తమిళనాడులో ఎన్నికలు షురూ.. ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తమిళనాడుతో పాటు ఇంకా కేరళ, పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు పార్రంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించనున్నారు. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాలకు 3,776 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కేరళలో 140 స్థానాలకు గాను 1,203 మంది అభ్యర్ధులు ఉండగా 2,61,06,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు 344 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 9,41,935 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయిన కొంత సమయానికి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.