జమాతే-ఇస్లామీ చీఫ్‌‌ను ఉరి తీసిన బంగ్లా ప్రభుత్వం

  బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఇస్లామిస్ట్‌ పార్టీ జమాతె-ఇస్లామీ చీఫ్ మోతిమర్ రెహమన్‌ నిజామీని ఆ దేశ ప్రభుత్వం ఉరి తీసింది. 1971లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో నేరాలకు పాల్పడినందుకు బంగ్లా సుప్రీంకోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఊచకోత, రేప్ కేసుల్లో నిజామి చాన్నాళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆయన క్షమాభిక్ష పెట్టుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిన్న అర్థరాత్రి ఢాకా సెంట్రల్ జైలులో ఉరి తీశారు. ఆయన ఉరితీతకు వ్యతిరేకంగా జమాతె పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దీంతో ఢాకాలోని ప్రధాన నగరాల్లో వేలాది మంది పోలీసులతో భద్రతను పెంచారు. రెహమన్ మృతిని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన మృతదేహన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రెహమన్ స్వస్థలమైన సతియా ప్రాంతానికి పంపించారు. 

దూసుకుపోతున్న ట్రంప్.. హిల్లరీకి బ్రేకులు

  అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధిగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాడు. ఇక మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా రేసులో దూసుకుపోతున్న తరుణంలో మధ్య మధ్యలో బ్రేకలు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఇండియానా ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోగా.. ఇప్పుడు వెస్ట్ వర్జీనియా ప్రైమరీలో కూడా తన సొంత పార్టీ అభ్యర్ధి బెర్నీ సాండర్స్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇక ట్రంప్ మాత్రం వర్జీనియా వెస్ట్, నెబ్రాస్కాల్లో విజయం సాధించి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నారు.   అయితే బెర్నీ సాండర్స్ పై ఓడిపోయినప్పటికీ హిల్లరీ క్లింటన్ మాత్రం.. మహిళా ఓట్లకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలతో ముచ్చటించిన ఆమె.. మహిళా హక్కులు, జీతాలు, ఫీజుల గురించి ఆమె చర్చించినట్టు సమాచారం. అంతేకాదు తాను అమెరికా అధ్యక్షురాలునైతే సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పారు. మరి ఆ ఆవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

పోలవరాన్ని కూడా వదిలించుకోబోతున్నారా..జవదేకర్ వ్యాఖ్యలు నిజమేనా?

  ఇప్పటికే ప్రత్యేకహోదా విషయాన్ని పక్కకు నెట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరోక షాకిచ్చింది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్ట్‌‌కు నీలి నీడలు పట్టించేందుకు బీజేపీ రెడీ అయ్యింది. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. పోలవరాన్ని నీటితో నింపేందుకు కేంద్రం సమ్మతించలేదని తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లతో తలెత్తిన వివాదాలు ముగిసేవరకు పోలవరం జలశయానని నింపొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించామని కేంద్రమంత్రి సెలవిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు బంద్‌లు, రాస్తారోకోలు చేశాయి. అవి ఎట్టిపరిస్థితుల్లోనే పోలవరం నిర్మాణాన్ని ఒప్పుకోవు. దీనిని బట్టి పోలవరం ప్రాజెక్ట్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నట్టే.

షీనా బోరా హత్య గురించి నాకు తెలుసు.. అప్రూవర్ గా ఇంద్రాణీ డ్రైవర్

  షీనా బోరా హత్య కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్ట్ లు, కొత్త కొత్త విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. దేశమంతటా సంచలనం సృష్టించిన ఈ కేసులో షీనాను తల్లి ఇంద్రాణీయే చంపిందని వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంబధించిన విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో నిందుతుడిగా ఉన్నా.. ఇప్పటికే అరెస్టయి జైల్లోలేనే విచారణ ఖైదీగా ఉన్న డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తాను కోర్టు ముందు నిజ నిజాలు చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని.. ఈ హత్యలో తనకు కూడా భాగముందని.. షీనా గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు.

స్టాలిన్ సీఎం అవ్వాలంటే నాకు ఏమన్నా అవ్వాలి.. కరుణానిధి

  డీఎంకే అధినేత కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది తనేనని.. స్టాలిక్ కు ఆ ఛాన్స్ లేదని అన్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే తనకు ఏమైనా అవ్వాలి.. ప్రకృతి నన్ను ఏమైనా చేయాలి అంతే.. అప్పటి దాకా స్టాలిన్ ఎదురుచూడాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇంకా జయలలితపై కూడా నాలుగు విమర్శల బాణాలు సంధించారు. మాపార్టీ ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే మేనిఫెస్టో విడుదల చేసింది.. కానీ జయలలిత మేనిఫెస్టో మిగత పార్టీల నుండి కాపీ కొట్టిందని.. అది కూడా చాలా ఆలస్యంగా విడుదల చేశారు.. ఇంకా నయం ఎన్నికల తరువాత ప్రకటిస్తారేమో అని అనుకున్నానని ఎద్దేవ చేశారు. అందులో చెప్పిన ఉచిత పథకాలన్నీ ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికే అని అన్నారు.

కాల్ డ్రాప్‌కు పరిహారం ఇవ్వాలా-సుప్రీంకోర్టు

  టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఫోన్ మాట్లాడుతున్నపుడు మధ్యలో కట్ అయితే ఆ కాల్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. వినియోగదారులు కాల్ చేసినప్పుడు ఏ కారణం చేతనైనా ఆ కాల్ కట్ అయితే మొబైల్ ఆపరేటర్లు పరిహారం చెల్లించాలంటూ ట్రాయ్ గత అక్టోబర్‌లో టెలికం కన్సూమర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌కు సవరణ చేసింది. ఒక్కో వినియోగదారుడికి ఒక్కో కాల్‌డ్రాప్‌కు రూ.1 చొప్పున, రోజుకి రూ.3 మించకుండా పరిహారం చెల్లించాలని టెలికం కంపెనీలను ఆదేశించింది. ట్రాయ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలికం కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన సుప్రీం ఈ విధానాన్ని తప్పుబట్టింది. మధ్యలో కట్‌ అయిన కాల్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

స్నేక్ గ్యాంగ్ నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష...

స్నేక్ గ్యాంగ్ నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ  రంగారెడ్డి జిల్లా  కోర్టు తీర్పు నిచ్చింది. ఏ1 నుంచి ఏ7 దోషుల వరకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన న్యాయస్థానం… ఏ8 దోషికి మాత్రం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 37 మంది యువతను బెదిరించి దోపిడికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది.   కాగా ఈకేసులో ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లు నిందితులు.

మరోసారి చిక్కుల్లో అమితాబ్.. 15 సంవత్సరాల నాటి కేసు..

  ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క పనామా పేపర్స్ పుణ్యమా అంటూ పేరు బయటకు వచ్చింది. ఆ తరువాత ఇంక్రెడిబుల్ ఇండియా అంబాసిడర్ గా నుండి కూడా ఛాన్స్ పోయింది. ఇప్పుడు మరో చిక్కు ఎదురైనట్టు కనిపిస్తోంది. 2001లో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి అమితాబ్ హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు పారితోషికంలో రూ. 1.66 కోట్లు పన్నుకట్టలేదని కేసు పెట్టింది. దీనిపై విచారించిన బాంబే హైకోర్టు కేసు కొట్టివేసింది. దీంతో ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగ్గొట్టారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆదాయపు పన్ను శాఖకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. మొత్తానికి అమితాబ్ కు ప్రస్తుతం కాలం కలిసిరానట్టు కనిపిస్తోంది.

మోడీ డిగ్రీపై ట్విస్ట్... పొరపాటున సంవత్సరం తప్పు పడింది..

  ఇప్పటికే ప్రధాని మోడీ సంబంధించి డిగ్రీలపై ఆప్ నేతలు పలు ఆరోపణలు చేస్తుంటే ఇప్పుడు తాజాగా విపక్షాలకు మరో అస్త్రాన్ని అందిచ్చిట్టయింది. రెండు రోజుల క్రితమే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మోడీకి సంబంధిచిన మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సర్టిఫికేట్ నిజమే కాని సంవత్సరం మాత్రం పొరపాటున తప్పు పడిందని ఢిల్లీ రిజిస్ట్రార్ తరుణ్ దాస్ వెల్లిడించారు. తాము రికార్డులన్నీ పరిశీలించామని, ఆయన 1978లో పరీక్షలు పాస్ కాగా, 1979లో డిగ్రీ వచ్చినట్టు తప్పు పడిందని తెలిపారు. ఆయన సీసీ 594/74 నెంబరుతో ఎన్ రోల్ అయ్యారని, ఆయన హాల్ టికెట్ సంఖ్య 16594 అని దాస్ వివరించారు.   దీంతో ఇప్పుడు మోడీ డిగ్రీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు అన్నట్టు మోడీది నకిలీ సర్టిఫికేటేనా.. లేకపోతే.. 1978లో పాస్ అయితే..  1979లో ఉత్తీర్ణుడైనట్టు సర్టిఫికెట్ ఇస్తే, అప్పుడే దాన్ని ఎందుకు సరిచేసుకోలేదన్నది.. ఇది కాకతాళీయంగా జరిగిందా? లేక ఆప్ ఆరోపిస్తున్నట్టు తప్పుడు ధ్రువపత్రమా? అని సందేహిస్తున్నారు. మరి దీనిపై మోడీ గారు చెబితే కాని అసలు విషయం ఏంటో తెలుస్తుంది.

చంద్రబాబుకు గట్టి షాక్.. టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ టీడీపీ నుండి పెద్ద షాక్ తగలనుండా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీఆర్ఎస్ లోకి చేరిపోగా..రెండు రోజుల క్రితమే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతోనే ఎల్ రమణ, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులతో మంతనాలు జరిపినట్టు సమాచారం.   గత కొద్ది రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ గురించి పట్టించుకోవడం లేదని.. ఇంకా వలస వెళ్లి పోతున్న ఎమ్మెల్యేలను నిలువరించే ప్రయత్నాలు కూడా చేయడంలేదని రమణ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. దీంతో ఇక పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండేదేమోనని భావించి పార్టీ మారాలని నిర్ణయించుకున్న్టట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

మాల్యాను వెనక్కి పంపించలేం.. బాంబు పేల్చిన బ్రిటన్

  బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా ఎంచక్కా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. అయితే మాల్యాను తిరిగి దేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దు చేసి.. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసి.. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేద్దామని చూస్తున్న నేపథ్యంలో.. బ్రిటన్‌ ప్రభుత్వం ఓ బాంబు పేల్చింది. తమ చట్టాల ప్రకారం విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించలేమని బ్రిటన్‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మాల్యాను స్వదేశానికి పంపించాలని ఇటీవల భారత ప్రభుత్వం యూకే ప్రభుత్వాన్ని కోరగా.. యూకే ప్రభుత్వం మాల్యాను పంపించలేమని వెల్లడించింది. అయితే మాల్యాను వెనక్కి రప్పించేందుకు భారత్‌కు సాయం చేస్తామని ప్రకటించింది.

ఐదుగురు హత్యలు.. చేసింది అన్న కొడుకులే..!

  ఆదిలాబాద్ జిల్లా బైంసాలో దారణమైన ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అత్యంత కిరాతంగా చంపిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణానికి పాల్పడింది కుటుంబసభ్యులే కారణమంటూ అనుమానిస్తున్నారు.  భైంసా పట్టణంలో బార్ ఇమామ్ గల్లీలో నివాసం ఉంటున్న నయామత్‌ఖాన్ కుటుంబానికి తన అన్న కుమారులతో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తన అన్న కుమారులు నయామత్‌ఖాన్ (55), యూనిస్‌ఖాన్ (35)లపై కళ్లల్లో కారం చల్లి గొంతుకోసి హత్యచేశారు. ఆ తర్వాత పట్టణంలోని బార్ ఇమామ్ గల్లీకి వెళ్లి మృతుడు నయామత్‌ఖాన్ భార్యపై దాడిచేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం.. పట్టణంలోని నయాబాదికి వెళ్లి అక్రమ్‌బి (62), ఆయేషాబేగం (15)లపై విచక్షణా రహితంగా దాడిచేసి పారిపోయారు. స్థానికులు అక్రమ్‌బి, ఆయేబేగంలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్రమ్‌బి ఆసుపత్రిలో మృతి చెందింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఆస్తికి సంబంధించిన తగాదాలు కారణంగానే ఈ హత్యలు జరిగుంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వెలగపూడిలో 144 సెక్షన్‌కు దారి తీసిన కార్మికుడి మరణం..

  ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సమీపంలోని వెలగపూడి వద్ద నిర్మితమవుతున్న సచివాలయ నిర్మాణ పనులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. నిన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్మికుడు కాంక్రీట్ మిషన్‌లో పడి దుర్మరణం చెందాడు. పనులు పర్యవేక్షిస్తున్న కంపెనీ కనీస భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే కార్మికులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారని..చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. నిర్మాణ సంస్థకు చెందిన పలు వాహనాలను ధ్వంసం చేసి,నిప్పు పెట్టారు. అధికారులు వారితో చర్చించి..మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించడంతో కార్మికులు శాంతించారు. ఉద్రిక్త పరిస్థితుల రీత్యా అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆ ప్రాంతంలో బహిరంగ ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.