నాచారంలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న కెమికల్ ఫ్యాక్టరీ

  హైదరాబాద్ లోని నాచారం పారిశ్రామిక కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం కెమికల్  ప్యాక్టరీలోని రియాక్టర్ పేలి భారీ ప్రమాదం జరిగింది. అయితే కార్మికులను అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్న అలారం ముందుగానే మోగడంతో... అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లిపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ కెమికల్ సిలిండర్లు పేలుతుండటంతో దాదాపు 200 అడుగులకు పైగా దట్టమైన పొగలు మల్లాపూర్ వరకూ ఐదు కిలోమీటర్ల దూరం కమ్మేయగా, సమీపంలోని ఓ ఇల్లు కూడా మంటల్లో చిక్కుకుంది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.      

రాహుల్ గాంధీ అమ్మాయిలా మాట్లాడితే ఇలా ఉంటుందటా..

  రాహుల్ గాంధీ అమ్మాయిల మాట్లాడితే ఎలా ఉంటుంది.. అచ్చం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ లా ఉంటుందంటా. అదేంటీ అనుకుంటున్నారా.. అలాగే ఉంటుందంటున్నారు నెటిజన్లు. ఇంతకీ మ్యాటరేంటంటే.. డింపుల్ యాదవ్.. సమాజ్ వాదీ పార్టీ తరపున ఎంపీ. అయితే లోక్ సభలో తనకు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై మాట్లాడే అవకాశం వచ్చిందట. ఈ నేపథ్యంలోనే ఆమె తను రాసుకొచ్చుకున్న పేపర్ ను తీసి చాలా ఆవేశంగా గుక్క తిప్పుకోకుండా చదువుతూ వెళ్లారంట. అయితే అది ఇంగ్లీష్ మీడియంలో చదివే మూడు, నాలుగు తరగతులు చదువుతున్న పిల్లలు మాట్లాడే ఆంగ్లంలా ఉండటంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వు ఆపుకోవడానికి చాలానే ప్రయత్నించారట. దీంతో రాహుల్ సైతం ఇలాగే మాట్లాడతారంటూ ఆమె మాట్లాడిన వీడియోను పోస్ట్ చేయగా అది నెట్టింట్లో వైరల్ అవుతోంది ఇప్పుడు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అనాసక్తి.. అక్కడికి ఇప్పుడే వెళ్లలేం...

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూన్ కల్లా ప్రభుత్వ ఉద్యోగులందరనీ ఏపీకి రప్పించడానికి చూస్తుంటే.. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుండి మాత్రం ఏపీ ఉద్యోగులు అక్కడికి వెళ్లడానికి ఏమాత్రం ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడంలేదు. ఇప్పటికే అక్కడ అద్దే ఇళ్లు దొరక్కా.. ఒకవేళ దొరికినా చుక్కలంటే రేట్లు.. ఇంకా ఎటువంటి మౌలిక వసతులూ లేకపోవడం వల్ల అక్కడికి ఎలా వెళ్లాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ నేత మురళీకృష్ణ మాట్లాడుతూ.. జూన్ లోగా అమరావతి వెళ్లడం సాధ్యం కాదని.. వచ్చే ఏడాది మార్చి వరకూ సమయం ఇవ్వాలని కోరారు. ఒక్కో మంత్రి ఒక్కోలా చెబుతున్నారని, 80 శాతం మంది ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే, ముందడుగు ఎలా వేస్తారని.. తమ పిల్లల అడ్మిషన్లు పూర్తయ్యాయని, స్పష్టమైన హామీలు లేకుండా వెళ్లలేమని ఉద్యోగులంతా ముక్తకంఠంతో తమ అభిప్రాయాలను చెబుతున్నారని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో వింత జంతువుల దాడి..నిజమా? పుకారా?

పశ్చిమగోదావరి జిల్లాలో వింత జంతువులు సంచరిస్తున్నాయంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. గత నెలలో చిన్నతాడపల్లి, రామన్నగూడెం తదితర గ్రామాల్లో పశువులపై వింత జంతువులు దాడి చేశాయని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటి వరకు 60 లేగదూడలను చేంపేశాయని చెబుతున్నారు. తాజాగా మరోసారి తాడేపల్లి గూడెం మండలం చినతాడేపల్లి గ్రామంలోని పొలాల్లో నాలుగు వింత జంతువులు సంచరిస్తున్నాయని స్థానికులు చెప్పారు. అవి లేగ దూడలపై దాడి చేశాయి. ఈ దాడిలో రెండు దూడలు మరణించగా..మరో రెండు దూడలకు గాయాలయ్యాయి. అడ్డువచ్చిన రైతులపై కూడా అవి దాడిచేశాయని గ్రామస్తులు చెప్పారు. దీంతో సమీపంలోని రైతులు పరుగులు తీశారు. ఇంతకి అవి వింతజంతువులా లేక పేరు తెలియని జంతువులా..సమాచారం అందుకున్న పోలీసు, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రపంచంలోనే పెద్ద విమానం హైదరాబాద్‌లోనే ఎందుకు దిగింది...?

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన ఘనత దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టింది. అంటనోవ్ ఏఎన్-225 మ్రియా విమానం ఆరు టర్బో ఫ్యాన్ ఇంజన్లు కలిగిన ఈ విమానం గరిష్టంగా 640 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. ప్రస్తుతం నిర్వహణ సర్వీసులు అందిస్తున్న విమానాల్లోకెల్లా అతిపెద్ద రెక్కలు దీనికి ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ నుంచి ఆస్ట్రేలియ వెళుతున్న ఈ విమానం విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చింది. శంషాబాద్‌లో ల్యాండ్ అవగానే అధికారులు నీళ్లు చల్లి సంప్రదాయ స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని పొడవైన రన్‌వే, విమానం ల్యాండింగ్‌కు అనుకూలమన్న భావనతోనే, ఈ విమానం ఇక్కడ ల్యాండయ్యింది. ఈ విమానం భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత దక్కించుకున్న తొలి విమానాశ్రయంగా ఆర్జీఐ రికార్డుల్లోకి ఎక్కింది.

మాల్యాకి రెడ్ కార్నర్.. ఇంటర్ పోల్ ను కోరిన ఈడీ

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎంచక్కా విదేశాలకి చెక్కేసిన విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి మన ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ రద్దు చేశారు ఈడీ అధికారులు. అంతేకాదు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయాలని ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే.. ఇంటర్ పోల్ ను రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయమని కోరింది. కాగా ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను పంపించడం కుదరదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలో తగ్గిన కాలుష్యం.. ఈసారి 9వ స్థానం..

  మన దేశంలో కాలుష్యానికి మారు పేరు ఢిల్లీ అన్నట్టు ఉండేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం తగ్గిపోయినట్టు తెలుస్తోంది తాజా సర్వేలను బట్టి. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన జాబితాలో ఢిల్లీ ఈసారి 9 వ స్థానాన్ని దక్కించుకుంది. ఒకప్పుడు టాప్ 5 లో ఉండే ఢిల్లీ ఈసారి మాత్రం కాలుష్యాన్ని తగ్గించుకొని టాప్ 9 ప్లేస్ లో నిలిచింది. సగటు పీఎం 2.5 ఇప్పుడు ఢిల్లీలో 122 మైక్రో గ్రామ్ పర్ క్యూబిక్ మీటర్‌గా ఉందని రిపోర్టు తెలిపింది. కాగా టాప్-5 జాబితాలో గ్వాలియర్, అలహాబాద్, పట్నా, రాయ్‌పూర్‌ నగరాలు కాలుష్యంలో ఢిల్లీని మించిపోయాయని తేలింది. ఇరాన్ లోని కాబూల్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరితమైన నగరంగా నిలిచిందని ఈ రిపోర్టు నివేదించింది.   ఇక రిపోర్ట్ లో ఢిల్లీకి 9 వ స్థానం దక్కడంపై ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. మోస్ట్ పొల్యూటెడ్ సిటీల జాబితాలో ఇక ఢిల్లీ లేదని, ఇందుకు ఢిల్లీ వాసులకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

దావూద్ పాక్ లోనే ఉన్నాడు.. ఇదే చిరునామా..!

  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ను పట్టుకోవడాని భారత ప్రభుత్వం కొన్ని ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దావూద్ ఇబ్రహీం పాక్ లో ఉన్నాడంటూ భారత్ ఎప్పటినుండో చెబుతున్న పాక్ మాత్రం ఎప్పటిలాగే అలాంటిదేం లేదని బొంకేది. అయితే ఇప్పుడు తాజాగా దావూద్ పాక్ లోనే ఉన్నాడన్న విషయం స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలిసింది. ఓ ఆంగ్ల మీడియా దావూద్ కు సంబంధించి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా తాను పాక్ లోనే ఉన్నాడని.. అంతేకాదు తాను ఉంటున్న ఇంటి చిరునామాను సాధించింది. పాకిస్థాన్‌ దక్షిణ కరాచీలోని క్లిఫ్టన్‌ లో డీ 13, బ్లాక్ 4లో ఉంటున్నట్టు కనుగొంది. దావూద్ బంగ్లాకు సమీపంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, దావూద్ భవంతి ఉన్న విలాసవంతమైన ప్రాంతం ఫొటోను క్లిక్ మనిపించారు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌పై పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూనే ఈ ఆధారాలను కూడా పాక్ ప్రభుత్వం తిరస్కరించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు.  

అన్నాడీఎం, డీఎంకే ప్రకటనలతో ఇరుక్కుపోయిన నటి..

  త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి రాజకీయాల్లో వేడి వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే.. డీఎంకే పార్టీలు ఓ ప్రకటనలు చేయించాయి. ఇప్పుడు ఈ ప్రకటనలవల్ల పార్టీల సంగతేమో కానీ.. ప్రకటనలో నటించిన ఓ సీనియర్ తమిళ నటి మాత్రం ఇరుక్కుపోయారు. ఎందుకంటే రెండు ప్రకటనల్లో నటించిది ఆమెనే.. అసలు సంగతేంటంటే..కస్తూరి అనే నటితో అన్నాడీఎంకే ఓ ప్రకటన రూపొందించింది. "నాకు కన్నబిడ్డలే తిండి పెట్టలేదు. అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే" అని అమ్మ క్యాంటీన్లను చూపుతూ ప్రకటన చేయించారు. దీనికి రూ. 1500 ఇచ్చారట.   అయితే ఆతరువాత డీఎంకే నేతలు కూడా వచ్చి ఆమెను ప్రకటనలో నచించాలని కోరారు. అయితే తాను అప్పటికే నటించానని చెప్పినా వినకుండా బలవంతంగా తీసుకెళ్లి.. "గాల్లో తిరిగే వారికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు? చాలమ్మా.." అంటూ చెప్పించి, ఓ రూ. 1000 చేతిలో పెట్టి పంపారు. దీంతో ఇప్పుడు రెండు ప్రకటనలు టీవీ ఛానళ్లలో పోటా పోటీగా ప్రసారమవుతున్నాయి. మరోవైపు కస్తూరి మాత్రం తనకే పాపం తెలియదని.. డీఎంకే నేతలే బలవంతంగా తీసుకెళ్లి ప్రకటన చేయించారని ఆరోపిస్తున్నారు.

ముస్లింలపై మళ్లీ మాట మార్చిన ట్రంప్.. అది సలహా మాత్రమే

  అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ తరువాత మాట మార్చడం సహజమే. ఆవేశంతో అని.. ఆతరువాత తన ఉద్దేశం అది కాదని మాట మార్చుతూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి కూడా అలానే చేశారు. గతంలో ట్రంప్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను కనుక అధికారంలోకి వస్తే ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించనీయనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై ట్రంప్ మాట మార్చేశాడు.   ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్రదాడుల స‌మ‌స్య ఉంద‌ని, అమెరికాలో ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ విధిస్తే.. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంద‌న్నారు. అమెరికా ఎన్నో స‌మ‌స్య‌ల్ని ఎదుర్కుంటోందని, అయితే ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ అంశాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేద‌ని ట్రంప్ అన్నారు. స‌మ‌స్య‌ల దృష్ట్యా ముస్లింల‌పై ఆ వ్యాఖ్య చేశాన‌ని, ఇది కేవ‌లం త‌న స‌ల‌హా మాత్ర‌మేన‌ని వ్యాఖ్యానించారు.     మరోవైపు ఏకంగా ట్రంప్ గెలవాలని ఢిల్లీలోని హిందూ సేనా నేషనలిస్ట్ గ్రూప్ నేతలు పూజలు, హోమాలు కూడా జరిపిస్తున్నారు. అంతేకాదు ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడాలంటే అది ఆయనకే సాధ్యమని వారు అంటున్నారు.

లైవ్ లో యువతి ఆత్మహత్య..

  తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అందరికి హడలిపుట్టింటి ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన ఎక్కడ జరిగిందనుకుంటున్నారా.. దక్షిణ పారిస్ లోని ఇగ్లీలో.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇగ్లీలోని 19 సంవత్సరాల యువతి అత్యాచారానికి గురైంది. దీంతో జీవతంపై విరక్తి చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే ఆమె పెరిస్కోప్ అనే యాప్ ద్వారా తన ఆత్మహత్యను ప్రత్యక ప్రసారం చేసి.. ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకొని.. అందులోని వీడియోలను పరిశీలిస్తున్నారు.   కాగా పెరిస్కోప్ యాప్ ద్వారా ట్విట్టర్ ఖాతాదారులు లైవ్ వీడియోలను చూసే అవకాశం ఉంది.  లైవ్ వీడియోలను వీక్షించేందుకు, షేర్ చెయ్యడానికి ఈ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంది.

ప్లాస్టిక్ వాడితే 500 రూపాయల ఫైన్..

ప్లాస్టిక్ వాడితే ప్రాణానికి హాని అని అందరికి తెలిసిన విషయమే. కానీ తెలిసినా వాటిని వాడకుండా ఉండలేం. ఏదో ఒక రూపంలో దానిని ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ప్లాస్టిక్ ను వాడితే 500 రూపాయలు జరిమానా విధించాలని.. ఇదే చర్యను రెండుసార్లు చేస్తే 1000 రూపాయలు జరిమానా విధించాలని కమిషనర్.. మంజునాథ్ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలకు కూడా.. ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, బ్యానర్స్ కానీ తయారుచేసినట్టయితే వారికి 5 లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని కూడా చెప్పారు. ఇలాంటి పద్దతిని కేరళలో గత ఏడాది, సెప్టెంబర్ నెల నుండి అమలు పరుస్తున్నారని.. అక్కడ ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడితే 5వేల రూపాయలు జరిమానా.. ఇంకా ఎక్కుసార్లు అయితే జరిమానా 25 వేల రూపాయలు వరకూ ఉంటుందని తెలియజేశారు.   ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు.. క్లాత్ షాపింగ్ బ్యాగ్స్ వాడాలని.. డ్రింక్స్ లాంటివి తాగేటప్పుడు స్ట్రాలను అవాయిడ్ చేయాలని.. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ లాంటివి వాడకూడదని సూచించారు. మరి ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

సాయిబాబా దేవుడా..? కాదా..?.. బాబా ఫైట్

  ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే.. రమణానంద మహర్షి, శ్రీ గోవిందానంద సరస్వతిల మధ్య జరిగే మత పోరు. ఒకరు సాయిబాబా దేవుడంటే.. మరోకరు కాదు అని వాగ్వాదాలకు తెర తీశారు. దీంతో ఇప్పుడు షిరడీ సాయిబాబా దేవుడా? కాదా..? అంటూ పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక దీనిపై జరిగినా చర్చా కార్యక్రమంలో ఇరువురు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు.   గోవిందానంద  సరస్వతి మాట్లాడుతూ.. ఏదైనా శాస్త్రం, వేదం మాత్రమే ప్రమాణమని.. సాయిబాబా హిందువా, ముస్లిమా, తల్లిదండ్రులు ఎవరు? హిందూ దేవుడిగా ఎందుకు చూపిస్తున్నారు? ఆయన ఏ శాస్త్ర పరంపరకు చెందినవాడని గోవిందానంద ప్రశ్నలను కురిపించారు.   దానికి రమణానంద మహర్షి సమాధానం చెబుతూ.. వేదాలు, శాస్త్రాలూ లేనే లేవని, వాటిని తాము నమ్మబోమని సాయి మతాతీతుడని, తల్లిదండ్రులు లేని శివస్వరూపమని రమణానంద చెప్పుకొచ్చారు. కాగా ఈ చర్చను తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఆసక్తిగా తిలకిస్తుండగా, మాడుగుల నాగఫణిశర్మ, జొన్నవిత్తుల తదితర పలువురు ప్రముఖులు స్పందించి తమ అభిప్రాయాలు చెబుతూ, ఇద్దరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఆఖరికి దేవుడిపై కూడా వివాదాలు తెస్తున్నారు.

కుక్కల బెడదకు ఏపీ పరిష్కారం ఇదే..!

వీధి కుక్కల దాడిలో పసిబాలుడు మృతి...జనాన్ని బెంబేలేత్తిస్తున్న కుక్కలు..ఇలాంటి మాటలు ఇకపై వినిపించకుండా, కుక్కల బెడద నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పరిష్కార మార్గాన్ని ఆలోచించింది. ఇంతకు ముందు కుక్క కాట్లు నమోదైతే అధికారులు ఆగమేఘాల మీద స్పందించేవారు. ఎక్కడికక్కడే పట్టి వాటిని చంపేసేవారు. వ్యానుల్లో ఎక్కించి ఎలక్ట్రిక్ షాక్‌, ఇంజెక్షన్లతో చంపేసేవారు. ఇలాంటి చర్యలపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కుక్కల నియంత్రణకు ఏపీ పురపాలక శాఖ కొత్త ఆలోచన చేసింది. పట్టిన కుక్కలను ఊరికి దూరంగా వదిలివేయకుండా సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసి వాటి ఆలనాపాలనా చూడనుంది. కుక్కల సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేక ఆవాసాలున్నాయి. ఇప్పటి వరకు 16 వేల కుక్కులకు శస్త్ర చికిత్సలు చేసినట్టు పురపాలక శాఖ ప్రకటించింది. రానున్న 150 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రియాంక గాంధీ జపం చేస్తున్న కాంగ్రెస్ నేతలు...

  ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ జపం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే 2017 ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రియాంక గాంధీ ఒక్కటే మార్గమని నేతలు భావిస్తున్నారట. అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రశాంత్ కిషోర్ రంగలోకి దిగారు. ఈనేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలతో సమావేశాలు జరుపగా అందరూ ప్రియాంక గాంధీవైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రియాంక గాంధీ వస్తేనే యూపీలో అధికారంలోకి వచ్చే వీలుంటుంది అని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారట. దీంతో ఇక ప్రశాంత్ కిషోర్ ఆమెను ఎలాగైనా ఒప్పించి యూపీ ఎన్నికల బరిలో నిలపాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు యూపీ అభ్యర్ధిగా రాహుల్, ప్రియాంక లేదా ఓ బ్రాహ్మణ అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని  ప్రశాంత్ కిషోర్ కోరినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ పార్టీ నేతలు మాత్రం ప్రియాంక జపమే చేశారు. మరి సోనియా గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.