రాయల తెలంగాణాపై కేంద్రం వెనకడుగు
posted on Dec 5, 2013 @ 4:17PM
కేంద్ర మంత్రి వర్గం సమావేశం గురువారం సాయంత్రం సమావేశమయ్యి కేంద్రమంత్రుల బృందం ఆమోదించిన రాయల తెలంగాణా లేదా పది జిల్లాలతో కూడిన తెలంగాణాలలో ఏదో ఒక ప్రతిపాదనను ఆమోదింపవలసి ఉంది. అయితే తను ఆయాచితంగా తెలంగాణా ప్రజలకు ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దపడినా వారు అందుకు అంగీకరించకుండా, మళ్ళీ బందుల బాట పట్టడంతో రాయల తెలంగాణా ప్రతిపాదన విరమించుకొంటున్నట్లుగా కొద్ది సేపటి క్రితమే అలవాటు ప్రకారం మీడియాకు లీకులు ఇచ్చింది. తద్వారా తాము ఆ ప్రతిపాదనపై తనకు అంత ఆసక్తి లేదనే అభిప్రాయం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ముందు ప్రకటించినట్లుగానే పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రమే ఇవ్వబోతున్నట్లు మీడియాకి లీకులు ఇచ్చింది.
అయితే రాయల తెలంగాణా ప్రతిపాదనతో తమ టీ-కాంగ్రెస్ నేతలు మళ్ళీ తెలంగాణాలో దైర్యంగా తిరుగలేని పరిస్థితి కల్పించడమే గాక, ఉన్న కొద్దిపాటి పరువు కూడా రెండే రెండు రోజుల్లో పోగొట్టుకొంది. తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగానే సోనియా గాంధీకి కరీంనగర్ జిల్లా కేంద్రంలో గుడి కట్టిన ప్రజలు, రాయల తెలంగాణా ప్రతిపాదన చేయగానే దానిని కూల్చి వేయడమే ఇందుకు చక్కటి ఉదారణగా చెప్పుకోవచ్చును.
ఈ నిరసనలను చూసి భయపడి కాంగ్రెస్ అధిష్టానం రాయల తెలంగాణా ప్రతిపాదన ఉపసంహరించుకొన్నపటికీ, హైదరాబాద్ మరియు భద్రాచలంపై ఆంక్షలు, ఇతర సున్నిత అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు తెలంగాణా ప్రజలు ఆ పార్టీకి దూరం చేయడం ఖాయం. అందువల్ల ఇప్పుడు పది జిల్లాలతో కూడిన తెలంగాణా రాష్ట్రమే ఇచ్చినా, తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ పార్టీని మెచ్చి దానికి ఓటేసే పరిస్థితి ఉండకపోవచ్చును.