జగన్ కి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత

 

ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇరుకునపడిన జగన్మోహన్ రెడ్డి, ధర్నాలు చేసే బాధ్యతను తల్లికి అప్పగించి చెన్నైవెళ్ళి ముఖ్యమంత్రి జయలలితను, ప్రతిపక్ష నేత కరుణానిధిని కలిసి సమైక్యాంధ్రకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా కరుణానిధి కుమార్తె మరియు 2జీ కేసులో నిందితురాలయిన కనిమోలి ఆయనకు స్వాగతం పలకడం విశేషం.

 

ఆయన వస్తున్నట్లు తెలిసి చెన్నైలో వైకాపా అభిమానులు బాగానే దారి పొడుగునా వైకాపా జెండాలు అలంకరించి బాగానే స్వాగతం పలికారు. అయితే చెన్నైనుండి హైదరాబాదులో కాలుపెట్టేసరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి హైదరబాదులో విమానం దిగి ఇంటికి వెళుతుంటే ఆయన కాన్వాయ్ పై కొందరు తెలంగాణా యువకులు కోడి గుడ్లు, టొమేటోలు, చెప్పులు విసిరి తమ నిరసన తెలిపారు. ఇది చూస్తే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతన్నట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.