"ఆత్మగౌరవాన్ని'' సోనియాకు తాకట్టుపెట్టిన నాయకులు!
posted on Dec 6, 2013 @ 3:53PM
- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
"వీడు అమ్మపెంచిన బిడ్డా, అయ్యపెంచిన బిడ్డా'' అంటే చెడిపోయినవాడెల్లా "వాడు అమ్మపెంచిన బిడ్డడే'' అన్నాడట వెనకటికొకడు! అంటే కొందరు అమ్మలా లక్షణాలు అలా ఉంటాయి కాబోలు! అలా అని "అయ్యా''లందరూ మంచివాళ్ళనీ తీర్పు చెప్పలేము, అయ్యల్లోనూ 'కొయ్య'మొగాలుంటాయి! ప్రేమకు, అబిమానానికి కూడా కొన్ని హద్డులుంటాయి. ఆ హద్దులు దాటినవాళ్ళు తమ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టేసి ఎంతకైనా దిగజారుతారనడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన సమస్య విషయంలో రాష్ట్రంలోని సీమాంధ్ర, తెలంగాణా ప్రాంతాల అధికారపక్షం, కొన్ని ప్రతిపక్షాల నాయకులు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియాగాంధీ పట్ల హద్దులు మీరి ప్రకటిస్తున్న 'విధేయత' శ్రుతిమించిన పొగడ్తలే నిదర్శనం! చివరికి వీళ్ళు అఆత్మగౌరవాన్ని కూడా చూసుకోనంతగా ప్రవర్తిస్తున్నారు. ఒకవైపున అనూహ్యమైన రీతిలో సోనియాగాంధీ పుట్టుపూర్వోత్తరాల తబిశీళ్ళ గురించి, ఆమె కుటుంబం తాలూకూ వివరాల గురించీ, వివాహమైన తీరు గురించీ, చివరికి ఆమె పేరుకున్న పూర్వరంగాన్ని గురించీ ఇంటర్నెట్ లోనూ, వెబ్ సైట్స్ లోనూ వస్తున్న అసాధారణ సమాచారం గురించీ ఆంధ్రప్రదేశ్ లోని ఇరుప్రాంతాలలోని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ లో చేరడానికి ఉవ్విళ్ళూరుతున్న వేర్పాటువాదియైన 'బొబ్బిలిదొర' ఏమాత్రం పట్టించుకున్నట్టులేరు! ఒకవేళ పట్టించుకునే పక్షంలో ఇంటర్నెట్, వెబ్ సైట్స్ లో భారీస్థాయిలో సోనియా గురించి ప్రవాహవేగంతో కుమ్మరిస్తున్న సమాచారంవల్ల తామిప్పటికే కోల్పోయిన ఆత్మగౌరవం మరింతగా ఎక్కడ బుగ్గిపాలై పోతుందోనని వీరికి భయమైనా ఉండి ఉండాలి, లేదా తుమ్మితే ఊడిపోయే తమ పదవులను కాపాడుకునే యత్నంలో పరువుప్రతిష్టలను ఆత్మగౌరవాన్ని సహితం పణంగా పెట్టినందువల్ల అదనంగా వచ్చే నష్టంలేదన్న భరోసా అయినా ఉండి ఉండాలి!
ఆత్మగౌరవంతో హుందాగా ప్రజలకు నాయకత్వం వహించి దేశ స్వాతంత్ర్యరథాన్ని సజావుగా నడిపించిన ఒకనాటి కాంగ్రెస్ నాయకత్వం వేరు, కేవలం 65ఏళ్ళ పాలనలో రాజ్యపాలనకు వచ్చిన కాంగ్రెస్, బిజెపి సంకీర్ణ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ఈ రెండు పార్టీల నాయకులు వేరు. స్వాతంత్ర్యానంతర భారతంలో కనీసం కడచిపోయిన గత నలభయ్యేళ్లలోనూ "ప్రోగ్రెసివ్ టాక్సేషన్'' స్థాయిలో పాలకపక్షాలయిన ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులూ, వారి పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ, వారి ప్రధానమంత్రులు, మంత్రులు సహా ఎలా ఏదో ఒక అవినీతికి పడగలెత్తుతూ వచ్చిన వారే! కనుకనే కేంద్రస్థాయిలో అవినీతికి, కుంభకోణాలకు అంతులేకుండా పోయింది. ఈ పరిణామం కేంద్రస్థాయిలో సోనియాను కూడా ఇరకాటంలో పెట్టగల స్థాయికి చేరుకుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యపై సోనియా వహించిన నాయకపాత్ర ఎంతో చరిత్రగలిగిన తెలుగుజాతికి వినాశకరంగా పరిణమించింది; ఆమె దృఢమైన అవగాహనకు తెలుగుప్రజల్ని నెట్టివేసింది! ఇందుకు దోహదం చేయడంలో తమ పదవీ స్వార్థప్రయోజనాల కోసం ఇరుప్రాంతాల కాంగ్రెస్ నాయకులు సిగ్గువిడిచి సోనియాకు చేయూతనిచ్చారు. ఇరుప్రాంతాలలోని తెలుగుప్రజలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంద్వారా ప్రజలలో చైతన్యాన్ని రేకెత్తించి, తెలంగాణలో "చెట్లపాదులను కూడా రాజకీయలు మాట్లాడ''గల స్థాయికి చేర్చిన వాతావరణంలో అంతవరకూ "నీ బాన్చను దొరా, నీ కాల్మొక్తా'' అన్న స్థితినుంచి ప్రజలైనా విముక్తి పొందారుగాని నాయకులు మాత్రం ఆ దుస్థితినుంచి విముక్తి పొందలేదని ఇటీవల పరిణామాలు నిరూపిస్తున్నాయి. నేడు ఇరుప్రాంతాలలో పెక్కుమంది కాంగ్రెస్ నాయకులు ప్రజలు 60 ఏళ్ళనాడే సాయుధపోరాట దీక్షలో తన్నితగలేసిన బానిసత్వాన్ని అందిపుచ్చుకుని తెలుగుజాతిని చీల్చడానికి కంకణం కట్టుకున్న సోనియా ముందు "నీ బాన్చలం తల్లీ! నీ కాల్మొక్తాం'' అంటూ సాగిలపడడాన్ని తెలుగుజాతి సహించలేకపోతోంది! "ఆత్మగౌరవ పోరాటా''న్ని కాస్తా వీరు ఆత్మవంచనా ప్రక్రియగా మార్చేశారు.
సోనియా కాళ్ళముందు సాగిలపడడంలో ఏ స్థాయికి వీరు దిగజారిపోయారో కొన్ని ఉదాహరణలు : కేవలం రానున్న జనరల్ ఎన్నికల్లో మన రాష్ట్రంలో కోల్పోనున్న కాంగ్రెస్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను కాపాడుకునేయత్నంలో, తద్వారా తన వారసుడైన రాహుల్ రాజకీయ భవిష్యత్తును పదిలపరచుకునేందుకు సోనియా తెలుగుజాతిని ముక్కలు చేయడానికి సంకల్పించి రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆశీస్సులు పలకడంతో రాష్ట్రప్రజలు పెద్దఎత్తున నిరసనకు దిగవలసివచ్చింది. ఆ నిరసన రకరకాల రూపాల్లో వ్యక్తం కావటం, జీవన్మరణ సమస్యలను ప్రజలు ఎదుర్లోవలసి వచ్చినప్పుడు అతి సహజం.ఆ ధర్మాగ్రహంలో భాగమే ప్రజాబాహుళ్యం సోనియా, రాహుల్ గాంధీల బొమ్మలతోపాటు, విగ్రహాలతో పాటు రాష్ట్ర విభజనకు పదవీ స్వార్థప్రయోజనాల కోసం 'గొర్రెల్లా' తలలు వూపిన స్థానిక ఎం.పి.ల, ఎం.ఎల్.ఏ.ల దిష్టిబొమ్మల్ని కూడా తగలపెట్టారు. ఆ క్రమంలో కొందరు స్థానిక కాంగ్రెస్ వందిమాగధులు తమ ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నదికాగ, ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా న్యూనపరుస్తూ ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్ర విభజన ద్వారా తెలుగుజాతిని కించపరచడానికి నడుంకట్టుకున్న కాంగ్రెస్ అధిష్ఠానాన్ని, దాని నాయకురాలయిన సోనియానూ ఎదుర్కునేదిపోయి, ఇరుప్రాంతాలలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు, వారికి తన స్వార్థం కొద్దీ కాపుకాస్తున్న "బొబ్బిలిదొర'' వర్గమూ "సోనియాను కించపరిచినవారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రకటనలు జారీచేశారు; అంతేగాదు, ఆమెను తమ పాలిట"స్థానిక దేవత''గా ప్రకటించి, ఆ "దేవత''కు ఒక "దేవాలయాన్ని'' కూడా నిర్మించాలని పోటాపోటీలమీద ఒక జిల్లా కాంగ్రెస్ నాయకులే బాహాటంగా తీర్మానించారు! తెలుగుజాతిని చీలుస్తున్నందుకు "జైజై సోనియా'' అంటూ ప్రత్యేక యాత్రలు తలపెట్టారు!
ఈ 'మేళా'లో ఒక గమ్మత్తు పరిణామం కూడా ఘటిల్లింది. ఇది, తెలంగాణా ప్రజలు మిలిటెంట్ పోరాటాల ద్వారా విదిలించుకున్న, వదిలించుకున్న బానిసత్వంలోకి తిరిగి ప్రజల్ని నెట్టేందుకు, తమ పెత్తనాన్ని తిరిగి ప్రతిష్ఠించి, బడుగు ప్రజలనెత్తిపైన పెత్తనం కొనసాగించుకోడానికి 'దొరల'పార్టీ (తెలంగాణా పేరిట ఏర్పడిన 'సమితి') నాయకులకూ, పాట జాగిర్దారీ, భూస్వామ్య కుటుంబాలకు చెందిన ఇతర మోతుబరులకూ తీవ్రమైన రాజకీయపోరు సాగుతోందని ప్రజలు మరచిపోరాదు. ఆ 'మాధ్యమాన్ని'' సోనియాలో చూసుకున్నారు! రోగి కోరుకున్నదీ, వైద్యుడు సూచించిన మందూ ఒకటే అయింది! ఆ మాధ్యమమే సోనియా! కాని సోనియా పుట్టుపూర్వాలు ఈ తెలుగునాయక 'బానిసల'కు తెలిసినప్పటికీ వీరు 'కిమ్మన్నాస్తిగా' నటించడంద్వారా తమ పదవుల్ని రక్షించుకోవటమే ప్రధాన వ్యాపకంగా మారింది! సరిగ్గా ఈలోగా, భారతీయులుగానీ, వారిలో భాగమైన తెలుగుజాతిగానీ గర్వించడానికి సంకోచించే విషయాలు సోనియా గురించి వెబ్ సైట్స్ లో తామర తంపరగా దూసుకువచ్చాయి! పండిట్ నెహ్రూ కుటుంబం, మోతిలాల్ నెహ్రూ సహా తమ ఆస్తిపాస్తులను, స్థిరచరాస్తులనూ అత్యధికభాగం భారత స్వాతంత్ర్యోద్యమం కోసం ధారపోశారు.
ఈ పెత్తందారీ పోరును కడకంటూ కొనసాగించుకోడానికి ఒక నాయకత్వ మాధ్యమం కరిగించుకున్నారు. కాని సోనియాగాంధీ, ఆ ఇంటికోడలుగా అడుగుపెట్టిన తరువాత సోనియా ఇంగ్లాండ్ రాణి ఆస్తుల విలువను కూడా వెనక్కినెట్టేసి, రూ.12 వేల కోట్ల విలువగల ఆస్తుల్ని కూడబెట్టిందనీ, 16వ స్థానంలో ఉన్న ఇంగ్లాడ్ రాణిని 12వ స్థానాన్ని ఆక్రమించుకున్న సోనియా ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలయిందనీ ప్రసిద్ధ అమెరికన్ మీడియా "హఫింగ్టన్ పోస్ట్ వరల్డ్'' ఈ నెల 3వ తేదీన (3-12-2013) ఆరోపణ చేసింది! ఇలా మరెన్నో వివరాలను ఈ సంస్థ బట్టబయలు చేసింది. ఈ "పురోగతి''చూస్తూ తెలుగువాళ్ళలో ఉన్న ఒక ముతక సామెత గుర్తుకొస్తోంది - "తన ముడ్డి గాకపోతే కాశీవరకూ దేకవచ్చు''నని! ఎందుకంటే అధికారికంగా సోనియా పేరు "సోనియాగాంధీ'' కాదనీ, ఆమె పాస్ పోర్టులో పేరు "గాంధీ''కాదు, 'సోనియా'నూ కాదనీ, ఆమె అసలు (ఇటాలియన్) పేరు "ఎడ్విజి ఆంటోనియా ఆల్బినా మాయినో'' అనీ, "సోనియా'' అన్నపదం రష్యన్ పెరనీ "వెబ్ సైట్స్''లో "ప్రతిభారతీయుడూ తెలుసుకోవలసిన సమాచారం యిది'' అనీ ఉంది!
ఇటాలియన్ వనిత అయిన ఆమెకు రష్యన్ పేరు "సోనియా'' ఎలా వచ్చిందన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆ సమాచ్వారం ఆమె తండ్రి అని చెప్పే స్టెఫానో యూజీనీ మాయినో కూడా ఇటాలియన్ కాదట, జర్మన్ అట. ఇతడు నాజీ హిట్లర్ జర్మనీలో పనిచేసినవాడు. హిట్లర్ సైన్యం రష్యామీద దురాక్రమించి, రెండవ ప్రపంచయుద్ధానికి దారితీసిన సమయంలో ఆ సైన్యంలో పనిచేసిన స్టెఫానో, రష్యా సైన్యానికి పట్టుబడిన సైనికుల్లో ఒకడు! అతన్ని రష్యన్ సైన్యం బంధించి 20 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. ఆ దరిమిలా అతన్ని రష్యన్ ప్రభుత్వం తన గూఢచారి శాఖ అయిన "కె.జి.బి.'' సంస్థకు అతడు లొంగిపోయి క్షమాభిక్ష పొందిన పిమ్మట రష్యన్ గూఢచారిగా ఉపయోగించుకుంది! నమ్మకం కుదిరిన తర్వాత శిక్షాకాలాన్ని నాలుగేళ్ళకు కుదించేశారు. జైలు నుంచి బయటపడిన స్టెఫానో తన కూతుళ్ళకు రష్యన్ పేర్లు పెట్టారు. అందులో ఒక పేరే "సోనియా'' అట! అదో గాధ!
గా స్టెఫానో ఇటాలియన్ నియంత ముసోలీనీకి విధేయుడైన బంటూ, మద్ధతుదారూ అని "వికిపీడియా'' సమాచారం! అంటే ప్రపంచయుద్ధానికి కారకులయిన ఇద్దరూ (హిట్లర్, ముసోలినీ) సోనియా తండ్రికి అత్యంత సన్నిహితులు! ముసోలినీ అనేవాడు ఫాసిస్టు! అంతేగాదు, మరో విచిత్రం - కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా కనిపించే నేటి ఆర్.ఎస్.ఎస్. మతోన్మాద సంస్థ పూర్వికులు ఈ ముసోలినీ, హిట్లర్ లతో సంబంధాలు కలిగినవారని జెఫ్రలాట్ అనే చరిత్ర విశ్లేషకుడు 'హిందూయిజం' పుట్టుపూర్వాల విశ్లేషణలో పేర్కొన్నాడు కూడా!
స్పానిష్ రచయిత్రి జేవియర్ మోరో, ఇటాలియన్ సోనియా గురించి "ది రెడ్ శారీ'' అన్న మకుటంతో ఓ జీవిత చరిత్రను 2009లో విడుదల చేసింది. అందులో ఇండియా గురించి ప్రస్తావించి, సోనియా 'ఇండియాలో సాహసయాత్ర'లు చేస్తోందనీ, సోనియా-రాజీవ్ ల కొడుకు రాహుల్ ఈసారి ఒకే (నెహ్రూ) కుటుంబంనుంచి దేశాన్ని ఏలుతున్న వారిలో నాల్గవతరంగా భారత ప్రధానిగావచ్చునన్న నమ్మకం నాకు కలిగింద''ని జేవియర్ మోరో రాసిందట! "దేశం గొడ్డుబోయినట్టు''గా మరెవరూ ప్రధానమంత్రి కాగాలవారు ఇండియాలోనే లేనట్టుగా ఇలా ప్రచారం జరగడానికి కారణం అంతా - భారత నాయకులు చాలామంది ఆత్మగౌరవం లేనివారు కావడమూ, వంశపారంపర్య సంస్కృతికి బానిసలు కావడమూ, నెహ్రూ కుటుంబం పార్టీలో సమర్థులయినవారిని ఎదిగిరానివ్వకుండా జాగ్రత్త పడటమూ, ఉన్నవారిని తినాతీలుగా మార్చుకోవటమూ, వెన్నెముకగలవారి వెన్ను విరిచేయడంలోనే ఉంది! బానిస మనస్తత్వాన్ని మార్చడం కష్టమనీ, ముఖ్యంగా కట్టుబానిసల్ని పెంచే రాజకీయ పార్టీలో మరింత కష్టమని మన రాష్ట్ర రాజకీయాలు నిరూపిస్తున్నాయి.