టీడీపీ సీనియర్ నేత చెన్నమనేని రాజశ్వేరరావు కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాజేశ్వరరావు స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక. విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చెన్నమనేని కొంతకాలం ఆజ్ఞాతవాసం గడిపారు.
1967లో రాజీకీయరంగ ప్రవేశం చేసిన రాజేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా సిరిసిల్ల నుంచి ఐదుసార్లు, మెట్టుపల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల సంఘం అధ్యక్షుడిగా, సీపీఐ అనుబంధ సంస్థ రైతు సంఘం జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మరణం పట్ల టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.