హజీ అలీ దర్గాలోకి తృప్తి దేశాయ్.. ద‌ర్గా గ‌ర్భాల‌యంలోకి ప్ర‌వేశిస్తా..

  భూమాత బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు లింగబేధ వివక్ష మీద పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఆలయాల్లో మహిళలకు అనుమతి లేని నేపథ్యంలో పోరాడి విజయం సాధించారు. తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలోకి కూడా ప్రవేశిస్తామని చెప్పిన సంగతి విదితమే. ఈ విషయంలో ఆమెపై విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు తృప్తి ద‌ర్గాలోకి ప్ర‌వేశిస్తే ఊరుకోబోమంటూ వ‌చ్చిన హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఈరోజు ఉద‌యం నుంచి అక్క‌డ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అయితే దర్గా గర్భాలయంలోకి తృప్తి దేశాయ్‌ ప్రవేశించలేదు. ద‌ర్గా వ‌ద్ద ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన ఆమె అనంత‌రం మాట్లాడుతూ... త్వ‌ర‌లోనే మ‌హిళ‌లు ద‌ర్గా గ‌ర్భాల‌యంలోకి ప్ర‌వేశిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  

ప్రకాశం హైటెన్షన్.. వైసీపీ, టీడీపీ మద్య ఘర్షణ

ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మద్య ఘర్షణ జరగడంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. నిన్న రాత్రి జిల్లాలోని పరుచూరు మండలం ఇనగల్లులో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇరు పార్టీకి చెందిన కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన చోటే పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

ఆ ఇంట్లో తవ్వే కొద్దీ పాములు..

ఇంట్లో ఒక పాము కనిపిస్తేనే మనుషులు హడలెత్తిపోతారు. ఇక 180 పాములు ఒక్కసారే కనిపిస్తే ఇంకేమైనా ఉందా..! గుండె అక్కడే ఆగిపోదు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ మాజీ అధికారి జితేంద్ర మిశ్రా తన కుటుంబసభ్యులతో కలిసి నిద్రిస్తుండగా పాము బుస శబ్దం వినిపించింది. అందరు కలిసి ఇళ్లంతా వెతకారు. ఓ మూల కొన్ని పాములు తిరగడాన్ని చూశారు. వెంటనే పాములు పట్టేవాళ్లకు చెప్పడంతో వారు వచ్చి వాటిని పట్టుకెళ్లారు. మళ్లీ ఆదివారం సాయంత్రం శబ్దాలు రావడాన్ని చూసేసరికి గదిలో ఓ మూల కొన్ని పాములు గుట్టలా పేరుకుపోయి కనిపించాయి. భయంతో వారు పక్కింటి వాళ్లింట్లో పడుకున్నారు. ఉదయం పాములు పట్టేవాళ్లు వచ్చి వెతకగా మొత్తం 180 పాములు దొరికాయి. వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయినప్పటికి మరిన్ని పాములు కూడా ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

ట్రంప్ గెలవాలని హిందూసంస్థ పూజలు, హోమం..

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. అందరిచేత విమర్శలు పొందే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే ఎలా ఉంటుందా అని ఇప్పటికే చాలా మంది భయపడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ట్రంప్ కు మద్దతుగా ఓ హిందూ సంస్థే ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వస్తేనే మానవత్వం నిలుస్తుందని.. ఏకంగా ఆయన గెలవాలని పూజలు, హోమాలు కూడా జరిపిస్తున్నారు. ఇంతకీ ఆ సంస్థ ఏంటనుకుంటున్నారు..  ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న హిందూ సేనా నేషనలిస్ట్ గ్రూప్. ఈ గ్రూపు సభ్యులు ట్రంప్ గెలవాలని, జంతర్ మంతర్ వద్ద పూజలు, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూసేన వ్యవస్థాపకుడు విష్ణు గుప్తా మాట్లాడుతూ.. దేవతలంతా ఆయన గెలుపునకు సహరించాలని కోరామని తెలిపారు. అంతేకాదు ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడాలంటే అది ఆయనకే సాధ్యమని ఆయన అన్నారు. మొత్తానికి ట్రంప్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలే ఆయనకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి.

తెలుగువారికి మరో షాక్.. పనామా జాబితాలో వివేక్, జగన్‌ స్నేహితుడు

  దేశానికి వేలకోట్లు పన్ను ఎగవేసిన వాటిని విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు ప్రముఖుల బాగోతాన్ని బయటపెట్టిన పనామా పేపర్స్ తాజాగా మరో జాబితా విడుదల చేసింది.  ఈ జాబితాలో పలువురు తెలుగువారు ఉండటంతో..ఉభయ రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌ అయ్యింది.   నిన్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌‌ డైరెక్టర్ మోటపర్తి శివరామ ప్రసాద్ పేరును బయటపెట్టింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి, తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడు దివంగత వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ వివేక్ పేర్లు బయటకు వచ్చాయి.   వివేక్ తన భార్య సరోజతో కలిసి "బెల్‌రోజ్ యూనివర్శల్ లిమిటెడ్" పేరిట కంపెనీని ఏర్పాటు చేయగా, రామ్ ప్రసాద్ రెడ్డి "ఆరెంజ్ గ్లో లిమిటెడ్" పేరిట వర్జిన్ ఐల్యాండ్స్‌లో కంపెనీని ఏర్పాటు చేసినట్టు పనామా పేపర్స్ బయటపెట్టింది. అయితే ఇంతవరకు వీరిద్దరూ ఈ వార్తలు ఖండించలేదు.

మరోసారి సరితా నాయర్ సంచలన వ్యాఖ్యలు.. నన్ను వాడుకున్నారు...

  కేరళ సోలార్ స్కాంలో నిందితురాలైన సరితా నాయర్ ఇప్పటికే ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన కొడుకుపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సరితా నాయర్. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో కాంగ్రెస్ పెద్దలు తనను ఒక పావులా వాడుకున్నారని, కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు చెందిన ఒక భూమి డీల్‌లో తాను మధ్యవర్తిగా కూడా వ్యవహరించానని చెప్పింది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన కొడుకు, కొందరు కేబినెట్ మంత్రులపై తన ఆరోపణలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఆమె విచారణ కమిషన్‌కు సమర్పించింది.   అంతేకాదు ఇంకా ఆమె రెండు పైన్ డ్రైవ్  లు, కొన్ని పత్రాలను కమిషన్ కు ఇచ్చానని.. తాను రాసిన లేఖలోని అంశాలకు, కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటపెడుతూ ఏషియా నెట్ చానల్ ప్రసారం చేసిన కథనానికి అవి ఆధారాలని సరితా నాయర్ చెప్పింది. శుక్రవారం మరికొన్ని ఆధారాలు సమర్పిస్తానని మరో బాంబు పేల్చింది. కాగా గతంలో తాను రాసిన లేఖలో ఊమెన్ చాందీ, ఆమె కొడుకు తనని లైంగికంగా వేధించారని తెలపిన సంగతి విదితమే. మరి ఇప్పుడు దీనిపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

కేసీఆర్ ని ట్వీట్టర్లో ప్రశంసించిన మోడీ.. చంద్రబాబు ఎన్నిసార్లు కలిసినా.. ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రధాని మోడీ సైతం పొగిడేశారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చించారు. అయితే వీటన్నింటిలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరధ పథకం మోడీకి బాగా నచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ మిషన్ కాకతీయ గురించి ట్వీట్లు చేసి కేసీఆర్ ను ప్రశసించారు.   ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి ఎన్నోసార్లు ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితి గురించి చర్చించినా..ఏనాడు ఇలా ట్వీట్ చేయలేదు.. కానీ కేసీఆర్ కలిసింది చాలా  అంటే చాలా తక్కువ సార్లు కలిసినా ట్వీట్ చేయడం ఆశ్చర్యం అని అనుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ మోడీని కూడా ఇంప్రెస్ చేశారన్నమాట.    

జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా దేవి ఇంట్లో మద్యం.. అరెస్ట్ వారెంట్

  బీహార్లో సంపూర్ణ మద్యం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. కానీ మందు బాబులు మాత్రం ఆగలేక పక్క ప్రాంతాలకు వెళ్లి మరీ తాగేస్తున్నారు. అయితే ఆ రాష్ట్ర అధికార జేడీయూకి చెందిన ఎమ్మెల్సీ మనోరమా దేవి మాత్రం ఇంట్లోనే మందు పెట్టుకొని అడ్డంగా బుక్కయ్యారు. ఆమె ఇంట్లో భారీగా మద్యం సీసాలను స్వాదీనం చేసుకొని ఆమె నివాసాన్ని సీజ్ చేశారు. ఆమె అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, జేడీయూ పార్టీ మనోరమాదేవిపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది కూడా   కాగా తన కారును ఓవర్ టేక్ చేసినందుకు గాను మనో రమాదేవి కొడుకు రాఖీ యాదవ్ ఓ విద్యార్ధిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తన ఇంటిని సోదా చేయగా అసలు బాగోతం బయటపడింది. కాగా ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు.

మోడీ సిగ్గు చేటు కాదా..? కేరళ నెటిజన్ల ఆగ్రహం..

  ప్రధాని నరేంద్ర మోడీపై కేరళ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'పో మోనే మోదీ' అంటే ఇక చాలు, ఇంటికి వెళ్లు అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టిమరీ మోడీపై మండిపడుతున్నారు. ఇంతకీ అంతలా మోడీ ఏం చేశారనే కదా..డౌట్.. అసలు సంగతేంటంటే.. కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళలో శాంతి భద్రతలు సోమాలియాలో కంటే దారుణంగా తయారయ్యాయని.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య, దళిత యువతిపై అత్యాచారం.. ఇలా వేటినీ ప్రభుత్వం ఆపలేకపోయింది అంటూ వ్యాఖ్యానించారు. అంతే మోడీ 'గాడ్స్ ఓన్ కంట్రీ' (దేవుని సొంత దేశం) అని పేరున్న కేరళను సోమాలియాతో పోల్చడంతో అక్కడ యువత ఆగ్రహిస్తున్నారు. 'పో మోనే మోదీ' అంటూ విమర్శలు సందిస్తున్నారు.   ఇక కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కూడా మోడీ వ్యాఖ్యలపై స్పందించి.. దేశ ప్రధానిగా ఆయన ఇలా సంబోధించడం సిగ్గు చేటు కాదా..?. ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆయన విరుచుకుపడ్డారు.

వైఎస్ ఆత్మకు చంద్రబాబు సపోర్ట్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన కేవీపీ రామచంద్రరావుకు, చంద్రబాబుకు పడదని అందరికి తెలుసు. అలాంటి కేవీపీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ఆయన రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రవేశపెట్టబోయే బిల్లుకు సహకరించాల్సిందిగా కేవీపీ, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. దీనిపై బాబు సానుకూలంగా స్పందించారు. బిల్లు పాస్ అయ్యేందుకు ఓటింగ్ జరిగితే అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీ ఎంపీలను ఆదేశించారు. ఎప్పుడూ-నిప్పు ఉప్పులా ఉండే కేవీపీ, చంద్రబాబులను ప్రత్యేకహోదా కలిపిందన్న మాట.

ప్రత్యేక హోదాపై సీఎం రమేష్ డిమాండ్.. శభాష్ రమేష్ అన్న కురియన్

రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా  టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. రెవెన్యూ లోటులో ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ కు ఎలగైతే ప్రత్యేక హోదా ఇచ్చారో అలాగే ఏపీకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్రం ఇంకా విడుదల చేయలేదని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోకపోతే మరింత నష్టపోతామని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోడా టీడీపీతోనే సాధ్యమవుతుందని.. కాంగ్రెస్ ను నమ్ముకోలేమని.. చంద్రబాబు నాయకత్వంలో హోదా సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సాధనకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.     అయితే సీఎం రమేష్ ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుండగా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కల్పించుకొని.. రమేష్.. రమేష్ అని పిలుస్తూ ఒక్కమాట విను అని అడిగారు. అయితే రమేష్ మాత్రం వినిపించుకోకుండా కంటిన్యూ చేస్తుండగా.. అబ్బా! విను రమేష్ అని ఆపి.. 'మీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందా?' అని అడిగారు. 'అవును సర్' అని ఆయన సమాధానమివ్వడంతో 'ఏ ఇబ్బందుల్లో ఉంది?' అని మళ్లీ ప్రశ్నించారు. దీనికి సీఎం రమేష్ చేతిలో ఉన్న పేపర్లను చదివే ప్రయత్నం చేయడంతో 'నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు నీకు తెలియక పేపర్ పై ఉన్న సమాచారం చదువుతున్నావా?' అని అన్నారు. దీంతో సీఎం రమేష్ కొన్ని లెక్కలు చెబుతూ, రెవెన్యూలోటు పూడ్చాలని కోరారు. దీంతో కురియన్ 'శభాష్ రమేష్... ఇది కావాలి...నీ ప్రాంతం గురించి ఏదో రాసుకొచ్చి చదవితే ఎలా?' అని అడిగారు.

బాగ్దాద్ కారు బాంబు పేలుడు...చేసింది మేమే..

  ఇరాక్ రాజధాని బాగ్దాద్లో మరోసారి ఉగ్రవాదులు హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. కారు బాంబు దాడి చేసి కొన్ని ప్రాణాలను బలిగొన్నారు. బాగ్దాద్ లోని ముస్లింలు అధికంగా ఉండే సాద్ర్ లో కారు బాంబు పేలి 64 మంది మృతి చెందగా 87 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మార్కెట్లోకి కూరగాయలు, పండ్లతో వచ్చి ఒక వాహనం ఆగిందని..అందులో దిగిన వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలేసి హడావుడిగా వెళ్లిపోయాడని.. ఆతరువాత బాంబు పేలిందని సాక్ష్యులు పోలీసులకు తెలియజేశారు. కాగా, ఈ సంఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాదులు ఒక ఆన్ లైన్ ప్రకటన చేశారు.  

నెల్లూరు జిల్లాలో వెరైటి చలి వేంద్రాలు!

  వేసవి కాలంలో మండుటెండల్లో ప్రయాణం చేసేవారికి, దాహార్తిని తీర్చేందుకు పలువురు దాతలు, స్వచ్ఛంధ సంస్థలు రహదారుల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటాయి. సాధారణంగా చలివేంద్రాల్లో మంచి నీరు ఇస్తారు, కొంచెం డబ్బున్న వాళ్లైతే మజ్జిగ ఇస్తుంటారు. కాని నెల్లూరు జిల్లాలో అక్కడి నేతలు ప్రచారానికి, గొప్పలకు పోయి..చలివేంద్రాల రూపు రేఖలు మార్చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, ఆయన భార్య సుజాతరావులు ఓ చలివేంద్రాన్ని ప్రారంభించారు. దానిలో నీళ్లకు బదులు ముంజలు పంపిణీ చేస్తుండటంతో విపరీతమైన ప్రచారం వచ్చి అక్కడ జనాల మధ్య క్యూ చాంతాడంత పెరిగిపోయింది. దీనిని చూసిన ఒకతను ఊళ్లో ఫుల్లు పబ్లిసిటి వస్తుందని చలివేంద్రాన్ని మొదలుపెట్టాడు. అక్కడ తాటి ముంజలతో పాటు, కొబ్బరి బోండాలు, మజ్జిగ పంపిణీ చేశాడు. ఇంకేముంది జనాల క్యూ ఇక్కడకు మారిపోయింది. వీళ్లద్దరి కంటే తానేం తక్కువ తినలేదని మరోకాయన ఫ్రూట్ జ్యూస్, ఐస్‌క్రీములు అంటూ చలివేంద్రాన్ని ప్రారంభించాడు. తీరా నెల్లూరు మొత్తం తరలివచ్చేటప్పటికి వీళ్లు చేతులేత్తేశారు. దీంతో జనం తిట్ల దండకాన్ని ప్రారంభించారు.

సివిల్స్ లో సత్తా చాటిన తెలుగోళ్లు..

  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన 48 మంది తమ సత్తా చాటుకున్నారు. మొత్తం 1078 మంది సివిల్స్ లో చోటు సంపాదించుకోగా.. అందులో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ నుండి 48 మంది ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ 48 మందిలో నలుగురు అభ్యర్ధులు 100 లోపు ర్యాంకులు దక్కించుకోగా.. 100 నుండి 500 లోపు 23 మంది మంది.. 500 పైన 21 మంది ర్యాంకులు సంపాదించుకున్నారు.   ఇక ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ కి చెందిన టీనా దాబి మొదటి ర్యాంక్ సాధించగా.. కాశ్మీర్ కు చెందిన అతార్ అమీర్ ఉల్ షపీ ఖాన్ రెండో ర్యాంక్ సాధించారు. ఇంకా విశాఖపట్నంకు చెందిన కీర్తి జాతీయ స్థాయిలో 14 వ ర్యాంకు సాధించగా.. చిట్లూరి రామకృష్ణ జాతీయ స్థాయిలో 84వ ర్యాంకు.. స్నేహజ కూడా 103వ ర్యాంకుతో సత్తా చాటింది. శ్రీకాకుళం కు చెందిన భుజంగరావు అనే ఆటో డ్రైవర్ కుమారుడు ఇజ్జాడ మధుసూదనరావు 658వ ర్యాంకుతో సత్తా చాటాడు.

జమాతే-ఇస్లామీ చీఫ్‌‌ను ఉరి తీసిన బంగ్లా ప్రభుత్వం

  బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఇస్లామిస్ట్‌ పార్టీ జమాతె-ఇస్లామీ చీఫ్ మోతిమర్ రెహమన్‌ నిజామీని ఆ దేశ ప్రభుత్వం ఉరి తీసింది. 1971లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో నేరాలకు పాల్పడినందుకు బంగ్లా సుప్రీంకోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఊచకోత, రేప్ కేసుల్లో నిజామి చాన్నాళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఆయన క్షమాభిక్ష పెట్టుకోవడానికి ఇష్టపడకపోవడంతో నిన్న అర్థరాత్రి ఢాకా సెంట్రల్ జైలులో ఉరి తీశారు. ఆయన ఉరితీతకు వ్యతిరేకంగా జమాతె పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. దీంతో ఢాకాలోని ప్రధాన నగరాల్లో వేలాది మంది పోలీసులతో భద్రతను పెంచారు. రెహమన్ మృతిని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన మృతదేహన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రెహమన్ స్వస్థలమైన సతియా ప్రాంతానికి పంపించారు. 

దూసుకుపోతున్న ట్రంప్.. హిల్లరీకి బ్రేకులు

  అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్ధిగా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తన బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నాడు. ఇక మరోవైపు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా రేసులో దూసుకుపోతున్న తరుణంలో మధ్య మధ్యలో బ్రేకలు పడుతున్నాయి. ఇటీవల జరిగిన ఇండియానా ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓడిపోగా.. ఇప్పుడు వెస్ట్ వర్జీనియా ప్రైమరీలో కూడా తన సొంత పార్టీ అభ్యర్ధి బెర్నీ సాండర్స్ చేతిలో పరాజయం పాలైయ్యారు. ఇక ట్రంప్ మాత్రం వర్జీనియా వెస్ట్, నెబ్రాస్కాల్లో విజయం సాధించి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకున్నారు.   అయితే బెర్నీ సాండర్స్ పై ఓడిపోయినప్పటికీ హిల్లరీ క్లింటన్ మాత్రం.. మహిళా ఓట్లకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలతో ముచ్చటించిన ఆమె.. మహిళా హక్కులు, జీతాలు, ఫీజుల గురించి ఆమె చర్చించినట్టు సమాచారం. అంతేకాదు తాను అమెరికా అధ్యక్షురాలునైతే సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పారు. మరి ఆ ఆవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

పోలవరాన్ని కూడా వదిలించుకోబోతున్నారా..జవదేకర్ వ్యాఖ్యలు నిజమేనా?

  ఇప్పటికే ప్రత్యేకహోదా విషయాన్ని పక్కకు నెట్టిన బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మరోక షాకిచ్చింది. ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్ట్‌‌కు నీలి నీడలు పట్టించేందుకు బీజేపీ రెడీ అయ్యింది. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. పోలవరాన్ని నీటితో నింపేందుకు కేంద్రం సమ్మతించలేదని తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లతో తలెత్తిన వివాదాలు ముగిసేవరకు పోలవరం జలశయానని నింపొద్దని ఏపీ ప్రభుత్వానికి సూచించామని కేంద్రమంత్రి సెలవిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అక్కడ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు బంద్‌లు, రాస్తారోకోలు చేశాయి. అవి ఎట్టిపరిస్థితుల్లోనే పోలవరం నిర్మాణాన్ని ఒప్పుకోవు. దీనిని బట్టి పోలవరం ప్రాజెక్ట్‌పై నీలి మేఘాలు కమ్ముకున్నట్టే.

షీనా బోరా హత్య గురించి నాకు తెలుసు.. అప్రూవర్ గా ఇంద్రాణీ డ్రైవర్

  షీనా బోరా హత్య కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్ట్ లు, కొత్త కొత్త విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. దేశమంతటా సంచలనం సృష్టించిన ఈ కేసులో షీనాను తల్లి ఇంద్రాణీయే చంపిందని వార్తలు కూడా వచ్చాయి. దీనికి సంబధించిన విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో నిందుతుడిగా ఉన్నా.. ఇప్పటికే అరెస్టయి జైల్లోలేనే విచారణ ఖైదీగా ఉన్న డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తాను కోర్టు ముందు నిజ నిజాలు చెప్పేందుకు ముందుకు వచ్చాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని.. ఈ హత్యలో తనకు కూడా భాగముందని.. షీనా గొంతునులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు.

స్టాలిన్ సీఎం అవ్వాలంటే నాకు ఏమన్నా అవ్వాలి.. కరుణానిధి

  డీఎంకే అధినేత కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది తనేనని.. స్టాలిక్ కు ఆ ఛాన్స్ లేదని అన్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అవ్వాలంటే తనకు ఏమైనా అవ్వాలి.. ప్రకృతి నన్ను ఏమైనా చేయాలి అంతే.. అప్పటి దాకా స్టాలిన్ ఎదురుచూడాల్సిందే అని వ్యాఖ్యానించారు. ఇంకా జయలలితపై కూడా నాలుగు విమర్శల బాణాలు సంధించారు. మాపార్టీ ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే మేనిఫెస్టో విడుదల చేసింది.. కానీ జయలలిత మేనిఫెస్టో మిగత పార్టీల నుండి కాపీ కొట్టిందని.. అది కూడా చాలా ఆలస్యంగా విడుదల చేశారు.. ఇంకా నయం ఎన్నికల తరువాత ప్రకటిస్తారేమో అని అనుకున్నానని ఎద్దేవ చేశారు. అందులో చెప్పిన ఉచిత పథకాలన్నీ ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికే అని అన్నారు.