

రాయల తెలంగాణను వ్యతిరేకించిన ఆజాద్

      పది జిల్లాల తెలంగాణకే కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం ఆయన జీఓఎం సభ్యులకు కూడా సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో చర్చ జరిగి అందరూ అంగీకరిస్తేనే రాయల తెలంగాణ ప్రతిపాదనకు మొగ్గు చూపవచ్చునని, లేకుంటే కొత్త సమస్యలకు దారి తీసినట్లవుతుందని వివరించారట. సిడబ్ల్యుసి నిర్ణయానికి కట్టుబడాలని సూచించినట్లుగా సమాచారం. రాయల తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం వల్లనే  ఆజాద్ వెనక్కి తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నారు. బిజెపి కూడా తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆజాద్ వెనక్కి తగ్గడానికి కారణమైందని అంటున్నారు. బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం కష్టమవుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నికల లోగా ఏర్పాటు చేయాలనే కాంగ్రెసు అధిష్టానం వ్యూహం బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. దీంతో ఆజాద్ వెనక్కి తగ్గక తప్పలేదని అంటున్నారు.

కాంగ్రెస్ ఎత్తులకి కాంగ్రెస్ చిత్తు

  కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతలు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసిన మాట వాస్తవమే. అదేవిధంగా మజ్లిస్ పార్టీ కూడా తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి నుండి ఈ ప్రతిపాదన చేస్తున్నపటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది. అయితే ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒకేసారి ఎసరు పెట్టేయవచ్చని కాంగ్రెస్ పార్టీ గ్రహించడంతో తెలంగాణా ప్రజల కోరకపోయినప్పటికీ వారికి అదనంగా ఈ ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.   రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో మజ్లిస్ ఉనికి నామమాత్రంగా మారిపోతుంది. పైగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బీజేపీ బలపడుతుందని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ కూడా భయపడుతున్నాయి. అదే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెచ్చి తెలంగాణాతో అంటు కట్టగలిగితే, అక్కడ అధికంగా ఉండే ముస్లిం ఓటర్లవలన మజ్లిస్, రెడ్డి ఓటర్ల వలన కాంగ్రెస్ పార్టీ బలపడవచ్చనే ఆలోచన కూడా ఇందులో ఇమిడి ఉంది.   అయితే, తెలంగాణా ఏర్పడిన తరువాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే సామాజిక న్యాయం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముఖ్యమంత్రి మరియు ఇతర కీలక పదవులు ఆశిస్తున్నటీ-కాంగ్రెస్ నేతల అవకాశాలను ఈ ప్రతిపాదన దెబ్బ తీస్తుంది. గనుక వారు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరుగబోయే కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ అంశంపై తమ అధిష్టానం తీసుకొనే నిర్ణయం చూసిన తరువాతనే వారు స్పందించాలని వేచి చూస్తున్నారు.   ఒకవేళ రాయల తెలంగాణాకే మొగ్గు చూపితే వారు కూడా అధిష్టానానికి ఎదురు తిరగవచ్చును. అదే జరిగితే, ఈ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కళ్ళెం వేద్దామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి అసలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల బహుశః ముందు ప్రకటించినట్లు 10జిల్లాలతో కూడిన తెలంగాణానే ఆమోదించక తప్పకపోవచ్చును.   రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంత కీలక దశకు చేరుకొన్నపటికీ, రాష్ట్రాన్ని ఏవిధంగా విడదీయదలచుకొందో చెప్పలేని దీనస్థితిలో కాంగ్రెస్ ఉంది పాపం. మొదటి నుండి కూడా రాష్ట్ర ప్రజలను కానీ, పార్టీలను గానీ పరిగణనలోకి తీసుకోకుండా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తులకి చివరికి తానే బలయిపోయే పరిస్థితి ఏర్పడింది.   కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. అది అప్పుడప్పుడు తనను తానే ఓడించుకొంటుంది అని కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకొనే మాట ఎంత నిజమో ఇప్పుడు అర్ధం అవుతోంది.నిన్న వెలువడిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక కవుంట్ డవున్ మొదలయిందని సూచిస్తునాయి.

అక్బరుద్దీన్‌ కు తెలంగాణ సెగ..హరీష్ ఫైర్

      తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. తెలంగాణ కోసమే తమ పోరాటం కానీ...రాయల తెలంగాణ కోసం కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తెరపైకి తెస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ గద్దెలను కూల్చేస్తామని హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా హరీష్‌రావు సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను ఒప్పుకోమన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ నాయకులు ఎన్నో కుట్రలు చేశారని, వారితో తాము కలిసేది లేదని హరీష్‌రావు తేల్చిచెప్పారు.

జగన్ కి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత

  ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇరుకునపడిన జగన్మోహన్ రెడ్డి, ధర్నాలు చేసే బాధ్యతను తల్లికి అప్పగించి చెన్నైవెళ్ళి ముఖ్యమంత్రి జయలలితను, ప్రతిపక్ష నేత కరుణానిధిని కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కరుణానిధి కుమార్తె మరియు 2జీ కేసులో నిందితురాలయిన కనిమోలి ఆయనకు స్వాగతం పలకడం విశేషం.   ఆయన వస్తున్నట్లు తెలిసి చెన్నైలో వైకాపా అభిమానులు బాగానే దారి పొడుగునా వైకాపా జెండాలు అలంకరించి బాగానే స్వాగతం పలికారు. అయితే చెన్నైనుండి హైదరాబాదులో కాలుపెట్టేసరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి హైదరబాదులో విమానం దిగి ఇంటికి వెళుతుంటే ఆయన కాన్వాయ్ పై కొందరు తెలంగాణా యువకులు కోడి గుడ్లు, టొమేటోలు, చెప్పులు విసిరి తమ నిరసన తెలిపారు. ఇది చూస్తే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.

తెలంగాణ బంద్...పలుచోట్ల ఉద్రిక్తత

      రాయల తెలంగాణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ తెలంగాణ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఐదు గంటల నుంచి తెలంగాణవాదులు ఆందోళనలకు దిగారు. జిల్లాలోని బస్సు డిపోల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.   #. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ నేపథ్యంలో నగరంలోని జూబ్లీబస్టాండ్‌వద్ద టీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఆందోళనకు దిగారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఈటెల హెచ్చరించారు. #. తెలంగాణ బంద్ నేపథ్యంలో జిల్లాలోని కొత్తూరు మండలం జేపీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. #. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఇచ్చిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓయూలో విద్యార్థుల బైక్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. గురువారం ఉదయం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు బైక్ ర్యాలీకి యత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. #. రాయల తెలంగాణకు ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ బంద్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ను విధించారు. అసెంబ్లీ వద్ద భారీగా బలగాలను మోహరించారు.