యూపిఏను కూల్చేస్తాం: లగడపాటి

 

 

 

తాము యూపిఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శుక్రవారం చెప్పారు. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని, ఈ ప్రభుత్వం తమను అడుగడుగునా మోసం చేసిందన్నారు. విద్వేషాలు రగిల్చిన వారు పండుగ చేసుకుంటున్నారని, చీకటి ఒప్పందాలు చేసుకుని రాష్ట్రాన్ని హడావుడిగా విభజిస్తున్నారని మండిపడ్డారు. హైకమాండ్ మమ్మల్ని బదనాంచేసిందని లగడపాటి విమర్శించారు.

 

రాష్ట్రాన్ని విభజించిన తీరు అందరినీ బాధించిందని, కనీస సమాయం కూడా ఇవ్వకుండా హడావుడిగా బిల్లును ఆమోదించారని విజయవాడ లగడపాటి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల సమావేశం అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడారు. కీలక అంశాన్ని టేబుల్ ఐటెంగా తీసుకున్నారన్నారు. తమను అవమానించి...ఇష్టానుసారంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.



ఈ సీమాంధ్ర కేంద్ర మంత్రుల చిన్ని చిన్న కోరికలు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దత్తతపుత్రుడ్ని పూచికపుల్లలా తీసిపారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ రాష్ట్రపతికి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించామని, నేడో...రేపో రాష్ట్రపతిని కలువనున్నట్లు ఎంపీ లగడపాటి తెలిపారు.