పది జిల్లాలతో కూడిన తెలంగాణకే ఆమోదం
posted on Dec 5, 2013 @ 7:47PM
దాదాపు 3 గంటల సేపు సాగిన కేంద్రమంత్రి వర్గ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. అనంతరం హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణానే కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని ప్రకటించారు. పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా సాగే హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజల హక్కులను కాపాడే బాధ్యత తెలంగాణా గవర్నర్ దేనని తెలిపారు. ఆర్టికల్ 371 (డీ) రెండు రాష్ట్రాలలో కొనసాగుతుందని తెలిపారు. జలవనరులు, విద్యుత్ తదితర కీలక అంశాలలో కేంద్రం పాత్ర ఉంటుందని తెలిపారు.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎక్కడ నిర్మించాలో ననిర్ణయించేందుకు ఒక నిపుణుల కమిటీ వేయబడుతుందని, అది 45 రోజులలో తన నివేదికను సమర్పిస్తుందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం తగినన్ని నిధులు విడుదులు మంజూరు చేస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా క్యాబినెట్ ఆమోదం పొందిందని, దానికి అవసరమయిన అనుమతులు, నిధులు వగైరా అన్నీ కేంద్రమే చూసుకొంటుందని ఆయన తెలిపారు.
ఈరోజు ఆమోదింపబడిన తెలంగాణా బిల్లు రేపు లేదా ఎల్లుండి రాష్ట్రపతికి పంపబోతున్నట్లు షిండే తెలియజేసారు. అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపటి నుండి మూడు రోజుల పాటు పశ్చిమ బెంగాల్ యాత్రకి బయలుదేరబోతున్నారు. అంటే షిండే చెప్పినట్లు రేపు కాక ఈరోజు రాత్రే రాష్ట్రపతికి తెలంగాణా బిల్లు అందజేయవచ్చును. లేకుంటే ఆయన కోల్ కత చేరుకొన్నతరువాత అక్కడికే బిల్లుని పంపి, ఆయన ఆమోదిస్తే అక్కడి నుండే నేరుగా రాష్ట్రశాసన సభకు పంపవచ్చును. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తామని షిండే తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, కావూరి సాంభశివరావు, పల్లంరాజు, కిషోర్ చంద్ర దేవ్ కూడా పాల్గొని తమ తమ ప్రాంతాలకు అనుకూలంగా బలంగా వాదనలు వినిపించారు. అయితే క్యాబినెట్ విభజనకే మొగ్గు చూపడంతో, సీమాంధ్ర మంత్రులు ముగ్గురు సమావేశం ముగిసే ముందే బయటకు వెళ్ళిపోయారు. వారు సీమాంధ్రకు ఇస్తున్న ప్యాకేజీ పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ప్రకటించినట్లు సమాచారం.