ఘనంగా పీవీ జయంతి

భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమం హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో జరిగింది. పీవీ జయంతిని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పీవీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘పీవీ మా తెలంగాణ బిడ్డ... ఆయన విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తే గుంపులో గోవింద అవుతుంది. అలా కాకుండా సమున్నత స్థానంలో ఘనంగా పీవీ విగ్రహ ప్రతిష్ట చేస్తాం. దేశం గర్వించేలా ఆ కార్యక్రమం చేపడతాం. పీవీని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదు. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు పీవీ పేరు పెడతాం. దాంతో పాటు జిల్లాలో స్థాపించబోయే యూనివర్సిటీల్లో ఒక దానికి పీవీ పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తాం. పీవీ గౌరవానికి తగినట్లుగా స్మారక భవనం ఏర్పాటు చేస్తాం. దేశంలో తొలిసారి భూ సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహరావు, దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్నికోరతాం. ఆయన ఆదర్శాలు, సంస్కరణలు, రచనలు భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపడతాం’’ అన్నారు.

విశాఖలో అమ్మోనియం ట్యాంక్ పేలింది!

తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పేలుడు జరిగి భారీ విషాదం నెలకొన్న సందర్భంలోనే మరో పేలుడు సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. విశాఖలోని పరవాడ ప్రాంతంలో వున్న ఫార్మాసిటీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో అమ్మోనియం ట్యాంక్ అకస్మాత్తుగా పేలింది. ఈ  సంఘటనలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను గాజువాకలోని పలు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో పేలుడు సంభవించడం ఇది రెండోసారి. 2013 మే 30వ తేదీన ఇదే కంపెనీలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తువ విషయవాయువులు వెలువడి చుట్టుప్రక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గతంలో ఇలాంటి అనుభవం ఎదురైనప్పటికీ కంపెనీ యాజమాన్యం కళ్ళు తెరవకపోవడం వల్లే మరోసారి ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

మావోయిస్టులతో మాటల్లేవ్: రాజ్‌నాథ్‌సింగ్

మావోయిస్టులతో చర్చించే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పేశారు. దేశంలో మావోయిస్టు తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మావోయిస్టుల దాడులను చేస్తే రెట్టింపు శక్తితో ఎదుర్కొంటామని, మావోయిస్టులను చావుదెబ్బ తీసేందుకు బలగాలు సర్వసన్నద్ధంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మావోయిస్టు ప్రభావిత 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఆర్పీఎఫ్ డీజీలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. ‘‘మావోయిస్టులతో మెతక వైఖరికి స్వస్తి చెబుతున్నాం. ఇకపై వారితో చర్చల ప్రసక్తే లేదు. అభివృద్ధి పనులను నక్సల్స్ ఎలా అడ్డుకుంటున్నారో మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరగాలి. ప్రతి రాష్ట్రంలో గ్రే హౌండ్స్ తరహా ప్రత్యేక బలగాల నియామకానికి కేంద్రం నిధులిస్తుంది. నక్సలైట్లు, వారికి తోడ్పడుతున్నవారి లొంగుబాటుకు మరింత ఆకర్షణీయమైన పునరావాస ప్యాకేజీని ప్రకటిస్తాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.

ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్

ఢిల్లీలో ఒక పెద్ద బిల్డింగ్ కుప్పకూలింది. ఇప్పటి వరకు ఒక మహిళ మృతదేహాన్ని బయటకి తీశారు. కుప్పకూలిన భవనం కింద ఇంకా అనేకమంది మరణించి లేదా చిక్కుకుపోయి వుండొచ్చని భయపడుతున్నారు. ఢిల్లీలోని తులసీనగర్ ఏరియాలో వున్న ఒక మూడు అంతస్తుల నివాస భవనం శనివారం ఉదయం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలామంది మహిళలు చనిపోయి వుండవచ్చని స్థానికులు భయపడుతున్నారు. అగ్ని మాపక శాఖ వారు సహాయక చర్యలు ప్రారంభించారు. కుప్పకూలిన భవంతి పై ఫ్లోర్‌లో మూడు కుటుంబాలు నివాసం వుంటున్నాయి. ఆ కుటుంబానికి సంబంధించిన వారి ఆచూకీ కనిపించకపోవడంతో వారు శిధిలాలలో చిక్కుకుని వుంటారని భయపడుతున్నారు.

లైంగిక విద్యపై కేంద్రమంత్రి వివాదం

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ లైంగిక విద్యను నిషేధించాలంటూ సంచలన ప్రకటన చేశారు. మొన్నామధ్య ఎయిడ్స్‌ను నివారించేందుకు కండోమ్‌ల కంటే విశ్వసనీయతే ముఖ్యమని వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న ఆయన తాజాగా మరో వివాదానికి తెరలేపారు. పాఠశాలల్లో లైంగిక విద్యను నిషేధించాలని తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇది కొత్త వివాదాన్ని సృష్టించింది. హర్షవర్దన్ తన వెబ్ సైట్‌లో ‘‘పాఠశాలల్లో లైంగిక విద్యను నిషేధించాలి. విలువైన విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరముంది. భారతీయ సాంస్కృతిక సంబంధాలను విద్యార్థులకు నేర్పాలి. యోగా నేర్చుకోవడం తప్పనిసరి చేయాలి’’ అని రాశారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ, ఆరోగ్య కార్యకర్తలు మండిపడ్డారు. ఆరెస్సెస్ ఎజెండాను చొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కేంద్రమంత్రి హర్షవర్దన్ వివరణ ఇచ్చారు. లైంగిక విద్యను పాఠశాల విద్యార్థులకు నేర్పడం అవసరమని, అయితే అది అసభ్యంగా ఉండకూడదని అన్నారు.

గెయిల్ దుర్ఘటన: 25 లక్షల పరిహారం

తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ లీకేజీ - పేలుడు దుర్ఘటనలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం లభిస్తుందన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందేలా వెంటనే చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాల్లో పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్పొరేట్ పాఠశాలల్లో ఉచితంగా పదో తరగతి వరకూ చదువు చెప్పిస్తాం. కొబ్బరి తోటలు, పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లిస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు. మృతుల కుటుంబాలకు లభించే 25 లక్షల నష్ట పరిహారంలో 20 లక్షలు గెయిల్ సంస్థ ఇస్తుంది. 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తాయి. మృతుల కుటుంబాల్లో ఒకరికి గెయిల్‌లో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందుతుంది. ఈ లక్షలో 50 వేలు కేంద్ర ప్రభుత్వం, 50 వేల గెయిల్ సంస్థ చెల్లిస్తాయి. అలాగే చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును గెయిల్ భరిస్తుంది. ఈ దుర్ఘటనలో శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వారికి గెయిల్ సంస్థ వారి పేరిట రూ.5 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేస్తుంది. ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపోయిన పంట, ఆస్తులకు మార్కెట్ విలువ ప్రకారం గెయిల్ పరిహారం చెల్లిస్తుంది.

నాగార్జున ఆస్తికి టెండర్ పెట్టారు!

  మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రుల తాట వలిచే కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టుంది. లగడపాటి ల్యాంకో హిల్స్‌ని ఇప్పటికే టార్గెట్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అక్కినేని నాగార్జున ఆస్తి మీద కన్ను వేసినట్టు తెలుస్తోంది. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని కట్టడాలను కూల్చే కార్యక్రమంలో ముమ్మరంగా వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడే వున్న అక్కినేని నాగార్జున నిర్మించిన ఫంక్షన్ హాల్ ‘ఎన్ కన్వెన్షన్’ మీద దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ కట్టడానికి సంబంధించి నాగార్జునకు అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ్మిడికుంట చెరువు పక్కనే 14 ఎకరాల స్థలంలో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. దీని వెనుక వున్న తమ్మిడికుంట చెరువుకు చెందిన స్థలం హద్దులను గుర్తిస్తున్నారు. ఒక వేళ చెరువుకు చెందిన స్థలంలో ఎన్ కన్వె్న్షన్ సెంటర్ నిర్మించి ఉన్నట్లయితే కూల్చివేత తప్పదని కొందరు అధికారులు అంటున్నారు. అధికారంలో ఎవరు వున్నా వారితో సన్నిహితంగా వుండే నాగార్జున పొలిటికల్‌గా దాదాపు నాన్ కాంట్రవర్షియల్. ఆయన ఆస్తుల మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.

నేను పుట్టగానే చంపేయాలనుకున్నారు: స్మృతి ఇరాని

మోడల్‌గా, టీవీ నటిగా ప్రస్థానం ప్రారంభించి ఈ రెండు రంగాలలోనూ విశేష కీర్తిని ఆర్జించి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్మృతి ఇరాని ఇప్పుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశంలో ఇంత ఉన్నత స్థానంలో వున్న స్మృతి ఇరానీ పుట్టినప్పుడు ఆమె బంధువులు ‘ఆడపిల్ల పుట్టింది కాబట్టి చంపెయ్’ అని ఆమె తల్లికి సలహా ఇచ్చారు. అయితే ఆమె తల్లి మాత్రం బంధువుల మాటను ఎంతమాత్రం పట్టించుకోకుండా చిన్నారి స్మృతిని అల్లారుముద్దుగా పెంచింది. ఈరోజు ఈ స్థాయికి రావడానికి సహకరించింది. ఈ విషయాన్ని స్మృతి ఇరానియే వెల్లడించారు. ‘‘నేను పుట్టగానే ఆడపిల్ల భారమని మా అమ్మకు చెప్పారు. చంపేయమని కూడా బంధువులు సలహా ఇచ్చారు. కానీ మా అమ్మ ధైర్యవంతురాలు. వాళ్లు చెప్పినట్లు చేయకుండా నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె వల్లే ఈరోజు ఇలా మీ ముందున్నాను. ఎవరో చెప్పిన మాట విని తనను వదిలించుకునేందుకు నా తల్లి ప్రయత్నించలేదు. ఇందుకు ఆమెకు ధన్యవాదాలు’’ అన్నారు. బాలికలలతో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో స్మృతి ఇరాని మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. దేశంలో బాలికలను ప్రోత్సహించి, వారి అభ్యున్నతికి తోడ్పడవలసిన అవసరం వుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. బాలికలను ఆదరించి, ప్రోత్సహించడం వల్ల వారు ఏ స్థాయికి చేరుకుంటారన్నదానికి తానే ఒక ఉదాహరణ అని ఆమె అన్నారు.

టీఆర్ఎస్ టార్గెట్: లగడపాటి ల్యాంకో హిల్స్

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి టీఆర్ఎస్‌ని ఢీకొన్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మీద కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు తన దృష్టిని కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో హిల్స్‌కు మున్ముందు కష్టాలు తప్పవని టీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. మెదక్ జిల్లాలో వక్ఫ్ భూముల సమీక్ష చేసిన సందర్భంగా మాట్లాడుతూ, ల్యాంకో హిల్స్ మీద తెలంగాణ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ల్యాంకో సంస్థకు ఇచ్చిన భూములు హైదరాబాద్ శివారులోని హుస్సేనిషావలి దర్గాకు చెందినవని, అవి వక్ఫ్ ఆస్తులు కాదంటూ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును తమ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. ‘‘ల్యాంకోకు ఇచ్చిన దర్గా భూములు వక్ఫ్ ఆస్తి. ఈ భూములు అమ్మడానికి, కొనడానికి వీల్లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం ఈ భూములు వక్ఫ్ ఆస్తి కాదంటూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం అంటే కంచే చేను మేసినట్లే. ఈ భూములు వక్ఫ్‌కే చెందాలని కేసు వేస్తాం’’ అని హరీష్ రావు చెప్పారు.

ఇరాక్‌: 190 మంది బందీలు హతం

  ఇరాక్‌లో అరాచకాన్ని సృష్టిస్తున్న మిలిటెంట్లు సుమారు 190 మంది బందీలను చంపేశారు. ఈ విషయాన్ని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది. తమకు అందుబాటులోకి వచ్చిన శాటిలైట్ చిత్రాలు, మిలిటెంట్లు వెల్లడించిన ఫొటోలు, రకరకాల మార్గాల నుంచి అందిన విశ్లేషణల ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చామని హ్యూమన్ రైట్స్ వాచ్ సంబంధీకులు చెప్పారు. జూన్ 11-14 తేదీల మధ్య సద్దాం హుస్సేన్ సొంత నగరమైన తిక్రిత్ నగరంలోని రెండు ప్రాంతాల మధ్య దాదాపు 190 మంది బందీలను మిలిటెంట్లు చంపేశారని హెచ్.ఆర్.డబ్ల్యు. ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మృతులు ఇంకా ఎక్కువే ఉండొచ్చని అయితే సంఘటనా ప్రాంతంలో విచారణ జరిపితే మరిన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూస్తాయని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

మావోల తలలు చాలా ఖరీదండోయ్!

  కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల తలలకు పోలీసు అధికారులు భారీ ధరలను ప్రకటించారు. కొంతమంది మావోయిస్టుల పేర్లను ప్రకటించి, ఒక్కో పేరుకు ఒక్కో ధరను నిర్ణయించారు. ఏ మావోయిస్టును పట్టుకుంటే ఎంత పారితోషికం లభిస్తుందో ఆ లిస్టులో వివరించారు. ఆ లిస్టు ప్రకారం... కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ బుచ్చన్న (25 లక్షలు), మల్ల రాజిరెడ్డి అలియాస్ సత్తన్న (25 లక్షలు), మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి (25 లక్షలు), ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (25 లక్షలు), పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (25 లక్షలు), తిప్పిరి తిరుపతి అలియాస్ సుదర్శన్ (25 లక్షలు), బల్మూరి నారాయణరావు అలియాస్ వెంకన్న (25 లక్షలు), గంకిడి సత్యనారాయణ అలియాస్ విజయ్ (20 లక్షలు), కొత్త రాంచంద్రారెడ్డి అలియాస్ ఉసెండి (20 లక్షలు), జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్న ఏలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చులు (8 లక్షలు), ఎగలోపు మల్లయ్య అలియాస్ కమలాకర్ (8 లక్షలు), 12.అనె్న సత్తయ్య అలియాస్ సుధాకర్ (5 లక్షలు), అప్పాసి నారాయణ అలియాస్ శంకర్ (5 లక్షలు), బత్తుల కాశీరాం అలియాస్ సత్యం (5 లక్షలు), బూర భాగ్య అలియాస్ అరుణ (5 లక్షలు), చీమల నర్సయ్య అలియాస్ జోగన్న (5 లక్షలు), గుండారపు ఆనందం (5 లక్షలు), కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ (5 లక్షలు), లోకే సారమ్మ అలియాస్ సుజాత (5 లక్షలు), మేకల మనోజ్ అలియాస్ వికాస్ (5 లక్షలు), పసుల గంబాలు అలియాస్ వసంత (5 లక్షలు), బెజ్జారపు కిషన్ (5 లక్షలు), సందె గంగయ్య అలియాస్ అశోక్ (5 లక్షలు), చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప (4 లక్షలు), దత్తు ఐలయ్య (4 లక్షలు), దీకోండ శంకరయ్య అలియాస్ శేషన్న (4 లక్షలు), నెరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క (4 లక్షలు), దళ సభ్యులుగా ఉన్న ముదాం లక్ష్మణ్ (2 లక్షలు), దేవరకొండ సత్యనారాయణ అలియాస్ సత్తన్న (లక్ష), జువ్వాడి వెంకటేశ్వర్‌రావువ అలియాస్ ధర్మన్న (లక్ష), కనగర్తి రజనీకర్‌రెడ్డి (లక్ష), కాశబోయిన స్వరూప (లక్ష).

తెలుగువారి మీద పంచభూతాల పగ?!

  ప్రస్తుతం తెలుగువారి మీద పంచభూతాలు పగబట్టాయా అనే సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న వారు తెలుగువారి మీద పంచభూతాలు పగబట్టినట్టుగా వుందని భావిస్తున్నారు. పంచభూతాలలోని నీటిని తీసుకుంటే.. అకస్మాత్తుగా ప్రవహించిన నీటి వలన హిమాచల్‌ ప్రదేశ్‌లో 24 మంది తెలుగువారు మరణించారు. అలాగే నిప్పు తన ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో భారీ పేలుదు, అగ్ని కీలలు సంభవించి తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో 16 మంది మరణించారు. అలాగే వడగాడ్పుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వందలాది మంది రాలిపోయారు. ఇది వాయువు ఆగ్రహం కారణంగా జరిగిందని భావిస్తున్నారు. ఎల్‌నినో అనే విపత్తు ఆకాశం ఆగ్రహించడం వల్లనే వచ్చిందని అంటున్నారు. ఆకాశం ఆగ్రహించడం వల్లనే సకాలంలో వర్షాలు కురవడం లేదని భావిస్తున్నారు. ఇక ఐదో పంచ భూతమైన భూమి తన ఆగ్రహాన్ని ఏ రూపంలో ప్రదర్శిస్తుందో అని భయపడుతున్నారు.

వైకాపా నెల్లూరు కార్పొరేటర్లు చలో గోవా

  వచ్చే నెల 3న మేయర్ ఎన్నికలు జరుగబోతున్నందున వైకాపా తన కార్పోరేటర్లను తెదేపావైపు గోడ దూకకుండా ఉండేందుకు నానా తిప్పలు పడుతోంది. ఆ పార్టీకి నెల్లూరు మేయర్ పదవి దక్కించుకోవడానికి 30మంది కార్పొరేటర్లు ఉన్నందున, నగర మేయర్ పదవి దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న వైకాపా తన కార్పొరేటర్లు తెదేపా వైపు మళ్ళకుండా ఉండేందుకు వారినందరినీ సకుటుంబసమేతంగా నిన్న గోవాకు తరలించింది. మళ్ళీ మేయర్ ఎన్నిక జరిగే రోజునే వారిని వెనక్కి రప్పించి నేరుగా ఓటింగ్ లో పాల్గొనేలా చేయాలని వైకాపా భావిస్తోంది. ఈసారి వైకాపా మేయర్ అభ్యర్ధిగా అబ్దుల్ అజీజ్ నిలబెడుతోంది. తమ కార్పోరేటర్లను తెదేపా నేతలు ప్రలోభాల నుండి కాపాడుకోవడానికి స్థానిక వైకాపా యం.యల్యే.లు డా.అనిల్ కుమార్ రెడ్డి మరియు కోమటి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కార్పోరేటర్లతో కలిసి గోవా బయలుదేరారు. వారితో బాటు మరో ఇద్దరు వైకాపా నేతలు బీ. శ్రీధర్ రెడ్డి మరియు రూప కుమార్ యాదవ్ కూడా తమ కార్పోరేటర్లను కాపాడుకోవడానికి వారితో కలిసి గోవా వెళ్ళారు. కేవలం కార్పోరేటర్లను మాత్రమే పంపించినట్లయితే, తెదేపా నేతలు వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి కార్పోరేటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రమాదం ఉందనే భయంతో కార్పోరేటర్ల కుటుంబ సభ్యులందరినీ కూడా గోవా తరలించారు.   అధికారంలోకి వచ్చిన తెదేపా ఈవిధంగా ఇతర పార్టీల కార్పోరేటర్లను ప్రలోభాలకు గురిచేసి తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి కాదని, ప్రజా తీర్పును ఆ పార్టీ గౌరవించడం నేర్చుకోవాలని వైకాపా నేతలు అంటున్నారు. ఇటువంటి ధోరణిని ఎవరూ హర్షించరు. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న తన విధేయులను ఎప్పుడు తలచుకొంటే అప్పుడు వైకాపాలోకి రప్పించి ప్రభుత్వాన్ని కూలగొట్టగలనని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనడమే కాకుండా ఆ తరువాత కాంగ్రెస్, తెదేపాలు చెందిన మొత్తం 19మంది యం.యల్యే.లను మూకుమ్మడిగా వైకాపాలోకి ఫిరాయింపజేసారు. ఆనాడు దానినొక ఘనకార్యంగా చెప్పుకొని భుజాలు చరుచుకొన్న వైకాపా నేడు తెదేపా తన కార్పోరేటర్లను ఆకర్షించేప్రయత్నాలు చేయడం చాలా అన్యాయమని గగ్గోలు పెట్టడం విచిత్రం. వైకాపా తాను మొదలు పెట్టిన ఈ వికృతరాజకీయ క్రీడకు ఇప్పుడు తానే బలయిపోతోంది. అందుకు ఎవరినీ నిందించడం అనవసరం కూడా.

గెయిల్ దుర్ఘటన: ప్రణబ్ దిగ్భ్రాంతి

  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్ లీక్, అగ్ని ప్రమాదం ఘటనలో 14 మంది మరణించడంపై భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సంఘటన విషయం తెలియగానే ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పైపు లైన్ పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఇంత పెద్దప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే తాను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నానని ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. కాగా, ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

బామ్మ మాట మర్డర్‌కి బాట!

  మామూలుగా బామ్మ మాట బంగారు బాట అంటారు. అయితే ఒక యువకుడు బామ్మ మాటలని మర్డర్‌కి బాటగా మార్చుకున్నాడు. ఆ యువకుడి పేరు రాజా. కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రాంతంలో అతని నివాసం. ఎప్పుడో చనిపోయిన బామ్మకిచ్చిన మాటను నెరవేర్చడానికి ఆ యువకుడు తన బామ్మ శత్రువుని పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేశాడు. చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళం గ్రామానికి చెందిన లింగినేని సాంబశివరావు 1998లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో సూర్యచంద్రరావు అనే వ్యక్తి నిందితుడు. ఈ కేసును రెండేళ్ల క్రితం కోర్టు కొట్టేసింది. సాంబశివరావు తల్లి వెంకటనరసమ్మ గుంటూరు జిల్లా లింగమనేనిపాలెంలో కొడుకు ఫొటోకు పూజలు చేస్తుండేది. సూర్యచంద్రరావును హత్య చేయాలన్న కోరికను తన బంధువుల దగ్గర ఎప్పుడూ చెబుతూ వుండేది. తన కొడుకుని చంపినవారిని ముక్కలు ముక్కలుగా నరకాలని చెబుతుండేది. ఆమెకు మనవడైన రాజా బామ్మ కోరికను తీర్చాలనుకున్నాడు. వెంకటనరసమ్మ 2011లో అనారోగ్యంతో మరణించింది. చనిపోయిన బామ్మ కోరిక తీర్చడం కోసం రాజా పకడ్బందీ ప్లాన్ వేశాడు. తాను టార్గెట్ చేసిన సూర్యచంద్రరావు గ్రామమైన శ్రీకుళానికి చెందిన యువతినే పెళ్ళి చేసుకుని ఆ ఊళ్ళోనే స్థిరపడ్డాడు. సూర్యచంద్రరావును చంపేందుకు అదును కోసం చూసీ చూసీ ఈనెల 22వ తేదీన శ్రీకాకుళంలోని వంగతోటకు నీరు పెట్టేందుకు వెళ్ళిన సూర్యచంద్రరావును హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. పోలీసులు అరెస్టు చేసి విచారిస్తే, సూర్యచంద్రరావుతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవని, తన బామ్మ కోరికను తీర్చడం కోసమే అతన్ని చంపానని చెప్పాడు.

గ్యాస్ పైప్ లైన్ పేలుడు: బాబు దిగ్భ్రాంతి

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం ‘నగరం’ గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ పైప్ లైన్ పేలిపోవడంతో 15మంది మృతి చెందగా, 14మంది తీవ్రంగా గాయపడ్డారు. అమలాపురంలోని కిమ్స్‌లో 11 మందికి చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు. ‘నగరం’ గ్రామంలో దాదాపు 50 ఇళ్ళు, దూకాణాలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. గ్యాస్ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకొని మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రికి వస్తున్నట్లు తెలిపారు. గ్యాస్‌పైప్‌లైన్ పేలుడు ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరికొద్ది సేపటిలో రాజమండ్రీ చేరుకోనున్న చంద్రబాబు

  ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో మామిడికుదురు మండలంలో నగరం గ్రామంలో గెయిల్ సంస్థకు చెందిన గ్యాస్ పైప్ నుండి గ్యాస్ లీక్ అవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్యా 15కు చేరింది. గాయపడిన వారినందరినీ అమలాపురం, కాకినాడ తదితర ప్రాంతాలలో ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం గురించి తెలిసుకొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే హోం మంత్రి చిన రాజప్పను అక్కడికి పంపించారు. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కూడా తక్షణమే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చెప్పట్టవలసిందిగా ఆదేశించారు. ఈదుర్ఘటనపై విచారణకు కూడా ఆదేశించారు. ఆయన ప్రస్తుతం డిల్లీలో ఉన్నందున వెంటనే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఈ దుర్ఘటన గురించి ఆయనకు వివరించడంతో ఆయన భాదితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి, మున్ముందు ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. చంద్రబాబు కేంద్రమంత్రులతో తన తదుపరి సమావేశాలనట్టినీ రద్దు చేసుకొని పెట్రోలియం శాఖ మాత్రి ధర్మేంద్ర ప్రాధాన్ ను వెంటపెట్టుకొని రాజమండ్రీ బయలుదేరుతున్నారు. అక్కడి నుండి వారిరువురూ రోడ్డు మార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తారు.