టిడిపి ఎంపీలపై లాఠీచార్జ్...తీవ్ర గాయాలు
posted on Dec 6, 2013 @ 10:19AM
కేబినెట్ హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నివాసం వద్ద ధర్నా చేపట్టిన టిడిపి సీమాంధ్ర ఎంపీల పై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 10 జిల్లాల తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోద౦ తెలపడంతో...ఆగ్రహంతో టిడిపి సీమాంధ్ర ఎంపీలు షిండే నివాసం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటు అమానుషమని, అదొక తప్పుడు నిర్ణయమని మండిపడ్డారు. వైఎస్ జగన్ కోసమే సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
టిడిపి ఎంపీ సీఎం రమేశ్ విలేకరులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోని ఆయన మెడ మీద చెయ్యి వేసి తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సంధర్బంగా పోలీసులు ఎంపీల మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జి చేయడంతో సీఎం రమేశ్‌కు, మోదుగులకు, ఒక కార్యకర్తకు బాగా దెబ్బలు తగిలాయి. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ వీధి పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని అర్ధరాత్రి దాటినా వదిలిపెట్టలేదు.