ముస్లింలపై మళ్లీ మాట మార్చిన ట్రంప్.. అది సలహా మాత్రమే
posted on May 12, 2016 @ 3:36PM
అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ తరువాత మాట మార్చడం సహజమే. ఆవేశంతో అని.. ఆతరువాత తన ఉద్దేశం అది కాదని మాట మార్చుతూనే ఉంటారు. ఇప్పుడు మరోసారి కూడా అలానే చేశారు. గతంలో ట్రంప్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను కనుక అధికారంలోకి వస్తే ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించనీయనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై ట్రంప్ మాట మార్చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడుల సమస్య ఉందని, అమెరికాలో ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ విధిస్తే.. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందన్నారు. అమెరికా ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటోందని, అయితే ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదని ట్రంప్ అన్నారు. సమస్యల దృష్ట్యా ముస్లింలపై ఆ వ్యాఖ్య చేశానని, ఇది కేవలం తన సలహా మాత్రమేనని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఏకంగా ట్రంప్ గెలవాలని ఢిల్లీలోని హిందూ సేనా నేషనలిస్ట్ గ్రూప్ నేతలు పూజలు, హోమాలు కూడా జరిపిస్తున్నారు. అంతేకాదు ప్రపంచాన్ని ఇస్లామిక్ టెర్రరిజం నుంచి కాపాడాలంటే అది ఆయనకే సాధ్యమని వారు అంటున్నారు.