కాంగ్రెస్ ఎత్తులకి కాంగ్రెస్ చిత్తు

 

కొందరు రాయలసీమ కాంగ్రెస్ నేతలు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసిన మాట వాస్తవమే. అదేవిధంగా మజ్లిస్ పార్టీ కూడా తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొదటి నుండి ఈ ప్రతిపాదన చేస్తున్నపటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గింది. అయితే ఈ ప్రతిపాదనతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒకేసారి ఎసరు పెట్టేయవచ్చని కాంగ్రెస్ పార్టీ గ్రహించడంతో తెలంగాణా ప్రజల కోరకపోయినప్పటికీ వారికి అదనంగా ఈ ‘రాయల్టీ’ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.

 

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో మజ్లిస్ ఉనికి నామమాత్రంగా మారిపోతుంది. పైగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బీజేపీ బలపడుతుందని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు రెండూ కూడా భయపడుతున్నాయి. అదే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెచ్చి తెలంగాణాతో అంటు కట్టగలిగితే, అక్కడ అధికంగా ఉండే ముస్లిం ఓటర్లవలన మజ్లిస్, రెడ్డి ఓటర్ల వలన కాంగ్రెస్ పార్టీ బలపడవచ్చనే ఆలోచన కూడా ఇందులో ఇమిడి ఉంది.

 

అయితే, తెలంగాణా ఏర్పడిన తరువాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగితే సామాజిక న్యాయం, ఆత్మగౌరవం అనే నినాదంతో ముఖ్యమంత్రి మరియు ఇతర కీలక పదవులు ఆశిస్తున్నటీ-కాంగ్రెస్ నేతల అవకాశాలను ఈ ప్రతిపాదన దెబ్బ తీస్తుంది. గనుక వారు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జరుగబోయే కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ అంశంపై తమ అధిష్టానం తీసుకొనే నిర్ణయం చూసిన తరువాతనే వారు స్పందించాలని వేచి చూస్తున్నారు.

 

ఒకవేళ రాయల తెలంగాణాకే మొగ్గు చూపితే వారు కూడా అధిష్టానానికి ఎదురు తిరగవచ్చును. అదే జరిగితే, ఈ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కళ్ళెం వేద్దామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి అసలు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల బహుశః ముందు ప్రకటించినట్లు 10జిల్లాలతో కూడిన తెలంగాణానే ఆమోదించక తప్పకపోవచ్చును.

 

రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంత కీలక దశకు చేరుకొన్నపటికీ, రాష్ట్రాన్ని ఏవిధంగా విడదీయదలచుకొందో చెప్పలేని దీనస్థితిలో కాంగ్రెస్ ఉంది పాపం. మొదటి నుండి కూడా రాష్ట్ర ప్రజలను కానీ, పార్టీలను గానీ పరిగణనలోకి తీసుకోకుండా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న ఎత్తులకి చివరికి తానే బలయిపోయే పరిస్థితి ఏర్పడింది.

 

కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. అది అప్పుడప్పుడు తనను తానే ఓడించుకొంటుంది అని కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకొనే మాట ఎంత నిజమో ఇప్పుడు అర్ధం అవుతోంది.నిన్న వెలువడిన సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక కవుంట్ డవున్ మొదలయిందని సూచిస్తునాయి.