స్టార్ బ్యాట్స్ మ్యాన్ కి ఇంకా ఎన్నిబాల్స్ మిగిలాయో
posted on Dec 6, 2013 @ 2:10PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఎన్నివాదనలు వినిపిస్తున్నపటికీ, విభజన ప్రక్రియకు మాత్రం ఆయన ఎన్నడూ అవరోధం కలిగించలేదనేది తెలంగాణావాదులు కూడా అంగీకరిస్తారు. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తప్ప, అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తే, ఆయన పరోక్షంగా విభజనకు సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతుంది. నిన్నతెలంగాణా ఏర్పాటుకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో విభజన ప్రక్రియలో మరో అంకం ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసింది. అయితే ముఖ్యమంత్రి నుండి దానిపై ఇంతవరకు స్పందించకపోవడం చాల విచిత్రం. ఏమయినప్పటికీ, ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనేది, రాష్ట్ర విభజన లాగే ఒక పెద్ద సస్పెన్స్ గా ఉంది.
ఒకవేళ ఆయన విభజన తరువాత కూడా పార్టీలోనే కొనసాగాలనుకొన్నా, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నవారు ఆయనని ఉండనీయకపోవచ్చును. ఒకవేళ బయటకు వెళ్లి కోట్లు ఖర్చు చేసి పార్టీ పెట్టుకొన్నా, ప్రజలు నమ్మి ఓటేస్తారనే నమ్మకం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన కారణంగా అయన వేరే ఏ పార్టీలోను జేరి మరొకరి క్రింద పనిచేయడం కూడా చాలా కష్టమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏమిచేస్తారనే ప్రశ్నకి ఎవరూ కూడా ఊహించని జవాబు వచ్చినా ఆశ్చర్యం లేదు.
బీజేపీ పాలిత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ కొద్ది రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా కలవడం అనుమానాలకు తావిస్తోంది. నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ లకు అత్యంత సన్నిహితుడయిన ఆయన తమ ప్రత్యర్ధ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా ఎందుకు కలిసారో ఇంకా తేలవలసి ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై కోపంతో రగిలిపోతున్నకిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితిని అర్ధం చేసుకొన్నబీజేపీ ఇదే అదునుగా భావించి ఆయనని తమ పార్టీలోకి ఆహ్వానించి సీమాంధ్ర పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే అటు ఆయన, ఇటు సీమాంధ్రలో సరయిన నాయకుడు లేక బలహీనంగా ఉన్నబీజేపీ ఇద్దరూ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఈ కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రులిద్దరి రహస్య సమావేశం దేనికి దారి తీస్తుందో తెలుసుకోవాలంటే శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు.