కుక్కల బెడదకు ఏపీ పరిష్కారం ఇదే..!
posted on May 12, 2016 @ 12:54PM
వీధి కుక్కల దాడిలో పసిబాలుడు మృతి...జనాన్ని బెంబేలేత్తిస్తున్న కుక్కలు..ఇలాంటి మాటలు ఇకపై వినిపించకుండా, కుక్కల బెడద నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పరిష్కార మార్గాన్ని ఆలోచించింది. ఇంతకు ముందు కుక్క కాట్లు నమోదైతే అధికారులు ఆగమేఘాల మీద స్పందించేవారు. ఎక్కడికక్కడే పట్టి వాటిని చంపేసేవారు. వ్యానుల్లో ఎక్కించి ఎలక్ట్రిక్ షాక్, ఇంజెక్షన్లతో చంపేసేవారు. ఇలాంటి చర్యలపై జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కుక్కల నియంత్రణకు ఏపీ పురపాలక శాఖ కొత్త ఆలోచన చేసింది. పట్టిన కుక్కలను ఊరికి దూరంగా వదిలివేయకుండా సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసి వాటి ఆలనాపాలనా చూడనుంది. కుక్కల సంరక్షణ కేంద్రాల్లో ప్రత్యేక ఆవాసాలున్నాయి. ఇప్పటి వరకు 16 వేల కుక్కులకు శస్త్ర చికిత్సలు చేసినట్టు పురపాలక శాఖ ప్రకటించింది. రానున్న 150 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.