వృద్దురాలిని తిప్పలు పెట్టిన ఎయిర్ ఇండియా... వీల్ ఛైర్లోనే ఉంటుందని

  అధికారులకైతే సలాం చేస్తూ.. ఎక్కడ  ఏ సీటు కావాలన్న ఇచ్చే ఎయిర్ ఇండియా వాళ్లు.. అదే సామాన్య ప్రజలైతే మాత్రం తమ నిర్లక్ష్య వైఖరి చూపిస్తుంటారు. కేవలం వృద్ధురాలు అన్న కారణంతో రాజేష్ శుక్లా అనే అనే ఆమెను ఏడు గంటలు ఎయిర్ పోర్టులోనే ఉంచారు. అది కూడా చాలా సిల్లీ కారణం చెప్పి.. వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన రాజేష్ శుక్లా అనే వృద్ధురాలు తన కూతరు న్యూయార్క్ల్ లో ఉండగా.. అక్కడికి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఎయిరిండియా సిబ్బంది ఆమెను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఓవర్ లోడ్ అయిందంటూ దించేశారు. దీంతో ఆమె ఏడు గంటలు అక్కడే వెయిట్ చేసింది. ఈవిషయాన్ని ముంబైలోని ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మరో కూతురికి తెలపడంతో ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిని నిలదీయడంతో వెంటనే ఆమెను వేరే ఫ్లయిట్ లో ఢిల్లీ నుండి లండన్ కు, అక్కడి నుండి న్యూయార్క్ కు పంపిచారు. దీంతో 15 గంటల ప్రయాణం కాస్త 20 గంటలు పట్టింది. అయితే ఎయిరిండియా వాళ్లు ఫ్లైట్ లో ఖాళీ లేకే దించేశామని చెబుతున్నా... అది అసలు కారణం కాదని అంటోంది కూతురు. తన తల్లి నడవలేదని, వీల్ ఛైర్లోనే ఉంటుందని, ఆ వీల్ ఛైర్ కూడా ఇవ్వలేక ఆమెను విమానంలోకి ఎక్కనివ్వలేదని ఆరోపిస్తోంది.

ఇంట్లో బీటెక్ పరీక్ష రాస్తూ అడ్డంగా దొరికిన ఆర్డీవో పుత్రరత్నం..!

ఎక్కడైనా ఎగ్జామ్స్ ఎక్కడ రాస్తారు..ఎంటీ ఆ వెధవ ప్రశ్న..ఎగ్జామ్‌ని ఎగ్జామ్ సెంటర్‌లో రాస్తారు అని మీరు అనుకోవచ్చు. కాని అందుకు భిన్నంగా తన ఇంటినే ఎగ్జామ్ సెంటర్ చేశాడు. హయత్‌నగర్ నోవా కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నిఖిల్ అనే విద్యార్థి పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తన తండ్రి ఆర్డీవో కావడంతో ఆయన పలుకుబడితో పరీక్షను ఇంటిలోనే రాయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే క్వశ్చన్ అండ్ అన్సర్ పేపర్స్ ఇంటికి వచ్చాయి. తనతో పాటు తన స్నేహితుల్ని కూడా పరీక్ష రాయించాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు పరీక్ష రాస్తున్న ఇంటిపై దాడి చేసి ఆర్డీవో కుమారుడు నిఖిల్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. క్వశ్చన్ పేపర్స్ స్వాధీనం చేసుకుని విద్యార్థులను పీఎస్‌కు తరలించారు.

రాహుల్‌కు తీవ్ర జ్వరం..ఎలా ఉందన్న మోడీ..!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా గత వారం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన వాయిదా  వేసుకున్నారు. రాహుల్ అస్వస్థత విషయాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలియడంతో రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికీ రాహుల్ హైవైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏపీ రాజధాని పేదలకు పదేళ్ల ఉచిత విద్య..

ఏపీ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇచ్చిన మరో హామీ నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకుంది. రాజధానిలో అమరావతి పరిధిలోని పేదలకు ఉచిత విద్య అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌లు, వృత్తివిద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పదేళ్ల పాటు ఈ ఉచిత విద్యను అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆధార్ గుర్తింపు కార్డు కాదంట..? కేరళలో ఓటు వేయనివ్వని అధికారులు..

భారత దేశం మొత్తానికి కలిపి యూనిక్ ఐడెంటి కార్డ్ ఆధార్..అలాంటి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు కాదన్నారు. కేరళలో పోలింగ్ సందర్భంగా ఆధార్ వివాదం రాజుకుంది. ఎలక్షన్ సందర్భంగా ఓటరు కార్డు లేనివారు తమ గుర్తింపును చూపడానికి గ్యాస్ కనెక్షన్, బ్యాంక్ అకౌంట్, పాస్‌పోర్ట్ ఇలా ఎన్నికల సంఘం పలు రకాల కార్డులను చూపాలని ప్రజలను ఆదేశించింది. దానిలో భాగంగా పొన్నై నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు ఓటర్లు క్యూలో నిలుచున్నారు. అయితే చాలామంది ప్రజలు గుర్తింపు కార్డుగా ఆధార్‌ను చూపించడంతో అది ఐడీ కార్డుగా పనిచేయదని, ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు వారిని తిప్పి పంపారు. దీంతో అధికారులకు, ఓటర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి ఆధార్ కార్డు అడుగుతుంటే..ఎన్నికల అధికారులు ఎందుకు దీనిని అంగీకరించడం లేదని వారు ప్రశ్నించారు. దీంతో ఎన్నికల సంఘం జారీ చేసిన 12 డాక్యుమెంట్లలో ఆధార్ కార్డుకు స్థానం దక్కలేదని, అందుకే దీనికి గుర్తింపు లేదని అధికారులు జవాబివ్వడంతో అక్కడి వారు అవాక్కయ్యారు.

గూగుల్ కు భారీ షాక్..వేల కోట్లు జరిమానా..!

  సెర్చ్ ఇంజిన్ గూగుల్ దిగ్గజం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో ఎక్కడ ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న క్షణంలో గూగుల్ నుండి మనం తెలుసుకోవచ్చు. అలాంటిది త్వరలోనే గూగుల్ కు ఓ భారీ షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. తనకు నచ్చిన కంపెనీలకే ముందు స్థానం ఇస్తూ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ గూగుల్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థకు సమస్యలు తప్పవని.. వేల కోట్లరూపాయలు జరిమానా విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది.  సుమారు 23 వేల కోట్ల (మూడు  బిలియన్ యూరోల) భారీ జరిమానా పడనుందని  పేర్కొంది. ఈ జరిమానా విధించేనిర్ణయం జూన్ మొదటి వారంలో అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారుల చెబుతున్నారు. అంతేకాదు సెర్చ్ లో మొదటి స్థానం సంపాదించిన కంపెనీలకూ 10 శాతం మేర జరిమాన విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ వరకూ ఆగాల్సిందే. 

టీఎస్‌ఆర్టీసీలో తొలి సమ్మెసైరన్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేసింది. వేతన సవరణ తర్వాత చెల్లించకుండా మిగిలిపోయిన బకాయిల్లో 50 శాతం మొత్తానికి బాండ్లు ఇవ్వాలని, మిగతా మొత్తం తక్షణం విడుదల చేయాలని, కొత్త డీఏను, నాలుగేళ్లుగా ఆగిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్లను చెల్లించాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రకటించింది. ఎంప్లాయిస్‌ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లతో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్‌ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్, బహుజన వర్కర్స్ యూనియన్‌లు సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.

తమిళనాడు ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..

  తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలనుండి ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనున్నాయి. ఎంతో రసవత్తరంగా సాగే ఈ ఎన్నికల్లో సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తోపాటు పలువురు తమ ఓటును వినియోగించుకున్నారు.   కాగా తమిళనాడులో 232 అసెంబ్లీ స్థానాలకు 3,776 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా 5,82,59,801 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.     రజనీకాంత్ స్టెల్లా మేరీస్ కాలేజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.   మొదట ఓటు వేయడం కుదరదేమోనని తెలిపిన కమల్ చివరికి తన ఓటును వేశారు. తేయనమ్ పేటలోని కార్పొరేషన్ స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమల్ తోపాటు కూతురు అక్షర హాసన్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. అజిత్ తన భార్య శాలినితో కలిసి కుప్పం బీచ్ రోడ్ లోని గవర్నమెంటు స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలంకరైలో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్య ఫాదర్ శివ కుమార్, ఆయన సోదరుడు కార్తి, ఇతర కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా పలువురు జీవా, వివేక్, కుష్బూ, రాధిక కూడా తమ ఓటు హక్కును వినియోగించకున్నారు.

డ్రైనేజ్ లో పడిన మహిళా ఎంపీ.. తీవ్ర గాయాలు..

  గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నియోజకవర్గ బిజెపి ఎంపీ పూనమ్ మాదమ్.. డ్రైనేజీ కుప్పకూలిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం.. ఎంపీ పూనమ్ మాదమ్ గుజరాత్ లో జలారామ్ నగర్ లోని ప్రజలు, అధికారులతో అక్కడి సమస్యలు.. తెలుసుకోవడానికి వెళ్లారు. అంతేకాదు డ్రైనేజీ చుట్టూ కట్టిన అక్కమ కట్టడానికి తొలగించేందుకు జామ్‌నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఆ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడానికి వెళ్లిన ఆమె ఓ డ్రైనేజీ కప్పుపై నిలబడి మాట్లాడుతుండగా.. సడెగా అది కుప్పకూలిపోయింది. దాదాపు 10 ఫీట్ల లోతు ఉన్న ఈ నాలాలో పూనమ్ మాదమ్ పడిపోవడంతో ఆమె కాలికి.. తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా డ్రైనేజీలో పడిపోగా వారిని కూడా ఆస్పత్రికి తరలించారు.

చైనాలో విచిత్రం.. అబ్బాయి ఆత్మకు, మహిళ మృతదేహానికి పెళ్లి

  చైనాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వివాహం.. యువతి, యువకులు చేసుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రంగా ఆత్మకు పెళ్లి చేశారు. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. అసలు సంగతేంటంటే.. చైనాలో షాంగ్జీ రాష్ట్రంలోని ఒక కుటుంబానికి చెందిన కుమారుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. అయితే పెళ్లి కాకుండానే బ్రహ్మచారిగా తన కొడుకు మరిణించాడని.. తన ఆత్మకు శాంతించాలని ఒక మహిళ మృతదేహంతో పెళ్లి జరిపించారు అతని కుటంబసభ్యులు. దీనికోసం ‘వధువు’ కుటుంబానికి రూ.18 లక్షలు కూడా ఇచ్చారంట. మామూలుగా అయితే అంతకంటే ఎక్కువే సమర్పించుకోవాలట. కానీ ఇరువురు తెలిసిన వారు కావడంతో తక్కువ మొత్తానికే ఒప్పుకున్నట్టు సమాచారం. పెళ్లి కాకుండా మరణిస్తే శాపం చుట్టుకుంటుందనే విశ్వాసంతో వారికి పెళ్లి జరిపించడం అక్కడ పురాతన సంప్రదాయం.

6 వేల మంది అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 6 వేల మంది అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పథకం కింద నిధులు రూ వేయ్యి కోట్లు ఖర్చు చేశామని.. రానున్న 45 రోజుల్లో మరో వెయ్యి కోట్లు ఖర్చు చేసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధిహామీ పనుల్లో పురోగతి బాగుందన్నారు... పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకాలు వేగవంతం చేయాలని తెలిపారు. పంట సంజీవనిలో అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయని, శ్రీకాకుళం, కృష్ణా, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్‌ జలసిరి కింద 6,21,745 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.

జగన్ 'జలదీక్ష'... కేసీఆర్ ఎలా కడతారు.. చంద్రబాబు చేతకాని తనంగా ఉన్నారు..

  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జలదీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. మూడు రోజుల పాటు జరిగే ఈ దీక్షకు ప్రజల నుండి మంచి స్పందనే వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు కర్నూలులో జగన్ చేపట్టిన ఈ దీక్షకు మద్దతుగా నియోజవకర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షాశిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు తెలిపారు.   ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇప్పించుకోలేకపోయారని, ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై కూడా చేతకాని విధంగా ఉండిపోయారని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ఇష్టమొచ్చినట్టు కట్టడాలు నిర్మిస్తున్నారు.. దిగువకు నీరు రావని తెలిసినా కేసీఆర్ ఎలా ప్రాజెక్టులు కడుతున్నారు.. ఈ విషయం తెలిసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు.. అని ప్రశ్నించారు. మనకు నీరు రాదని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అని మండిపడ్డారు.

మోడీతో ఫైట్ కు చంద్రబాబు.. తెలంగాణకు 791 కోట్లు.. ఏపీకి 433 కోట్లు

  ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదాపై చేతులెత్తేసినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. విభజన సమయంలో తాము కనుక అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు.. ఏకంగా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికిన ఎన్డీయే ప్రభుత్వం.. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని.. అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి న అవసరం ఏంటని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం అర్ధమైపోయింది.   ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై మోదీ సర్కారుతో యుద్ధం చేసేందుకు చంద్రబాబునాయుడు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. ఫారెన్ టూర్ ముగించుకొని వచ్చిన ఆయన అధికారులతో సమావేశమై.. అసలు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత.. ఇతర రాష్ట్రాలకు.. మనకు ఇచ్చిన నిధుల కేటాయింపులు..తదితర విషయాలపై నివేదిక తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తెలంగాణలోని 7 జిల్లాలకు రూ. 791 కోట్లు కేటాయించగా.. ఏపీలోకి 10 జిల్లాలకు కేవలం రూ. 433 కోట్లు మాత్రమే కేటాయించినట్టు గుర్తించారు. అంతేకాదు ఇంకా ఏపీపై కేంద్ర వ్యవహరించిన తీరుపై కూడా చంద్రబాబు మోడీ ముందు తెలియజేయనున్నట్టు సమాచారం. మరి చంద్రబాబు విన్నపాలు మోడీ వింటారా?.. ప్రత్యేక హోదాపై ఎలా స్పందిస్తారో తెలియాలంటే వెయిట్ చేయాలి.