యదా ప్రజా తదా నేత
posted on Dec 6, 2013 8:42AM
కేంద్ర క్యాబినెట్ రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేయడంతో తెలంగాణాలో ఉద్రిక్తతలు తగ్గితే, సీమాంధ్రలో మళ్ళీ ఆందోళనలు మొదలయ్యాయి. తెదేపా, వైకాపాలు 48గంటల సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చాయి. ఉద్యోగ సంఘాలు మళ్ళీ సమ్మెకు సిద్దం అవుతున్నాయి. రాష్ట్రానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.గతానుభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ సారి సీమాంధ్ర మంత్రులు, యంపీలు, శాసనసభ్యుల ఇళ్ళకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక పోలీసు రక్షణ కల్పించారు.
సీమాంధ్రలో మారిన ఈ పరిస్థితులను చూసి రాజకీయనేతల వాదనలు, మాట తీరు, ఆలోచనలు కూడా మారిపోయాయి. నిన్నటి దాకా రాజీనామాలు తప్ప మరిదేనికయినా సిద్దం అని దృడంగా పలికిన సీమాంధ్ర యంపీలు, కేంద్రమంత్రులు మళ్ళీ తమ రాజీనామా డ్రామాలకు తెర తీసారు. ఇంతకాలంగా రాష్ట్ర విభజన అనివార్యమని వాదిస్తున్నసీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర విభజనని చివరి దాకా అడ్డుకొంటామని మళ్ళీ ప్రతిజ్ఞలు చేయడం మొదలు పెట్టారు. తెదేపా, వైకాపాలు మళ్ళీ విడివిడిగా సమైక్యపోరాటాలు మొదలుపెట్టేసాయి.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తాపత్రయం కంటే ప్రజాగ్రహానికి గురి కాకూడదనే భయమే రాజకీయ నాయకులని ఈవిధంగా మాట్లడేలా, వ్యవహరించేలా చేస్తోంది. పనిలోపనిగా ప్రజలలో ఉన్న బలమయిన సమైక్య సెంటిమెంటుని కూడా వాడుకొని ప్రయోజనం పొందుదామనే దురాశ కూడా ఇమిడి ఉంది.