కేసీఆర్ కోసమే ‘రాయల తెలంగాణ’
posted on Dec 6, 2013 @ 4:03PM
కెసిఆర్ ను దారిలోకి తెచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీ తనమార్కు రాజకీయం ప్లే చేసిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని తాయిలం ఆశ చూపిస్తూ వచ్చిన కేసీఆర్ తీరా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ప్లేటు ఫిరాయించేశాడు.
అందుకనే రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందే ముందు రోజున ‘ఇచ్చేది రాయల తెలంగాణ’ అనే మాటను లీక్ చేయడం ద్వారా కేసీఆర్‌ని దారిలోకి తెచ్చిందని, కేంద్రం ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతోందన్న వార్త బయటకు రాగానే కేసీఆర్‌లో టెన్షన్ పెరిగి కాంగ్రెస్‌కి దాసోహం అన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాత్రికి రాత్రే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఒప్పందాలు చాలా పకడ్బందీగా కుదిరి వుండవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ విలీనం విషయంలో తల ఎగరేసిన కేసీఆర్‌కి కీలక సందర్భంలో విలీనానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించిందని, కేసీఆర్‌ని దారిలోకి తేవడానికి ‘రాయల తెలంగాణ’ అస్త్రాన్ని విజయవంతంగా వాడుకుందని అంటున్నారు.