ప్రత్యేక హోదా, ప్యాకేజీ కావాలని కోరనున్న చంద్రబాబు...

  ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అనే అంశం విభజన చట్టంలో లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటని కూడా వ్యాఖ్యానించిన వాళ్లు ఉన్నారు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా రావడం అనేది కలే అన్నట్టు అయిపోయింది పరిస్థితి.   అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తమకు ప్రత్యేక హోదా..ప్రత్యేక ప్యాకేజీ రెండూ కావాలని ప్రధాని మోడీని కోరనున్నట్టు తెలుస్తోంది.  ఈనెల 17న మోడీతో భేటీకానున్న చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడాలన్న విషయమై రెండు రోజుల పాటు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షలు జరపనున్నారు. ప్రస్తుతం కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే.. ప్రత్యేక హోదా నేతలు చేసిన వ్యాఖ్యలపై.. తరువాత అనుచరించాల్సిన విషయాలపై చర్చించనున్నట్టు సమాచారం. అంతేకాదు రెవిన్యూ లోటు భర్తీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధుల అంశాన్ని కూడా ప్రధానికి నివేదించనున్నారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా రాష్ట్రాలతోపాటు వచ్చిన సాయం ఎంత? విభజన చట్టానికి లోబడి ఏపీకి ప్రత్యేకసాయం ఎంత? అన్నదానిపై కూడా నివేదికలు తయారు చేసి వాటిని కేంద్రానికి సమర్పించాలని చూస్తున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన కేంద్రం చంద్రబాబు నాయుడు విన్నపాలు వింటుందా.. చూద్దాం ఏం జరుగుతుందో...

చార్‌థామ్‌ యాత్రలో తెలుగువాళ్ల కష్టాలు..

ఉత్తరాఖండ్‌ చార్‌థామ్‌ యాత్రలో తెలుగువాళ్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెంట్లు టోకరా ఇవ్వడంతో తెలియని ప్రాంతంలో పడరాని పాట్లు పడుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది భక్తులు కైలాస్ మానససరోవర్ యాత్రకు వెళ్లారు. అక్కడ శిఖర దర్శనం కోసం హెలికాఫ్టర్‌‌కు డబ్బులు కూడా చెల్లించారు. అయితే డబ్బులు తీసుకున్న ఏజెంట్ ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో యాత్రికులు కష్టాలు పడుతున్నారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

బాక్సింగ్‌లో వరుసగా ఆరో నాకౌట్ సాధించిన విజేందర్

భారత స్టార్ బాక్సర్‌ విజేందర్ సింగ్ పంచ్‌ల్లో తనకు సాటి లేదని నిరూపించాడు. కెరిర్‌లో వరుసగా ఆరో బౌట్‌లోనూ నాకౌట్ విజయం సాధించాడు. నిన్న బోల్టన్‌లోని మార్కాన్ స్టేడియంలో జరిగిన సమరంలో పోలెండ్‌కు చెందిన ఆండ్రెజ్‌ సోల్డ్రాను అతడు మట్టికరిపించాడు.  తొలి రౌండ్‌ నుంచే బాడీషాట్‌లు, బలమైన పంచ్‌లతో విజేందర్ విరుచుకుపడ్డాడు. దీంతో ఆరు రౌండ్‌ల బౌట్‌లో మరో మూడు రౌండ్‌లు మిగిలి ఉండగానే ఫలితం తేల్చేశాడు . విజేందర్ పంచ్‌ పవర్‌కి సోల్డ్రా దిమ్మ తిరిగిపోయింది. కనీసం పోరాడే స్థితిలో ఉన్నట్టు కూడా అతడు కనిపించలేదు. రిఫరీ సాంకేతిక నాకౌట్ ద్వారా విజేందర్ గెలిచినట్టు ప్రకటించాడు.

లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ ఎంట్రీ... కలవరంలో అమెరికా..!

ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా భద్రతా దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే లాడెన్ ను అమెరికా మట్టుబెట్టి ఐదు సంవత్సరాలు అయిన సంగతి కూడా విదితమే. అయితే ఈ ఐదు సంవత్సరాల తరువాత మళ్లీ అమెరికా భయపడే విషయం ఒకటి బయటపడినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు మరణించాడని భావిస్తున్న బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్ వీడియోలో కనిపించడంతో అమెరికా కలవరపడుతోంది. తాజాగా ఆల్ ఖైదా విడుదల చేసిన వీడియోల అధినేత అల్ జవహరి తరువాత హమ్జా మాట్లాడి తీవ్రవాదుల్లో స్పూర్తి నింపేప్రయత్నం చేశాడు. ఇరాక్ సిరియాల్లో ఉండే తీవ్రవాదులంతా ఏకంకావాలని ఆ వీడియోలో పిలుపునిచ్చాడు. దీంతో మెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అతని గురించిన వివరాల కోసం ఆరాతీస్తున్నాయి.   మరోవైపు అయితే ఈ వీడియోలో ఆయన మాట్లాడలేదని, గొంతు ఆయనది కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హమ్జా పిలుపుతో తీవ్రవాదులు ఏకమైతే అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్రిటన్ పార్లమెంట్లో మోహన్ బాబుకు అరుదైన గౌరవం....

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు బ్రిటన్ లో ఓ అరుదైన గౌరవం దక్కింది. మోహన్ బాబు నటించిన పలు సినిమాల్లోని డైలాగ్స్ అన్ని ఒక పుస్తకంగా ప్రచురించి దానిని బ్రిటన్ పార్లమెంట్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్ పార్లమెంట్‌ సభ్యులు బాబ్‌ బ్లాక్‌మన్, వీరేంద్రశర్మ, మోహన్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడి సభ్యులనుద్దేశించి లక్ష్మీ మంచు ప్రసంగించగా, మంచు మనోజ్‌ తండ్రిని అనుకరిస్తూ హావభావాలు, డైలాగులతో అలరించారు. మంచు విష్ణు కోరడంతో చివరగా ‘పెదరాయుడు’ చిత్రంలోని పాపులర్‌ డైలాగ్స్‌ చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు మోహన్ బాబు. కాగా కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట జీవితంలో హీరోగా, విలన్ గా, నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నారు.  

కుక్క ఆహారం తిని ఇబ్బంది పడ్డ సెరెనా విలియమ్స్..

మనుషులు తినే ఆహారం మనుషులు తినాలి.. జంతువులు తినే ఆహారం జంతువులే తినాలి.. అంతేకాని ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులే కదా.. అవి తినే ఆహారం మనం కూడా టేస్ట్ చేద్దాం అంతే తర్వాత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కి.  రెండు రోజుల క్రితం ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ మ్యాచ్ ఆడేందుకని రోమ్ వెళ్లింది  సెరెనా. ఆమెతో పాటు తన పెంపుడు కుక్క 'చిప్' ను కూడా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తాను బస చేసిన హోటల్ లో తన 'చిప్' కు కూడా ఆహారం తయారు చేయించమని దానికి సంబంధించిన ప్రత్యేక మెను కూడా చెప్పిందంట. అయితే ఎందుకో 'చిప్' కోసం తయారు చేసిన ఆహారం తినాలనిపించిదట సెరానాకు.. అంతే ఒక స్పూన్ తీసుకొని తినడం జరిగింది. అయితే కొద్ది సేపటి తరువాత దాని ప్రభావం తెలిసింది సెరానాకు.  స్టమక్ అప్ సెట్ అవడంతో కొంత ఇబ్బంది పడింది. అయితే, తేరుకున్న సెరెనా మర్నాటి మ్యాచ్ లో విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన అనంతరం..   ‘చిప్’ ఆహారం రుచి చూశారు కదా! ఎలా ఉంది?’ అని అడుగగా ..‘నచ్చలేదు. ఇది మనుషులు తినేది కాదని ఆ మెనూలో రాసి ఉంటే బాగుండేది’ అని సెరెనా జవాబు ఇచ్చిందట.

90 కోట్ల విజయ్ మాల్యా విల్లా స్వాధీనం...

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా విల్లాను ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ స్వాదీనం చేసుకుంది. గోవాలో 90 కోట్లు విలువ చేసే ఆయన విల్లాను స్వాదీనం చేసుకునేందుకు కలెక్టర్ బ్యాంకు అధికారులు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు విల్లాను స్వాధీనం చేసుకున్నారు.   మరోవైపు విజయ్ మాల్యాకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇంటర్ పోల్ కు ఓ లేఖ రాసింది. మాల్యాను తమ దేశం నుండి ఇండియాకు పంపించడం కుదరదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తుంది. కాగా ఇప్పటికే మాల్యా పాస్ పోర్ట్ రద్దయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేశారు.

సల్మాన్ ఖాన్ ను వీడని హిట్ అండ్ రన్ కేసు..

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను హిట్ అండ్ రన్ కేసు ఇప్పుడప్పుడే వదిలి పెట్టేలా లేదు. ఈ కేసులో తాను నిర్ధోషి అని కోర్టు తీర్పు నిచ్చినా కానీ.. ఎవరో ఒకరు దీనిని మళ్లీ బయటకి తీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2002 లో జరిగిన ఈ ఘటనలో దోషి గా ఉన్న సల్మాన్ కు దాదాపు పదమూడు సంవత్సరాల తరువాత ఊరట లభించింది. అయితే ఇప్పుడు మళ్లీ.. ఈకేసులో మరో వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. నియామత్ అనే వ్యక్తి కారు ప్రమాదం తనను శాశ్వత వికలాంగుడిగా మార్చిందని, రోజు వారీ కూలీ చేస్తేనే తప్ప బతకలేమని ఆయన విన్నవించారు. తన కుటుంబంలో సంపాదించేది తానేనని, అయితే ఇప్పుడు తాను పనులు చేసే పరిస్థితిలో లేనందున తగిన పరిహారం ఇప్పించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించాలని అతడు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

యువతిపై ఈవ్ టీజింగ్.. మహిళా కానిస్టేబుల్ చేతిలో దెబ్బలు

  మహిళలకు రక్షణగా ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తా చర్యలు తీసుకుంటున్నా వారిపై జరిగే ఆకృత్యాలు లాంటివి ఆగడం లేదు. మహిళలపై ఈవ్ టీజింగ్ కూడా నానాటికీ పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో ఓ మహిళను ఏడిపిస్తున్న పోకిరిని ఓ మహిళా కానిస్టేబుల్ చితకబాదింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. పాట్నాలోని ఓ యువతిని ఓ ఆటో డ్రైవర్ టీజ్ చేస్తుండగా.. దానిని అక్క‌డే ఉన్న మ‌హిళా పోలీస్ గమనించి ఆటోడ్రైవర్ చెంప‌లు వాచి పోయేలా కొడుతూ తన పై అధికారుల వద్దకు తీసుకెళ్లింది. అనంత‌రం అతనిని పోలీస్ వాహ‌నంలో స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మరోవైపు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోని వీక్షించిన నెటిజ‌న్లు మ‌హిళా పోలీస్ చ‌ర్య‌ని మెచ్చుకుంటున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటి..?

  ఏపీ ప్రత్యేక హోదాపై ఇప్పటికే కేంద్రం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అది క్లియర్ కట్ గా అర్ధమయిపోయింది. ఇంకా దీనిపై బీజేపీ ఎంపీ ఇంఛార్జ్ సిద్ధార్ధ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. విభజన లేనందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాద్యం కాదని తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని.. అయినా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి నిధులిస్తున్నాం.. ఇప్పటికే ఏపీకి రూ.లక్షా 75 వేల కోట్లు ఇచ్చాం.. ఇక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని తిరిగి ప్రశ్నించారు.   ఇంకా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కూడా మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని చెప్పేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని.. అందుకే ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామని కేంద్రం చెబుతోందని ఆమె చెప్పారు. ఇఫ్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉందని, కొత్తగా మరో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదని ఆమె తేల్చిచెప్పారు.

జనసేనలో పవన్, దాసరి, మోహన్ బాబు.. కాంబినేషన్ రచ్చ రచ్చే..

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ముగ్గురి కాంబినేషన్ వింటూనే ఇలా ఉంటే.. ముగ్గురు కలిసి రాజకీయాల్లో అది కూడా ఒకే పార్టీ తరపున పనిచేస్తే ఎలా ఉంటుంది. రచ్చ రచ్చే ఇంకా.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పార్టీలకు మద్దతు తెలిపి భారీ మెజార్టీ సాధించడంలో పాత్ర పోషించారు. ఇప్పుడు తానే 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగుతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉన్నా దానికి తగిన ప్రణాళికలు ఇప్పటి నుండే రూపొందిస్తున్నారు.     ఇక దాసరి నారాయణరావుకు కూడా రాజకీయానుభవం చాలానే ఉంది. అంతేకాదు తన పుట్టిన రోజు జరిగిన ఓ ఇంటర్య్వూలో రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి రాజకీయాలకు పనికిరానని.. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి బురద చల్లించుకోవడం ఎందుకని వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే ఆయన పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు చేశారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉన్న మనిషని... పవన్ కు ధైర్యం ఎక్కువ ఉందని.. పవన్ మాట మీద నిలబడుతాడని.. ఆయన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని పొగిడేశాడు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయకపోయినా.. పవన్ కు మద్దతు ఇస్తారని.. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శమని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.     ఇక కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తాను మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఏ పార్టీలో చేరుతారన్నది మాత్రం ఇంకా తెలీదు. ప్రస్తుతం ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ.. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీలే కాస్త బలంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆయన ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని అనుకుంటున్నారు రాజకీయ పెద్దలు. అయితే దాసరి జనసేనకు మద్దతు ఇస్తే.. మోహన్ బాబుకు దాసరి గురువు లాంటి వారు కాబట్టి.. దాసరి ఆన్నా.. ఆయన మాట అన్నా మోహన్ బాబుకి గురి కాబట్టి.. ఆయన కూడా పవన్ కు మద్దతిచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇక ఇప్పటికే టీడీపీ, వైసీపీ పార్టీ నేతలు జంపింగ్లతో కొట్టుకుంటున్నారు కాబట్టి మోహన్ బాబు కూడా జనసేన పార్టీలో ఉండటమే బెటర్ అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు.   మొత్తానికి అన్నీ కుదిరి వచ్చే ఎన్నికల్లో కూడా వీరు ముగ్గురు కాంబినేషన్లో జనసేన కనుక ఎన్నికల బరిలో దిగితే ఇక పండగే అంటున్నారు రాజకీయ పెద్దలు. అంతేకాదుప్రస్తుతం ప్రత్యేక హోదా పై హ్యాండ్ ఇచ్చినందుకు బీజేపీ పై.. ప్రత్యేక హోదాపై టీడీపీ కూడా ఏం చేయట్లేదన్న కోపంలో ప్రజలు ఉన్నారు కాబట్టి.. వీరికి పట్టం కట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ ఉద్యోగాలకు నోటీఫికేషన్లు

  ఏపీ నిరుద్యోగులకు ఓ శుభవార్త. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటీఫికేషన్లు విడుదుల చేసే దిశగా ఏపీపీఎస్పీ రంగం సిద్దం చేస్తుంది. ఇప్పటికే దేవాదాయ శాఖలోని 1100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని.. గ్రూప్ -2 నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు 20,250 ఖాళీల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 12 వేల ఉద్యోగాలకు, పోలీసు శాఖలోని 8 వేల ఉద్యోగాలకు కేంద్రం నుంచి ఇండెంట్ అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

సుప్రీంకోర్టు జడ్జిగా మరో తెలుగు వ్యక్తి..

  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరో తెలుగు వ్యక్తికి అవకాశం దక్కింది. గుంటూరు జిల్లా, పెదనందిపాడుకు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. దీనిలో భాగంగానే ఈరోజు ఆయన ప్రమాణస్వీకారం చేశారు.   కాగా లావు నాగేశ్వరావు 1957, జూన్‌ 8న గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించారు. దాదాపు పది సంవత్సరాలు పాటు గుంటూరులోనే న్యాయవాదిగా విధులు నిర్వహించి.. ఆతరువాత సుప్రీంకోర్టులో 3 దశాబ్దాలపాటు న్యాయమూర్తిగా చేశారు. ఈక్రమంలో ఎన్నో కేసులను వాదించి జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి అందుకున్నారు.

500 నఖిలీ ఈవీఎంలు పట్టివేత.. తమిళనాట కలకలం

  త్వరలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలందరూ ఎవరి ప్రచార కార్యక్రమాల్లో వారు బిజీ బిజీ గా ఉండగా.. ఇక ఎన్నికల్లో ఎలాంటి మోసాలు చేయాలో అని ఆలోచించే వాళ్లు వాళ్ల పనిలో పడినట్టు ఉన్నారు. దీనిలో భాగంగానే.. నకిలీ ఈవీఎం మిషన్లను సొంతం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన తంజావూరు జిల్లాలోని తిరువారూర్ జరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తనిఖీలు ముమ్మరం చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి వీరు తారసపడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా దాదాపు 500 నఖిలీ ఈవీఎంలు బయటపడ్డాయి. దీంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసుల వారిని అరెస్ట్ చేసి.. అసలు వీటి వెనుక ఎవరి హస్తం ఉంది.. ఎవరు వీటిని ఉపయోగించాలనుకున్నారు.. ఎవరికి అనుకూలంగా ఓట్లను వేసుకోవాలన్నది వీరి ఆలోచన? వంటి తదితర అంశాలపై విచారణ జరుపుతున్నారు. కాగా తిరువరూర్ కేంద్రం నుంచి డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

టీడీపీ నుండి బెదిరింపులు వస్తున్నాయి.. ఏం ఇవ్వడానికైనా రెడీ..

  వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం టీడీపీపై విమర్శలు చేస్తున్నాడు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గత కొంత కాలంగా టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి స్పందించిన అతను తనకు టీడీపీలో చేరాలని బెదిరింపులు వస్తున్నాయని.. కానీ ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని.. వైసీపీని వీడి టీడీపీలోకి చేరేది లేదు అని స్పష్టం చేశారు. టీడీపీ నుండి తనను కొంత మంది మంత్రులు కలిశారని వారు ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి పదిహేనుమందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇందిరాకు సోనియా అంటే ఇష్టం.. మేనకాగాంధీ సహాయంగా ఉండాలనుకున్నారు...

  దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి తన పెద్ద కోడలు సోనియాగాంధీ అంటేనే ఇష్టమట.. ఈ విషయం ఇందిరా గాంధీ వ్యక్తిగత వైద్యుడు కె.పి మాథుర్ రాసిన  ‘ద అన్‌సీన్ ఇందిరాగాంధీ’ పుస్తకంలో వివరించారు. గతంలో రెండో ప్రపంచ యుద్దంలో సమయంలో ఇందిరా గాంధీ ఏం చేశారో చెప్పిన కె.పి.మాథుర్ ఇప్పుడు తన పుస్తకం ద్వారా మరో కొత్త విషయాన్ని చెప్పారు. ఇందిరా చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మరణానంతరం.. చిన్న కోడలు మేనకాగాంధీ తనకు సహాయంగా ఉండాలని కోరుకున్నారంట. కానీ మేనకా మాత్రం ఇందిరా పెద్ద కొడుకు రాజీవ్ గాంధీకి వ్యతిరేక వర్గంలో ఉండటంతో ఇందిరాకు దగ్గర కాలేకపోయారట. ఇక రాజీవ్, సోనియా వివాహం తరువాత ఇందిరా, సోనియా ఇద్దరూ చాలా తొందరగా కలిసిపోయారట. సోనియాపై ఇందిర ఆపేక్ష, మక్కువ చూపేవారట. మరి ముందుముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.

నాచారంలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడుతున్న కెమికల్ ఫ్యాక్టరీ

  హైదరాబాద్ లోని నాచారం పారిశ్రామిక కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం కెమికల్  ప్యాక్టరీలోని రియాక్టర్ పేలి భారీ ప్రమాదం జరిగింది. అయితే కార్మికులను అలర్ట్ చేస్తూ అక్కడ ఉన్న అలారం ముందుగానే మోగడంతో... అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లిపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ కెమికల్ సిలిండర్లు పేలుతుండటంతో దాదాపు 200 అడుగులకు పైగా దట్టమైన పొగలు మల్లాపూర్ వరకూ ఐదు కిలోమీటర్ల దూరం కమ్మేయగా, సమీపంలోని ఓ ఇల్లు కూడా మంటల్లో చిక్కుకుంది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.